మనిషి చేసిన శిల్పం
మనిషిని చంపుతుంది
శిల్పాన్ని మలచిన మనిషి
శిల్పాన్ని తాకలేడు ప్రతిష్టించాక
శాస్త్రం బోధన వరకే
ఆచరణలో కమ్మేస్తున్న మంత్రం
పూజలో రాలుతున్న మొగ్గలు
బలి కోరుతున్న భారీ కట్టడాలు
నమ్మకం ఉన్మాదమై తాయెత్తులై దట్టీలై
గత్తర బాబాలు స్వాములు
పెళ్ళాలను చంపేసో వదిలేసో
అవతారాల తెరలు
లేని ఆత్మల పలుకుతూ
జన్మ పునర్జన్మ ల ఊకదంపుడు ఉపన్యాసాలు
ప్రతిష్టాత్మక బి హెచ్ యు లో భూత వైద్య కోర్సు
అసృష్టి పుట్టుకల బిడ్డలు దేవుళ్ళు దేవతలు
బురదలో కుండల్లో మగమగ సంభోగాలు
సున్నిత మత భావనల అలజడి
లేత మనసుల్లో అలికిడి
గొట్టాల నిండా అశాస్త్రీయ అంశాల కుప్పలు
రాజ్యం నిండా
చదువుల లేమి
విజ్ఞానం జ్ఞానం శూన్యం
మత బోధనల ఆకృత్యాలు
శాస్త్ర అవగాహన దుర్భిణీ వేసి గాలించినా దొరకదు
ఏలేవాడు
ఎరగనోడు
మబ్బులు కమ్మేస్తే రాడార్ కి
యుద్ద విమానం దొరకదని ప్రార్థించే వాడు
పురాణాల్లో శాస్త్రం వుందని వెర్రి వెంగళప్పల వీరంగం
తల పోతే తల తెచ్చిన అభూత కల్పనలతో
మనిషి ని మత్తులో ముంచే సన్నాసులు
అగుపడని దేవుళ్ళ ప్రతినిధుల
మాయా లోకంలో ప్రభావితమై
మానసిక దౌర్బల్యం లో
హత్యల దాకా
ఒక్క సన్నాసి ఖండించని మూర్ఖత్వం
ఒక్క కేసూ కడ దాక నిలవదు
ఆశ్రమాల్లో మానభంగాలు
స్వచ్ఛందంగా లొంగిపోయే వైపరీత్యం
కాల్పుల మోతలు పోలీస్ స్టేషన్ లకి వినబడవు
అంతరిక్ష పరిశోధనా మేథస్సు
కొబ్బరి కాయ కోసం వెర్రి తలలు వేస్తుంది
కౌంట్ డౌన్ విగ్రహాల పాదాల చెంత
రేయనక పగలనక చదివి
పరీక్షకి ముందు రాయి ముందు ముకుళిత హస్తాలతో
రోగం నయం
వైద్యున్ని చేతుల్లో
వైద్యశాల ప్రాంగణం లో పాలరాతి బొమ్మ
దండాలు విరాళాలు దండుకునే తీరు
శాస్త్రాన్ని జయిస్తున్న మూఢ నమ్మకాలు
సామాజిక వలయంలో
భయాన్ని జయించటం లో
భౌతిక వాద విస్మరణ
లేనిదాన్ని నమ్మిస్తూ భ్రమలో తేలుస్తూ
వున్నదాన్ని కాదనే వ్యవస్థలో
పోతున్న ప్రాణాలకు దోషి రాజ్యమే!!!
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~