యామిని ` కాళ్ళు నేల మీదే ఉన్నా మనసు మాత్రం ఆకాశంలో ఇంద్రధనస్సు లా ఎగిరి ఎగిరి పడుతోంది . ప్రింటింగ్ ప్రెస్ యజమానికి ఏదో ఊరు వెళ్లే పని అత్యవసరంగా పడటంతో అనుకున్నదానికంటే ముందే శుభలేఖలు ఇచ్చేసాడు.
తను ప్రేమించి పెళ్లిచేసుకుంటున్న `తన్మయ్ `తో కలిసి తెలిసిన వారందరికీ శుభలేఖలు పంచాలని ముచ్చటగా ఉంది . అది నాలుగు రోజులు ముందుకురావటమే ఈ ఆనందానికి కారణం . ఈ విషయం చెప్పి తన్మయ్ ని ఆశ్చర్యంలో పడెయ్యాలని రయ్ రయ్ న కారులో వెళ్లి వాలిన ఆమెకు అక్కడ వాళ్ళు మాట్లాడుకునే మాటలు అయోమయంలో పడేశాయనే చెప్పాలి .
ఈ ఆడాళ్ళు మరీ పేట్రేగిపోతున్నారు . వీళ్ళని అదుపులో పెట్టాలి . అందుకే పెళ్ళయ్యేదాకా అణిగిమణిగి ఉంటున్నా . ఆ తర్వాత చూపిస్తా నా అసలు స్వరూపం . పిచ్చిది ఇదంతా నిజమని నమ్మేస్తోంది . ఎవరినో ఒకరిని బుట్టలో వెయ్యకపోతే `పెళ్లి కాని ప్రసాద్ `లని బిరుదు మొయ్యాల్సివస్తోంది . ఒక్కసారి పెళ్లి అయిపోతే పరువు మర్యాద అంటూ కుక్కిన పేనులా పడి ఉండక ఛస్తారా ? అమ్మాయిలు తక్కువున్నారని తెగ వేషాలు వేసేస్తున్నారు ఈ ఆడాళ్ళు . ఖచ్చి తీర్చుకోవాల్సిందే ! “
.
ఆ ప్రవాహానికి ఆనకట్ట వేసే వాళ్లే లేరు .
అవునురా .. అవును అంటూ తలలూపేవాళ్లే అందరూ . వీళ్లా స్నేహితులు ?
ఆ మాటలు అన్నీ మాట్లాడుతున్నది ఎవరో కాదు తను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాననుకుంటున్న తన్మయ్ యే !
ఒక్కసారి తన చెవులు కళ్ళు తనని మోసం చెయ్యటం లేదు కదా అని తనను తనే ప్రశ్నించుకుంది.
తన ముందు ఎంత బుద్ధిమంతుడులా ఉండేవాడు . ఎన్ని పరీక్షలు పెట్టింది . అన్నిటిలో నెగ్గాడు .
తన సెలక్షన్ ఆణిముత్యమే అని తెగ సంబరపడి పోయిందే !
ఇంత మోసమా ? మై గాడ్ . ఈ రోజు ఎంతో మంచి రోజు. ఆ ప్రెస్ అతనికి ఆ పని తగలటం తన అదృష్టం . లేకపోతే ఇలాంటి ఊసరవిల్లితో జీవితం అంతా గడపాల్సివచ్చేది .
“ఇలాంటివాడు అని తెలియగానే విడాకులు ఇచ్చెయ్యవా ఏమిటి ? కో అంటే కోటి మంది నీ కాళ్ళముందు వాలిపోతారు “అంతరంగం బుజ్జగిస్తోంది .
“ఒకరితోనే జీవితమని ,భార్యాభర్తల్లా కాక స్నేహితుల్లా తామిద్దరూ మెలగాలని బీదవాడైనా తనని ఇష్టపడింది . తన భావాలకు తగ్గవాడు దొరికాడని సంబరపడిపోయింది . ఆది లోనే హంసపాదా ? ఇలాంటివాడని తెలిసాక క్షణం కూడా అతనిని భరించలేదుగా . ఈ విషయం బయటికి రాదు . అహంభావంతో అహంకారంతో తనే పెళ్లి రద్దు చేసుకున్నట్లు పుకార్లు పుట్టిస్తారు . ఆడవాళ్లు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని నెపం తమకే అంటగడతారు .
ఏం సమాజం ? ఏం మనుషులు ?
మంచికి విలువ లేకుండా పోతోంది .
మొన్న ఈ మధ్య తన స్నేహితురాలు “శాస్త్ర “ నిశ్చయతాంబూలాలు అయ్యాక అతనిని కాదని వేరే అతనిని చేసుకుందని అందరూ దాన్ని ఆడిపోసుకున్నారు . చివరి నిముషంలో వాడు ఆడవాళ్ళ పిచ్చివాడు అని తెలిసింది . రోజుకో అమ్మాయితో గడిపితే కానీ వాడికి కామదాహం తీరదట . అలాంటివాడిని చేసుకుని నా నూరేళ్ళ జీవితాన్ని చేజేతులా నేనెలా పాడుచేసుకుంటాను అని అది తన దగ్గర వాపోయింది .
బయటకు వచ్చిన వార్త వేరు . అందరూ దాన్నే ఆడిపోసుకున్నారు . అర్ధం చేసుకునే వ్యక్తి దొరకడంతో అది ఈ గండం నుంచీ గట్టెక్కింది .
ఇప్పుడు తననెన్ని అపవాదులు చుట్టుముడతాయో !
డోంట్ కేర్ . ఆ తన్మయ్ గాడికి తగినశాస్తి చెయ్యాలి . మరో అమ్మాయి వాడికి బలి కాకుండా బుద్ధి చెప్పాలి . ఆడపిల్లలు అంటే ఆటబొమ్మలు అనుకుంటున్నారు వెధవలు . “అంటూ నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటూ కారు రివర్స్ చేసుకుని దూసుకు వెళ్లిపోయింది .
అదంతా ఏమీ తెలియని తన్మయ్ వివాహం ఆగిపోయిందన్న వార్త విని డీలాపడిపోయాడు . మరి యామిని విషయంలో ఎంత కష్టపడ్డాడో అతనికే తెలుసు . మరి ఓ నిజం చెప్పటం తేలిక . అదే నిజం బయటపడకుండా వంద అబద్దాలు ఆడటం అంటే మాటలా ?
ఇంతే అనుకుంటే ఓ అర్ధరాత్రివేళ తన్మయ్ మీద పది మంది గుండాలు దాడి చేసి చితకబాది వైవాహిక జీవితానికే పనికిరాని జీవచ్ఛవాన్ని చేసిపారేసారు .
శిక్ష పెద్దదే . కానీ పడాల్సిందే . ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునే మగవాళ్లకు ఈ శిక్ష చాలా చిన్నదనే చెప్పాలి .
యామిని ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది . ఇలాంటి వంకర బుద్ధి ఉన్న వాళ్ళ కంటే మానసికవికలాంగుడైనా మంచిదే అన్నంతవరకూ వెళ్లిపోయాయి ఆమె ఆలోచనలు .
భగవంతుడు అలా ఎందుకు ఊరుకుంటాడు ? న్యాయం వైపు ఉండేవాళ్ళకు ఎప్పుడూ అన్యాయం జరగనివ్వడు .
జరిగిన విషయం అంతా విన్న ఓ మంచి వ్యక్తి అదే ముహూర్తానికి ఆమె చేతిని అందుకున్నాడు .
–అనురాధ యలమర్తి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~