ఒక అణువూ (కవిత )- సౌమ్య

ఒక అణువూ నన్ను చేసినట్టు,

ఒక అగ్గి రవ్వ నన్ను బూడిద చేసినట్లు..
కొన్ని పూర్తి కాని శీర్షికలు జీవితాన్ని నింపినట్లు..
కొన్ని అందమైన కలలను మర్చిపోయినట్లు..

నా చరిత్ర కూడా మరుగున పడిపోతున్నది..

జీవితం నాపైకి విసురుతున్న ప్రతి సందర్భాన్ని ,
అనుభవించడం నేర్చుకున్నాను..
నా నిఘంటువులో ని చివరి పేజీతో,

పరిచయం పెంచుకున్నాను..
అక్కడే కదా, నేను పూర్తి చేస్తున్న చిక్కు ప్రశ్నను,
మొత్తంగా చూడగలను!!
అక్కడే కదా, నేను దాటాలని ప్రయత్నిస్తున్న,
పరీక్షను మళ్ళీ చదవగలను!!

ఆ పూర్తి కాని శీర్షికలు అసంపూర్ణాంగానే ఉన్నాయి,
వాటిని ఆశ్చర్యం తోను కంగారు తోను చూస్తున్నాను…
నా ఆత్మ శరీరాన్ని వదిలి

వెళ్లిపోతుంటే నిస్సహాయంగా చూస్తున్నాను…

అణువు గానే మొదలయ్యాను,

ఆకాశ హార్మ్యంగా పూర్తయ్యాను,
నా చుట్టూ ఉన్నవాళ్ళతో,

నేను తిరిగిన ప్రదేశాలతో నిండిపోతున్నాను…

నా ఊహకందనంత లోతైనది

నా జీవితం అని గమనిస్తూ ఉండగా ,
ఈ అంతిమ అనుభవం అనివార్యం అనే సమాచారం

ఒక చిన్న అగ్గి రవ్వ గా నన్ను చేరింది..!!

– సౌమ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments