ISSN – 2278 – 478
అమాయకత్వానికి మారుపేరు, మంచితనానికి నిలువెత్తు నిర్మాణం, కష్టపడే తత్త్వాన్ని నరనరాల్లో నింపుకున్న వారు కోయ తెగకు చెందిన ప్రజలు. నాగరిక జీవన విధానం ఇంకనూ వీరి దరి చేరలేదు, చదువుసంధ్యలు వీరినింక పలుకరించలేదు. రహదారులు లేవు, రవాణా సౌకర్యాలు లేవు. అయిన కోయ గూడాల నుండి విద్యార్థులు తండోపతండాలుగా విద్యాలయాల వెంట పరుగులు పెడుతున్నారు. అడవులే అన్ని అనే నినాదం నుండి నేడు పిల్లలు విద్యావంతులైతే చాలు అనే స్థితిలోకి ఎదిగారు. కాబట్టే తమ ఇండ్లలోని ఆడపిల్లలను సైతం వందలు, వేల కిలోమీటర్ల దూరం పంపి వసతి గృహాల్లో చదివిస్తున్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో అనేక గిరిజన విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడి గిరిజనులకు విద్యాదానం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన గురుకులాలను నెలకొల్పడంలో రాష్ట్ర ప్రభుత్వం, జానపద గిరిజన విజ్ఞాన పీఠం మరియు యస్.ఆర్. శంకరన్, ఆర్.యస్. ప్రవీణ్ కుమార్ మొదలైన వారు ఎందరో అడవి బిడ్డల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అడవుల్లో జీవిస్తున్న స్వేచ్ఛగా జీవించలేని విధానంగా వీరి జీవన విధానం మారిపోయింది. సెజ్ లు, గ్రీన్ హంట్ ల పేరిట మరియు క్వారీలు మొదలైన వాటికోసం అడవులు నరకడం, క్యూబింగ్ లాంటి అనేక పనులతో గిరిజనులను అవస్థలకు గురి చేయడం నేటికి కనిపిస్తుంది.
ఆహార విషయానికొస్తే వీరు నాగరిక జీవనంలో ఉండే అలవాట్లనే నేడు పాటిస్తున్నప్పటికీ వీరి జీవితంలో మరికొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. తేనే, కంద గడ్డలు, వేట, చాపలు పట్టడం మొదలైనవి మరియు పప్పుదినుసులు రకరకాల పంటలను పండించి వాటిని దాచుకుని కొద్దికాలం వాటినే వాడుకుంటారు. నేడు పొంగల్, ఉప్మా మొదలైన ఆధునిక ఆహార పదార్థాలు తింటున్నారు. పూర్వ కాలంలో సజ్జలు, జొన్నలు, రాగులు, గటుక, జావా, అంబలి మొదలైనవి తినేవారు, తాగేవారు. కాలక్రమంలో వీరు తినే తిండిలో అనేక మార్పులు వచ్చాయి. ఈ తెగలో వ్యవసాయాన్ని నమ్ముకుని ఎక్కువ శాతం ప్రజలు జీవిస్తుండగా, మరికొందరు పశు సంపదను మరికొందరు వేటను ఆధారం చేసుకుని జీవిస్తున్నారు. కోయ జీవన విధానం మిగితా తెగలతో పోల్చితే కొంత వైవిధ్యంగా కనిపిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల జాబితాలో 18వ తెగగా చేర్చారు. ఈ తెగవారు ఇంద్రావటి, గోదావరి, శబరి, సీలేరు నీరులా ప్రాంతాల్లోను, బస్తర్, కోనరావుపేట, వరంగల్, కరీంనగర్, ఉభయ గోదావరి జిల్లాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తారు. కోయలు, కొండరెడ్లు కలిసి జీవిస్తుంటారు. కోయల జీవన విధానంపై నదుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా స్వచ్చమైన జీవితాన్ని గడుపుతుంటారు. తెలంగాణలో కోయలు ఎక్కువగా ములుగు ఏటూరు నాగారం తాలుకాలో భద్రాచలం, వరరాయ చాంద్ర పురం (ఖమ్మం), అశ్వరావు పేట (ఖమ్మం) నుగూరు తాలుకాలలో ఉన్నారు. సుమారు ఈ జిల్లాలో 70% కోయ జనాభా ఉన్నట్లు తెలుస్తుంది.
కోయ జాతి వారు గోదావరికి ఇరువైపుల ఎక్కువగా నివాసాలు ఏర్పరుచుకున్నారు. కోయలు, కొండరెడ్లు వీరి అవసరాలకు, గృహ నిర్వాహణలో వస్తు మార్పిడి పద్ధతులను వాడుకుంటున్నారు. ఒకరి దగ్గరి వస్తువులను మరొకరికి ఇచ్చి ఒకరితో మరొకరు సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. కోయ తెగ వారి భాషను పరిశీలిస్తే వీరు గ్రామాలకు దగ్గర ఉన్నవారు తెలుగు భాషని, తెలుగు వారి పండుగలు, దేవతలను అనుసరిస్తుంటే, అడవుల్లో ఉండే వారు గోండి భాషను మాట్లాడుతూ, అడవి దేవతలను పూజించడం కనిపిస్తుంది.
పండుగలు :
తిర్ణాల పండుగ విత్తనాలు అలుకే పండగ. ఈ పండుగకు పందిని బలి ఇస్తారు. ప్రస్తుతం కోడి, మేకను బలి ఇస్తున్నారు (కోరం పోతురాజు, 25 సంవత్సరాలు, అబ్బాయి గూడెం, మంగపేట, ములుగు).
ఉట్ల పండుగ :
వనభోజనాలు, రెక్క రామక్క పండుగను కొమురం ఇంటి పేరు గల వారు చేసుకుంటే, రెక్కల రామక్క అల్లుడిని ఇరిపోలు ఇర్స ఇంటి పేరు కల్గిన వారికి ప్రత్యేక దేవత, పండుగలు ఉంటాయి. పాయెం, గొంది, జబ్బ, కూరెం, బొల్లెం ఇంటి పేర్లు కలిగి ఉంటారు. ప్రాచీనకాలంలో గూడచారులుగా కోయ తిన్న వారికి మంచి పేరు ఉండి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించడంలో వీరికి వీరే సాటి. వీరు సందేశాన్ని తెలపడానికి ఒక రకమైన ప్రత్యేక శబ్దాన్ని చేస్తారని చెప్పుకుంటారు. (వాసం కల్పన, 16 సంవత్సరాలు, వెంకటాపురం, ములుగు).
పూజా విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి, ప్రాచీన ఆచారాలు, సాంప్రదాయాలు మెల్లమెల్లగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కొబ్బరికాయలు, దీపం, అగరబత్తులు, కుంకుమ, భరణిలు గంధం మొదలైనవి వాడుతున్నారు. ఆడపిల్ల పెద్ద మనిషి అయితే పెండ్లి, చావు, తద్దినాలు మొదలైన కార్యక్రమాలను ఆ తెగ పెద్ద పూజారిగా వ్యవహరిస్తాడు. ఇతనని ‘ఒడ్డె’అని పిలుచుకుంటారు. ‘ఒడ్డె’ అనగా గ్రామ పెద్ద అని అర్థం. వీరు మైసమ్మ, పోతురాజులు, నాగులమ్మ, ఆవు దేవుడు, అంజన్న, రెక్కల రామక్క దేవుళ్లను పూజిస్తారు.
ఈ తెగలోనూ వలసలు అధికమైనాయి. పొట్ట చేత పట్టుకొని నగరాల బాట పట్టిన వారు చాలా మంది ఉన్నారు. ఇంకా వీరి జీవితంలో అనేక అసమానతలు ఉన్నాయి. ప్రస్తుత సమాజం కొంతవరకు అభివృద్ధి బాటను అనుసరిస్తున్నా, చాల మంది ఇంకా వెలుగుని చూడడానికి ఇష్టపడని వారు ఉన్నారు.
-తాటికాయల భోజన్న
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~