మన చరిత్రను ఒక్కసారి తరచి చూస్తే ఏప్రెల్ నెలలో సమాజంలో చైతన్యాన్ని కలిగించిన ముగ్గురు మహోన్నతమైన నాయకులు దర్శనిమిస్తారు.
మహాత్మా గోవింద రావు జ్యోతిబా ఫులే, బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్.
మహాత్మా గోవింద రావు జ్యోతిబా ఫులే ఏప్రెల్ 11, 1827 న మహారాష్ట్ర లోని సతారా లో పుట్టాడు. యుక్తవయస్కుడై విద్యార్ధి దశలో వున్నప్పుడు తనకి ఎదురైన సంఘటనలకి ప్రభావితుడై, మతం పేరిట జరుగుతున్న మూఢ నమ్మకాలు, వాటి వల్ల నష్టాలు , సమాజం కింది వర్గాలపై జరుపుతున్న అన్యాయాలను ఎదిరించటానికి నిశ్చయించుకున్నాడు. 21 సం. వయస్సులోనే కార్యా చరణలోకి దిగాడు. ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశాడు జ్యోతిబా ఫులే ఈ అన్ని అసమానతల పై పోరాడాడు. తన భార్య సావిత్రి భాయి తో కలిసి పోరాడి బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశాడు.
మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848 లో పూనాలో ప్రారంభించాడు. సావిత్రి భాయి ఫులే తొలి భారతీయ ఉపాధ్యాయిని. వితంతు వివాహాలు, బాలికల పాఠశాలలు, మూఢనమ్మకాలపై ,అణచివేతల పై తిరుగుబాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. అప్పుడు వాళ్ళు నాటిన విద్యా బీజాల వల్లే స్త్రీలు ఈ మాత్రమైనా వెలుగులోకి వచ్చారని చెప్పక తప్పదు.
14 ఏప్రెల్ 1891 న పుట్టి న బాబా సాహెబ్ అంబేద్కర్ స్త్రీల హక్కుల కోసం చేసిన కృషి అసమానమైనది. స్త్రీ విముక్తిని కేవలం ప్రసంగాలకే పరిమితం చెయ్యకుండా హిందూ కోడ్ బిల్లును రూపొందించి భారత స్త్రీలకి ఆస్థిలో వాటా , తద్వారా ఆర్ధిక సమానత్వాన్ని కల్గించే దిశగా కృషి చేశాడు. స్త్రీలని చిన్న చూపు చూసే మత విశ్వాసాల పై తనదైన భావజాలంతో చైతన్యవంత మైన మార్పుకి నాంది పలికాడు.ఆ నాటికి అంబేద్కర్ ఆలోచనలకి దర్పణం పట్టిన హిందూ కోడ్ బిల్ యధాతథంగా అమలు కాకపోయినా – ఇప్పటికీ స్త్రీల హక్కుల కోసం కనీసం చట్టాల్లో అయినా అమలవుతున్న విధానాలు కంటితుడుపు చర్యలే అనిపించక మానవు.డా. బి.ఆర్ అంబేద్కర్ తన శక్తివంతమైన భావజాలంతో అసమ సమాజ మార్పుకోసం తీవ్రంగా కృషి చెయ్యటం మాత్రమే కాదు. వర్ణనిర్మూలన , దళిత బహుజనుల శ్రేయస్సు కోసం , విద్య,అంటరానితనం ,పేదరికంపై అత్యంత ఆలోచనాత్మ కమైన సందేశాలను , రచనలను అందించాడు. అమూల్య మైన తార్కిక విధానాన్ని తన రచనల్లో చూపాడు.ఆయన గ్రంథాల్లోని శాస్త్రీయ చర్చ ఫలవంతమైన మార్గదర్శినిగా గోచరిస్తుంది.
ఏప్రిల్ 5 వ తేదీన జన్మించిన బాబూ జగజ్జీవన్ రామ్ ఈ దేశంలోని నిమ్న వర్గాలకు మార్గదర్శి.బాల్యం నుంచీ అస్పృస్యతను ఎదుర్కుంటూ , అంబేద్కర్ సిద్ధాంతాలకు బాసటగా నిలిచాడు. తాను ఏ పదవిలోవున్నా ఆ పదవి ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించాడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా కూడా వ్యవహరించారు. భారత రాజకీయాల్లో రక్షణ శాఖ మంత్రిగా విశిష్టమైన సేవలందించాడు.ఆయన కూతురు లోక్ సభ తొలి మహిళా స్పీకర్ పనిచేసారు మీరా కుమార్.
ఈ మహనీయులని స్మరించుకుంటుంది ….విహంగ పత్రిక .
-అరసిశ్రి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to ఏప్రెల్ సంపాదకీయం – అరసిశ్రి