జ్ఞాపకం- 57 – అంగులూరి అంజనీదేవి

నిన్న ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్పుకోవాలని కాలేజీ అయిపోగానే హస్విత దగ్గరికి వెళ్లింది సంలేఖ.
కానీ హస్విత ఎప్పటిలా లేదు. ఏదో మార్పు.

“ఏంటి హస్వీ! అలా వున్నావ్?” అక్కడే వున్న సోఫాలో కూర్చుంటూ అడిగింది సంలేఖ.
హస్విత వెళ్లి సంలేఖ పక్కన కూర్చుని “నాకెందుకో భయంగా వుంది సంలేఖా!” అంది.

“భయమా! ఎందుకు?” ఆశ్చర్యపోతూ అడిగింది సంలేఖ.

“దిలీప్ ని పెళ్లిచేసుకుని తప్పు చేశానేమో!” అంది హస్విత. కదిలిస్తే ఏడ్చేలా వుంది.
హస్విత వైపు పరిశీలనగా చూసింది సంలేఖ.

ఎప్పుడొచ్చినా ‘దిలీప్ అలా, దిలీప్ ఇలా’ అంటూ ఎంతో ఆనందంగా మాట్లాడేది. ఇప్పుడు దిలీప్ ని పెళ్లిచేసుకుని తప్పుచేశానని అంటోంది? తను వింటున్నది నిజమేనా అన్నట్లుగా చూసింది.

“ఇన్నిరోజులు ఏమో అనుకున్నాను లేఖా!” అంది విచారంగా చూస్తూ హస్విత.
“అసలేం జరిగిందే? నిన్ను చూస్తుంటే భయంగా వుంది” అంది సంలేఖ.
“ఇంకా ఏం జరగలేదు. జరగదన్న గ్యారంటీ లేదు లేఖా!”
“అంటే…?”
“అంటే ఏముంది? అంతా నా కర్మ! ముందు తెలిస్తే ఒక జర్నలిస్టును పెళ్లిచేసుకోటానికి చచ్చినా ఒప్పుకునేదాన్ని కాదు. అతను రాత్రీ, పగలు అని లేకుండా ఎక్కడ ఏ సంఘటన జరిగినా న్యూస్ కోసం బయటకెళ్తుంటాడు. నాతో ఒక్కోసారి ఎంత ఎక్కువగా గడుపుతాడో అంతకన్నా ఎక్కువగా అందుబాటులో లేకుండా వుంటాడు. అయినా అతని వృత్తిని, ప్రవృత్తిని బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి అతను ఇంట్లో వున్నప్పుడు ఎంత ఆనందంగా వుంటున్నానో, లేనప్పుడు కూడా అంతే ఆనందంగా వుండగలుగుతున్నాను. కానీ…” అంటూ ఆగింది హస్విత.

సంలేఖ హస్విత వైపే చూస్తూ ఆత్రంగా వింటోంది. ఇంకా ఏం చెప్పబోతుందోనని ఆమెకి టెన్షన్ గా వుంది.
“మొదట్లో నేను దిలీప్ ని అత్యవసర పరిస్థితిలో కూడా న్యూస్ కోసం వెళ్ళనిచ్చేదాన్ని కాదు. గొడవ చేసేదాన్ని. అసలు నన్నెందుకు పెళ్లిచేసుకున్నావ్ అని ఏడ్చేదాన్ని. కానీ అతను తనకి జర్నలిజం అంటే ఎంత ఇష్టమో చెప్పాడు. అతని లక్ష్యాలను చెప్పాడు. వాటి విలువల్ని చెప్పాడు. నా మాట విని ఇంట్లో వుంటే ఏం కోల్పోతాడో చెప్పాడు. అతనిది వ్యక్తిగత సేవకాదు. సమాజ చైతన్యం కోసం చేస్తున్న పని. అందుకే నేను అతని అభిప్రాయాన్ని గౌరవించాను. ఆ క్షణం నుండి అతన్ని వేధించటం. నేను వేదన చెందటం మానుకున్నాను. కానీ…” అంటూ మళ్లీ ఆగింది.
సంలేఖ ఆత్రంగా హస్వితనే చూస్తూ వింటోంది.

“ఇవాళ ఉదయం టీ.వి.లో ఒక సినిమా చూశాను. అందులో రిపోర్టింగ్ తీసుకోటానికి వచ్చిన జర్నలిస్ట్ ని కొట్టి, అతని కెమెరాని దౌర్జన్యంగా లాక్కున్నారు. దాన్ని నేలకేసి కొట్టి పగలగొట్టారు. ప్రాణ భయంతో ఆ జర్నలిస్ట్ పారిపోతుంటే నలుగురు వ్యక్తులు వెంబడించి చంపారు. ఆ జర్నలిస్ట్ లో నాకు దిలీపే కన్పిస్తున్నాడు. భయంతో నా గుండె చూడవే ఎలా కొట్టుకుంటుందో” అంటూ సంలేఖ చేతిని తన గుండెమీద పెట్టుకుంది హస్విత.
నిజంగానే హస్విత గుండె అవసరాన్ని మించే కొట్టుకుంటోంది.

“నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఇన్వెస్ట్ గేషన్ చేసేటప్పుడు జర్నలిస్ట్ ల కి ప్రమాదాలు వుంటాయి. కానీ నువ్వు సినిమాలో చూసినంతగా వుండకపోవచ్చు. కావాలంటే దిలీప్ ని అడిగిచూడు. నీ భయం పోతుంది”

“నాదంత సులభంగా పొయ్యే భయం కాదు. నా మాట వింటాడో లేదో నువ్వయినా చెప్పవే లేఖా! ఇది వదిలేసి వేరే జాబ్ చూసుకోమని” అంది.
సంలేఖ నవ్వి “నీ భయం చూస్తుంటే నాకో న్యూస్ గుర్తిస్తుంది. అదేంటో చెప్పనా?”
“చెప్పు?”

“పసిఫిక్ సముద్రంలోని ఒక ద్వీపంలో కలరా సోకి 500 మంది చనిపోయారని తెలిసి అమెరికన్ సహాయక బృందాలు అక్కడికి వెళ్లాయట. అయితే వారిలో 50 మంది మాత్రమే కలరాతో చనిపోతే, మిగిలిన 450 మంది కలరా భయంతో చనిపోయారని పోస్ట్ మార్టం పరీక్షల్లో తేలిందట. దీన్నిబట్టి వ్యాధికన్నా భయమే ప్రమాదకరం కదా!”
హస్విత కళ్లు అప్రయత్నంగానే వర్షించాయి.

అది చూడగానే సంలేఖ కదిలిపోతూ తన చున్నీతో హస్విత కన్నీళ్లను తుడిచి “ఈ భయం వల్లనే నువ్వు పిరికిదానివైపోతున్నావు. భయం అనేది బందిఖానా లాంటిది. ఒక్కసారి దానిలోకి ప్రవేశిస్తే యావజ్జీవ ఖైదీలా రోజూ చస్తూ బ్రతుకుతూ వుండాలి. ముందు నువ్వా భయాన్ని తగ్గించుకో. దిలీప్ కి ఏం కాదు” అంది సంలేఖ.

సంలేఖ మాటలు వింటూ లోపలికి వచ్చాడు దిలీప్.

దిలీప్ ని చూడగానే “ఇవాళ హస్విత ఏదో సినిమా చూసిందట దిలీప్! అందులో ఒక పాత్రికేయుని చంపబోయారట. చంపబోవటం కాదు నిజంగానే చంపేశారట. అప్పటి నుండి ఒకటే ఏడుపు. ఎంత చెప్పినా మనలోకంలోకి రావడం లేదు!” అంది సంలేఖ.

”సినిమాలని సినిమాల్లాగే చూడాలి. ఎంటర్ టైన్ చెయ్యాలి. జీవితాలకి అన్వయించుకొని మనసు పాడు చేసుకోకూడదు. రోజురోజుకి మరీ చిన్నపిల్లయిపోతుంది” అన్నాడు వాళ్లకి ఎదురుగా కూర్చుంటూ దిలీప్.

హస్విత మాట్లాకుండా లేచి లోపలికి వెళ్లబోయింది. ఆమె ముఖంలో విచారం ఇంకా తగ్గలేదు. .
దిలీప్ హస్వితవేపు చూసి “మొహం కడుక్కొని రా! నీకో మంచి గుడ్ న్యూస్ చెబుతా!” అన్నాడు.

గుడ్ న్యూస్ అనగానే ముఖం అదోలా పెట్టి “ఎప్పుడు చూసినా న్యూస్ ల గొడవే! ఆ న్యూస్ కోసం తిండి లేకపోయినా, నిద్రలేకపోయినా ఫర్వాలేదు. ఫోన్ కాల్ వస్తేచాలు అర్థరాత్రయినా సరే కెమెరా పట్టుకొని వెళ్లిపోతుంటారు. తెల్లవారి న్యూస్ వచ్చేంతవరకు ఇంటి పరిసరాలు గుర్తుండవు. మీటింగ్ లు, ఇన్వెస్ట్ గేషన్స్ తప్ప మరో వ్యాపకం వుండదు” అంది కోపంగా, బాధగా హస్విత.

దిలీప్ నవ్వి “నా వృత్తే అదయినప్పుడు నా వ్యాపకం మరోలా ఎలా వుంటుంది? ఇది నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే మాట్లాడుతుంటావ్! ఇక లాభం లేదు. నీక్కూడా ఏదో ఒక ఉద్యోగం చూడాలి. ఇంట్లోవుంటే నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నామీదనే పెడుతున్నావ్!” అన్నాడు కాస్త జోగ్గా, కాస్త సీరియస్ గా.

హస్విత “వెంటనే ఆ పని చేయండి! అదే హాయి నాకు. ఎక్కడో చోటుకి ట్రాన్స్ఫర్ చేయించుకుని మీకు దూరంగా వెళ్లిపోయి నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను” అంది.

“ఆ బ్రతుకే ఇప్పుడు చాలామంది బ్రతికేది. జాబ్ చేసుకుంటూ లేడీస్ హాస్టల్లో వుంటున్నారు. హాయిగా వున్నాం అనుకుంటున్నారు. అయితే నువ్వు కూడా త్వరలోనే ఇల్లు వదిలి లేడీస్ హాస్టల్లో వుండబోతున్నావన్నమాట. పోన్లే ఏదో ఒక హాస్టల్లో ఓ బెడ్ దానివి కాబోతున్నావ్! శుభం” అన్నాడు.
హస్విత ముఖం పాలిపోయింది.

“చూడవే! ఏమంటున్నాడో!” అంది సంలేఖతో..
“నీ మాటల్నిబట్టే దిలీప్ కూడా మాట్లాడుతున్నాడు. ఏదైనా మనల్ని బట్టేకదా అవతలవాళ్లు”

“ఇక చాల్లే ఆపు. నా ఫ్రెండ్ వన్న మాటేగాని నువ్వెప్పుడూ దిలీప్ వైపే మాట్లాడుతుంటావు” అంటూ సంలేఖ మీద కోప్పడింది.

“ఆ కోపమే వద్దనేది. ఒక జర్నలిస్ట్ గా నా విధులు, బాధ్యతలు, నేనిచ్చే రిపోర్టింగ్ పూర్తి అయ్యేంత వరకు నేను పడే టెన్షన్ నీకు తెలుసు. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని న్యూస్ వచ్చేంతవరకు ఎవరికీ తెలియకుండా ఎంత రహస్యంగా వుంచాలో, ఎన్నెన్ని పరిచయాలను, ఎంత ఇన్ఫ్లూయిన్స్ ను పెంచుకోవాలో, వాటిని కాపాడుకోవాలంటే ఎంత లౌక్యం కావాలో నాకు తెలుసు. డిఫరెంట్ న్యూస్ ని కవర్ చెయ్యాలన్నా, తాజా వార్తలు అందించాలన్నా రిస్క్ తప్పదు. ఎక్కడా తిరక్కుండా, నా ప్రయత్నమే లేకుండా సమాచారం మొత్తం వచ్చి నా ఒల్లో పడదు. అయినా నీకేం తక్కువ చేస్తున్నా?”

“అంతా ఎక్కువే!” అంది మూతి ముడుచుకుని.
దిలీప్ నవ్వుతూ లేచి “నీ బాధేంటో నాకు తెలుసు. నాకేం కాదు. నాకన్నా ముందున్న ఏ కొద్దిమంది పాత్రికేయులో తప్ప అందరూ ప్రాణ త్యాగాలు చెయ్యలేదు. ప్రమాదాల్లో ఇరుక్కోలేదు. నా మాట నమ్మి లోపలకెళ్లి స్వీట్ పట్రా! సంలేఖకి తినిపిద్దాం!” అన్నాడు.

ఆమె ఎందుకు? ఏమిటీ? అని అడక్కుండా వెంటనే వెళ్లి స్వీట్ తెచ్చి సంలేఖ నోట్లో పెట్టి “ఇప్పుడు చెప్పండి” అన్నట్లు భర్తవైపు చూసింది.

దిలీప్ ఒక కవర్లోంచి మంచి పాపులర్ పత్రికను బయటకు తీశాడు. స్వీట్ తింటూ ఏమిటన్నట్లు ఆ కవరు వైపు చూస్తోంది సంలేఖ.

“ఇందులో నీ కథ వచ్చిందిలేఖా!” అంటూ ఆ పత్రికను సంలేఖ చేతిలో పెట్టాడు.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో