జ్ఞాపకం-64– అంగులూరి అంజనీదేవి

ఒక్కక్షణం భూమిలోకి కుంగిపోతున్నట్లు తలవంచుకున్నాడు రాజారాం. ఒకప్పుడు తన భార్య మాట విని తప్పులు చేసినమాట వాస్తవమే. ఇప్పుడెంత పశ్చాత్తాప పడినా వాటిని సవరించుకోలేడు. కానీ స్వంత తమ్ముడే కుంటోడు అని అవహేళన చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. తిలక్ నే కాదు తన భార్యకూడా అలాగే అంటుంది. కుంటితనం పెట్టే నరకం కన్నా వీళ్ల మాటల ద్వారా కలిగే మానసిక క్షోభనే భరించరానిదిగా వుంది. ఇలాంటి మాటలు విన్న ప్రతిసారి చనిపోవాలన్న కోరిక బలంగా కలుగుతుంటుంది. కానీ ‘ఆత్మహత్య మహాపాపం’ బాధలు భరించలేకనో, కష్టాలు పడలేకనో ఆత్మహత్య చేసుకోరాదు. ఈ దేహం వుండేది కర్మఫలం అనుభవించటానికే. ప్రాణం పోయేంత వరకు అనుభవించాల్సిందే అనుకున్నాడు. మొండిగా భరిస్తున్నాడు.

అంతటి బాధలో కూడా తమ్ముడికి నచ్చచెప్పాలని “అదికాదురా!” అని ఏదో చెప్పబోయాడు. తిలక్ రాజారాంని మాట్లాడనివ్వకుండా సూటిగా అతన్నే చూస్తూ “ఏది కాదు. అసలేంటి నీ ప్రాబ్లమ్? కావాలంటే నీ వాటాకి వచ్చే పొలాన్ని అమ్ముకో. నా వాటాకి వచ్చే పొలాన్ని వదిలేయ్. దాన్ని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను” అన్నాడు.

“సగం పొలం అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయి? ఇప్పుడున్న రేట్లకి ఆ డబ్బులేం సరిపోతాయి?” అన్నాడు రాజారాం.

“సరిపోవు కదా! అయితే ఓ పని చెయ్. ‘నేను కుంటోడ్ని, నామీద జాలితో నా చెల్లెల్ని పెళ్లిచేసుకో’ అని జయంత్ దగ్గరికి వెళ్లి అడుగు. తప్పులేదు” అన్నాడు.

ఆ మాటలకి రాజారాంతో పాటు అక్కడ వింటూ నిలబడ్డవాళ్లు కూడా బిత్తరపోయారు.

అవయవాలన్నీ వున్న తిలక్ కన్నా కాళ్లు లేని రాజారాం గొప్పగా అన్పించాడు వాళ్లకి. కాళ్లు లేకపోవటం అనేది ఎంత దయనీయ స్థితినో, ఎలా వున్న రాజారాం ఎలా అయ్యాడో కళ్లకు కట్టినట్లు కన్పిస్తోంది. జాలిగా చూడటం తప్ప వాళ్లల్లో ఒక్కరు కూడా తిలక్ మాటల్ని అడ్డుకోలేకపోతున్నారు. అక్కడికి ఇంకా కొంతమంది వచ్చి చేరారు. ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందోనన్న ఉత్కంఠతో చూస్తున్నారు.
ఒక ముసలాయన అక్కడే నిలబడి తిలక్ మాటలు విన్నాడు. “నువ్వేం మనిషివయ్యా తిలక్! మీ అన్నయ్యకి కాళ్లు సరిగా లేకపోయినా పొలం అమ్మి చెల్లెకి పెళ్లి చెయ్యాలంటుంటే నువ్వు ఆ డబ్బులతో షాపు పెడతావా? బుద్దిలేదూ ఆ మాట అనటానికి?” అన్నాడు.
తిలక్ కి కోపం వచ్చింది.

“రేయ్ ముసలోడా! నాకు బుద్ధిలేదంటావా?” అంటూ ఆయన్ని నెట్టటంతో వెళ్లి రాజారాం మీద పడ్డాడు. రాజారాం ఆపుకోలేకపోయాడు. వాకర్ మీద వున్న చేతులు పట్టు తప్పాయి. సడన్ గా కింద పడిపోయాడు.
తిలక్ రాజారాం వైపు చూడలేదు. అక్కడ నిలబడి వున్నవాళ్లు ఆత్రంగా రాజారాంని లేపి కూర్చోబెట్టారు. రాజారాం ఎప్పుడు కిందపడ్డాడో అప్పుడు మొదలైంది ఆ వాతావరణంలో కలకలం.

పల్లెజనం కావటం వల్ల తిలక్ చుట్టూ చేరి ఆవేశం ఆపుకోలేక తిడుతున్నారు. ఆ కేకలు, అరుపులు విని పోలీస్ స్టేషన్ దగ్గర వున్న ప్రెస్ వాళ్లు హుటాహుటిన రాజారాంని చేరుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకుని మేటర్ రికార్డు చేసుకుని వెళ్లిపోయారు. దాదాపు అన్ని పేపర్ల వాళ్లు వచ్చారు. వాళ్లలో దిలీప్ కూడా వున్నాడు.

తిలక్ చేస్తున్న గొడవకి నిర్ఘాంతపోయాడు. వెంటనే తేరుకుని తిలక్ ని పక్కకి లాక్కెళ్ళాడు దిలీప్.
ఓ చోట నిలబెట్టి “తిలక్! నువ్వు చేస్తున్న పని మంచిదనుకుంటున్నావా?” అడిగాడు కోపంగా.
ఒకప్పుడు దిలీప్ తో కలిసి చదువుకున్నా ఇప్పుడు జర్నలిస్ట్ కావడంతో మౌనంగా చూస్తున్నాడే కానీ మాట్లాడలేదు తిలక్.

“మనిషన్నాక కొంచెమైనా సెల్స్ కాన్ఫిడెన్స్ వుండాలి. కలలు కనాలి. వాటిని స్వయంశక్తితో నిజం చేసుకోవాలి. అంతేకాని తాతల ఆస్తికోసం ఫైట్ చెయ్యకూడదు” అన్నాడు.

ఆ మాటలు వింటున్నా విననివాడిలా చూస్తున్నాడు తిలక్.

“నువ్విలాగే మొండి వైఖరి ప్రదర్శిస్తే జనం వూరుకోరు. ఇప్పటికే ఈ న్యూస్ ని పేపర్ల వాళ్లు పట్టుకెళ్లారు. మీ ఊరివాళ్లు కొట్టి అయినాసరే నీ చేత సంతకం పెట్టిస్తారు. క్వాటర్ బాటిల్ తాగి నువ్వు సెంటిమెంట్స్ ని చంపుకుంటున్నావ్. మీ ఆదిపురి వాళ్లు నీలాగా కాదు. మానవ సంబంధాలను వూపిరి చేసుకుని బ్రతుకుతున్నారు. వాళ్ల సహనానికి పరీక్ష పెట్టకు. వెళ్లి సంతకం పెట్టు” అన్నాడు దిలీప్.
పాము చావకపోయినా, చచ్చినట్లు నటించినట్లు తిలక్ సంతకం పెట్టటానికి ఒప్పుకున్నాడు.
దిలీప్ ఆ కుటుంబానికి ఆత్మీయుడు కావటం వల్లనో ఏమో రిజిస్ట్రేషన్ జరిగేంత వరకు అక్కడే ఆగాడు.

                                                                      *****

తెల్లవారి అన్ని పేపర్లలో తిలక్ సబ్ రిజిష్టారాఫీసు దగ్గర చేసిన గొడవ వచ్చింది. తిలక్ లోని దానవుడి గురించి చెప్పటం కోసం రాజారాంలోని మానవత్వాన్ని హైలెట్ చేసి రాశారు.

ఆ న్యూస్ చదివి “అన్నయ్యా” అంటూ వచ్చి రాజారాం దగ్గర కూర్చుంది సంలేఖ.

ఆమె చేతిలో వున్న పేపర్ ని అందుకున్నాడు రాజారాం. ఆ న్యూస్ ని రాజారాం కూడా చదివాడు. అతని కళ్లు అదే పేపర్లో వున్న పక్కన్యూస్ మీద నిలిచాయి. ఆస్తి ఇవ్వలేదని కన్నతల్లికి తలకొరివి పెట్టని కొడుకు. తప్పని సరై భర్తే భార్యకి తలకొరివి పెట్టి అంత్యక్రియలు చేసిన ఉదంతం. దాన్ని చదవగానే సమాజం ఎటు వెళ్తుందో అర్థమైంది. మానవ సంబంధాలు కొంతమంది కన్నకొడుకుల స్వార్ధం వల్ల, మూర్ఖం వల్ల కన్పించాల్సిన కోణంలో కన్పించటం లేదు. వుండాల్సిన రీతిలో వుండటం లేదు. మరీ దయనీయంగా మారిపోతున్నాయి. రాజారాం హృదయం కరిగింది.

“ఏంటన్నయ్యా ఆలోచిస్తున్నావ్?” అడిగింది సంలేఖ.

“ఏంలేదమ్మా! తిలక్ వెళ్లిపోయాడు. రేపు పెళ్లయితే నువ్వూ వెళ్లిపోతావ్. అప్పుడు నేను ఒంటరివాడినై పోతానేమో. అఫ్ కోర్స్ అమ్మా, నాన్నా, వినీల వున్నారనుకో!” అన్నాడు.

“నేను వెళ్లినా ఇక్కడ వున్నట్లే మీకు ఫోన్ చేస్తుంటాను. నీ ఒంటరితనాన్ని పోగొడతాను. తిలక్ అన్నయ్య రోజురోజుకి బాగా మారిపోతున్నాడు అన్నయ్యా!” అంది బాధగా పేపర్లో వచ్చిన న్యూస్ ని గుర్తుచేసుకుంటూ.

“ఎప్పుడూ ఒకేలా ఎవరూ వుండరు లేఖా! మార్పు సహజం” అన్నాడు.

“ఆ మార్పు మంచివైపు సాగితే ఫర్వాలేదు” అంది.

“అది ఏ వైపుకి వెళ్లే మార్పు అనేది వాళ్ల ఆలోచనా విధానం మీద ఆధారపడి వుంటుంది. ఏ ఆలోచనలు ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆనందాన్ని ఇస్తాయో తెలియదు కదా!” అన్నాడు.

సంలేఖ రాజారాం కాళ్ల వైపు చూస్తూ అన్నయ్య అందరిలా త్వరగా నడిస్తే బావుండు అని మనసులో అనుకుంటోంది.

అన్నా, చెల్లెళ్లు మాట్లాడుకుంటుంటే చూసి అప్పటికే రెండుసార్లు వచ్చి ఏదో పనివున్న దానిలా వెళ్లింది వినీల. ఆమె ఎందుకలా వచ్చి వెళ్తున్నదో రాజారాంకి తెలుసు. ఏది చూసినా ఆరాటం, ఎప్పుడు చూసినా అసూయ. ఇవి తప్ప మరో కోణం కన్పించదు ఆమెలో రాజారాంకి. అది గుర్తుచేసుకుంటూ నెమ్మదిగా ఓ నవ్వు నవ్వాడు.

ఆ నవ్వులో ఒకవైపు ఫిలాసఫీ, ఇంకోవైపు తను గడిపిన జీవితం కన్పిస్తున్నాయి.

ఇప్పుడలా ఎందుకు నవ్వాల్సి వచ్చిందో తెలియని దానిలా అన్నయ్యనే చూస్తోంది సంలేఖ.
పెళ్లయినప్పటి నుండి ఇప్పటి వరకు వినీల ప్రవర్తనను గుర్తుచేసుకుంటూ “మనుషులు జీవితాన్ని రకరకాలుగా అర్థం చేసుకుంటారు లేఖా! కొందరికి జీవించడం సహజంగానే అలవడుతుంది. కొందరు జీవితాన్ని విడివిడి సంఘటనలుగా భావిస్తారు. ఆ సంఘటన మధ్య వుండే సంబంధాన్ని గ్రహించరు. మొదటిరకం వాళ్లు జీవితం నుండి తృప్తిని, ఆనందాన్ని తేలిగ్గా పొంది ఆత్మగౌరవంతో జీవిస్తారు. రెండోరకం వాళ్లు పరిస్థితుల ప్రభావంలో చిక్కుకుని అటూఇటూ పరుగులు తీస్తారు మీ వదినలాగా!” అన్నాడు.

వదిన వింటుందేమోనని భయంగా చూసింది సంలేఖ.

రాజారాం ఏమాత్రం భయంలేకుండా ”స్వార్థం వుండొచ్చు. దానికి హద్దుల లేకపోతే జీవితంలో సంతోషం వుండదు. ఏదో ఒక రకంగా మనకు తెలియకుండానే మనం దోచుకోబడతాం!” అన్నాడు.

అన్నయ్యలో ఈ మధ్యన చాలా మార్పు కన్పిస్తోంది. అది మంచి మార్పా కాదా అన్నది కాలమే నిర్ణయించాలి అని మనసులో అనుకుంది సంలేఖ.

“నువ్వు తిలక్ గురించి ఆలోచించకు లేఖా! వాడికి నీమీద ప్రేమ లేదనుకోకు. బాధపడకు” అన్నాడు.
అంతలో తండ్రి రావడంతో పేపర్ దాచేసి తన గదిలోకి వెళ్లింది సంలేఖ.

తండ్రి, కొడుకు కూర్చుని పెళ్లికి అవసరమయ్యే లిస్ట్ తయారుచేసుకున్నారు. ఎవరెవరిని పిలవాలో, ఎవరెవరికి పెళ్లి పత్రికలు పంచాలో అడ్రసులు రాసుకున్నారు.

రాఘవరాయుడు, సులోచనమ్మ సంలేఖ పూర్తిగా పెళ్లిపనుల్లో మునిగిపోయారు.

వినీలకి ఏ పని చెప్పినా విసుక్కోకుండా “ఇంకా ఏమైనా పనులు వున్నాయా అత్తయ్యా? ఇదిగోండి! ఇది ఇలా చేస్తే సింపుల్ గా, చూడటానికి బావుంటుందేమో. కొంచెం రేటు ఎక్కువయినా సంలేఖకి ఈ చీరలైతేనే బావుంటాయి. తను కాస్త ఎత్తుగా, తెల్లగా, అందంగా వుంటుంది కాబట్టి చీరల రంగుల విషయంలో మనకి ఇబ్బంది లేదు. నగలు కూడా తక్కువ గ్రాముల బంగారు పట్టేలా చూసుకుని ఇంకో రెండు ఐటమ్స్ ఎక్కువ చేపిద్దాం. బయటకెళ్లేటప్పుడు తను కట్టే చీరల్ని బట్టి నగల్ని మార్చుకుంటుంది. అందులో తనుండేది మనలాగా పల్లెటూరులో కాదు కాబట్టి ఏది కొన్నా కాస్త లేటెస్ట్ గా, సిటీ కల్చర్ కి నప్పేలా కొందాం” అంటూ పెళ్లికి ముందు నుండే ఉత్సాహపడుతూ మాట్లాడుతుంటే చిత్రంగా అన్పించి ఉక్కిరిబిక్కిరి అయింది సులోచనమ్మ.

పదిరోజుల ముందు నుండే ఇంటికి సున్నాలు వేయించి, రంగులువేసి అలంకరించుకున్నారు.
పెళ్లిరోజు ఇంటిచుట్టూ షామియానాలు వేసి పూలు, మామిడాకులు కట్టగానే పెళ్లికళ వచ్చింది.

(ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

156
జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో