జ్ఞాపకం- 63 – అంగులూరి అంజనీదేవి

“అదికాదు రాజారాం!” నసిగాడు రాఘవరాయుడు.
“నువ్వు ముందు పొలం అమ్ము నాన్నా! ఆడపిల్ల పెళ్లికోసం పొలం అమ్మితే తప్పులేదు. దానికింత ఆలోచన కూడా వద్దు” అన్నాడు.

రాఘవరాయుడు వెంటనే “నువ్వు టీచర్ వి. ఎలాగైనా బ్రతుకుతావు. తమ్ముడు ఇప్పుడంటే గనుల్లో పనికి వెళ్లాడుకాని, ఎప్పటికీ అక్కడ వుండలేడు. తర్వాత అయినా ఈ ఊరు రావలసిందే. పొలం లేకుంటే వాడెలా బ్రతుకుతాడు?” అన్నాడు.

“కోపం వచ్చినప్పుడు తిడతావనేకాని వాడంటే ఎంత ప్రేమ నాన్నా నీకు? అలా అని సంలేఖ అంటే ప్రేమలేదని కాదు. తిలక్ పనిలో చేరి నెలరోజులపైనే అయింది. ఇంటికి రావడంకాని, డబ్బులు పంపటం కాని చేశాడా? కనీసం అన్నయ్యకు ఎలావుంది? నడుస్తున్నాడా? అని ఒక్క ఫోన్ కాలన్నా చేశాడా? అయినా వాడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ‘నీకు చదువుంది. ఉద్యోగం వుంది. వాడెలా బ్రతకాలిరా!’ అని జాలిపడుతూనే వుంటావు. వాడు మగవాడు నాన్నా! ఎలాగైనా బ్రతుకుతాడు. ఆడపిల్లనిసరైనవాడి చేతిలో పెట్టకపోతే బ్రతుకంతా ఏడుస్తూనే వుండాలి. అది ఏడవటం నీకు ఇష్టమేనా?”

“ఇష్టమెలా అవుతుంది రాజా! మీ అమ్మ గురించి కూడా ఆలోచించాలిగా!”
“అమ్మ వద్దంటుందా?”

“ఏ తల్లి అయినా కూతురుకి పెళ్లి చెయ్యొద్దని అంటుందా? అలా ఎప్పుడూ అనదు. మీ అమ్మ పొలం అమ్మమనే అంటోంది. కానీ నేనే ఆలోచిస్తున్నాను”
“ఏంటి నాన్నా! ఆ ఆలోచనా?”

“ఏం లేదురా! నాకు నువ్వున్నావు. నేను చనిపోయాక పెద్దకొడుకు తండ్రికి చెయ్యాల్సిన కర్మకాండలన్నీ నువ్వు చేస్తావు. నీ విషయంలో నాకెలాంటి సందేహం లేదు. కానీ తల్లికి చిన్నకొడుకే చెయ్యాలి. అది శాస్త్రధర్మం. వాడికి ఏ ఆశా చూపించకపోతే వాడు చేస్తాడా? వున్న పొలం అమ్మి సంలేఖకి పెళ్లి చేస్తే అమ్మకి చెయ్యాల్సిన కర్మలన్నీ సంలేఖ చేతనే చేయించుకోమంటాడు. వాడెంత మూర్ఖుడో మనకు తెలియంది ఏముంది?”

“తిలక్ అలా అన్నాడే అనుకో! అప్పుడు నేనే వాడికి డబ్బులిచ్చి తల్లికి చిన్నకొడుకు చెయ్యాల్సిన కర్మక్రతువుల్ని ఏ లోటూ లేకుండా జరిపిస్తాను. పెళ్లికి చావుకి ముడి పెట్టకుండా పెళ్లి జరగనీయండినాన్నా!” అన్నాడు రాజారాం.

ఈ మధ్యన మనుషుల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులు కాని, మానవసంబంధాల్లో పుడుతున్న తేడాలు కాని డబ్బుకోసమే వస్తున్నాయి. డబ్బు పుష్కలంగా ఉన్నచోట సమస్యలుండవు. మనస్తాపాలు వుండవు. అవి వున్నా డబ్బు వాటిని కడిగేస్తుంది. డబ్బువున్నా లేకపోయినా బంధాలకి బాధ్యతలకి దూరంగా బ్రతకలేం! కొడుకు మాటలు సమంజసంగా అన్పించాయి రాఘవరాయుడికి.
రేపటి నుండే పొలం అమ్మకానికి పెట్టాలనుకున్నాడు.

పొలం అమ్మకముందే ఇరువైపుల పెద్దవాళ్లు మాట్లాడుకొని ఓ మంచిరోజున సంలేఖ, జయంత్ లకి నిశ్చితార్థం జరిపించారు. నిశ్చితార్థానికి తిలక్ వచ్చినప్పుడు పొలం అమ్ముతున్నట్లు చెప్పారు.
పొలాన్ని రాఘవరాయుడు తన అవసరార్ధం అమ్ముతున్నాడు కాబట్టి ఎంత తక్కువరేటుకి అడిగినా ఇస్తారన్న ఆశ కొనేవాళ్లలో వుంది. ఇంకొంచెం ఎక్కువరేటుకి అమ్మితే పెళ్లిలో సంలేఖకు ఏదో ఒక వస్తువో, నగనో తీసివ్వొచ్చన్న కోరిక రాఘవరాయుడులో వుంది. ఇదిలాగే సాగితే పొలం అమ్మలేమేమోనన్న సందేహం రాజారాంలో వుంది.

ఎక్కువరోజులు ఆగితే జయంత్ మనసు మారిపోతుందేమోనన్న అనుమానం దిలీప్ లో వుంది.
ఈ రోజుల్లో కళ్యాణమండపం దాకా వచ్చిన పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి. నిశ్చితార్థం ఓలెక్కనా?
అందుకే ఒకరోజు రాఘవరాయుడిని కూర్చోబెట్టి దిలీప్, రాజారాం నచ్చచెప్పారు.
మధ్యస్తంగా ఒక రేటును ఖాయం చేసి ఆ రేటును ప్రకటించారు.

పొలంలో వున్న రాఘవరాయుడి తండ్రి బసవరాయుడి గారి సమాధుల్ని, వాటితోపాటు ఇంకా ఓ మూడు సెంట్ల పొలాన్ని తామే వుంచుకుని మిగిలిన పొలాన్ని అమ్మకానికి పెట్టారు. అందుకు సంతోషంగా ఒప్పుకుని ఆదిపురివాళ్లే ఆ పొలాన్ని కొనటానికి ముందుకొచ్చారు.

మొత్తం డబ్బులు పొలం రిజిస్ట్రేషన్ చేయించుకునేరోజే ఇచ్చేస్తామని మాట ఇచ్చారు.
అందరు కలిసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరకి వెళ్లారు.

ఆ ఆఫీసు వుండే ఆవరణలోనే ఎమ్మార్వో ఆఫీసు, పోలీస్ స్టేషన్ వున్నాయి. అందుకే ఆ ఆవరణలో చాలామంది ఆదిపురి వాళ్లే కన్పిస్తున్నారు. ఎవరిపనిలో వాళ్లు ఆత్రంగా, ఆరాటంగా, ఆందోళనగా తిరుగుతున్నారు. ఒకరిని ఒకరు పట్టించుకునే ధ్యాసలో కాని ఒకరి సమస్యను ఒకరు వినే స్థితిలో కాని లేరు.

తిలక్ తో పొలం అమ్ముతున్నామని, ఫలానా రోజు రిజిస్ట్రేషన్ వుంటుందని రాఘవరాయుడు చెప్పాడు. రిజిస్ట్రేషన్ రోజు మాత్రం ఎంత పనివున్నా ఆపుకుని రమ్మని ఆదిపురివాళ్లు గనుల దగ్గరకి వెళ్తుంటే చెప్పి పంపాడు. ఎందుకంటే కొనేవాళ్లు తిలక్ సంతకం లేనిదే కొనమంటున్నారు. తాత పొలం మనవడికి తండ్రికన్నా ఎక్కువ హక్కు వుంటుందని భవిష్యత్తులో అతను ఇబ్బంది పెట్టొచ్చని భయపడుతున్నారు. వయసు 18 దాటింది కాబట్టి చట్టరీత్యా అతను ఏమీ చెయ్యలేకపోయినా అతను చెయ్యాలనుకుంటే పొలంలోకి కాలు పెట్టకుండా చెయ్యగలడు. మొండికి పడి కాలు పెడితే తలలు నరకటానికైనా వెనుకాడడు. తిలక్ స్వభావం తెలియందెవరికి?

తిలక్ కోసం రాజారాం, రాఘవరాయుడు ఎదురుచూస్తున్నారు. క్షణాలు దొర్లుతుంటే వాళ్లగుండెల్లో అలజడి మొదలైంది తిలక్ వస్తాడో. రాడో అని…

ఎదురుచూసి, చూసి ఎండగా వుండటంతో రాఘవరాయుడు రాజారాంని వాకర్ సాయంతో పక్కనేవున్న వేపచెట్టు కిందకి నడిపించుకెళ్లాడు. చాలా నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ, నాలుగు అడుగులకోసారి ఆగుతూ వెళ్లాడు రాజారాం. రాజారాంని చెట్టుకింద వున్న గట్టుమీద కూర్చోబెట్టాడు రాఘవరాయుడు. ఆదిపురి సర్పంచ్ ఎమ్మార్వో ఆఫీసు ముందు నిలబడి కన్పించటంతో ఇప్పుడే వస్తానని కొడుకుతో చెప్పి అటువైపు వెళ్లాడు రాఘవరాయుడు.

అప్పుడొచ్చాడు తిలక్. కళ్లు ఎర్రగా వున్నాయి. తాగివున్నాడు. బబుల్ గమ్ నములుతున్నాడు. మనిషిగాని, నడకగాని, తూలినట్లుగా లేదు. నేరుగా రాజారాం కూర్చున్న దగ్గరకి వెళ్లాడు.

రాజారాం వాకర్ మీద చేతులు వుంచి ఆలోచనగా చూస్తూ రాత్రి వినీల “ఆ పొలం చూసే నన్ను మావాళ్లు మీకిచ్చారు. అదే అమ్మేస్తే ఇంకేముందండి? కనీసం చెప్పుకోటానికైనా ఓ సెంటు పొలం వుండొద్దా? నాకు ముందే తెలుసు సంలేఖ పెళ్లి చెయ్యాలి అంటే పొలం అమ్ముతారని. ఆ తర్వాత అత్తగారు, మామగారు ఎలా బ్రతకాలి? అదేం అంటే వాళ్లకి ‘నేనులేనా!’ అని మీరంటారు. మీరెప్పుడు నడవాలి? వాళ్లకి సంపాయించి ఎప్పుడు పెట్టాలి? మీది మీకే సరిగా లేదు. అయినా పెళ్లికోసం పొలం అమ్మటమేంటండీ? ఆడపిల్లకి పెళ్లిచేసి నోటికాడిది పోగొట్టుకుంటేగాని తృప్తివుండదా? ఆ తర్వాత వాళ్ల బాధ్యత ఎవరు చూడాలి? ఖాళీచేతులతో కూర్చుని అయ్యా ధర్మం! అమ్మా ధర్మం అన్నప్పుడు వాళ్ళను ఎవరు చూడాలి? పెళ్లి ఈ ఏడు జరగకుంటే వచ్చే ఏడు జరగదా? అతను కాకుంటే ఇంకొకడు రాడా? అతనేమైనా సంలేఖ కోసమే పుట్టాడా?” అంది. వాధించింది. తిట్టింది. ఛీకొట్టింది.

తనేం మాట్లాడలేదు. తర్జనభర్జనలకి, లాజిక్కులకి ఇది సమయం కాదు. ఆస్తులకి సంబంధించిన వ్యవహారాలు వచ్చినప్పుడు ఏ ఇంట్లో అయినా కొందరు కోడళ్లు ఇలాగే వుంటారు. ఆ ఆస్తుల్ని తామేదో కష్టపడి సంపాయించినట్లు, సర్వహక్కులు తమకే వున్నట్లు, అతిముఖ్యమైనది ఏదో కోల్పోతున్నట్లు విలవిల్లాడుతారు. అందుకే ఆమె ఎలా రెచ్చిపోయి మాట్లాడినా, రెచ్చగొట్టాలని చూసినా సంయమనం పాటించాడు. సహించాడు. ఓర్పుతో, నేర్పుతో సర్దిచెప్పాడు.

(ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

148
ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో