హేతువాదలక్ష్మి తో ముఖాముఖీ కట్టూరి వెంకటేశ్వరరావు, పుష్యమి సాగర్

కట్టూరి వెంకటేశ్వరరావుమరణించినా జీవించండి” పది మందికి జీవన దానం చేయండి.పది కాలాలు బతకండి అంటూ “మీ శరీరాన్ని మాకు ఇవ్వండి మేము తీసుకుంటాం”.అనే నినాదంతో అవయవదానానికి మించినది ఈ శరీరదానం అని ప్రజల్ని చైతన్య పరుస్తూన్న  ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.ఆవిడే గూడూరు సీతామహాలక్ష్మి.ఈపేరు బహుశా ఎక్కువమందికి తెలియకపోవచ్చు.కానీ హేతువాదలక్ష్మి గారంటే రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియనివారు ఎవరూ ఉండరు. వారితో ఈ నెల ముఖాముఖి ……….

1. మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి మా ‘విహంగ’ పాఠకులకు తెలియజేస్తారా?

జ. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర్లో ఉన్న ఉండి మాఊరు. మేము ఆరుగురు సంతానం. నేను నాలుగో అమ్మాయిని. నాన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి. మాది చాలా మధ్య తరగతి కుటుంబం. నేను చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేదాన్ని. డాక్టర్ అవ్వాలనే కోరికతో ఇంటర్లో బైపీసీ చదివాను. గోల్డ్ మెడల్ కూడా సాధించాను. ఆంధ్ర మెడికల్ కళాశాలలో మెడిసిన్లో మంచి ర్యాంకు వచ్చినా.అప్పటి మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో డాక్టర్ కోర్సు లో చేరలేక పోయాను. మా నాన్న నన్ను దగ్గరకు తీసుకుని ఒక మాట చెప్పారు. నాకు వచ్చే జీతంతో మీకు పెద్ద పెద్ద చదువులు చెప్పించలేనమ్మా.అని చెప్పి టీచర్ ట్రైనింగ్ కి వెళ్ళమని చెప్పారు.ఆ సందర్భంలో మా నాన్న ఒకమాట నాతో ఇలా అన్నారు. ఒక ఉపాధ్యాయుడే పదిమంది గొప్ప వ్యక్తులను తయారు చేయగలడమ్మా అంతగొప్పది ఉపాధ్యాయ వృత్తి అని చెప్పారు. అలా నేను 1983లో ఉద్యోగం సాధించి, నేను చదివిన స్కూల్ లోనే ఉపాధ్యాయురాలిగా జాయిన్ అయ్యాను.1986లో నేను కులాంతర వివాహం చేసుకున్నాను.మాకు ఇద్దరు సంతానం.ప్రస్తుతం విశాఖపట్నం లో నివాసం ఉంటున్నాము.అనకాపల్లి దగ్గరలో ఒక పల్లెటూరులో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.

2. సీతామహాలక్ష్మి హేతువాద లక్ష్మీ గా మారడాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు?

జ: .సీతామహాలక్ష్మి అనే పేరుతో కాకుండా నేను హేతువాద లక్ష్మి అనే పేరు నా ఊహ తెలిసినప్పటి నుండి పాపులర్ అవ్వడం అనేది జరిగింది. హేతువాద శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నా పేరు ఆలంబన అయిపోయింది.నిజంగా హేతువు అంటేనే కార్యాకరణ సంబంధాన్ని చెప్పగలిగేది.అదే హేతువాదం. అంటే ఏదీ గుడ్డిగా నమ్మకుండా అంటే మూఢనమ్మకాలు,అసంబద్ధమైన,అసంఘటితమైన, అశాస్త్రీయమైన విషయాలన్నిటిని వదిలేసి మధ్యయుగాల నాటి బూజుపట్టిన భావాలను, మతవిశ్వాసాలను పక్కన పెట్టేసి ప్రతిదీ కొత్తగా ఆలోచించడం. అలా ఆలోచించడమనేది అవసరం. శాస్త్రబద్ధంగా లేనిది,చట్టబద్దంగా లేనిది,చట్టపరంగా లేనిది మనం కొట్టిపారేస్తామన్నమాట. అలా హేతువాదంతో నేను ముందుకెళ్తున్నాను కాబట్టి, హేతువాద భావజాలంలో నేను బాగా ప్రాచుర్యం లోకి వచ్చాను. కాబట్టి హేతువాద సంఘం తరఫున అనేక కార్యక్రమాలు అంటే బాబాలు,అమ్మలు, యోగులు,యోగినులు,సాయిబాబాలు,బాలయోగులు ఇట్లాంటి వారు ప్రచారం చేస్తున్న. అశాస్త్రీయమైన విషయాలని ఎండగట్టడానికి నేను హేతువాద ఉద్యమాన్ని ఎంచుకున్నాను. దీనికి నేనే నాయకత్వం వహించాను. ఈ కారణంతోనే ప్రజల నన్ను సీతామహాలక్ష్మీ అని పిలవడం మర్చిపోయారు. హేతువాదలక్ష్మి గానే గుర్తించారు. ఎవరైనా సీతామహాలక్ష్మి అంటే చెప్పలేరేమో గానీ హేతువాదలక్ష్మి అనగానే ఠక్కున చెప్పేస్తారు.సభల్లో,మీటింగుల్లో మాట్లాడుతారు అవిడేనా అని అంటుంటారు.అలా హేతువాద లక్ష్మి గా నా పేరు ప్రజల్లో స్థిరపడిపోయింది.

పుష్యమి సాగర్ 3. హేతువాద ఉద్యమకారిణిగా మీరు చేసిన కొన్ని సాహసోపేతమైన కార్యక్రమాలను మా ‘విహంగ’ పాఠకులకు తెలియజేస్తారా?

జ: మన చదువు విజ్ఞానం పెంచేదిగా ఉండాలి కానీ మూఢ అంధవిశ్వాసాలు ప్రోత్సహించేలా ఉండకూడదు. అని చెప్పిన మా హెడ్మాస్టర్ కలిదిండి రాఘవ రాజు గారి మాటను ఆదర్శంగా తీసుకుని తొమ్మిదో తరగతిలో ఉండగానే హేతువాదసంఘం లో సభ్యత్వం తీసుకున్నాను.నేను సాధించిన మొట్టమొదటి విజయం ఏమిటంటే పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే, మా ఊర్లో దేవుడమ్మ అనే ఒక ఆవిడ వారం వారం శకునాలు చెప్తా ఉండేది. ఆమె దగ్గరికి మా స్కూల్ పిల్లలంతా వెళ్లి ఆవిడకి ఏ మహిమలు లేవు అని నిరూపించి అవిడని ఊరువదిలి వెళ్లేలా చేశాం. ఆ తర్వాత ఆ దేవుడమ్మ కూరగాయలు అమ్ముకుంటూ జీవించింది.అది మా మొదటి విజయంగా చెప్పుకోవచ్చు.అదేవిధంగా నరసాపురంలో ఒక బాబా తనకు తాను శ్రీకృష్ణుడిగా చెప్పుకుంటూ అమాయక ప్రజల్ని భక్తి ముసుగులో వారికి మాయమాటలు చెప్పి మోసాలు చేసేవారు. ఆడవాళ్ళకి అభ్యంగన స్నానాలు చేయించి. తన చుట్టూ కూర్చోబెట్టుకొని అసాంఘిక, అశ్లీలత కార్యక్రమాలకు పాల్పడేవాడు.అతడు అక్కడ చేసిన నికృష్టమైన చేష్టలని మేము బట్టబయలు చేసాము.ఈ బాబా చేసిన మోసాలని “దొంగసాధు-కొంగజపం” అని కరపత్రాలు వేసి అక్కడజరిగే మోసాలను బయట పెట్టాము. అలాగే కొంతమంది ఒక 14 ఏళ్ల బాలుడి తో బాబా వేషం వేయించి అమాయక ప్రజల అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని భక్తి ముసుగులో దోచుకు తింటున్నారు. మేము కూడా భక్తులులాగా వెళ్లి అక్కడ జరిగే తంతు అంతా బయట పెట్టాము.

ఆ బాలుడికి ఎటువంటి మహిమలు లేవని నిరూపించాం.ఆ బాబా వేషం కట్టిన అబ్బాయి చదువుకుంటాను అంటే అతణ్ని బడిలో చేర్పించే ఏర్పాటు చేసాం.అలాగే పుట్టపర్తి సత్య సాయిబాబా దగ్గర కూడా ఎటువంటి మహిమలు మాయలు లేవని నిరూపించాము.ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గా ఉండగా ఒక వెయ్యి మంది రుత్వికులు,పూజారులతో అశ్వమేధ యాగం చేయాలని తలపెట్టారు. దానిని మా హేతువాద సంఘం ద్వారా వ్యతిరేకించి, ఆ కార్యక్రమం జరగకుండా నిలుపుదల చేయగలిగాము. అలాగే జ్యోతిష్య శాస్త్రం అనేదే ఒక బూటకం. దానికోసం ప్రత్యేకించి ఒక విశ్వవిద్యాలయం స్థాపించడానికి మహేష్ యోగికి 1500 ఎకరాలు కేటాయించింది ఎన్టీ రామారావు ప్రభుత్వం. దానిపైన మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసాము. పేదవాడికి సెంటు భూమి ఇవ్వలేకపోతున్న ప్రభుత్వాలు, మహేష్ యోగి జ్యోతిష్యవిద్య విశ్వవిద్యాలయానికి 1500 ఎకరాల భూమి ధారాదత్తం చేస్తారా అని లక్ష పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టాము. అలా ఆ ఉద్యమం చేయడం వల్ల ప్రభుత్వం ఇచ్చిన జీ.వో ను వెనక్కి తీసుకునేలా చేయగలిగాము. అలాగే తిరుపతిని వాటికన్ సిటీలా చేస్తాం. అని అన్నారు ఎన్టీ రామారావు. దానికి కూడా మేము వ్యతిరేకించి, ఉద్యమం చేసి చివరికి ఆ కార్యక్రమం జరక్కుండా చేశాము. ఇంకా ఇటువంటి ఉద్యమాలు చాలానే చేశాము.

*4. భక్తి అంతా కూడా వ్యాపారమే ..అంటారా?
జ: అవునండి. ఖచ్చితంగా ఈ రోజులోనే కాదు అరవై, డెబ్భై దశకం నుంచి కూడా భక్తి ఒక వ్యాపారం గానే విలసిల్లుతుంది. ప్రజలు మానసిక దౌర్బల్యాన్ని అలుసుగా తీసుకొని ఇలాంటి వ్యాపారానికి భిన్న దారులు రూపాలు తీసుకొని దోచుకోబడుతుంది. ఒక స్వామిజి, బాబా దర్శనానికి వేల రూపాయలు ఖర్చు చేయాలి. వారికి అడుగులు మడుగులు ఒత్తుతూ సేవ చేయాలి. ఈ దేశం లో శాస్త్రీయ దృక్పధం కలిగి ఉంటె, ప్రజలకి చైతన్యం వస్తే వీరి వ్యాపారం సాగదని వారిని అజ్ఞానం లోనే ఉంచుతారండీ. దేశంలో ఎందరో బాబాలు, స్వామిజిల విలాసవంతమైన జీవిన శైలి చూస్తే వాటివెనుక వ్యాపార విలువలే/ప్రయోజనాలే తప్ప సమాజానికి ఉపయోగపడేది ఏవి ఉండదు. మూఢ భక్తి ని క్యాష్ చేసుకునే వారు ఎక్కువ. దురదృష్టకరమైన విషయము ఏమిటి అంటే ఇలా భక్తి ని గ్లోబలిజషన్ చేసి సంపాదిస్తున్న వాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళు, పై స్థాయి అధికారులు, రాజకీయనాయకులు మద్దతు పలకడం. ఏమైనా భక్తి పేరుతో కోట్ల రూపాయలను కూడా బెట్టుకొని అదొక వ్యాపారవస్తువుని చేశారు. ప్రజలు తెలుసుకొని మేలుకోలేనంతవరకు ఈ మోసాలు కొనసాగుతూనే ఉంటాయి

5. తెలుగు సాహిత్యంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన రచనలు,రచయితలుఎవరు?

జ. నేను చిన్నప్పటినుండి సాహిత్యం బాగా చదివేదాన్ని. సాహిత్యం అనేది రెండు రకాలుగా ఉంటుంది.
1. కాల్పనిక సాహిత్యం
2. అభ్యుదయ సాహిత్యం.
ఈ కాల్పనిక సాహిత్యం ప్రజలకు ఏ రకంగాను ఉపయోగపడదు. కాబట్టి నేను దాన్ని పట్టించుకోలేదు. అభ్యుదయసాహిత్యం నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది.శ్రీ శ్రీ అన్నట్లుగా “కదిలేది కదిలించేది పెనునిద్దుర వదిలించేదీ కావాలోయ్ నవ కవనాలు”అని అంటాడాయన. కాబట్టి మనల్ని కదిలించగలిగేది ఏ సాహిత్యమైనా సరే వాటిని చదవటం, దాచుకోవడం జరిగింది. మొట్టమొదట నన్ను బాగా ప్రభావితం చేసిన నవల మాక్సిం గోర్కీ రాసిన అమ్మ నవల. శ్రీశ్రీ ,రాచకొండ విశ్వనాథశాస్త్రి,కాళీపట్నం రామారావు,శ్వేతాదేవి,రంగనాయకమ్మ వంటివారి సాహిత్యం. అలాగే ఏడు తరాలు,నా జైలు జీవితం వంటి రచనలు.అదేవిధంగా కొడవటిగంటి కుటుంబరావు, త్రిపురనేని రామస్వామి,పెరియార్,నారాయణగురు వంటి వార్ల రచనలు నాకు చాలా ఇష్టం. పుస్తకాలు చదవడమంటే నాకు ఒకరకమైన ఫ్యాషన్. అద్భుతంగా ఆలోచింపజేసేవి పుస్తకాలు. మనకొక దిశానిర్దేశం చేయగలిగేది మంచి సాహిత్యం అని నేను బలంగా నమ్ముతాను.సాహిత్యానికి ఆ ప్రయోజనం ఉంది.ఎండ్లూరి సుధాకర్ గారి సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం.ఆయన రచనలు అన్నీ చదివాను. అలాగే మద్దూరి నగేష్ బాబు,పైడి తెరేష్ బాబు వంటి వారి రచనలు చాలా ఇష్టం. చల్లపల్లి స్వరూపరాణి,కె ఎన్ మల్లీశ్వరి “ప్రరవే”సంస్థ నుండి వచ్చే రచనలు, వారి సాహిత్యం ఇంకా ప్రగతిశీల భావజాలం కలిగిన వ్యక్తులు వారు రచనలు ముస్లింవాద సాహిత్యం, బీ.సీ వాద సాహిత్యం, దళిత సాహిత్యం ఇలా చెప్పుకుంటూపోతే ప్రజల పక్షాన నిలబడి రచనలు చేసేటువంటి వారి సాహిత్యం నాకు చాలా ఇష్టం. ప్రజల పక్షాన గొప్ప సాహిత్యం సృష్టిస్తున్న కవులకు రచయితలకు మీ ద్వారా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

6. హేతువాద ఉద్యమమే కాకుండా ప్రజల పక్షాన అనేక ఉద్యమాలు చేసి అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ గారిచేత అభినందించి పడ్డారని విన్నాము ఆ వివరాలు మా ‘విహంగ’ పాఠకులకోసం ఒకసారి వివరిస్తారా?

జ. నేను హేతువాద ఉద్యమమే కాకుండా 1985 లో జరిగిన కారంచేడు సంఘటనలో దళితుల పక్షానపోరాటం చేశాను.వారికి అండగా నిలబడ్డాను. దళిత ఉద్యమంలో పాల్గొన్నాను. అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నాను.సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం మరియు కుల నిర్మూలన పోరాట సమితి స్థాపించడం వంటివి చేసాను. నేను పనిచేసే ఊరిని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా మార్చగలిగాను. సారా వ్యతిరేక ఉద్యమం బలంగా చేయడం వల్ల అప్పటి జిల్లా కలెక్టర్ అజయ్ కల్లాం గారు మా జిల్లాలో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యఅతిథిగా అప్పటి గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ గారిని పిలిచారు. ఆ సభలో గవర్నర్ గారు సారా వ్యతిరేక ఉద్యమంలో సంవత్సరంపాటు నిద్రపోకుండా పనిచేశారని నన్ను అభినందించారు. అలాగే ప్రజలను చైతన్యవంత పరిచే అనేక కార్యక్రమాలు, ఉద్యమాలలో పాల్గొనాలని చెప్పారు. మా జిల్లాలో బాల్య వివాహాలు చాలా ఎక్కువగా జరిగేవి. వాటిని నిరోధించడానికి చాలా ఉద్యమాలు చేశాం. మైనర్ బాలికలపై జరిగే అత్యాచారాలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము.మైనర్ బాలికలు తల్లులవడం, అంటే ఎనిమిది, తొమ్మిదో తరగతి చదివే కొంతమంది ఆడపిల్లలు గర్భవతులువ్వడం వంటివి చాలా జరిగాయి.

అభంశుభం తెలియని పిల్లల్ని తల్లుల్ని చేసి తప్పించుకుతిరుగుతున్న మోసగాళ్లని పట్టుకొని వారిని పోలీసులకు అప్పగించి ఆ ఆడపిల్లలకు న్యాయం జరిగేలా చేయగలిగాము. ఒక జవాన్ చేతిలో మోసపోయిన రమ్య అనే 15 ఏళ్ల అమ్మాయి మూడునెలల పసికందుని ఎత్తుకొని వాళ్ళ అమ్మని తీసుకుని నా దగ్గరికి వచ్చింది.అప్పటికి ఆ అమ్మాయి పదవ తరగతి చదువుతోంది.తొమ్మిది నెలలు నిండేవారకూ తను గర్భవతి అన్న సంగతే ఆమెకు తెలియలేదు.అటువంటి అమాయకురాలు రమ్య. ఒకరోజు రమ్య వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోలేక పోవడం వల్ల రమ్య వాళ్ళ అమ్మ పనిచేసే ఇంటికి తను పని చేయడానికి వెళ్ళింది.ఆ ఇంట్లో ఉన్న జవాన్ రమ్యకు మాయమాటలు చెప్పి ఆమెను లోపరుచుకుని గర్భవతి ని చేసి వెళ్లిపోయాడు.అప్పటికి రమ్య పదో తరగతి చదువుతోంది. ఆ జవాన్ తన కూతురికి చేసిన మోసాన్ని నాకు చెప్పి మాకు ఒక న్యాయం జరిగేలా చూడమని నాదగ్గరకు వచ్చారు రమ్య తల్లి. అప్పటి కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ గారితో ఆ విషయాన్ని చెప్పి రమ్యకు న్యాయం జరగడానికి కలెక్టర్ గారి సపోర్టుతో పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది.ఇలా అనేక మంది పిల్లలకు అండగా నిలబడ్డాము.తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి బాల్య వివాహాలు చేయకుండా అనేక కార్యక్రమాలు నిర్వహించాము.

7. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ & చారిటబుల్ ట్రస్ట్ (SPECT)ద్వారా మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఏమిటి.మీ సంస్థ ద్వారా ఇప్పటి వరకు ఎంత మంది పిల్లలకు సహాయం అందించారు?

జ. ప్రతిభ ఉండి చదువుకోలేని వారు, పేద పిల్లలు, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు వీరందరినీ గుర్తించి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా వీరందరికీ నా జీతంతో కొంతమందిని మరికొంతమందిని దాతల నుంచి సేకరించిన డబ్బుతో పిల్లలను మేము చదివిస్తున్నాము. ప్రేమతత్వం, మానవత్వం ఉన్నవారు మేము చేసే కార్యక్రమాలకు స్పందించి చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. అలా మేము ఇప్పటివరకు 380 మంది విద్యార్థులను చేరదీసి వారి చదువుకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని మా సంస్థ ద్వారా అందించగలుగుతున్నాం. పేదరికం ఎంతటి ప్రతిభ ఉన్నవారినైనా తొక్కేస్తుంది. ఆ బాధ ఏమిటో నాకు బాగా తెలుసు. నాలా మిగతావారు ఇలా బాధపడకూడదని సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది దాతలచేత సహాయ సహకారాలు అందించగలుగుతున్నాము.

8.అఖిలభారత అవయవదానం శరీరదాన సంఘం స్థాపించారు కదా.ఈ ఆలోచన మీకు ఎలా కలిగింది.మిమ్మల్ని అంతలా ప్రభావితం చేసిన సంఘటన ఏదయినా ఉందంటారా?

2003వ సంవత్సరంలో కిడ్నీ సమస్యతో చాలా హాస్పిటల్స్ తిరిగాను. ఎక్కడ నాకు నయం కాలేదు. ఒక డాక్టర్ గారి సూచనతో కోయంబత్తూర్లో వేదనాయకం గారి హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. అక్కడ నా ఎదురుగా ఉన్న గదిలో ఎనిమీదేళ్ల అబ్బాయి చాలా ముద్దుగా ఉన్నాడు.ఆ పిల్లాడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు.ఆ అబ్బాయి తల్లిఎంతో బాధ పడుతుంది. తన బిడ్డకు ఎవరైనా కిడ్నీ దానం చేస్తే నూరేళ్లు బ్రతుకుతాడని. కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ సంఘటన నాకు చాలా బాధ కలిగిచింది. అప్పుడు వేదనాయకం గారిని అడిగాను.ఆ అబ్బాయి బ్రతికే ఛాన్స్ లేదా అని. అప్పుడా డాక్టర్ గారు ఎవరైనా కిడ్నీ దానం చేస్తే ఆ పిల్లాడు బ్రతికే అవకాశం ఉందమ్మా? కానీ ఎవరు చేస్తారు. మన దేశంలో అంత ఆవేర్ నెస్ ఎవరెవరికీ లేదమ్మా.ఎవరూ ఇలా అవగాహన కల్పించడం లేదు.అందువల్లే చాలామంది చనిపోతున్నారని అన్నారు. నూరేళ్ళు బ్రతకాల్సిన అబ్బాయిని మనం పోగొట్టుకుంటున్నాం కదా….అనే ఆలోచన నన్ను నిత్యం తొలిచేసేది. ఆ అబ్బాయిలాగా ఎవరూ చనిపోకూడదు మన వంతుగా మనం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో అఖిలభారత అవయవదాన శరీరదాన సంఘం స్థాపించాను.

ఈ సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి.ప్రజల్లో శరీర అవయవ దానం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాము. మొట్టమొదటిగా నేను చనిపోయాక నా శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేస్తానని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. అప్పుడు నన్ను చాలామంది చాలా వింతగా చూసేవారు. తర్వాత కాలంలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి శరీర దానం అవయవ దానం చేయడం వల్ల అనేకమందికి జీవన దానం చేయవచ్చని అవగాహన కల్పించి వారి చేత కూడా శరీర అవయవదానం చేయడానికి ముందుకువచ్చేలా చేయగలిగా. ఈ కార్యక్రమానికి మా నాన్నగారు సపోర్ట్ చాలా ఉంది. అలాగే నా భర్త నా ఇద్దరు పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేశారు.దేశవ్యాప్తంగా చాలామంది శరీరదానం చేయడానికి ముందుకు వస్తున్నారు.ముఖ్యంగా డిగ్రీ,బి.టెక్ చదివే పిల్లలు కూడా శరీర అవయవ దాననికి ముందుకు రావడం నాకు చాలా సంతోషం కిలిగించింది.

9.ఆర్గాన్ డోనేషన్ అంటే ఏమిటి ?శరీరదానం చేయమని అడగడానికి వెళ్ళినపుడు మీకు ఎదురైన అనుభవాలు మా పాఠకులకు వివరిస్తారా?

జ.బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను వేరొకరికి దానం చేయడంవల్ల కనీసం ఐదు ఆరుగురికి జీవం పోసినట్లవుతుంది.అని ఆ వ్యక్తి యొక్క బంధువులను ఒప్పించి అతని శరీరంలోని అవయవాలను వాటి అవసరం ఉన్న ఇతరులకు మార్పించే ఏర్పాటు చేయడంవల్ల బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి జీవించి ఉంటాడు. కొంతమంది తల్లిదండ్రులు జీవితాల్లో వెలుగు నింపిన వాడవుతాడు. చనిపోయే వ్యక్తి బంధువుల దగ్గరికి వెళ్లి మీ అబ్బాయి శరీరాన్ని మాకు ఇవ్వండి. అని అడగడం చాలా బాధతో కూడుకున్న పని. వారు ఎంతో దుఃఖంతో నిండి ఉంటారు. అయినా సరే వారిని శరీర అవయవదానం చేయడానికి ఒప్పించడం చాలా కష్టమైన పని. కాని ఇలా చేయడం వల్ల కొంత మంది జీవితాల్లో వెలుగులు నింపుతారని వారికి నచ్చజెప్పి వారిని ఒప్పించడం జరుగుతుంది.

10.మీరు నిర్వహిస్తున్న శరీర అవయవదాన సంఘానికి ప్రభుత్వం నుండి మీకు సపోర్టు చేస్తుందంటారా?

జ.మేం చేసే ఈ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రభుత్వం కూడా స్పందించి జీవన్ దాన్ ట్రస్టు ని ఏర్పాటు చేసింది దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. ఎవరైనా సరే అవయవ దానం చేయగలిగితే ఈ నెంబర్ కి పోనే చేస్తే ఒక టీమ్ మీదగ్గరకు వస్తుంది. వారు చనిపోయిన వ్యక్తి నుండి కార్నియా సేకరించి తీసుకు వెళ్లి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లో భద్రపరుస్తారు.అవసరమైన వ్యక్తికి ట్రాన్స్ ప్లాంటేషన్ చేసే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి ఆర్గాన్స్ సేకరించి వాటి అవసరం ఉన్న వారికి అందించే ఏర్పాట్లు చేస్తారు.

11.బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ డా.పుట్ల హేమలత గారితో మీ అనుబంధం తెలియజేస్తారా?

జ. హేమలత గారంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ నాకు. ఆమెను చూస్తేనే మనలోనే ఒక చైతన్య ప్రవాహం అలా ప్రవహిస్తూ వచ్చేస్తుంది మనకి. ఆమె గలగలా నవ్వుతూ కల్మషంలేని హృదయంతో అందర్నీ అక్కున చేర్చుకునే వ్యక్తి డా.పుట్ల హేమలత. వొక సాహితీవేత్తగా ఆవిడ ఎంత గొప్పదో చెప్పడానికి నా శక్తి సరిపోదు. కానీ ఒక మనిషిగా ఒక ప్రేమతత్వం నిండిన మనిషిగా హేమలత పట్ల మాకు కొండంత అభిమానం. నేను హేతువాదిని. ఆత్మలు లేవు అని బలంగా నమ్మే వ్యక్తిని. కానీ హేమలత గారు ఈలోకం విడిచి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఆవిడ ఇంకా బ్రతికే ఉంది.మన మధ్యనే సజీవంగానే ఉంది అని అనిపించేంతగా ఉంటుంది నాకు.అనకాపల్లిలో ‘ప్రరవే'(ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక) ప్రారంభించిన మొదటి సభ నుండి ‘ప్రరవే’ పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వైజాగ్ లో నిర్వహించిన సభలో కూడా ఆమెతో కలిసి పని చేసాను.ఎండ్లూరి సుధాకర్ గారికి హేమలత గారికి ఒక ఆణిముత్యం.

సుధాకర్ సార్ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. హేమలత,మానస తో వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉంది. హేమలత గారు మన మధ్య లేరు అనే విషయం ఇంకా నమ్మలేకపోతున్నాను. ఆమె జ్ఞాపకాలు ఇంకా సజీవంగా నా వెంటే ఉన్నాయి. గొప్ప మానవతావాది డా. పుట్ల హేమలత. విశ్వ మానవ ప్రేమతత్వం ఆమె సొంతం. గత సంవత్సరం ఆమె సంస్మరణ సందర్భంగా “పుట్ల హేమలత సాహిత్య స్మారక అవార్డు”ను అందుకున్న మొదటి వ్యక్తి నేను. చాలా సంతోషాన్ని గర్వాన్ని ఇచ్చింది ఆ అవార్డు నాకు.కానీ అంతకంటే ఎంతో ఎక్కువ బాధగా ఉందినాకు. నా స్నేహితురాలు పుట్ల హేమలత మన మధ్య లేదు అని. ఆమె పేరు మీద ఇచ్చిన పది వేల రూపాయల పారితోషికాన్ని ఒక పేద విద్యార్థి చదువు నిమిత్తం ఖర్చు పెట్టాను. తెలుగు సాహితీ లోకంలో హేమలతను చిరస్మరణీయురాలిగా నిలిపిన సుధాకర్ గారికి వారి కుమార్తెలు మానస,మనోజ్ఞ లకు వినమ్రంగా కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

12.ఉపాధ్యాయురాలిగా,హేతువాదిగా,స్త్రీవాదిగా నేటి యువతకు మీరిచ్చే సందేశం?

జ. నేను ఉపాధ్యాయురాలిని కాబట్టి,ఒక తరాన్ని మార్చగలిగే అవకాశం నా చేతిలో ఉంది కాబట్టి. నేను యువతరాన్ని కోరేది ఏంటంటే నిస్తేజంగా బతకవద్దు. నిద్రాణంగా బతకొద్దు అంటాను. నార్ల చిరంజీవి గారు అన్నట్లు “యువతరం గళమెత్తితే ,యువతరం శిరమెత్తితే,ఈ చీకటే తొలగిపోదా, ఈ దేశమే మారిపోదా అని అంటాడయన. ఇవేళ దేశ దేశాన్ని మార్చగలిగేది, నడిపించగలిగేది యువతరం మాత్రమే. ఆ యువతరం ఈ సైబర్ కేసుల్లోగాని,దేశం మీద వేదజల్లుతున్న విషసంస్కృతి ప్రభావానికి లోను కాకుండా. ఒక ప్రజాస్వామిక విలువలు నిలబెట్టడానికి,ప్రజల యొక్క స్థితిగతులను మార్చడానికి యువతరం నడుం బిగించాలి అని నేను కోరుకుంటున్నాను. సమాజంలో అందరూ బాగా బతికితే మనం నేడు ఈ ఉద్యమాలు చేయవలసిన అవసరమీ లేదు. ఈ వేళ రైతులు గడ్డకట్టే చలిలో ఆ దుర్మార్గమైన వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. దాదాపు 60,70 మంది తమ ప్రాణాలు అర్పించారు. అలాంటి రైతు పోరాటానికి మనం మద్దతు పలకాలి. యువకులే కాదు అన్నం తినే ప్రతి ఒక్కరూ,మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రైతులు చేస్తున్న పోరాటాన్ని బలపరుస్తూ ముక్తకంఠంతో రైతుకు తోడుగా నిలబడాలి.

ఆ రైతుఉద్యమం స్వాగతం చెప్పే అసలు మన ఉనికికే మనుగడ లేకుండాపోతుంది.అందుకే సమాజంలో కార్మికవర్గమైనా,కర్షకవర్గమైనా,ఏ శ్రామిక కులాల ప్రజలైనా ఎక్కడ అవస్థలు పడుతున్నా,కన్నీళ్ళు పెడుతున్నా,అత్యాచారాలకి,దమనకాండకి గురైపోతున్న వాటిని చూసి స్పందించకుండా ఉండొద్దండీ. పోరాడుదాం అందరం బ్రతకాలి.మంచిగా బ్రతకాలి,సంతోషంగా జీవించాలి. అసమానతలు,అస్పృశ్యతలు లేకుండా బతకాలి. దోపిడీ,హింస లేకుండా ఒక మానవీయ సంస్కృతి,ఒక మానవత్వంతో ఒక ప్రేమతో నిండిన సమాజం మనకి నేడు కావాలి. అటువంటి సమాజం వచ్చేవరకూ ప్రతి ఒక్కరు పని చేయాల్సిందే.ముఖ్యంగా నేటి యువత. మనుషులుగా బ్రతుకుదాం స్పందిద్దాం. అందరూ స్పందిస్తే అందరూ పోరాటానికి చేతులు కలిపితే ఖచ్చితంగా ఈ సమాజం మారుతుంది. సమాజం యొక్క మార్పు నేటి యువతరం చేతుల్లోనే ఉంది కాబట్టి,యువత పోరాడాలి సమానత్వం సాధించాలి.

మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు

 

.కట్టూరి వెంకటేశ్వరరావు,

-పుష్యమి సాగర్

————————————–——————––——-–————-

ముఖాముఖిPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో