మనిషిలో ఒక నమ్మకం కలగడానికి చాలా కాలం పడుతుంది. ఆ నమ్మకం పోవడానికి క్షణాలు చాలంటారు పెద్దలు. ఈ నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయో చెప్పడం చాలా కష్టం. ఒక్కో ప్రదేశంలో ఒక్కోవిధమైన నమ్మకాలు మనకు కనిపిస్తాయి. ఈ నమ్మకాలు రోజు రోజుకి మారుతుంటాయి. ప్రాచీన కాలంలోని నమ్మకాలు ఈ రోజు అదే విధంగా లేవు. కాలానుగుణంగా ప్రాంతానుసారంగా మారిపోతున్నాయి. ఎక్కడో మానవుడి బలహిన క్షణంలో ఏర్పడిన నమ్మకాలు తరతరాలుగా వారసత్వ సంపదగా ముందుతరాలకు అందివ్వబడుతున్నాయి. వీటిలోని నిజానిజాలను గమనించని మనుష్యులు ఎంతో మంది మనకు కనిపిస్తున్నారు.
నమ్మకాలు మరియు మూడనమ్మకాలు అని రెండు రకాలుగా ఉంటాయని మనకు తెలసిందే. శాస్త్రీయ కోణంలో నిరూపించబడినవి నమ్మకాలు. శాస్త్రీయ కోణంలో నిరుపించబడినవి నమ్మకాలు, శాస్త్రీయతలేనివి అణగారిన జాతులు, కులాలు, తేగల వారు అజ్ఞానంలో పాటించేవి మూడనమ్మకాలుగా చెప్పవచ్చు. అవి వారికి తరతరాలుగా సంక్రమించాయి. ఒత్తిడి కారణంగా నమ్మకాలు పుడుతాయని బ్రిటన్ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఆడమ్ గాలిన్సీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ముడనమ్మకాలపై అనేక పరిశోధనలు చేశారు. “తమ జీవితంపై నియంత్రణ కోల్పోయే కొద్ది మానసిక జిమ్నాస్టిక్స్ ద్వారా దాన్ని పొందెందుకు వారు అంత ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారని ఆడమ్ వివరించారు”. (te.m.wikipedia.oog).
మనుషులు జీవితంలో కొంతకాలం ఇతరులపై ఆధారపడి జీవిస్తారు. తరువాత తనపై తనకు పూర్తిగా నమ్మకముండి జీవితం మొత్తం తన చేతుల్లోనే ఉంటుందని అనుకుంటూ జీవిస్తాడు. వయసు మళ్లే కొలది అతనిలో జీవితం పట్టు తప్పిపోతుంది. ఈ సమయంలోనే అతనిలో కొన్ని నమ్మకాలు మరికొన్ని మూడనమ్మకాలు వచ్చి చేరతాయి. అది శాస్త్రీయమైనదేనా, అశాస్త్రియమైనదా అని ఆలోచించే శక్తి కుడా వారికి ఉండదు. ఇది ఒక మానసిక దురవస్థగా లేదా మానసిక రుగ్మతగా చెప్పవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో నేటికి అనేక నమ్మకాలు మనకు దర్శనమిస్తాయి. దైవం పరంగా గమనిస్తే పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మారేడమ్మ, మల్లన్న, శివ, విష్ణు మొదలైన దైవాలను నమ్ముతారు. ఈ దైవాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పూజలు నిర్వహించి దేవతను సంతృప్తి పరుస్తామని గ్రామీణులు చెపుతుంటారు. దుష్ట శక్తుల పరంగా గమనిస్తే దయ్యాలు, భూతాలు, శక్తులని, చెడుగాలులని రకరకాల పేర్లతో భయబ్రాంతులకు గురి అవుతారు. ఈ భయంలోనే భూత వైద్యుల ద్వారా మరియు ఇతర మార్గాలలో దయ్యాలను, భూతాలని సంతృప్తి పరచడానికి రకరకాల క్రతువులు జరుపుతారు. ఈ పై రెండు క్రతువుల్లో సమయ నష్టం, దన నష్టం జరుగుతుంది. దీని కంటే ముఖ్యంగా మానసిక స్థితిలో అనేక మార్పులు సంభవించి మనిషిని జీవితాంతం ఒకే రకమైన స్థితిలో పట్టి ఉంచుతాయి.
ఇవే కాకుండా గ్రామీణుల్లోని నాగరికుల్లోనూ అనేక నమ్మకాలు దాగి ఉంటాయి. కాలలపై నమ్మకలపై, గ్రహాలపై, జాతకాలపై, వాస్తు శాస్త్రంపై నేటి తరంలోనూ రోజురోజుకు నమ్మకం బలపడుతుంది.
నేటి తరంలోనూ కొందరు ముడనమ్మకాలను జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. నమ్మకాలను నమ్మడంలో ఏ తప్పు లేదు కానీ మూడనమ్మకాలను నమ్మడంలోనే వ్యక్తుల నైపుణ్యం తెలుస్తుంది. వ్యక్తి వ్యక్తిత్వ నిర్మాణలో జరిగిన పొరపాట్ల కారణంగా మూడవిశ్వాసాలు, మూడనమ్మకాలు వారిలో ఏర్పడతాయి.
ఆడవారి గాజులు, అద్ధాలు పగలడం సహజమే అయిన నేటికి అదేదో కీడు చేస్తుందని నమ్మే వారున్నారు. మరణించిన వారికి శ్రార్థ కర్మలు చేయకపోతే దయ్యమై వేదిస్తారని నేటికీ నమ్ముతారు. ఈ కర్మలు చేయడం తరతరాలుగా వస్తున్న నమ్మకంగా చెప్పవచ్చు.
మనలో ఆత్మ ఉంటుందని మనం చనిపోయిన తరువాత ప్రేతాత్మగా మారుతుందని నమ్ముతారు. కాబట్టే పితృదేవతలకు పూజలు నిర్వహిస్తారు. కష్ట సమయంలో, మరణ సమయంలో హనుమాన్ చాలీసా, సుందర కాండ, బైబిల్, కురాన్, చదవమని సూచిస్తారు. ఇవే కాకుండా సామాజికంగా కతికితే అతకదనే నమ్మకము బలంగా నేటికి ఉంది. Folk belief is often a matter of attitude and a matter of faith – (జానపద విజ్ఞానాధ్యయనం 2001, పుట : 236) దేవుడి తోడు నేను అబద్ధం చెప్పనా అనే నమ్మకం మన అత్యుత్తమై న్యాయ వ్యవస్థల్లో సైతం నేటికి వాడుతున్నారు. దీనిని బట్టి మన దేశంలో నమ్మకాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తుంది. ఈ నమ్మకాలు మత సంబంధాలుగా, అతి మానుషా నమ్మకాలుగా సాంస్కృతిక సంబంధలుగా, వైయుక్తికాలుగా కనిపిస్తాయి. వీటిల్లోనే మానుష నమ్మకాలు, ప్రాణి నమ్మకాలు, కౌటుంబిక నమ్మకాలు, సంకీర్ణ నమ్మకాలుగా పండితులు విభజించారు.
తిక్కన మహాభారతంలోనూ, శ్రీ నాథుని వీరచరిత్రలోనూ రకరకాల నమ్మకాలను చిత్రించడం కనిపిస్తుంది. కపిల పాటల్లోనూ నమ్మకాలు దర్శనమిస్తాయి. (జానపద విజ్ఞాన అధ్యయనం, 2001, పుట: 244) నల్ల దాన్ని నమ్మరాదు, ఎర్రదాన్ని ఏలరాదు. సావు నలుపు దాన్ని సచ్చేదాకా ఇడువరాదు. పై విధంగా జానపదులు అనేక నమ్మకాలను పాటల రూపంలో పొందుపరుచుకున్నారు.
మూడ విశ్వాలపై వ్యతిరేకంగా పోరాటం సాగించిన డాక్టర్ దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎం. ఎం కుల్బర్గి మొదలైన వారిపై మనో భావాలను దెబ్బతీస్తున్నారని అనేక కేసులు పెట్టారు. “వశీకరణం” మంత్రవిద్యలు నిర్వహిస్తున్నారని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 నుంచి 2012 వరకు దాదాపు 350 మందిని చంపారని నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో తెలియజేసింది.
-తాటికాయల భోజన్న
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~