రాతకోసం రాజీపడని కలం- ‘ఆరుద్ర పురుగు’( పుస్తక సమీక్ష..) -లోకే. రాజ్ పవన్

‘ఆరుద్ర పురుగు’ 2015 లో సాహితి సోపతి-కరీంనగర్ అచ్చువేసిన పుస్తకం. ఈ పుస్తకం రాసిన కవి కూకట్ల తిరుపతి గారు. తెలంగాణ మలిదశ ఉద్యమం, తెలంగాణ సమాజ భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటు చరిత్ర, దిగజారిపోతున్న మానవ సంబంధాలు, అనుబంధాలు. 

కనుమరుగవుతున్న పల్లెజీవితం,వ్యవసాయం,సంస్కృతులు, వాటికి కారణమైన దుష్ట రాజకీయాల సామాజిక ఫలితాలు వంటి విభిన్న వస్తువులను ఎంపిక చేసుకుని రాసిన 37 కవితలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వాటిలోని కొన్నింటిని,ఆ కొన్నింటిలోని పంక్తులు కొన్నింటినీ తీసుకుని పుస్తక విశ్లేషణకు పూనుకుంటే ఆ కొన్నింటిలోనే ఎన్నో భావాలను పొంది ఆశ్చర్యకరంగా మంచి కవితావస్తువులున్న ఓ పది పుస్తకాలను చదివిన అనుభూతి ఈ ఒక్క పుస్తకం చదివి మూసేశాక కలిగింది. ఇది కేవలం పుస్తకంలో కవి నిక్కచ్చిగా సాగించిన కవితా ప్రయాణ ఫలితమే.

ప్రకృతి మనిషికి ఆహ్లాదాన్ని,రమణీయతను అందించడం ఒక ఎత్తైతే అంతకుమించి మనిషికి అనేక సామాజికానుభావాలు అందడంలో అది దోహదపడుతుంది. ఉదాత్తమైన జీవనవిధానాన్నిఅందించే సాధనంగా ప్రకృతి ఎల్లవేళలా మనిషి వెన్నంటి ఉంటుంది. ఆ ఫలితాన్ని అందుకోవడమా లేదా అనేది మనిషి ప్రవర్తనకు సంబందించిన సమస్య. కానీ ప్రకృతి తన బాధ్యతను ఏనాడూ విస్మరించదు. సామాజికాంశాల మీద,సామాజిక సమస్యల మీద చాలాకాలంగా రాస్తున్న కూకట్ల తిరుపతి గారికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. విపరీతమైన ప్రేమ. పువ్వులన్నా,పురుగులన్నా వాటితో జరిపే సాంస్కృతిక సంరంభాలన్నా ఇష్టం.
సిమ్మ సీకటి చుట్టుకొన్న జాడల
యెతల కతల లోతులెతికి
ఎరుపెక్కిన కండ్ల పొదల మందారాలు (బతుకు పూల సొగడ, పే.66)
మందరపూల ఎరుపును వర్ణించడంలో మాటగా వాటివి ‘యెతల కతల లోతులెతికి ఎరుపెక్కిన కండ్ల’ ఎరుపుదనం అంటారు. చక్కని ప్రతీక ఇది.
ఇంట్లో చిన్నగా, గమనించనంతగా పారే పురుగును కూడా ఆయన ఒక సౌందర్యదృష్టితో గమనిస్తారు. గమనించడమే కాదు, ఆ సౌందర్యానికి తన కలంతో శోభలల్లుతారు. అందుకే అసలే ఎర్రగా అందంగా ఉండే ఆరుద్రపురుగు ఆయన రాతల్లో మరింత అందాన్నిసంపాదించుకుంది.
ఎర్రగ తొర్రపండు రూపు
మట్టి చిప్పోల్గే యీపు
జెకమొక మెరుపుల కండ్లు
లుకలుక మెస్లే రిక్కల కాల్లు
నడిచే ముద్ద మందారం
పొద్దు పొదుపు సింగారం
బొత్తిగ బొద్దు పెయ్యి (ఆరుద్ర పురుగు,పే.92-93)
బతుకమ్మ ఒక ప్రకృతి శోభల పండుగ. ఆ పండుగ మొత్తం పూలతో కలగలిసి ఉంటూనే అంటరాని, పేద బతుకులతో ముడిపడి తన అస్తిత్వాన్ని నిలుపుకుంటుంది. శ్రామిక కులాల, బహుజనకులాల పెద్ద పండుగ బతుకమ్మ. పండుగల్లోనూ ఆధిపత్యం, అగ్రవాటా పెద్ద కులాలే ఆక్రమించుకున్నపుడు చిన్న అని ఈసడింపులకు గురైన కులాలకు మిగిలిన ముఖ్యమైన పండుగను ఒక చక్కని ప్రతీక ద్వారా ఇలా వర్ణిస్తారు.
అడవి పూల కోసం
కాలం చెట్టు వో రోజును కాస్తుంది
అవే బతుకమ్మ రోజులు (నెత్తికెత్తుకొనే రోజులు, పే.97)
ఇక్కడ అడవిపూలు అంటే తంగేడు,గునుగ లాంటి పూలనే నిజార్థం ఒకటున్నా, దాన్ని ప్రతీకగా వాడుతూ సమాజానికి దూరంగా జీవిస్తున్న కులాలన్న అర్థాన్ని వచ్చేలా ఆ పదంలో చక్కని భావాన్ని ఇమిడించారు.
ఈ కులాల కోసం ఏటా ఒక రోజు పూస్తుంది. అలా పూసిన రోజే బతుకమ్మ అంటారాయన.
అంటిముంటని తనువుల
నెత్తికెత్తుకొనే రోజులు
వెలేసిన మనుషులకూ
వెలుతురు సోకని సమాజానికి సుతా
ఓ రోజు పూయనే పూసింది (నెత్తికెత్తుకొనే రోజులు , పే.97)
కానీ ఈ ఒక్కరోజే జీవితం కాదు. తరచి చూస్తే జీవితమంతా అవమానాలు, ముల్లు పరచిన దారులు. బాల్యం నుండీ వాటిమీద నిరంతర ప్రయాణమే అలవాటుగా, అవసరంగా బతుకులీడుస్తున్న అభాగ్యులెందరో. బయటికి కనిపించే బహుముఖ రూపాలెన్ని వున్నా ఇవ్వాల్టికీ బహుజనుల జీవితాలు అట్టడుగు దశల్లోనే ఉన్నాయి.
అడుగడుగునా అవమానాలు
కొమ్ములిరిసిన కీకలు
పల్లేరు పర్సిన బాటల్ల పయనాలు
———————
ముండ్ల మీద నడిచిన కహానీ
గంగా జమునల తహజీబే జిందగీ (అచ్చెటా..ముచ్చెటా! ,పే.84)
అని తనలాంటి ఎందరివో జీవితాల సహజ గమనాల తీరును చెప్తారు. అసలు బహుజనుల జీవితాలు ముడిపడిందీ, ఆ జీవితాలు ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో వెలికి,వెత కు గురైందీ వారికున్న నిరంతర శ్రామిక లక్షణం వల్ల. శ్రమ అనేది వాళ్ళ జీవితాల్లో విడదీయరాని అంతర్భాగం. ఈ శ్రామికలక్షణాన్ని చాలాచోట్ల ప్రధానంగా ప్రస్తావిస్తారు.
అటికెలూ,గురుగులు
ముంతలూ,దీపంతెలు
కూజాలూ,కుండలు
అబ్బురపరుచు ఆకారాలు (మట్టిపూలు ఒక మనాది, పే.12)
అని కుమ్మరి ఉత్పత్తుల వెనక ఉన్న శ్రమకు, నైపుణ్యానికి అబ్బురపోతారు. కేవలం గొడ్డులాగా చాకిరీ చేసి సమాజానికి సర్వ ఉత్పత్తులను అందించే వాళ్ళ శ్రమనే కాదు, ఆ శ్రమ నిర్మించిన అద్భుత సాంస్కృతిక వారసత్వాలనూ గుర్తించి విధేయ గౌరవంతో కీర్తిస్తారు.
శుద్ధిగ పుదిచ్చిన బోనం
గండదీపం ముట్టిచ్చుకుంటది
యిరగ బూసిన పస్పు యిచిత్రం
తంగేడు సుట్టూర్గ అలుకు వూతలయి
పుట్టకోరు మన్ను గద్దెలయితయి
పలుగురాళ్ళు కొత్త నీల్లల్ల పానమోసుకొని
పొలమ రాజులగ పొందిచ్చుకుంటయి (పొలమ రాజుల పండుగు, పే.14-15)
అంటూ గొల్ల కురమ సంస్కృతిలో అతి ముఖ్యమైన పొలమరాజు రూపుదిద్దుకునే విధాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు.
తరాలు దాటుతుంటే ఆధునికత కారణంగా, పెట్టుబడీదారి సాంస్కృతిక ఆధిపత్యం,అణిచివేతలవల్ల ఈ పల్లె సంస్కృతులు, బహుజన వారసత్వాలు ఎలా కనుమరుగై పోతున్నాయో కూడా వివరిస్తారు. అంటే సంస్కృతి గొప్పదని చెప్పే సాధారణ రాతలే కాదు అవి కనుమరుగైపోతున్నాయని ఘోషించే వాక్యాలూ అనేకచోట్ల నిండి ఉండటంలో ఆయనకున్న సాంస్కృతిక బాధ్యత సుస్పష్టంగా కనిపిస్తుంది.
తెలంగాణ పల్లెల్ల
————–
ఎన్కటి కెల్లున్న ఆచారం
గిప్పుడు కొడిగట్టిన దీపం (పొలమ రాజుల పండుగు, పే.15)
అని సూటిగా, నిక్కచ్చిగా చెప్తారు.
సంస్కృతులే కాదు ఇప్పుడు బంధాలు,బంధుత్వాలూ విచ్చుకుపోతున్న దుర్మార్గపు కాలం దాపురించింది. ఒకప్పుడు ఎంతో అట్టహాసంగా నిండుగా నిలిచిన మనుషుల మూర్తిమత్వాలు క్రమేపీ కనుమరుగైపోతుంటే, ఉన్న కొద్దిపాటి బంధాలు,వాటిని నిలుపుకున్న మనుషులు భౌతికంగా దూరమైతే తనలో కలిగే బాధను వేదనతో వ్యక్తీకరించడాన్ని పుస్తకంలో కొన్నిచోట్ల చూడొచ్చు.
మొకం పూసిన తంగేడు
నిండార్గ మల్లె పూలద్దుకున్న నెత్తి
గుమ్మడి పండోల్గే తనువు
పొద్దుపొడుపును
నొసట రూపాయి బిల్లంత దిద్దుకొని
ఎన్నీలను అడ్డంగ అదుముకొనేది (ఆచారవంతురాలు, పే.16)
పూలు,పండ్ల అందాలతో పోల్చుతూ మనిషి కట్టుబొట్టు ను చెప్పడం ఇది. తన నాయనమ్మ గురించి రాసిన వాక్యాలే అయినా, పల్లెటూరి ప్రతి నిన్నటితరం పడుచు ఆహార్యంలోని నిండుదనం, అందానికి ఇవి సరిపోతాయి. ఇట్లాంటి నిండైన మనుషులు, అందునా బంధం పెనవేసుకున్న మనుషులు తమవారి నుండి దూరమైతే ఆ వేదన వర్ణనాతీతం.
కట్టగాల మచ్చిన యాల్ల
దేవునింట్ల మన్నువొయ్య
యెంత పాపపు రాత రాసిండో!
ఆని గుడి గుండంగానని వొకటే సదువు
యియ్యాల నువ్వద్దిగనే
గజ్జెల లాగులు సిన్నవోయినయి
సత్తి బోనాలు సప్పవడ్డయి (ఆచారవంతురాలు, పే.19)
నిందాస్తుతి అనాదిగా ఉన్నదే. మొదటి వాక్యాల్లో నిందించడం,ఆనక బానిసత్వాన్ని ప్రదర్శించుకొని సాగిలబడే రాతలకు తెలుగు సాహిత్యంలో కరువేమీ లేదు. కానీ తన నాయనమ్మను తీసుకుపోయినందుకు ఎలాంటి రాజీ లేకుండా, లొంగుబాటు ప్రదర్శించకుండా నిర్మొహమాటంగా తిడుతూ ‘దేవునింట్ల మన్నువొయ్య’ అంటారు.
మరోచోటా చాలా ప్రేమతో రాసిన ఇలాంటి అనుబంధాల వ్యక్తీకరణే కనిపిస్తుంది.
మంగలార్తి ముట్టిచ్చిన కాడల్ల
మన్సు బొత్తిగ గావరయితది
ఆడిబాల అలికిరి యినిపించక
ఇల్లు యిరువాటు సిన్నపుచ్చుకుంటది
కడుపుల పుట్టిన
ఆడివిల్ల లేని చావు చావద్దంటరు
మరీ మాలాటి దిక్కుమల్లే జీవునాలకు
ఆ బాగ్గెమెట్లా కలుగుద్దీ..(పేగు సవందం, పే.56)
ఆడపిల్ల లేని ఇల్లు వల్లకాడుతో సమానమనే వ్యక్తిగత అభిప్రాయాన్ని కాసేపు పక్కనబెట్టి , ఇక్కడి ‘ఆడివిల్ల లేని చావు చావద్దంటరు’ అనే ఆయన మాటకు నా పూర్తి ఏకీభావం.
అసలైతే ఇలాంటి బంధాలు, ప్రేమలు ఇంకా నిలిచున్నవి పల్లెటూర్లలోనే. కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా క్రమేపీ ఈ బంధాలు తగ్గిపోతూవస్తున్నాయి. ఇందుకున్న కారణాలు అనేకం ఎలాఉన్నా అసలు పల్లెలే మిగలని, పల్లెల జాడలే మాయమయ్యే దోపిడీ ఆర్థిక సంబంధాల ప్రతిఫలనాలు ప్రధానకారణంగా ప్రతిచోటా నిలబడుతున్నాయి. ఇలాంటి వినాశనాలను గురించి వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు వస్తువులను తీసుకుని తిరుపతి గారు రాసిన పంక్తులు ఈ పుస్తకంలో చాలా కనిపిస్తాయి.
కాలం కంట్లే కారం బోసుకున్నది
సింగసాని కుంట సిన్నవోయి కన్నీల్లను నింపుకున్నది
గుత్తేదారు కండ్లల్ల వడ్డది గుట్ట
గుత్తను పరపర నమిలిమింగి నీల్దాగిండు
పచ్చని పల్లె బత్కుల్ల నిప్పులు గుమ్మరిచ్చిండు (జిలాల గుట్ట, పే.22)
గుత్తేదారు గుట్టను మింగేస్తుంటే, పల్లెకుండే భౌగోళిక సంపదను సర్వనాశనం చేస్తుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయతలో ‘మన్సు కలకలయి పానమవిసిపోతాంది’ అని బాధపడతారు.
గుట్టల్లాంటి భౌగోళిక సంపదే కాదు ఇవాళ పల్లెల్లో అన్నీ రంగాలూ కుదేలైపోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయం చిన్నాభిన్నమైపోయింది. వ్యవసాయ ఆధారిత పనులు, జీవితాలు,సంస్కృతులు అవసానదశకు చేరుకున్నాయి. సంస్కరణలు,నూతనత్వం పేరుతో పాత విధానాలను వదిలేస్తూ పోతున్న ప్రతిదశా చెడు ఫలితాలనే మిగిల్చి వెక్కిరిస్తున్నా పాలకులు,వాళ్ళ విధానాలు మారడంలేదు. పైగా మరింత వినాశనం వైపే విధాన నిర్ణయాలు కేంద్రీకృతమౌతున్నాయి.
సిలుక పచ్చ సీర గట్టినట్టు! బూదావరకు
సుట్టు మెట్టు వారి నాట్లయి పోవుడు
నత్తనడుమ యీకోలె
నా పొలముత్తగుండుడు
ఇంటి దాన్కి సదిరి సెప్పలేక
ఇజ్జతు మానం వోతాంది
టాటరు నెవడు గనిపెట్టిండో?
గానీ..
దీన్ తల్లీ!
నా యెద్దెవుసం మూలవడ్డది (ఎద్దెవుసం మూలవడ్డది, పే.104)
ఎద్దెవుసమే కాదు మొత్తంగా పల్లెల్లో వ్యవసాయమే ఎంత నాశనం అయిందో నాలుగు పంక్తుల్లోనే వివరంగా చెప్తారు.
మూలకు మూల్గు ముల్లుగర్ర
గుంటుగ్గొట్టిన డౌర జమ్ములు
సీకువట్టిన కానీ వార్నెలు
నక్కులకు నడుమిరిగిన నాగలి
కండ్లల్ల కరిగిన కచ్చురం(ఎద్దేడ్సిన ఎవుసం, పే.86)
వ్యవసాయంతో పాటు దానిమీద ఆధారపడ్డ రైతుజీవితం కూడా ఎలా ఛిద్రమైందో చెప్తారు. అసలు భూమితో,బురదతో మమేకమై తాను పండించే పుట్లకు పుట్ల ధాన్యం ప్రపంచానికి జీవాధారమౌతున్నా రైతు జీవితం మొదటినుండీ బుక్కెడు బువ్వకు నోచుకోలేదు.
బురద బుక్కి
బురద కక్కినా
బుక్కెడు బువ్వా
గుక్కెడు నీల్లకు నోసుకోని పుట్క
——
చెమ్మగిల్లిన చేను
గొడ్డు బోయిన దొడ్డి
దిగుట్లే కూసున్న దీపం (ఎద్దేడ్సిన ఎవుసం, పే.87-88)
ఇప్పుడు ఇంకా దయనీయంగా మారిపోయింది పరిస్థితి. రైతు పేరుతో రాజకీయాలు చేయడం, రైతు నోట్లో మన్ను కొట్టడం ఆనవాయితీగా మారింది. శరీరాన్ని కృశింపజేసుకుని రక్తాన్ని పొలంలో ఇంకిస్తున్న రైతు ఇప్పుడూ బువ్వ మెతుకుల కోసం అంగలారుస్తునే ఉన్నాడు. అలాంటి రైతు జీవితం పూర్తిగా మెరుగుపడాలని తిరుపతి కలగంటారు.
ముప్పై యేండ్లకే ముడుతల పెయ్యి
ఊసులకండ్లు ఊడిన పండ్లు
నెరిసిన జుట్టు చితికిన బతుకులకు
బుక్కెడు బువ్వ కోసం
నేను కలగంటున్నా!(నేను కలగంటున్నాను, పే.112)
అందుకే అంటారు, ‘ఆడిబిడ్డ ఏడ్చిన ఇల్లు, రైతు ఏడ్చిన పొలం’ అని.
సరిగ్గా ఇవే మాటలు,
ఎద్దేడ్సిన ఎవుసం
రైతేడ్సిన రాజ్యం
అరిష్టం..అరిష్టం.. (ఎద్దేడ్సిన ఎవుసం, పే.88)
ఇంత దారుణంగా దేశంలో రైతుల జీవితాలు, వ్యవసాయం చావుదలకు చేరుకోవడానికి కారణాన్ని కూడా ఆయన పట్టుకున్నారు. ప్రపంచీకరణే అన్ని ప్రస్తుత అనర్థాలకు ప్రధానకారణంగా ఉందని సరిగ్గా గ్రహించారు. ప్రపంచీకరణ విషాఫలితాల రూపాల్లో ఒకటిగా వచ్చి వ్యవసాయాన్ని ముంచేసిన డంకేల్ వాణిజ్యం సృష్టించిన విధ్వంసకాండను చెప్తారు ‘ఎద్దేడ్సిన ఎవుసం’ లో.
పెంట కాకల పెనేసిన తాకతు
ఎదపెయ్య డంకెలు
బేపారపు రంకెల
నాడెల డెక్కల కింద నలిగిపోయింది (పే.86)
ఒక్క వ్యవసాయమే కాదు, ప్రపంచీకరణ బారిన పడి ఉనికిని కోల్పోయిన రంగాలెన్నో. ఆయా రంగాల్లో వివిధ సామాజిక పరిణామ దశల్లో జరిగిన విధ్వంసాలన్నీ ఒకెత్తైతే, ఈ నలభై ఏళ్లుగా ప్రపంచీకరణ నిర్వహించిన వినాశనాలు ఒకెత్తు. ప్రపంచీకరణ సాగించిన అలాంటి ఒక వృత్తివినాశక ప్రక్రియను ‘మట్టిపూలు ఒక మనాది’ లో చెప్తారు.
గీరె తిరగడమే కాదు
గతంలో..
సమాజ గతినే తిప్పేసింది
బతుకు ఆఖరి మజిలికి
అగ్గికుండసుత అగుపిస్త౦దా?
ప్రపంచీకరణ కూల్చిన బతుకు చెట్టు
నేడు నాకు
మట్టిపూలు ఒక మనాది (పే.12)
కుమ్మరి వృత్తిలో చోటుచేసుకున్న ప్రపంచీకరణ మార్పులు ఎట్లా ఆ వృత్తి ప్రాశస్త్యాన్ని దిగజార్చివేశాయో ఈ వాక్యాలు చెప్తున్నాయి. అంతేకాదు ఇట్లాంటి మార్పులే చిన్న వర్తక రంగాలనూ దెబ్బతీశాయంటారు.
గంప గుత్తల గంగపాలు
చిల్లర అమ్మకం చిల్లం కల్లం (ఆక్టోపస్,పే.42)
ఇక్కడ ఆక్టోపస్ అంటే ప్రపంచీకరణ. సరిగ్గా అమరిన పోలిక ఇది. 1990ల నుండీ ఆక్టోపస్ లా విస్తరిస్తున్న ప్రపంచీకరణ మనిషి జీవితాలను, అతని అనేక జీవిత రంగాలను తీవ్రంగా దెబ్బకొట్టింది. సరిగ్గా ఇదే అవగాహనతో ఆ ఫలితాల ప్రభావాలను ఇలా చెప్తారు.
బడాచోరు డాబుల
బహుళ జాతి వలపు
వన్నె చిన్నెలు ఆరవోయు
బహురూపుల యేశాలది
నమ్మి నానవోత్తే
పుచ్చి బుర్రలవుడేనా!
తలుపులు బార్లా తెరిచిన ఇండ్లల్ల
వ్యాపారపు గోడల గోరీలు (ఆక్టోపస్,పే.44)
ఇంతటి దుర్మార్గమైన విధానాలను ఈ దేశంలోకి తీసుకుని వచ్చి ప్రజల జీవితాలను బందీ చేసిపారేసిన వికృత రాజకీయాలనూ ఆయన నిరసిస్తారు. ఆ రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే నాయకుల తీరునూ ఎండగడతారు. ఎన్నికల సమయాల్లో సీతాకొక చిలకల్లా ఆ నాయకులు వేసే బహురూప విన్యాసాలను ‘ఇసిత్రం’లో ఇలా బయటపెడతారు.
వన్నెదేరిన సీతాకోకచిలుకలు
ఓట్ల తోటలో గిరికీలు కొడ్తయి
నోట్ల పూదేనె తాపిస్తయి
అందితే కాళ్ళు అందుకుంటే జుట్టుకు పల్టీలు కొడ్తయి
పెదాల మీద జలజలరాలు
మాటల మానిక్యాల మూటలు
చెవ్వుల్ల పువ్వులయి పూస్తయి (పే.31)
అరచేతిల అంజనమేసి
ఆదరిస్తమని ఊదరగొడ్తరు
అరికాలునంటిన ముండ్ల
పండ్లతో పీకుతమన్న నేతలు
పత్తుoడరు పిరాదుండరు (ఎద్దేడ్సిన ఎవుసం, పే.88)
ఈ నాయకుల మోసాలు,అణిచివేతలూ ఇక ఎన్నాళ్ళో సాగవంటూ, నాగల్లు ఎరుపెక్కి భూస్వామ్యాన్ని కూలదోసిన ఇక్కడి చరిత్రనే మరోసారి వెనక్కి తిరిగి చూసుకోమని వాళ్ళకు సలహా ఇస్తారు.
యెట్టి సాతల నాగండ్లు ఎరుపెక్కినయి
కోండ్రలు గలిపిన కోడెకత్తు
పిరికిట్ల కొడవళ్ళయి పదునెక్కింది
మోత్కుల్లల్ల మోగిన సైరన్
గుట్టల్ల ఎదురెక్కిన చీమలదండు
రేగుతెట్టెల రేల పాటలు
గడ్డిపోసలు పురిగొన్నయి
పరికి కంపకు ఉప్పు పాతర (జర సొచాయించూ..?, పే.63-64)
పెట్టినవి. అలాంటి పోరాటచరిత్ర తెలంగాణ సమాజానికి ఉంది కనుక పేదల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తారు.
కాల్రెక్కలు దగ్గెర వెట్టుకో
బక్క పల్చని జీవుల జోలికత్తే
గంటెపుత్తెలు గట్టిగుండాలే! (జర సొచాయించూ..?, పే. )
పోరాటాలే సమస్యలను పరిష్కరించే సాధనాలని తరచూ నమ్మే తిరుపతి ఒకానొక సందర్భంలో తెలంగాణ సమాజ పోరాట చైతన్యాన్ని ఉచ్ఛదశకు తీసుకుపోయిన నక్సలైట్ ఉద్యమ గత చరిత్రను కూడా గుర్తుచేసుకుంటారు.
శవాల పీక్కుతినే పీతిరి గద్దల పాతరేయ
కాలికి బట్టగట్టకుంట నిగురానుండు
ఎర్రోల్లను ఎదల దొనల దాసుకొనేది (జిలాల గుట్ట,పే.21)
ఎర్రోల్లు(నక్సలైట్లు) చరిత్రలో నిర్వహించిన పాత్రను గుర్తుచేయడానికి వాళ్ళు, పీక్కుతినే గద్దలను తరిమి కొడతారని, సమాజాన్ని అలాంటి వాళ్ళ నుండి కాపాడేందుకు కాపలాగా ఉంటారని సంక్షిప్తంగా చెప్తారు.
తెలంగాణ లోనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రజాపోరాటం జరిగినా దానికి ఆయన తన రాతల్లో సంఘీభావం ప్రకటిస్తారు.
పుట్టిన మట్టిని పులుంకొన్న మమకారం
మానవతను నినదించిన గొంతుక
తున్కల్తున్కలుగా తూరుపు
బిగిసిన పౌరహక్కుల ఉక్కు పిడికిలి (ఇనుపచెట్టు,పే.49)
దేశ ప్రజలను నిత్యం వంచిస్తున్నవివిధ కేంద్రప్రభుత్వాలను ఎదిరించి ప్రజలకోసం,పౌరహక్కుల కోసం పోరాడిన మణిపూర్ మహిళ ఇరోం చాను షర్మిల పోరాటాన్ని కొనియాడుతూనే ఆమెనిలా ‘మానవత్వం నిండిన గొంతుక’అని కీర్తిస్తారు.
ఈ దేశంలో వేలాది ఏళ్లుగా పాతుకుపోయిన దుర్మార్గపు కులవ్యవస్థ మీద కూడా తిరుపతికి తీవ్రమైన అసహ్యం,కోపం ఉన్నాయి. ఎక్కడికక్కడ సందర్భం దొరికిన ప్రతిసారీ దానిమీద నిప్పులు కక్కుతుంటారు. బహుజన కోణం ఒకసారి, దళిత అణిచివేత కోణం ఇంకోసారి, గిరిజన పక్షం మరోసారి.. ఇలా అనేకచోట్ల అనేకసార్లు కుల ఆధిపత్యాల మీద తిరగబడటం కనిపిస్తుంది.
శంభూక వధ
సెగలు కక్కుతనే ఉంది
బర్బరీకుని బలి
బరిల నిల్తనే ఉంది
ఏకలవ్యుని బొటనేలు
ఏలికకు ఎదురు తిరుగుతనే ఉంది(ఆరం, పే.33)
కులవ్యవస్థ అంటరానిగా చేసిన దళితుల పక్షం వహించి రాసిన కవిత ‘అయిదవ వాన్నే? నేను!’. ‘ఆరుద్రపురుగు’ పుస్తకంలో తప్పకుండా చదవాల్సిన కవితల్లో ఇది ముందు వరుస లోనిది. పంచముడు లేదా దళితుడు అనే అర్థం వచ్చేందుకు శీర్షికలో అయిదవవాన్ని అని ప్రకటించుకుని ఇక కవిత సాంతం గొప్పనైన వ్యక్తీకరణలతో విశాలభావాన్ని ప్రకటించారు. ప్రతివాక్యంలోనూ ధైర్యం,ధిక్కారంతో కూడిన ఆత్మగౌరవప్రకటనలు చేస్తారు. సగర్వంగా, తాను చాటింపునంటారు. తాను చెప్పునంటారు. చీపురునంటారు. పాలేరును,ఎట్టికి మొల్సిన మొల్కనూ అంటారు. పాడే కట్టేవాడిగా, చావుడప్పు వేసేవాడిగా, గజ్జెకట్టి చావు నాట్యంచేసేవాడిగా,కాటికాపరిగా మనిషి చచ్చినా గొడ్డు చచ్చినా మాదిగ మహాజనులు నిర్వహించే కర్తవ్యాలను ఈ కవితాపంక్తుల్లో గొప్పగా చెప్తారు. వీటన్నిటినీ మించిన అద్భుత వర్ణన ఇది..
కడుపుల సల్ల కదలని కాడ
కంచాల్లో పూసిన తెల్లని మల్లెపూవు నేను
పాలు పొంగిచ్చిన గూడుల
పాదం మోపనోసుకోని పరమాత్మ నేను (అయిదవ వాన్నే? నేను!, పే.69)
అన్నాన్ని పోల్చడం చూడండి, ‘కంచాల్లో పూసిన తెల్లని మల్లెపూవు’.. ఎంత బాగుందో కదా పోలిక..!
ఇన్ని గొప్ప సామాజిక కార్యాలను నిత్యం నిర్వహిస్తూవస్తున్న దళితులను ఈ క్రూర కులవ్యవస్థ ‘నీరటి తలారి కైకిలోడనీ/వొంటి నిండార్ల కట్లు’ కట్టేసిందని దిగులుపడుతూనే, నిరాశ చెందకుండా..
డొక్కలు చింపే చూరుకత్తి
డోలు కట్టే దప్పుకుదురు
సివ్వంగిలయి లేస్తన్నయి
అంటు ముట్టులు
సింపులేశాలేస్తన్నయి(పే.71)
అంటూ తిరుగుబాటు బావుటా ఎగరేస్తారు.
-ఇవి ‘ఆరుద్ర పురుగు’ పుస్తకంలో తడిమిన కొన్ని అంశాలు మాత్రమే. లోపలికి లోతుగా పోతే ఇంకేన్నో తపకుండా స్పృశించాల్సిన అంశాలు బోలెడుంటాయి. వాటన్నిటిలోనూ అనేకంగా మంచి వ్యక్తీకరణలు ప్రతి పేజీలోనూ కనిపిస్తుంటాయి.అలాంటివాటిల్లో ‘ఎదల పూసిన ఎన్నీల’లో వెన్నెలకు స్త్రీరూపం ఇస్తూ అన్న ‘పదారణాల పంచవన్నెల సిల్క’గా వెన్నెలను పోల్చడం, జీవితంలో కలిసిరాని సమయాన్ని ‘నా కనుపాపను/కనికరం కానని కాలం చిదిమేసినపుడు’ అని రాసిన ‘పేగు సవందం’ కవితలోని వాక్యాలు మచ్చుకో రెండు. అలాగే కులవ్యవస్థ దాష్టీకాన్ని చెప్పే సందర్భంలో ఇతరవర్ణాలను తిట్టకుండా ‘నలుగురన్నల’నడం, తాను మాత్రం ‘కడగొట్టు’వాడినని చెప్పుకోవడం ఆయన సంస్కారానికి నిదర్శనం.
చక్కని వ్యక్తీకరణాలున్ననూ, ఈ పుస్తకంలోని అనేక పేజీలను అవలీలగా చదివేయొచ్చనుకునే పాఠకులను ప్రధానంగా వేధించిన సమస్య భాషావాడకం. మాండలిక భాషలో,స్థానిక భాషలో రాయడం అనేది నిస్సందేహంగా బాధ్యతాయుతమైన పని. అలా రాయనివారు ఎక్కువే అయినా తిరుపతి లాంటి కవులు మాత్రం ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారు. ఇది తప్పనిసరిగా అభినందించాల్సిన విషయమే. అయితే ఇక్కడి సమస్య ఏమిటంటే ఈ పుస్తకంలో వాడిన మాండలిక భాష ప్రధానభాష కంటే క్లిష్టమైపోవడం. మాండలిక భాషలో సాహిత్యాన్ని చదువుతున్నప్పుడు దాన్ని పాఠకుడు సౌలభ్యకరంగా ఎందుకు భావిస్తాడంటే అసలుభాషలోని పరిచయం లేని,తెలియని పదాలు,ఆడంబర వాక్యాలు మాండలిక భాషలోనయితే కనిపించవనే ఆశ ఉంటుంది కనుక. తను మాట్లాడే, తనచుట్టూ ఉండే భాషే అచ్చులో అగుపిస్తుందనీ, అట్లా ఏకబిగిన పుస్తకమంతా సులభంగా చదివేయొచ్చని పాఠకుడు ఆశ పడతాడు . కానీ ఈ పుస్తకం అలా ఆశపడ్డ పాఠకులను నిరాశపరిచింది. ఇది మినహా ఇంకే పరిమితీ పుస్తకంలో కనిపించదు. రాబోయే పుస్తకాల్లో తిరుపతి గారు ఈ చిన్న పరిమితిని కూడా అధిగమిస్తారని ఆశిద్దాం.
కూకట్ల తిరుపతి బాధ చాలామందిలాగే సమాజాలు,రాజకీయాలు సృష్టిస్తున్న సమస్యలే. వాటి పరిష్కారాల కోసం నిరంతరం ఆయన కలలు కంటూ ఉంటారు. ‘నేను కలగంటున్నా!’ కవితలో స్వయంగా ప్రకటించుకున్నట్టుగా ఆయన కలలన్నీ నదులనీళ్ళు పొలాలకందాలని, మూగజీవాలకు గడ్డి దొరకాలని, రైతుకు గుప్పెడుబువ్వ,పిడికెడుజాగా దొరకాలని, గుత్తేదార్ ల పీడన పోవాలని, జానేడు గుడ్డ ప్రజలందరికీ అందాలని,తెలంగాణ భాష నిలబడాలనే ప్రజల కొరికలే. ప్రజల అవసరాలను కాంక్షించే కొరికలే. వాటికోసమై నిరంతరం మార్గాలను అన్వేషిస్తూ కాలికి బలపం కట్టుకు తిరుగుతూ, తిరిగి తిరిగి పోరాట పరిష్కారాల దగ్గరికి వచ్చి ఆగిపోతారు, వాటిని సాకారం చేసుకునేందుకు మళ్ళీమళ్ళీ తిరుగుతూనే ఉంటారు, విరామమెరుగని ‘ఆరుద్ర పురుగు’లా.

-లోకే. రాజ్ పవన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో