ప్రతి జీవి అభివృద్ధి క్రమంలోనే ముందుకు సాగుతూ వస్తుంది. తెలిసో, తెలియకో తమని తాము ఉన్నతీకరించుకునే దిశగానే అన్ని జీవులు అడుగులు వేస్తాయి. ఏక కణం నుండి బహు కణాలు ఏర్పడి జీవులు, జీవులలో మానవుడు పుట్టుకొచ్చాడు. ఆది నుండి ఆధునిక కాలం దాకా మానవుడు ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు, సముద్రాలని మదించాడు, ఆకాశాన్ని గుప్పెటలో అదిమి పట్టాడు, భూగోళం మొత్తాన్ని కను సన్నల్లో పెట్టుకోగలిగాడు అయినా ఇంకా ఎందరో అడవుల్లో, కొండ, కోనల్లో ఆదిమ దశలోనే ఆగిపోయారు. వారికి ప్రపంచం తెలియదు, సమాజం తెలియదు, అధునిక వస్తువులు, నాగరికత వారి పాదాల అంచులనైన తాకనే లేదు. వారి లోకం వేరు, వారి జీవన విధానం వేరు. వారినే మనం ఆది వాసీలుగా, ఆదిమ తెగలుగా (scheduled tribes) చెప్పుకుంటున్నాము. అలాంటి వారిలో కోలం తెగ ఒకటి.
కోలం తెగకు చెందిన వారు తెలంగాణ, చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నారు. వీరు తెలంగాణలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్ మరియు వరంగల్ జిల్లాలలో నివసిస్తున్నారు. “they belong to the sub-Category particularly vulnerable tribal group” (en.m.wikipedia.org/wiki/kolam) కోలామ్ భాషలో వీరిని “కొలావర్లు” (kolavars), మరాఠీ ప్రాంతాలలో కొలాములు అని అంటారు. కోలం తెగ వారి జీవితం అతి దుర్భరంగా ఉంటుంది, వీరిని పోలిన తెగలు కట్కారీలు, మారియా గోండ్ లని చెప్పవచ్చు. వెనుకబడిన తెగలలోనే అత్యంత వెనుకబడిన తెగ కాబట్టి, వీరి జీవన ప్రమాణాలు తక్కువ ఉండి, అక్షరాస్యత రేటు, ఆదాయం మొదలైనవి ఎన్నో వెనుకబడే ఉంటాయి.
గిరిజనులందరి జీవన విధానం ఒకే విధంగా ఉంటుందని అనుకోవడానికి వీలులేదు. ఒక్కో ప్రాంతంలోని తెగ, ఒక్కో జీవన విధానాన్ని కలిగి ఉంటుంది. ఈ తెగలో వారిలో వారికే ఉప తెగలు ఉంటాయి, వాటిని ముఖ్య తెగ పోషిస్తూ ఉంటుంది, వీరినే ఆశ్రితులు అంటారు. ఈ ఆశ్రితులు ముఖ్య తెగ నాయకులపై, దేవతలపై పాటలు, కథలు మొదలైనవి పాడుతూ వారి నుండి ధాన్యాన్ని, డబ్బుని అడుక్కొని జీవిస్తారు.
కోలం తెగ వారు గోండులు, ప్రధాన్, తోటిలతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. కోలములు మహా భారత కాలంలోని హిడింబ సంతతి వారమని నమ్ముతారు. కాబట్టే ఆది దేవుడిగా భీముని తలుస్తూ భక్తితో కొలుస్తారు. భీముని భార్య హిడింబను కుల దైవంగా భావిస్తారు, వీరు కన్నుల పండుగగా ‘‘భీమ్యక్ లగ్న’’ పండగను జరుపుకుంటారు. భీమ్యక్ లగ్న అనగా భీముడి పెండ్లి అని అర్థం.
కోలాములు ముందు కాలాలలో వచ్చే విపత్తులను ముందుగానే ఆలోచించే శక్తిని కల్గి ఉంటారు. కాబట్టే ‘‘ఆయక’’ దేవాలయ బాధ్యతలను, సంరక్షణ, పూజారులుగా కోలాములనే గోండు తెగ నియమిస్తుంది. కోలాములు ఈ ‘ఆయక’ దేవతను గణ దేవతగా తలిస్తే, గోండీలో ఈ దేవతలను ‘‘భీమల్’’ అని వ్యవహరిస్తారు. గోండులు తమ పండుగలలో క్రతువులు, కొండ దేవత పూజలు, అడివి దేవత పూజలు చేసే బాధ్యతలను కోలామ్ తెగ వారికి అప్పగిస్తారు. కాబట్టే గోండులు కోలామ్ తెగ వారిని పూజారులు అని పిలుస్తారు.
కోలం తెగ దేవత నందియమ్మ, ఈ దేవత నివాస ప్రాంతంలో ఉంటుంది. ఈ దేవతతో పాటు పోతురాజు, సీతాదేవి, జింగుభాయి, లక్ష్మీ, ఇందుమలదేవి మొదలైన దేవతలను మొక్కుతారు. ‘‘అఖండి’’ అనే దేవతను వారి పశువులను కాపాడే దేవతగా కొలుస్తారు. గోండుల వ్యవస్థనే కోలామ్ లు పాటిస్తారు, కాని వాటికి వేరే పేర్లు పెట్టుకున్నారు. ఈ తెగలో వివాహం అనేక రకాలుగా జరుగుతుంది. అవి చొర బడడం, పెండ్లి కూతురును ఎత్తుకు రావడం, తమకు కావాల్సిన వారితో చర్చలు, స్త్రీ, పురుషుడు ప్రేమించుకోవడం, లేచి పోవడం, సేవ మొదలైన విధానాలతో వీరి జీవిత భాగస్వామిని ఎన్నుకుంటారు.
కోలామ్ ల ప్రధాన ఆహారం జొన్న పంట, వీరు జొన్న పంటను ఎక్కువగా పండిస్తారు. జొన్నల ద్వారా అనేక రకాల ఆహార, పానీయాలను తయారు చేసుకొని జీవిస్తారు. ఉదా : జొన్న అంబలి, జొన్న రెట్టె, జొన్న అటుకులు, జొన్న పంటతో పాటు పత్తి, పప్పులు పండిస్తారు. ముఖ్యంగా వీరు వ్యవసాయ కూలీలుగా జీవితం గడుపుతారు. ప్రస్తుతం కొంత మంది గృహ నిర్మాణ కూలీలుగా, ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు.
కోలం ప్రజలలో తలెత్తిన అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి వారు ఒక కౌన్సిల్ ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి కోలమ్ నివాస ప్రాంతంలో ఒక సంప్రదాయ గ్రామ కౌన్సిల్ (కుల పంచాయితీ) ని నిర్వహిస్తారు. ఈ కుల పంచాయితీలో…
ఎ) నాయకన్ (Headman)
బి) డీలక్ (Priest)
సి) మహాజన్ (Messenger)
డి) తార్మాక (Cook)
ఇ) ఘటియ (distribution of food) సభ్యులుగా ఉంటారు.
కోలం తెగలో ఊరి పెద్ద (village headman) మరియు పూజారి (priest) వివిధ రకాల వివాదాలను పరిష్కరిస్తారు. వీరికి ఈ తెగలోని ఇతర సభ్యులు సహకరిస్తారు. రెండు గ్రామాల మధ్య వివాదాలు ఉంటే నాయకన్ మరియు డీలక్ వారిని సమావేశ పరచి పరిష్కరిస్తారు.
-భోజన్న
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~