ఆమె
ఆలోచన
పురిట్లోనే సంపబడింది
పుట్టకముందే ఆమెకో
చట్రం తయారు చేయబడింది
పుడుతూనే మూతివిరుపుల
సమాజంలో పడ్డందుకు
ఏడుపు లంకించుకుంది
వేష భాషలు ప్రత్యేకం
ఆహారమూ అరకొరే
వాకిట దించుకున్న తల
మళ్ళీ వెనక్కి వచ్చి గుమ్మం ముందే ఎత్తాలనే
నిబంధనల కత్తులు
కలలు కనాలన్నా
కనలేని కళ్ళు
రెప్పల తలుపులు మూయగా
మూగగా రోదిస్తున్న కళ్ళు
కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టి
దాని చుట్టూ కథలల్లి భయపెట్టి బందీ ని చేసారు
కళలు
తన ఉనికి కోసం కాక
వాడి వేడి చూపులకి మసయ్యేలా
మసిలేలా రూపు దిద్దుకున్నాయి
తన శక్తిని తను అంచనా వేయగల్గినా
అబలంటూ మొత్తుకుంటూ ఆబగా ఆక్రమించ
సిద్ధమయ్యే సిత్త కార్తె కుక్కలకి దన్నుగా మనువు
అక్షరం ఆమె ను జేరితే
జ్ఞానం ప్రశ్న ని సంధిస్తే
పితృ స్వామ్య మరణం తథ్యమని
నమ్మకాల ఊబిలో ఆమెని ముంచి
కోరికల్ని తుంచేసి ఇష్టాయిష్టాల ఊసే ఎత్తడానికి
వీలు లేని వీలునామా లిఖితం
నాటి నుండి నేటి దాకా అదే అదే అదునుగా
పదునైన వేట కొడవళ్ళు ఆమెపై అనునిత్యం
ఏ ఒక్క రోజైనా
ఆమె ఆమెగా జీవించేనా??!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~