జ్ఞాపకం- 60– అంగులూరి అంజనీదేవి

ఇప్పుడలా ఎందుకు మాట్లాడలేకపోతోంది? కానీ ఆరోజు దిలీప్ చెప్పగానే జయంత్ ఇంట్లోవాళ్లందరికి నచ్చాడు. పక్క ఊరి సంబంధం కన్నా ఈ సంబంధమే మెరుగైనది అనుకున్నారు. తన అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఈలోపలే వదిన అతన్ని మార్చేలా వుంది.

“ఇంత చెప్పినా వినకుండా సంలేఖనే ఎందుకు చేసుకుంటా నంటున్నావో అదే మిస్టరీగా వుంది నాకు జయంత్! ప్రేమించావా అంటే అదీలేదు. పైగా పెళ్లయ్యాక ప్రేమిస్తానంటున్నావ్! ఎందుకు జయంత్? ఇప్పుడు సంలేఖ కథలు వ్రాస్తుందనా? ఆమె వ్రాస్తున్న కథలనేవి పేపర్లమీద అచ్చురూపంలో వుంటాయి కాని నీకు ప్రేమను పంచవు. నిన్ను లాలనగా చూడవు. నీ దినచర్యల్ని పట్టించుకోవు. భార్య చెయ్యాల్సిన పనులేవీ ఆ కథలు చెయ్యవు. కోరి ఇబ్బందులు తెచ్చుకోవటం అంటే ఇదే” అంది వినీల.

మాట్లాడేది ఫోన్లోనే అయినా ఏదో రహస్యం చెబుతున్నట్లు చాలా సీరియస్ గా వుందామె స్వరం. దానికి జవాబుగా జయంత్ ఏమన్నాడో వినీల మాత్రం “అది నీ భ్రమ జయంత్! పెళ్లయ్యాక కూడా నాకు తెలిసి తను రాయడం మానకపోవచ్చు. పైగా మా మామగారు కట్నం కూడా పెద్దగా ఇవ్వలేరు. ఆ ఇచ్చేదికూడా పొలం అమ్మిన తర్వాతనే ఇస్తారు. ఇంత లేనింటి అమ్మాయిని ఎందుకు చేసుకోవడం? ఆలోచించు” అంది.

అవతల వైపు నుండి లైన్ కట్ అయినట్లు అకస్మాత్ గా వినీల మాట్లాడడం మానేసింది. జయంత్ నిర్ణయం సడలిందా? బిగిసిందా? అన్నది సస్పెన్స్ లో ఆగిపోయింది. ఇంకెప్పుడైనా అయితే అతని నిర్ణయంతో తనకేం పని అని తేలిగ్గా తీసుకునేది. ఇప్పుడలా తీసుకోలేకపోతోంది. దానికి కారణం వదిన వంటగదిలో తల్లితో “సంలేఖకు పెళ్లిచేసి పంపితేనే మనకు పంటలు బాగా పండుతాయి. ఇంటికి పట్టిన పీడాపోతుంది” అని అనటమే.

ఆ మాటలు నఖ ముఖాలుగా చేరి సంలేఖను పీడిస్తున్నాయి. మనసు లోతుల్లోకి పాకి సంఘర్పణ పుట్టిస్తున్నాయి. ఇప్పుడేకాదు వదిన ఏ క్షణంలో ఏం మాట్లాడుతుందో తెలియటం లేదు. ఆమెతో వాదించి లాభం లేదు. పైగా ఇది వాదించాల్సిన సమయం కూడా కాదు. అన్నయ్య లేచి తిరగలేక మంచంలోనే వున్నాడు. తండ్రి ఆ దిగులుతోనే సగమైపోయాడు. ఇలాంటి సమయంలో వదిన అన్నయ్యను పట్టించుకోకుండా తన గురించి ఇలా మాట్లాడటం విచారంగా వుంది. ఇదంతా వదినకు తన మీద
వున్న అసూయతోనే జరుగుతోంది.

అసూయ అనేది మామూలుది కాదు. మనిషిని చేయిపట్టి లాక్కెళ్లినట్లు ఎటుపడితే అటు లాక్కెళ్లుతుంది. ఒకప్పుడు జయంత్ లో వున్న అసూయవల్లనే తన చదువు మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు జయంత్ తో తన పెళ్లి జరగకూడదని వదిన ఆశిస్తోంది. అదికూడా అసూయతోనే. ఈ అసూయవల్లనే మనుషుల్లో వుండే మంచి-చెడు త్వరగా బయటకొస్తాయి. మంచివారిని చెడ్డవారిగా, చెడ్డవారిని మంచివారిగా భావించటం సహజం. ఎవరు ఎవరిని ఎలా భావించినా ప్రతి ఒక్కరిలో అంతో ఇంతో మంచితనం వుంటుంది. మంచికి తను మాత్రమే బాధ్యురాలని, చెడుకి ఇంకెవరో బాధ్యులని తనెప్పుడూ అనుకోదు.
అందుకే తనకి వ్యతిరేకంగా వున్నవారిని చెడుగా భావించలేకపోతోంది. ఆ భావనతోనే గతాన్ని వదిలేసి జయంత్ పట్ల వున్న వ్యతిరేకతను తొలగించుకోవాలనుకుంది. అతనే స్వయంగా తనను పెళ్లిచేసుకుంటానని అడుగుతున్నాడు కాబట్టి మానసికంగా గట్టి నిర్ణయానికే వచ్చి వుంటాడు. ఏది జరిగినా అది తన మంచికే.

వెంటనే అతన్ని పెళ్లిచేసుకుని ఈ ఇంటినుండి, ఈ ఊరినుండి వెళ్లిపోవాలి. అప్పుడు వదిన పుష్కలంగా పొలంలో పండే పంటల సిరులతో తులతూగుతుంది. ఇంతకీ తను జయంత్ ని పెళ్లిచేసుకోవాలనుకునేది వదినమీద వున్న కోపంతోనా? లేక తన జీవితం గురించి బాగా ఆలోచించుకునా? ఇది తను స్పష్టంగా తేల్చుకోలేకపోతోంది.

ప్రస్తుతం తన కుటుంబ పరిస్థితులను బట్టి ఇలా చేస్తేనే బావుంటుందను కుంటోంది. ఎలాగూ ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో ఉద్యోగం చేసి తన కుటుంబానికి సహకరించలేదు. అలాంటి కోరికగాని, అభిప్రాయం కాని ఇంట్లోవాళ్లకి లేవు. వాళ్లకి ఇష్టం లేకుండా తనేపనీ చెయ్యలేదు. ఇలాగే వుంటే కొంత కాలానికి తన సహనంపై తనకే విసుగుపుట్టి ఏదో ఒకటిలే అని రాజీపడి ఇంట్లోవాళ్లని తనే ఒప్పించి, పక్క ఊరి అబ్బాయినే పెళ్లిచేసుకుంటుంది. అప్పుడు వదినలోని ఈగో సంతృప్తి పడుతుంది. తనేమో ఒడ్డునపడ్డ చేపపిల్ల అవుతుంది. అందుకే తన నిర్ణయాన్ని ఇంట్లోవాళ్లకి త్వరగా చెప్పి జయంత్ ని పెళ్లిచేసుకోవాలి అని మనసులో అనుకుంటుండగా…….

రాజారాం తన భార్యను “వినీలా..! వినీ!” అంటూ గట్టిగా పిలిచాడు.
ఆ పిలుపుకు ఉలిక్కిపడి గతంలోంచి బయటకొచ్చేసింది సంలేఖ.
ఒక్కక్షణం కంగారుపడింది.
అన్నయ్య ఎందుకు పిలుస్తున్నాడో?

ఏదైనా అవసరం అయితేనే అలా పిలుస్తాడు. ఆ పిలుపును ఆ ఇంట్లో ఎవరు విన్నా వాళ్ళు వెళ్లి అతని అవసరాలు తీరుస్తుంటారు. ఎంత పిలిచినా వినీల జాడలేదు.

వెంటనే సంలేఖ లేచి పరిగెత్తుకుంటూ అన్నయ్య మంచం దగ్గరకి వెళ్లింది.
ఈలోపలే తల్లివచ్చి రాజారాంకి ఏం కావాలో చూస్తోంది.

ఆ దృశ్యాన్ని చూస్తుంటే సంలేఖకి జాలిగా వుంది. మనిషి ఆసరా లేకుండాఏ పనీ చేసుకోలేకపోతున్నాడు రాజారాం. మొద్దు పోలయ్య ఇస్తున్న నాటువైద్యం ఏమాత్రం పని చెయ్యటం లేదు. ఈ స్థితిలోంచి బయటపడి అన్నయ్య ఎప్పుడు కోలుకుంటాడో ఏమోనన్న బాధ సంలేఖ కళ్లలో కదలాడడం రాజారాం చూశాడు.

అతనికి వెంటనే వినీల గుర్తొచ్చింది. ఇప్పుడు వినీల ఏంచేస్తుంటుందో అతనికి తెలుసు. చుట్టుపక్కల ఇళ్లలో తన వయసువాళ్ళు లేకనో ఏమో ఎప్పుడో తప్ప ఆ ఇళ్లకు వెళ్లదు. ఎంత పని వున్నా పొలం వెళ్లదు. ఒకవేళ వెళ్లినా చేతికి కట్టుకట్టుకునో, జ్వరంగా వుంది మామయ్యా! అనో ముందుగానే చెప్పి ముక్కుతూ, మూలుతూ వెళ్తుంది.

అది చూడగానే ‘సరే! నువ్వు ఇంటికెళ్లమ్మా!’ అంటాడాయన. ఇంటికొస్తుంది. తల్లి వంటచేసి పొలం వెళ్లగానే గబగబ వెళ్లి బీరువాలో దాచుకున్న హెడ్ సెట్ ని బయటికి తీస్తుంది.

దాన్ని చెవుల్లో పెట్టుకని ఇంట్లో తిరుగుతూనో, ఓచోట కూర్చునో పాటలు వింటూ వుంటుంది. ఎంత పిలిచినా చెవిటి దానిలా చూస్తుంది. లేదంటే తలవంచుకుని తన లోకంలో తనుంటుంది. ఎవరివైపూ చూడదు. ఆ క్షణంలో అసలు తనచుట్టూ మనుషులు తిరుగుతున్నారన్న ధ్యాసకూడా ఉండదామెకు.

(ఇంకా ఉంది)

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో