అవధుల్లేని ఎడారి
ఎత్తుపల్లాల ఇసుక తిన్నెలు
ఎడతెరపి లేని వేడి గాలులు
అదో నరకపు నమూనా
గమ్యం చేరితేనే గెలిచి నిలిచేది
చొప్ప బెంన్డు నీటిపై తెలినట్టు
ఒక్కసారిగా ఇసుకలోంచి పైకి చేరిన పేడ పురుగు
మలాన్ని ముక్కలుగా చేస్తోంది
ఉండలుగా మలుస్తోంది
వెనుక కాళ్ళతో మోస్తూ బలంగా సోత్తుంది
తిన్నెల శిఖరాలపైకి
అచ్చం నా జీవితంలో బాధల్ని ముక్కలుగా చేసి
గుండె లోతుల్లోంచి పెదాల వాకిట్లోకి
చిరునవ్వుల్ని తోస్తున్నట్లుగా తోస్తున్నది
అచ్చం అలాగే ఉంది నిజంగా నా పనే ప్రతిఫలిస్తోంది
నెట్టిన ప్రతిసారీ మలం జారుతోంది
నవ్విన ప్రతిసారీ కన్నీరు కారుతోంది
కష్టం క్రమ క్రమంగా పెరుగుతోంది
అయినా పైపైకి బలంగా తోస్తోంది
అది నా గుండెకు బరువుగా తోస్తోంది
నిజానికి అదో పేడ పురుగు
ఆత్మ స్థైర్యంలో అదో గురువు
తెలియని ధైర్యం గుండెల్లో
ఎందుకో వేగం పయనంలో
వెనుదీయని ప్రేరణ నాలో
జీవిత తత్త్వం బోధపడింనట్లైంది
దించిన తల ప్రమేయం లేకుండగనే లేచింది
రెప్పల వాకిళ్ళను చీకటి ముంగళ్ళను చీల్చుకుంటూ
చూపులు సూన్యంలోంచి సూటిగా ధీటుగా ప్రసరించాయి
లక్ష్యం వైపుగా పాదాలు సాగాయి
పోరాటం నేర్పింన పయనం కదా ఇక ఆగదులే.
-డా॥పెరుగుపల్లి బలరామ్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`