1) మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ చదువు, ఉద్యోగం గురించి మా పాఠకులకు చెప్తారా?
వైజయంతి : నేను పుట్టి పెరిగిందంతా ఓల్డ్ సిటీలో, మా తాతల కాలం నుండి ఇక్కడే ఉంటున్నారు. మా తాతగారు ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన మనిషి, ఆయన అప్పట్లోనే కులాంతర వివాహం చేసుకున్నారు.
ఇక నా తండ్రి విషయానికొస్తే ఆయన ఓల్డ్ సిటీలో పెరిగాడు. ఎక్కువగా చదువుకోలేదు, మా అమ్మ ది మద్రాస్. తన వైపు వాళ్ళంతా బాగా చదువుకున్న వ్యక్తులు. మా తాతగారు డాక్టర్ గా పని చేసేవారట. మా అమ్మ కూడా ఎకనామిక్స్ లో Ph.d చేసి ఒక గవర్నమెంట్ కాలేజ్ లో వర్క్ చేసేవారు.
నాయనకు అమ్మ రెండవ భార్య, మొదటి భార్య చనిపోవడంతో అమ్మని రెండో వివాహం చేసుకున్నాడు. నేను పుట్టేటప్పటికే నాకన్నా పదేళ్ళు పెద్ద వయసు ఉన్న సవతి అన్న ఉన్నాడు.
ఊహ తెలియని వయసులోనే నా సవతి అన్న చేతిలో లైంగిక వేధింపులకి గురయ్యాను. తర్వాత కొన్నిరోజులకి అతనికి ఇండియన్ నేవీ లో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు. నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు తనకి పెళ్ళి కుదిరింది కానీ అమ్మాయి వైపు వాళ్ళు మీ ఇంట్లో ఆ హిజ్రాని ఉంచితే మా అమ్మాయిని మీకు ఇవ్వమనడం తో నన్ను బంధువుల ఇళ్ళకి పంపారు. బంధువుల ఇళ్ళల్లో వారాలు చేసుకుంటూ చదువుకున్నా. వారాలు చేసుకునే ఇళ్ళల్లో కూడా నాకు లైంగిక వేధింపులు తప్పలేదు.అదే సమయంలో నన్ను చేరదీసిన మా చిన్న అమ్మమ్మ ఒకామె పాంక్రియాటిక్ కాన్సర్ తో ఎప్పటినుండో బాధపడుతూ నన్ను చేరదీసిన మూడు నెలలకే చనిపోయింది. ఇక అప్పటినుండి నాకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. నేనో నష్టజాతకురాలినని, దరిద్రాన్నని నన్నెవరూ రానిచ్చేవారు కాదు.
ప్రైవేటుగా ఇంటర్ చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ డిస్టెన్స్ లోనే B.A., Neuro linguistic program లో డిప్లొమా చేసాను. 1998 నుండి 2015 వరకూ చాలా ఉద్యోగాలు చేసాను.
2) మన దేశంలో ట్రాన్స్ జెండర్స్ పట్ల ఉన్న అసమానతల వల్ల ఎక్కువగా నిరక్షరాస్యులే ఉంటున్నారు. చాలా తక్కువమంది లో మీరింత అభివృద్ధిలోకి రావడానికి, ఎవరిదైనా ప్రోత్సాహం/ స్ఫూర్తి ఉందా?
వైజయంతి : స్ఫూర్తి అంటూ ప్రత్యేకంగా నాకు ఎవరూ లేరు. ఎలాగైనా బతకాలన్న ఆశతో చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. ఏదైనా ఆవగింజంత స్ఫూర్తి పొందానంటే అది నా తల్లి నుండి మాత్రమే. మా నాన్న చాలా హింస పెట్టినా ఓపికగా భరించేది. జీతమంతా లాక్కున్నా ఒక్క మాట మాట్లాడేది కాదు.
3) Transgender గా software field లో ఉద్యోగం సాధించడంలో ఎలాంటి ఒత్తిడులు ఎదుర్కున్నారు? మీ జర్నీ ఎలా సాగింది?
వైజయంతి : ఇంటర్ అయిపోయాక BPO లో ఉద్యోగం చేస్తూ B.A. & Human resources training లో డిప్లొమా చేసాను. ఇంకొకటి Neuro linguistic program లో కూడా డిప్లొమా చేసాను. ఆ సమయంలో మాకు ప్రత్యేకంగా ఎలాంటి చట్టాలు, హక్కులు లేవు. ఇంట్లో, తెలిసిన తోటి ట్రాన్స్ జండర్ గ్రూప్ లలో ఎలా ఉన్నా ఉద్యోగానికి మాత్రం ప్యాంట్ షర్ట్ తోనే వెళ్ళేదాన్ని. 2014 లో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిన రోజున ఆ తీర్పు కాపీ ని ఆఫీస్ లో అందరికీ పంచి నేను ఒక ట్రాన్స్ జండర్ ని, ఇకనుండి నాకు లేడీస్ బాత్రూమ్ కానీ లేదా ఒక న్యూట్రల్ బాత్ రూమ్ కావాలని అడిగాను.
నేను ట్రాన్స్ జండర్ అని తెలిసాక మా ఆఫీసులో చాలామంది గొడవ చేసారు. ఒక హిజ్రాకి ఈ ఉద్యోగం ఎలా ఇస్తారు అన్నారు. నాకు తెలియని వర్క్ ఇచ్చి వేధించేవాళ్ళు. హిజ్రా అని తెలిసాక లైంగిక వేధింపులు మరింతగా ఫెరిగాయి. సపోర్ట్ గా ఎవరూ ఉండేవారు కాదు.
4) ఒక transgender గా Body తో, Mind తో, సమాజం తో ఎలాంటి పోరాటం ఉంటుంది?
వైజయంతి: మాలాంటి వారిని Gender assigned birth అంటారు, అంటే పురుషదేహం లో ఉన్నప్పటికీ మా మనస్తత్వం, మా హావభావాలు స్త్రీల లా ఉంటాయి. మమ్మల్ని మేము అలాగే ఊహించుకుంటాము.కానీ,2019 లో ట్రాన్స్ జండర్ హక్కుల రక్షణ తీర్పు వచ్చాక మాకోసం కొన్ని నియమాలు వచ్చాయి. ఆ చట్టం లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ అది మాకు కొంత మేలే చేసింది.
లింగ మార్పిడి ఆపరేషన్లు చేసుకున్న వారినే ట్రాన్స్ జండర్ గా గుర్తిస్తామని తీర్పులో పేర్కొన్నారు కానీ ఆ ఆఫరేషన్ చాలా ఖర్చు తో కూడుకున్నది. అవగాహన సరిగ్గా లేదు. దేశంలో ఉన్న ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లింగమార్పిడి శస్త్రచికిత్స కానీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ లాంటివి చేయడం లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ సర్జరీ చేసుకోవాలంటే ఐదారు లక్షల వరకూ ఖర్చవుతుంది. ఒకవేళ సర్జరీ చేయింఛుకున్నప్పటికీ అది సక్సెస్ అవుతుందో లేదో మా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.
డాక్టర్లు కూడా ఆపరేషన్ సక్సెస్ అయితే అది తమ క్రెడిట్ లో వేసుకోవడం లేదంటే మా ఖర్మ అని చేతులు దులుపుకుంటున్నారు. సర్జరీ కి ముందే తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకుంటారు. ఇలా సర్జరీ లు చేయించుకొని చాలామంది చనిపోయారు.
5) తెలంగాణ Transgender activist గా మీ హక్కుల కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నారు? ప్రభుత్వం మీ పట్ల ఏదైనా ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తుందా?
వైజయంతి : ఎన్నో పోరాటాల తర్వాత 2014 లో రైట్స్ ఆఫ్ ట్రాన్స్ జండర్ పర్సన్స్ బిల్ ని ప్రవేశపెట్టారు. దాదాపు ఐదేళ్ళ తరువాత అంటే 2019 లో అమలులోకి వచ్చింది.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ పోయి నేషనల్ మెడికల్ కమీషన్ వచ్చింది, అయినా ట్రాన్స్ జండర్స్ కోసం ఎలాంటి ప్రోటోకాల్స్ ఏర్పాటు చేయలేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇష్టానుసారం గా సర్జరీలు చేస్తున్నారు, వారికి ఒక సర్టిఫికేట్ అంటూ ఏం లేకుండానే ప్రమాదకరమైన పరిస్థితుల్లో సర్జరీ చేసి చాలామంది మరణాలకు కారణమవుతున్నారు. మా పోరాటం ఇలాంటి వాటి గురించి మరియు మా హక్కుల గురించి.
6) విహంగను స్థాపించిన పుట్ల హేమలతగారితో మీ పరిచయం గురించి చెప్తారా?
వైజయంతి : హేమలతక్క ని నేను రెండు సార్లు కలిసాను. మొదటిసారి ప్రరవే సభలో కలిసాము, చాలా పరిచయం ఉన్న వ్యక్తి లా ఆప్యాయంగా మాట్లాడారు. అక్క ది చిన్నపిల్లల మనస్తత్వం, అందరితో కలిసిపోయే స్వభావం.
రెండవసారి, మిళింద (హేమలత గారి కుమార్తె,రచయిత్రి మానస ఎండ్లూరి పుస్తకం ) పుస్తక ఆవిష్కరణ సభ లో కలిసాం. అంత పనిలో కూడా తను నాకోసం వచ్చి తన అత్తగారిని, అమ్మ గారిని పరిచయం చేసారు. అదెప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. ఆవిడ వెళ్ళిపోవడం సాహితీ లోకానికి, కుటుంబానికే కాదు మాలాంటివాళ్ళకి కూడా చాలా లోటు. నన్ను తన కుటుంబ సభ్యురాలిలా చూసుకున్నారు.
7) మా పాఠకులకు, ముఖ్యంగా యువతకు మీ సందేశం ఇస్తారా?
వైజయంతి : ఎవరైనా సరే, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఒకరి మీద ఆధారపడకండి ముఖ్యంగా ఆడవాళ్ళు.
యువత, దయచేసి ట్రాన్స్ జండర్స్ ని, LGBT’s ని గౌరవించడం నేర్చుకోండి. వారి హక్కులని వారికి ఇవ్వండి. హేళన చేయకండి.
మీ భావాలు, అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు .
-షఫేలా ఫ్రాంకిన్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to వైవిధ్యాల వైజయంతి … షఫేలా ఫ్రాంకిన్