ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లంబాడీలా తీజ్ పండుగ(సాహిత్య వ్యాసం )-డా .మురహరి రాథోడ్

ISSN 2278-4780

లంబాడీలు జరుపుకునే తీజ్ పండుగ గత దశాబ్ద కాలంగా బహుళ ప్రచారం పొందుతూ వస్తుంది. తండా వాసులకే పరిమితమై తీజ్ పండుగ పిలువబడింది. లంబాడీల పైన జరుగుతున్న పరిశోధనలు, పలుఅభివృద్ధి కార్యక్రమాలు వారి జీవన విదానాన్ని, సంస్కృతి వైవిధ్యాన్ని గిరిజనేతర ప్రాంతాలకు పరిచయం చేయడానికి వీలు కలిగింది. ఆదిలాబాద్ జిల్లలో గుడి హత్నుర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, అసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల పరిసర ప్రాంతాలలో ఈ పండుగను సంప్రదాయంగా జరుపుకుంటూ వస్తున్నా ఆనవాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా గుడిహత్నుర్ మండలంలో లంబాడీలు జరుపుకునే తీజ్ పండుగలో గతం తాలూకు మూలాలు నేటికి సహజంగా చూడవచ్చు. ఈ ఉద్యేశం తోనే ఈ ప్రాంతంలో సేకరణకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి మిగతా ప్రాంతాల్లో కూడా దీనికి సంబందించిన మరింత సమాచార సేకరణకు పూనుకోవడం జరిగింది.

తీజ్ పండుగ ఔన్నత్యాన్ని లంబాడీల జీవన సరళిని చర్చించడానికి వీలు కలిగింది. ప్రకృతితో మమేకమై జీవనం సాగించే గిరిజన జీవన వైవిద్యం పలు సందర్భాల్లో ప్రతిఫలించే విదానాన్ని గ్రహిస్తూ ప్రత్యేకతలను తెలుసుకునే వీలు కలుగుతుంది.

తీజ్ పండుగకు పునాది దాటుడు పండుగ, ఇలా ఒక పండుగల క్రమం వీరి ఆచారంలో కనిపిస్తుంది కాలం, వ్యక్తులు ప్రదాన్యతకు వివరిస్తుంది.

తీజ్ పండుగలో భాగస్వాములైన కువారి చోరి (పెళ్లికానీ యువతులు) తీజ్ సందర్భంగా వారి మనోభావాలను పంచుకుంటూ ఈ పండుగ ఆసాంతం చక్కని, నిర్మలమైన మనస్సుతో ఏకాగ్రత కలిగి ఉంటాం. స్వేచ్చ వాతావరణంలో తండా నాయకుని అనుమతితో అన్నదమ్ములు, భావాల ప్రేమానురాగాలు పంచుకుంటూ తల్లిదండ్రుల దీవెనలు అందుకునే ఈ పండుగ మాకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

తండా నాయక్ అనుమతి అవసరం, మేరమా లేదా సేవా భయా దేవాలయాల ముందు మంచేలు వేసి వాటి పైన తీజ్ బుట్టలు పెడుతారు. సాధారణంగా ఈ దేవాలయాల వద్ద వేపచెట్టు కూడా ఉంటుంది. వేపను మేరమాకు ప్రతిరూపంగా భావిస్తారు. కొందరు వేప చెట్టు పైన కొమ్మలను మంచెగా తాయారుచేసి దానిపైన బుట్టలు పెట్టి రోజు పూజిస్తారు. పండుగ ఆసాంతం వీరి ఆచారం ప్రతిఫలించే సంగటనల సమాహారంతో ఉంటుంది.

ఈ పండుగ లంబాడీల జీవన చిత్రానికి ప్రతిబింబంగా సంస్కృతీ నేపత్యాన్ని వివరించే ప్రక్రియగా గుర్తించవచ్చు పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. వ్యవసాయ జీవితాలపై ఆధారపడే కుటుంబాలు పంటలను అంచనా వేయడానికి తీజ్ బుట్టలు ఉపయోగపడుతాయి. లంబాడీలు పంటలను అంచనా వేయడానికి తీజ్ బుట్టలు ఉపయోగపడుతాయి. లంబాడీల ముఖ్య ఆహారం జొన్న రొట్టె పూర్వం జొన్నలతో చేసిన రొట్టెలుతినేవారనీ, కాలం మార్పు ప్రాంత మార్పు వల్ల గోధుమ రొట్టెలను దైనందిన ఆహారంలో భాగంగా తీసుకోవడం జరిగింది. ఈ విధానం తీజ్ పండుగ క్రమంలో గమనించవచ్చు.

తండాలో శుభశుభ కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా ప్రథమ తాంబూలం తండా నాయకునిదే వివాహ సందర్భంలోని పాటల్లో గాని, సీత్లదేవి, తీజ్ మొదలైన పండుగల సందర్భంలో పాడుబడిన పాటల్లో గాని ప్రతి సందర్భంలోనూ తండా నాయకుని ప్రసక్తి రావడం ఇందుకు నిదర్శనం. విశేషం ఏమంటే తండా నాయకుడు గీసిన గీతను కేవలం ఇతర పెద్దవి కాదు అన్ని వయసుల వారు తండాలో అనుసరిస్తారు. తండా నాయక్, భగత్ ఇతర పెద్దలు కలిసి పండుగ జరుపుకోవడానికి మంచి రోజును నిర్ణయిస్తారు. సాధారణంగా మంగళవారం సాయంత్రం గోదుమల నానపోయుటకు మంచిరోజును చూస్తారు. దాటుడు పండుగకు కూడా మంగళవారానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ పండుగ పూర్తయిన రోజే సాయంత్రం గోధుమల నానపోస్తారు. దీనితో పండుగ ప్రరంబమౌతుంది. ఈ పండుగలో పాలు పంచుకునే పెళ్లికానీ అమ్మాయిలు కూడా శుభ్రతతో నియమనిష్టలతో ఉంటారు.

నీళ్ళకోసం భావి దగ్గరకు వెళ్ళినపుడు అమ్మాయిలు పాడే పాట ’సేవ భామా’ సేవతత్పరతను తెలియజేస్తుంది. నీటి అవసరం అందరికి ఉంటుంది. కాబట్టి తవ్వే భావిని లోతుగా తవ్వితే చాల కాలం ఉపయోగపడుతుంది.

ప్రతిరోజు మూడు పూటల నీల్ల్లను నియమనిష్టలతో పోస్టు ఉంటె నారు ఏపుగా వస్తుంది. మూడవ రోజున మొలక కనిపిస్తుంది. ఐదవ రోజు వరకు కొంత ఎత్తు వస్తుంది. నారు చక్కగా, పచ్చగా వస్తుంటే అమ్మాయిల ఆనందం అలవి కాకుండా ఉంటుంది.

తీజ్ పైన అమిత విశ్వాసం పెరుగుతుంది. మరింత దీక్షతో ఆ నారు చక్కగా రాయడానికి పాటు పడుతుంది. నారు ఎదుగుదల అమ్మాయి గునగణాన్ని కూడా బేరీజు వేసుకునే ఆచారం ఉన్నందున ఈ పండుగలో వీటిని ప్రత్యేకంగా గమనిస్తారు. పండుగ నేపత్యంలో ఈ అంశం కూడా ప్రత్యేకమైనది. కాబట్టి అమ్మాయిలు తీజ్ పైన అత్యంత మమకారం కనబరుస్తుంటారు. నీరు పోయడంలో నిర్వహణలో ప్రతి రోజు జరిపే కార్యక్రమాల్లో చిత్త శుద్ధి ప్రధానమైనది.

గాణగోర్:- ఎనిమిదవ రోజు సాయంత్రం అమ్మాయిలు చెరువు నుంచి మట్టి తెస్తారు. ఆ మట్టితో ఇద్దరు వృద్ద స్త్రీలు ఆడ మగ బొమ్మలను తాయారు చేస్తారు. వాటినే గణ గొర్ అంటారు.

డొక్రి:- డోక్రాల ముందు పెట్టిన తీజ్ బుట్టను అబ్బాయిలు ఎత్తుకెల్తారు. అమ్మాయిలు వారిని వారిస్తూ, బ్రతిమిలాడుతూ బుట్టను తిరిగి భోగ్ వద్ద పెట్టి నైవేద్యం పెడుతారు. అబ్బాయిలు డొక్రి – డొక్రాలను ఎత్తుకొని పోతారు. ఆకాశంలోని ఎగిరేస్తూ మరోకరు అందుకుంటారు. పాటలు పాడుతారు. నృత్యం చేస్తారు. అబ్బాయిలు ఒకరికొకరు ఆ బొమ్మలను ఆడుకుంటూ చివరికి నేలపైకి వేస్తారు. ఈ విదంగా ఆ బొమ్మలు తిరిగి భూమిలో కలిసిపోతాయి.

తీజ్ వేరదేర్ అని తీజ్ ప్రరంబమైన తొమ్మిదవ రోజున జరుపుకుంటారు. మేరమా, సేవభాయలకు మొక్కుబడులు సమర్పించుకోవడం, బొగ్ తీజ్ పంపకం తీజ్ ను గంగలో కలుపడం బోర్డే జపకీర్ అనేవి ఈ రోజున జరుపుకునే ప్రధాన అంశాలు.

ఆదిలాబాద్ లంబాడీలు ఆరాధ్య దైవాలు మేరమా, సేవబాయ రామరావు మహారాజ్ ప్రమం సింగ్ మహారాజ్ ప్రకాష్ మహారాజ్ వీరిని ఈ రోజు ప్రత్యెక పూజలతో కొలుస్తారు. సేవభాయ నీచు ముట్టడు కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా కొబ్బరికాయలతోనే సరిపుచ్చుతారు.

తొమ్మిది రోజులు తాము పూజించిన బుట్టలను తనతో పాటు తీసుకొని పోతున్న ఏటిని “పాపిష్టి గంగ” అని మాషిస్తారు. ఎక్కడి నుంచో వచ్చావు మా ఇంటి ఆనందాన్ని కూడా తీసుకొని పోతున్నావు. నీవు పాపిష్టిదానవు అని దూషిస్తారు. ఈ మాటలను బట్టి అమ్మాయిలు టీజ్ పండుగతో మమేకమైనట్లు అర్ధమవుతుంది. అంతే కాదు. వారి అమాయకత్వం కూడా తెలుస్తుంది.

తీజ్ బుట్టలను నిమజ్జనం చేసిన చేసిన తర్వాత అందరు తండాలో తీజ్ లు పెట్టిన ఇంటి ముందుకు చేరుకుంటారు. ఆ తరువాత పెద్దలు అన్నయ్యలు అమ్మాయిల కోసం ఉయ్యాలలు ఏర్పాటు చేస్తారు. అందరూ, ఆడీ, పాడి ఎవరింటికి వారు బయలుదేరుతారు.

-డా .మురహరి రాథోడ్

 

ఉపయుక్త గ్రంధాలూ:-
1. నల్లగొండ జిల్లా బంజార సాహిత్యం – జీవన చిత్రణ
డా. సూర్య ధనంజయ్ – 2011
2. బంజరీలు టీజ్ పండుగ,
ఆచార్య బట్టు రమేష్ – 2017
3. ఆదిలాబాద్ జిల్లా లంబాడి సాహిత్యం – 2019
డా. మురహరి రాథోడ్
4. కరీంనగర్ జిల్లా – లంబాడీల ఆచార వ్యవహారాలు
జనపాల శంకరయ్య – 1995
5. తెలుగు జానపద గేయ గాధలు, నాయిని కృష్ణ కుమారి – 1999
6. కర్ణాటక లంబణిగాళు డిందు సాంస్కృతిక అద్యాయన పి.కే. ఖండోబా – 1991
7. తండా (నవల) మల్లిఖార్జున హీర్ మాద్ – 2004
8. తెలుగు లంబాడీల గేయ సాహిత్యం, సిద్దాంత గ్రంధం
డా. జనపాల శంకరయ్య 2001.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments