పాక్సో -2 – మేకోపాఖ్యానం – వి . శాంతి ప్రబోధ

చాకోలెట్ ఇస్తానని పిలిచిన పక్కింటి అన్నయ్య ఛాతీపై తడుతూ , చనుమొనల్ని నలుపుతున్నా అది తప్పుకాదు . ఎందుకంటే పైన గౌను ఉందికదా ..

రామ్మా .. అంటూ ముద్దుగా పిలిచి ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆమె అండర్ వేర్ ని తాకుతున్న తాతయ్య చేతుల్ని , ప్యాంటు జిప్ తీస్తున్న మామయ్య చేతల్ని తప్పు పట్టకూడదు.

దగ్గరకు పిలిచి వెకిలిగా చూపులతో, అసభ్యపు మాటలతో ఏదో నెపంతో చేతుల్ని ఆమె వక్షస్థలాన్ని తాకుతుంటే అది మాస్టార్ నేరం ఏమాత్రం కాదు.

అలా ఎవరు ఆమె శరీర భాగాల్ని తాకినా అదేమి నేరమేమీ కాదు అంటున్న మొగుడ్ని బిత్తరపోయి చూసిందో క్షణం .

ఆ వెంటనే ‘ బుర్రున్న మాటలేనా .. ‘ గట్టిగా కసిరింది . చిరాగ్గా చూసింది భార్య మేక ‘తాగిన మైకపు మాటలనుకునేవు . నిజ్జంగానే చెబుతున్నా. నీమీదొట్టు .
దుస్తుల మీద నుండి ఏ పిల్లని తాకరాని చోట తాకినా లైంగిక వేధింపులు కిందికి రాదట.
అక్కడ గాంధీ బొమ్మ సెంటర్లో అనుకుంటుంటే విన్నాను’ కాలరెగరేస్తూ చెప్పింది మొగుడు మేక .

‘ఇంకేం.. చిత్త కార్తె కుక్కల్లాగా పెట్రేగి పోవచ్చనుకుంటున్నారేమో.. ‘ వెటకారంగా ఓ క్షణం ఆగింది .
మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లుగా మొగుడికేసి చూస్తూ ‘ఆ .. మరీ అంతలా విర్రవీగిపోనక్కరలేదులే… ఏళ్ల తరబడి పోరాటాలు చేసి తెచ్చుకున్న చట్టాలున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకు చావండి ‘ అన్నది .
మర్రి కొమ్మల సందులోంచి మీద పడుతున్న మాఘమాసపు ఎండకు దూరంగా జరుగుతూ ..

‘ఆ .. చట్టాలా.. ఆ చట్టాలన్నీ చట్టుబండలేగా..
అవేమీ.. , ఏమీ చేయలేవు . వాటిని ఎట్లా వాడుకోవాలో తెలిసుంటే చాలు .
ఆ తెలివితేటలు దండిగా ఉన్నాయిగా..

ఆ జడ్జి అమ్మలాంటి వాళ్ళుండనే ఉంటారు తప్పించడానికి . నేరము – శిక్షలకు దూరంగా బిందాస్ ఉండొచ్చు. ‘ అన్నది మొగుడుమేక

‘చాలు చల్లేవయ్యా .. చూడపోతే .. అదేదో నీ మేనమామింటి ఆవుదూడయినట్టు.. ‘ దీర్ఘం తీసింది ఆడమేక

“ఆ .. కాకపోతే .. ఆ మాటలు చెప్పిన జడ్జమ్మ ఆడదేగా .. ‘ నసిగింది మగమేక

‘ఎట్టెట్టా .. నాకేమీ అర్ధం కావట్లా .. ముందుండి దారి చూపించాల్సిన మనిషి అట్లా చెప్పిందా ..?
తన పరిధులు అతిక్రమించిన వాళ్ళను తప్పు పట్టకుండా బాధితను అత్యాచారం చేసినట్టు లేదూ ..
తమ చేతిలో ఉన్న న్యాయం , చట్టం పీక నొక్కి తప్పుడు తీర్పు ఇచ్చినట్లుగా లేదూ.. ‘ ఆవేశ పడింది పెళ్ళాం మేక .

‘ఆ .. అవునవును, అందుకేనేమో.. ఆ తీర్పు విని భద్రలోకం ఉలిక్కి పడింది. మా పిల్లల రక్షణ ఎట్లాగని కంటిమీద కునుకులేకుండా ఉన్నట్లున్నదని ఆ సెంటర్లో మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటల్ని బట్టీ నాకర్ధమవుతున్నది ‘ అన్నది మగమేక .

‘ ఎంత అన్యాయం? ఎంత దుర్మార్గమైన తీర్పు?
ఒంటిమీద బట్టలుంటే , బట్టలమీదనించి మగాడు ఏం చేసినా చెల్లుబాటవుతుందని ఏ చట్టం చెప్పిందో నాకర్ధం కావట్లేదు. అట్లెట్ల చెప్పిందో నాకు తెలియట్లేదు .

ఆలోచిస్తుంటే , మహిళా న్యాయమూర్తులు కూడా తమ తీర్పులతో ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తున్నట్టనిపిస్తున్నది ‘ గాయపడిన హృదయంతో భారంగా అన్నది ఆడమేక.

ఆ వెంటనే మొగుడికేసి చూస్తూ ‘దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో .. కీలకస్థానంలో ఉన్న ఆమె మాటలు ఏ దిశకు పయనిస్తాయో… ఏంపాడో..

ఇదంతా ఆమె అర్ధం కాలేదా .. లేక తెలిసి తెలిసీ ఆ తీర్పిచ్చారా..

ఆడదై ఉండీ అట్టెట్లా తీర్పు చెప్పిందబ్బా .. ఇట్లాటివాళ్ళని నెత్తిమీద ఎట్లా కూర్చో పెట్టారో .. అసలు ఏ విషయంలో ఈ మాటలు చెప్పిందో ..’ ఆకాశంలోకి చూస్తూ బుర్ర గోక్కున్నది భార్యమేక .

‘2016లో సతీష్ అనే 39 ఏళ్ల వ్యక్తి పన్నెండేళ్ల బాలికకు పండు ఇస్తానని తన ఇంటికి తీసుకెళ్లాడట. అక్కడ ఆ బాలికపై లైంగిక దాడిచేశాడు. ఆమె ఛాతీ తాకి అసభ్యంగా ప్రవర్తిస్తూ , దుస్తులు విప్పడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ బాలిక భయంతో కేకలు వేసింది . ఆ క్రమంలో ఆపిల్ల తల్లి వచ్చి బిడ్డను రక్షించుకుంది .

నేరం చేసినవాడికి తగిన శిక్ష పడాలని చట్టంపై నమ్మకంతో , కోర్టులపై విశ్వాసంతో ఆ తల్లి కేసు పెట్టింది .
కింద కోర్టులో నేరం నిరూపణయింది . అతడు దోషిగా మూడేళ్ళ జైలు శిక్ష పడింది . నిందితుడు హై కోర్ట్ కి అప్పీల్ చేసుకున్నాడు .

నిందితుడి చర్మానికి బాలిక చర్మం ఆనించినట్లుగా నిరూపణ కాలేదు కాదు కాబట్టి, దుస్తులపై నుంచి శరీర భాగాల్ని తాకడం లైంగిక వేధింపులకు పాలపడినట్లు చెప్పలేమని సింగిల్ జడ్జి పుష్ప సురేంద్ర గనెడివాలా అభిప్రాయపడింది . లైంగిక ఉద్దేశ్యంతో బాలిక దుస్తులు తొలగించి లేదా లోపలికి చేయిపెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని తీర్పు ఇచ్చింది.

కాబట్టి ఈ కేసు POCSO Act 32/2012 (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టంలోని సెక్షన్ 7 కిందకు రాదని అతడికి కింది కోర్టు విధించిన మూడేళ్ళ జైలు శిక్షను రద్దు చేసింది ముంబై హైకోర్టు . .

అయితే , ఐపీసీ సెక్షన్ 354 (ఓ మహిళ గౌరవానికి భంగం కలిగించడం ), సెక్షన్ 342 (దురుద్దేశంతో నిర్బందించడం ) కింద కోర్ట్ ఇచ్చిన ఒక ఏడాది శిక్షను మాత్రం సమర్ధించింది .
అయినా .. చట్టాలకు లోబడే తీర్పులుంటాయి .కదా ‘ సాలోచనగా అన్నది మొగుడు మేక.

‘నిజమే, నువ్వన్నట్టు చట్టాలకు లోబడే తీర్పులుండాలి .
కానీ ఆ చట్టాల్లో ఏవో తిరకాసులు, లొసుగులు .. వాటి ఆసరాతో తూట్లు పొడుస్తున్నారుగా ..
మనిషి జన్మనెత్తి అంత చదువు చదివీ ఆ జడ్జీ నెత్తిమీద తలకాయ లేనటువంటి తీర్పునివ్వొచ్చా ..?!
ఒక వేళ చట్టంలోనే లోపం ఉందనుకుందాం .. ఉంటే అటువంటప్పుడు ఏం చెయ్యాలీ .. అందులో ఉన్న మంచి చెడ్డలు విశ్లేషించాలి . లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి . అట్లా చెప్పే అధికారం వాళ్ళ కుండదా ఏంటి ..?

ఇంతకీ ఆ చట్టం సెక్షన్ 7లో ఏముందో తెలుసా ? అడిగింది.

‘లైంగిక వాంఛతో బాలిక లేదా బాలుడి యోని , శిశ్నము , గుదము , వక్ష భాగాలను ముట్టుకున్నా లేదా బాలిక లేక బాలుడిచే తన లేదా మరొకరి యోని , శిశ్నము , గుదము , వక్ష భాగాలను ముట్టుకునేలా చేసినా లేదా అంగ ప్రవేశం చేయనప్పటికీ లైంగిక వాంఛతో భౌతిక స్పర్శ ద్వారా మరే ఇతర చర్యలకి పూనుకున్నా లైంగిక దాడిగా భావించాలి ” అని ఉందట మొగుడు మేక జవాబిచ్చింది.

‘నువ్వు చెప్పిన సెక్షన్ 7 ప్రకారం చూస్తే చర్మానికి చ ర్మం తాకితేనే అనే కండిషన్ కనిపించడం లేదే .. అట్లాగే దుస్తులు తీసివేయబడి ఉండాలనీ లేదు . దుస్తులపైనుండి లైంగిక దాడి చేయడం నేరం కాదనీ చెప్పలేదు . అసలు ఆ సెక్షన్ లో ఎక్కడా దుస్తుల ప్రస్తావన కనిపించలేదు . మరట్లాటప్పుడు అంత లత్కోర్ తీర్పు ఎట్లా ఇచ్చిందో .. చట్టాన్ని తన ఇష్టమొచ్చినట్టు అన్వయించుకుని తీర్పులు ఇచ్చేస్తుందా .. ఎంత అన్యాయం . అస్సలు ఉరుకోకూడదు . గోరంత ఆలస్యం కొండంత నష్టం తెచ్చేస్తుంది .

ఇప్పటికే ఏ సందులో గొందులోనో కాదు ఎక్కడ పడితే అక్కడ ఆఖరికి ఇంట్లోనూ ఆడపిల్లలు ఇట్లాటి సంఘటనలు ఎన్నో ఎదుర్కొంటున్నారు . అవేమీ పట్టిచ్చుకోకుండా అట్లా వదిలెయ్యాలి అంతేనా .. పంటి బిగువున భరించాల్సిందేనా .. ఛి ఛీ .. అసహ్యంగా ఉంది ‘ కలవరపడుతూ దిక్కులు చూస్తున్నది పెళ్ళాం మేక .

‘లైంగిక వాంఛతో భౌతిక స్పర్శ ద్వారా మరే ఇతర చర్యకి పూనుకున్నా అది నేరమేనని సెక్షన్ 8 చెబుతుంది, అయినా అది న్యాయమూర్తి కళ్ళకు కనబడినట్లు లేదని జనం అనుకుంటున్నార్లే .. ‘ మొగుడు మేక

ఆ చెట్టుకిందే ఆవలి పక్క సేదతీరుతున్నది ఓ గాడిద. మొగుడూపెళ్లాల ముచ్చట్లు వింటున్నదల్లా లేచి గబగబా మాటలు వినవస్తున్న వైపు అడుగులేసింది.

‘న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టుకున్నట్టే ఆ జడ్జీ కళ్ళకి కూడా గంతలు కట్టుకున్నట్టుంది . లేకపోతే ఇలాంటి తీర్పులిస్తుందా ‘ ఆవేశంగా అన్నది గాడిద .

అప్పటివరకూ సీరియస్ గా మాట్లాడుకుంటున్న ఆ జంట కొత్త గొంతు విని ఉలిక్కిపడింది . గాడిదను చూసి పలకరిస్తూ ‘నువ్వన్నదేమిటో అర్ధం కాలేదన్నా .. ‘ అన్నది మగమేక .

‘ ఇందాకటి నుంచీ మీ మాటలు నా చెవిన పడుతుతూనే ఉన్నాయి . వళ్ళు కుతకుతా ఉడికిపోతున్నది . వెళ్లి రెండుకాళ్ళెత్తి తన్ని రావాలన్నంత కోపంగా ఉంది ‘ అన్నది గాడిద
‘ ఇంతకీ ఎవర్నేమిటి ..?’ నవ్వింది ఆడమేక .
‘ ఇంకెవర్నీ .. ఆ తీర్పు చెప్పినావిడనే . ‘
‘ఎందుకో .. ‘ ఆడ , మగ మేకలు రెండూ ఒకేసారి అడిగాయి
‘ ఎందుకేవిటీ ..
అన్నెపున్నెం ఎరగని ఐదేళ్ల పసిబిడ్డ చేతులు పట్టుకోని, పాంట్ జిప్ తీసి తన జననాంగాలు చూపాడట . మంచం మీద పడుకుందాం రమ్మని అడిగాడట లిబ్నాస్ కుజుర్ అనే వ్యక్తి.
ఆ బాలిక తల్లి వెళ్లేసరికి అతని ప్యాంటు జిప్ తీసి ఉండడం ఆ తల్లి కూడా గమనించిందట. తన బిడ్డ మీద లైంగికదాడికి పాల్పడ్డాడని అతనిపై కేసు పెట్టిందట . రెండేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై గడ్చిరోలి జిల్లా కోర్టు పోస్కో చట్టం ప్రకారం ఐదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందట.
ఆ తీర్పును సవాలు చేస్తూ లిబ్నాస్ గత అక్టోబరు లో హైకోర్టుకు వెళ్ళాడట .
అతని చర్య లైంగిక దాడి కిందకి లేదా తీవ్రమైన లైంగిక దాడి కాదని అందువల్ల పోక్సో చట్టం కిందకి రాదని ఐపీసీ సెక్షన్ 354 కిందకు మాత్రమే వస్తుందని స్పష్టం చేస్తూ మరో సంచలన తీర్పునిచ్చింది ఆ మహా తల్లి పుష్ప గనెడివాలా . .
నేరం నిర్ధారించి కింద కోర్ట్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది . కింది కోర్టు వేసిన ఐదేళ్ల జైలు శిక్ష అవసరం లేదని నిందితుడు 50 ఏళ్ల లిబ్నాస్ ను వదిలి పెట్టమని తీర్పిచ్చిందట ‘ అని కొద్దిసేపటి క్రితం విన్న విషయాలు ఏకరువు పెట్టింది గాడిద .

‘అయ్యయ్యో .. ఇట్లయితే ,
తమపై జరిగిన లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఎంత మంది బాధితులు పోరాడినా ఫలితం ఏముంటుంది ? నిందితులు ఈ కేసును చూపి తప్పించుకుపోరూ…
ఇక లైంగిక దాడులకు గురైన అమ్మాయిలెవరూ న్యాయం కోసం కోర్టు మెట్లెక్కకుండా లైంగిక అత్యాచారాలు యదేశ్చగా జరిగిపోతూనే ఉంటాయేమో’ అన్నది ఆడమేక
‘అదేంటీ .. అట్లా మాట్లాడతావ్ ..’
‘మరంతేగా .. దేశమంతా అదే సంకేతాలు పంపుతున్నది కదా ఈ తీర్పు .
వక్రబుద్ధిగల వాడి మెదళ్లలో ఈ తీర్పు తిష్ట వేసుక్కూర్చోదూ ..
అయ్యయ్యో ..
అసభ్యకరంగా ముట్టుకోవడం , తాకడం అది దుస్తుల లోపలైనా , బయటైనా తప్పే కదా .. ఏ ఉద్దేశ్యంతో తాకాడన్న ప్రశ్నలేకుండా ఇంగితం లేని ఈ తీర్పులేంటి ?
కోర్టులు , చట్టాలపై మిణుకుమిణుకు మంటున్న నమ్మకం ,ఆశలు అడుగంటిపోయే తీర్పుని ఎదుర్కోవడం ఎట్లా .. .

అసలు లోపం చట్టంలో ఉందా .. లేదా చట్టాన్ని ఉపయోగించిన తీరులోనా ‘ కల్లోలమవుతున్న మనసుతో ఆవేదనపడింది పెళ్ళాం మేక

‘లైంగిక వాంఛతో శరీరాన్ని తాకితే తప్ప దానిని లైంగిక దాడిగా పేర్కొనలేమని ముంబై హై కోర్ట్ 12 ఏళ్ల బాలిక విషయంలో పుష్ప వీరేంద్ర గనేవాడికర్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందట .

ముంబై హైకోర్ట్ లో నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై బాలల హక్కుల సంఘాలు , ఉద్యమకారులు లేవనెత్తిన తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తాయిగా.. సుప్రీం కోర్టు దృష్టికి వెళ్ళింది . వెంటనే సుప్రీం కోర్ట్ అటార్నీ జనరల్ , ప్రధాన న్యాయమూర్తి SA బొబ్దే ఆ తీర్పుపై స్టే ఇచ్చారు .

అంతిమంగా అత్యున్నత న్యాయస్థానం ఏ బాట చూపిస్తుందో వేచి చూడాల్సిందే .. ‘ అన్నది గాడిద .

‘ఒకే నేరం , ఒకే చట్టం .. వేర్వేరు తీర్పులు ..
ఇట్లాటి తీర్పులు న్యాయ వ్యవస్థకే మచ్చలు కదా ..
చట్టం, న్యాయం .. బాధితుల వైపో .. నిందితుల వైపో .. సుప్రీం కోర్ట్ తేల్చాలి .. అన్నది మొగుడు మేక

‘నాకు తెలీక అడుగుతానూ .. తమ ఇంటి ఆడపిల్లయితే ఇట్లాటి నకిలీ తీర్పే వస్తుందా .. ఏమో ..
ముందు ఆ ముదనష్టాన్ని గద్దె మీంచి తీసిపడెయ్యాలి. లేకపోతే ఇంకెన్ని ఛండాలపు తీర్పులు ఇస్తుందో .. !’ ఆలోచనగా ఆడమేక

‘మానవజాతి మన జంతుజాతి కంటే గొప్పని విర్రవీగుతారు గానీ ..
వాళ్లలో ఉన్న విష సంస్కృతీ మనలో లేనందుకు నేనయితే గర్వపడుతున్నా’ అన్నది మొగుడుమేక .

‘నిజమేనయ్యా .. మనకటిలాంటి లోప దృష్టి లేదు .

మనుషుల్లోనే .. వంకర బుద్ది . ఎప్పుడు ఎవరి చేతలు ఎట్లా ఉంటాయో .. ఎవరి చూపులు ఎక్కడ ఉంటాయో తెలియదు . ఆడపిల్లల్ని ఎంతకని జాగ్రత్తగా కాపలా కాసుకుంటారు .. ప్చ్ ..
గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా .. చెప్పండి .

లోపమంతా ఆడపిల్లని చూసే దృష్టిలోనే ఉన్నట్లున్నప్పుడు ఎన్ని ఆర్టికల్స్ , సెక్షన్స్ తో చట్టాలు చేసుకున్నా ఏం లాభం ? ఇలాగే .. ఇటువంటి తీర్పులే వస్తుంటాయి .

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం..?’ ఆందోళన పడింది ఆడమేక

-వి . శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో