అంతా అయిపోయింది
ఇక జరగాల్సంది చూడండి
అందరూ వచ్చారు
ఎక్కడికన్నా పోతేకదా రావడానికి
కిక్కిరిసిన జనసందోహం
ఒక్కరూ ఏడ్చిన పాపానపోలేదు
చెంగుల్ని,చేతిగుడ్డల్ని నోట్లోకుక్కి
కళ్ళజోళ్ళతో కళ్ళుమూశారు
ఇయర్ఫోన్లతో చెవులు పూడ్చారు
భౌతికంగా ఎవరూ స్పృహలో లేరు
వేదాంతానికి కొదువలేదు
పాడె కట్టారు పట్టి ఎత్తారు
నీతి,నిజాయితీ,సత్యం,ధర్మాలను
నాణేలుగా కలిపి వెదజల్లారు
దింపుడు కల్లం రానే వచ్చింది
ఎవరో పెద్దగా అరిచారు
అందరూ ఉలిక్కిపడి విన్నారు
మనిషనేవాడుంటే రండయ్యా
మానవత్వం చెవిలో మనిషిని పిలుస్తున్నాను లెమ్మనండి
మళ్ళీ మనలోకి రమ్మనండి
చివరి అవకాశం వదులుకోకండి
ఒక్కసారిగా అంతా నిశ్శబ్ధం
ఎవరు కదల్లేదు,ఎటూ మెదల్లేదు
కళ్ళన్నీ కిందికే చూస్తున్నాయి
ఆరడుగుల గొయ్యది
ఆ శరీరపు తత్త్వాన్ని అమాంతంతోశారు
లేవనీయకండి పూడ్చండి పెద్ద పెద్ద పెళ్ళలు వేయండి
ఒకరినొకరు చూసుకున్నారు
మాటామాటా కలుపు కున్నారు
మానవత్వం లేనట్టేగా!
మళ్ళీ రానట్టేగా! హమ్మయ్యా
పాపం మనకంటదులే పోదాం పదండి
ఇంతలో ఏదో అలజడడి
ఏంటీ మంటలు! ఎక్కడివీ మంటలు!
ఎవరు ఎవరు మనల్ని కాల్చుతున్నది!
ఆకాశవాణి పలికింది
మిమ్మన్ని మీరే కాల్చుకున్నారు
మీ చితిని మీరే పేర్చుకున్నారు
మానవత్వం లేనప్పుడు మనిషెందుకు
అలోచన ఆవహించింది
ఒక్కక్షణం మనిషిగా బ్రతికారు
స్వయంకృతమంటూ పశ్చాత్తాపంతో పలికారు
పదండి పోదాం మంటల్లోకి
మసిగా మారే వరకు నుసియైపోయే వరకు
మానవత్వం బ్రతికే వరకు
పదండి పోదాం మంటల్లోకి
పదండి పోదాం, పదండి పోదాం
-డా.బలరామ్ పెరుగుపల్లి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~