తెల్లటి ఆకాశం
మధ్యలో కర్రి మబ్బు
గమనం లేకుండా అలా నిస్తేజంగా
కర్రిమబ్బు పై
తారాడే సుద్ద ముక్కల
అలికిడి లేక గుడ్ల నీరు కుక్కుకుంది
కర్రిమబ్బు
వెదజల్లే అక్షర విత్తనాలు
మొక్కల మెదల్లోకి జొర్రే క్షణాలు
మళ్ళీ ఏనాడో
మొక్కల సవరించే సన్నని కర్ర
కర్రిమబ్బు పై దిక్సూచిగా చూపే కర్ర
కర్రిమబ్బు సొగసు తీర్చిదిద్దే వస్త్రం
సువిశాల ప్రపంచంలో కురిసే దెన్నడో
అలసి సొలసిన
అక్షర సేద్యగాడు
మళ్ళీ ఉద్యుక్తుడై
మొక్కలు ఏపుగా పెరగగల
ఇంధనాన్ని కర్రి మబ్బుపై
సృష్టించే దెన్నడో
మందు సృష్టించేటోడు
మందు వాడేటోడు
ఈడి నుండి పోయినోడే
ఈ చోటు ఎడారి గా ఎన్నాళ్ళుండాలో
ఎరుక గాక కలిసొచ్చే
కాలం కోసం వత్తులు వేసుకుని
జూస్తున్న జన ధరిత్రి
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~