వాడు
రోజంతా తనకన్నీళ్ళు త్రాగుతూ
రోడ్డుపై తన బాల్యాన్ని పారబోసుకుంటున్నాడు
వాడిని ఏవగించుకోకండి.
వాడు,
మురికి శరీరంతో,మట్టివాసనతో,
పసితనపు సుగంధాన్ని పోగొట్టుకుంటున్నాడు,
వాడిని అసహ్యించుకోకండి.
వాడు,
ఎండిన కన్నీటి చారికలతో,ఏడ్చిన ఎర్రబడ్దకళ్ళతో,
తన చిరునవ్వును వెతుక్కుంటున్నాడు,
వాడిని చీదరించుకోకండి.
వాడు,
జనానికి అర్థం తెలియక జనార్ణ్యంలో
తెలియని తన మనిషికోసం ఆశగా
ఎదురుచూస్తున్నాడు,
వాడిని తరిమి కొట్టకండి.
వాడు
రోజులతరబడీ నిండని జానెడుపొట్ట పట్టుకుని తిరుగుతూ
రాస్తాపై తన పసితనాన్ని ఎండించుకుంటున్నాడు,
వాడిని అపహాస్యం చేయకండి.
వాడికి
కథలు చెప్పేందుకూ కడుపు నింపేందుకూ
కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేందుకూ
కన్న తల్లిలేదు
కన్నీళ్ళు తుడి చేందుకూ కోర్కెలు తీర్చేందుకూ
కిలకిలా నవ్వించి పెంచేందుకూ
కన్న తండ్రిలేడు
ఈ ప్రాణికి ప్రేమ నిషిధ్ధం
ఈ జీవి జన్మ అవాంఛితం,
ఈ అనాధ గాధ అగాథం .
—పోచిరాజు శర్వాణి.బెంగుళూరు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~