తృప్తి(కథ ) -షఫేలా ఫ్రాంకిన్

“పొద్దున్నే ఎక్కడికో వెళ్ళాలన్నావ్ ఇంకా పడుకునే ఉన్నావేంటే?” అని రూమ్మేట్ లేపితే మెలకువొచ్చింది దీవెనకి.

టైం చూసుకుంటే ఎనిమిదైంది, రాత్రి ప్రవీణ్ ని విష్ చేసి కబుర్లాడుతూ పడుకునేసరికి మూడయింది, మెలకువ రాలేదు. లేట్ చేసినందుకు తనని తాను తిట్టుకుంటూ, చకచకా రెడీ అయింది.

కాలెండర్ లో బైబిల్ వాక్యం చూసుకుంటూ మనసులోనే దేవుడికి సారీ చెప్పుకుంది. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో చర్చికి వెళ్ళకుండా ఉండొద్దని ఇంటి దగ్గర అమ్మానాన్న పదే పదే చెప్పిన మాటలు, సండేస్కూల్ లో నేర్చుకున్న వాక్యాలన్నీ మర్చిపోయింది.

కాలేజ్ లో చేరిన మొదట్లో ఎంతో భయభక్తులతో ఉండేది, కాలేజ్ టైం అవుతున్నా బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా కాలేజ్ కి వెళ్ళేది కాదు, ఆదివారం ఎన్ని పనులున్నా వాయిదా వేసి చర్చికి వెళ్ళేది. రెండేళ్ళలో ఎంత మార్పు!

చర్చికి వెళ్ళి దాదాపుగా పదినెలలు కావొస్తోంది, సంక్రాంతి సెలవులకి ఇంటికి వెళినప్పుడు వెళ్ళడమే,
మళ్ళీ క్రిస్మస్ కి వెళ్ళొచ్చులే అని వాయిదా వేస్తూనే ఉంది. చూడాలని ఉన్నా, ఇంటికి రమ్మని అమ్మ పదేపదే అడుగుతున్నా, స్పెషల్ క్లాసులు ప్రాక్టికల్స్ అంటూ వాయిదా వేస్తూనే ఉంది.

ప్రవీణ్ ని ఒక్కరోజు చూడకపోయినా, మాట్లాడకపోయినా ఊపిరి ఆగినట్టుంటుంది.

నిజమే, ఎంత అదృష్టం చేసుకుంటే అతను తనలాంటి ఒక మాములు పల్లెటూరు అమ్మాయిని, తమ‌

కులం కన్నా తక్కువ కులం అమ్మాయిని ప్రేమిస్తాడని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటుంది. తానెంతో పుణ్యం చేసుకుందని, వాళ్ళ కులం అమ్మాయిల్లో అందగత్తెలు చాలామంది ఉన్నా తనని ప్రేమించడం చాలా‌ గర్వంగా, స్నేహితుల ముందు గొప్పగా ఉంటుందని పొంగిపోతూ ఉంటుంది.

తన ప్రాణస్నేహితురాలనుకునే రాధ కూడా ఈ విషయంలో తనని తప్పు పడుతుంటే జెలసీతో అలా చేస్తుందని తనని కూడా దూరం పెట్టింది.

ఇప్పడు తనకి ప్రవీణ్ కంటే ఎవరూ ఎక్కువ కాదు, కాలేజ్ కి వచ్చే ముందు ఏవేవో గోల్స్ పెట్టుకుంది, బాగా చదవి మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలి, ఫైనల్ ఇయర్ లో ఉండగానే ఒక మంచి MNC లో పెద్ద ప్యాకేజీ తో క్యాంపస్ రిక్రూట్మెంట్ లో జాబ్ సంపాదించాలి, అమ్మానాన్నని సిటీ కి తెచ్చుకోవాలి, చెల్లిని తమ్ముడ్ని ఏం చదువుతామన్నా చదివించాలి‌, తనలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో కాకుండా మంచి హాస్టల్ లో వేయాలి, కార్, మంచి ఇల్లు కొనుక్కుని అమ్మా నాన్నని కూడా యాక్సెప్ట్ చేసే అబ్బాయి వస్తే అప్పుడు పెళ్ళి గురించి ఆలోచిద్దాం, కుటుంబానికి ఒక పెద్ద మనిషిలా అండగా నిలబడాలని చాలా కలలు కన్నది.

కానీ ప్రవీణ్ పరిచయమయ్యాక చదువు, గోల్స్ అన్నిటినీ వెనక్కి నెట్టేసింది, సబ్జెక్టులు సంవత్సరానికో ఆరు చొప్పున రెండేళ్ళ సబ్జెక్టులు మిగిలిపోయినా పెద్ద బాధపడలేదు. ఎందుకంటే ప్రవీణ్ కోటీశ్వరుడు, కాలుమీద కాలువేసుకొని బతికేయొచ్చు, వాళ్ళింట్లో అన్నిటికీ నౌకర్లేనట, మాటల్లో ఒకసారి చెప్పాడు. ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడదామా అని ఎదురుచూస్తోంది.

ఇవాళ ప్రవీణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇద్దరమే సెలబ్రేట్ చేసుకుందాం అని అతనన్నప్పుడు మనసు గాల్లో తేలినంత సంబరం. ‘నీ ఫ్రెండ్స్ నొచ్చుకోరా?’ అని అడిగితే ‘నీకన్నా నాకెవరూ ఎక్కువ కాద’ని అతనిచ్చిన జవాబుకి ప్రపంచంలో తనకన్నా అదృష్టవంతులెవరూ లేరని మురిసిపోయింది.

కాలేజీలో చేరక ముందు వరకూ పత్తి కూలికి, మిరపకాయల కోతలకు తమ పల్లెలో వాళ్ళతో కలిసి వెళ్ళేది, అమ్మానాన్నకి తను ఈ పని చేయడం ఇష్టం లేకపోయినా తనే ఆ డబ్బులు ఇంటి ఖర్చులకి అక్కరకి వస్తాయి కదా అన్నట్టు వెళుతుండేది. వచ్చిన కూలీ అమ్మకి ఇచ్చేసేది. అమ్మ ఆ డబ్బుల్ని రూపాయి కూడా ముట్టుకోకుండా మొత్తం బేంక్ లో దీవెన పేరు మీద వేసేసేది. అలా కూడబెట్టిన మొత్తం దాదాపుగా ముప్పై వేల వరకూ ఉన్నాయి. ఇన్ని రోజులూ వాటిని కదిలించే అవసరం ఎప్పుడూ రాలేదు కానీ ఇన్నాళ్ళకి ఆ డబ్బు పంపమని అమ్మకి చెప్పినప్పుడు మొదట ఆశ్చర్యపోయినా చదువుకునే పిల్లలు అవసరాలేవో ఉంటాయని అమ్మ వెంటనే పంపింది.

ఆ డబ్బుతో ప్రవీణ్ కి ఒక చిన్న చైన్, ఒక షర్ట్ కొన్నది.

చైన్ చూసి అతనెలా రియాక్ట్ అవుతాడో ఊహించుకుంటుండగానే తన నుండి ఫోన్-
పలానా హోటల్ లో పలానా రూంకి రమ్మని.

హోటల్ రూంకి రమ్మనగానే కొద్దిగా భయంగా అనిపించినా ‘మనమిద్దరమే సెలబ్రేట్ చేసుకుందాం’ అన్న మాటలు గుర్తొచ్చి మనసు కుదుటపడింది.

రూంలోకి వెళ్ళాక తను తెచ్చిన చైన్, షర్ట్ ఇచ్చి విషెస్ చెప్పి తన మెచ్చుకోలు కోసం ఎదురు చూసింది, తను వాటిని అటూఇటూ తిప్పి చూసి నిర్లక్ష్యంగా ఓ పక్కన పడేయడం చివుక్కుమనిపించినా తనకితనే సర్ది చెప్పుకుంది. చిన్న కేక్ తెప్పించి కట్ చేసి ప్రవీణ్ నోట్లో ఒక ముక్క పెట్టాక బర్త్ డే గిఫ్ట్ ఏం లేదా అంటూ తన భుజాల మీద చేతులేస్తూ దగ్గరికి తీసుకోబోయాడు.

ఆ చర్య కొంచెం ఇబ్బందికరంగా అనిపించి ‘ఇందాక ఇచ్చాను కదా నచ్చలేదా అవి’ అంటూ దూరం జరిగింది.

“అవా?!” అంటూ నవ్వాడు. ‘అలాంటి గిఫ్ట్ లు మా ఇంటి డ్రైవర్ కూడా ఇస్తాడు. ఇంకా గొప్పగా ఏమివ్వగలవు ఆలోచించు’ అంటూ లేచెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చాడు.

ఎందుకో అతని పనులు వింతగా తేడాగా అనిపించి “నేనిక వెళతా”నంటూ లేచి నిలబడి వెళ్ళబోయింది.
గిఫ్ట్ ఏమీ ఇవ్వకుండానే వెళతావా అంటూ కౌగిలించుకోబోయాడు.

“వద్దు ప్రవీణ్ ఇలాంటివేం ఇప్పుడే వద్దు పెళ్ళయ్యాకే అన్నీ” అంటూ అతన్ని దూరంగా నెట్టేసింది.
అయినా అతను వినకుండా “తన మీద ప్రేమ ఉంటే ఈ గిఫ్ట్ ఇస్తావని, అడ్డు చెప్తే తన మీద ప్రేమ లేనట్టేనని” అనడంతో ఎలాగూ పెళ్ళి చేసుకోబోయే వ్యక్తే కాబట్టి మాట్లాడకుండా ఒప్పుకుంది.

రోజులు గడిచేకొద్దీ ప్రవీణ్ లో మార్పు రాసాగింది.

ఫస్టియర్ స్టూడెంట్ చుట్టూ తిరుగుతున్నట్టు తెలిసి ఒకరోజు నిలదీసింది దీవెన. ఆమెని విదిలించుకొని నిర్లక్ష్యంగా జవాబు చెప్పడంతో,

“ఇదంతా కాదు మీ ఇంట్లో మన గురించి ఎప్పుడు చెప్తావు, మనమెప్పుడు పెళ్ళి చేసుకుందాం చెప్పు” అంటూ అడిగింది.

“ఏంటి పెళ్ళా? ఎవరి పెళ్ళి” అంటూ అతను పెద్దగా నవ్వి “నిన్ను పెళ్ళి చేసుకుంటా అని ఏరోజైనా చెప్పానా దీవెనా? నిన్నెలా చేసుకుంటా అనుకున్నావు? ఎక్కువగా ఊహించుకోకు. అయినా నిన్ను చేసుకుంటే నాకేం వస్తుంది? ఎంత కట్నం ఇవ్వగలరు మీవాళ్ళు? నీతో ఇన్నిరోజులు మాట్లాడడమే ఎక్కువ” అంటూ అతను వెకిలిగా మాట్లాడుతుంటే కాళ్ళకింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. అతన్ని ఆ చెంపా ఈ చెంపా వాయించి ‘నావెంట ఎందుకు తిరిగావ్, ఎందుకు నన్ను మోసం చేసావు?’ అని అడగాలనుకుంది.

కానీ ఆ వెధవ ముందు ఒక్క క్షణం కూడా నిలబడబుద్దేయలేదు.

వస్తున్న ఏడుపుని దిగమింగుకొని హాస్టల్ కి వెళ్ళింది. ఇల్లు, అమ్మా నాన్న గుర్తొచ్చారు, అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని ఏడవాలనిపించింది‌. రాధకి ఫోన్ చేసి ‘వార్డన్ కి తాను ఊరెళుతున్నానని, ఇప్పుడప్పుడే రానని’ చెప్పమంది.

బస్టాండ్ కి వచ్చేసరికి తన ఊరెళ్ళే బస్ కనిపించగానే ఉన్నపళాన ఎక్కేసింది.

ఊరికి చేరేలోగా సాయంత్రం అయింది, మాటామంతీ లేకుండా వచ్చిన కూతుర్ని చూసి దీవెన అమ్మానాన్నలిద్దరూ ఆశ్చర్యపోయారు. అదేంటమ్మా చెప్తే నేనొచ్చి తీసుకొచ్చేవాడినిగా అని ‌తండ్రి అంటుంటే “అదేం లేదు నాన్నా, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసా” అన్న మాటలకి అమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

“ఇంత చిక్కిపోయావేందమ్మా, సరిగ్గా తినట్లేదా” అని అప్పటికప్పుడు నాన్నని పంపి మటన్ తెప్పించి చపాతీలు చేసి అమ్మే తినిపించింది. తింటుంటే మధ్యలో పొలమారితే నాన్న నీళ్ళు తెచ్చిచ్చి తల మీద మెల్లగా తట్టాడు, ఇలాంటి తల్లిదండ్రులనా ఆ వెధవ కోసం నేను నిర్లక్ష్యం చేసింది అని లోలోపల బాధపడింది‌. వాడి తీయని మాటలు విని వాడికి లొంగిపోయి తానెంత పెద్ద తప్పు చేసిందో గుర్తొచ్చి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది.

వారం రోజులు అమ్మా నాన్నల ముందు తప్పు చేసానన్న భావనతో గడిపింది. తిరిగి మాములు మనిషవ్వడానికి దాదాపుగా రెండు నెలలు పట్టింది. ఎక్జామ్స్ ముందు కాలేజ్ కి వచ్చింది, ఫీజ్ కట్టి పరీక్షలకి అటెండ్ అయింది.

ప్రవీణ్ ని సస్పెండ్ చేసారని ఇంకా ఏదేదో చెప్తుంటే ఆ సంభాషణని అంతటితో తుంచేసి వెళ్ళిపోయింది.
‘ఎందుకన్ని రోజులు ఇంటికెళ్ళావు, ప్రవీణ్ గురించి ఏం జరిగిందం’టూ అందరూ గుచ్చి గుచ్చి అడిగినా మాటలు దాటేసింది.

కాలం ఎవ్వరికోసం ‌ఆగకుండా పరుగు పెడుతూనే ఉంది, చదువు మీద మరింత దృష్టి పెట్టి రెండు సంవత్సరాల బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకుంది, ఫైనల్ ఇయర్లో మంచి పర్సెంటేజితో డిస్టింక్షన్ సాధించింది. అనుకున్నట్టుగానే క్యాంపస్ రిక్రూట్మెంట్లో విప్రోలో సంవత్సరానికి పదిలక్షల ప్యాకేజీతో జాబ్ తెచ్చుకుంది.

ఫేర్వెల్ రోజు కూడా ప్రవీణ్ మాటలు కలపాలని చూసినా త్వరగా ఊరెళ్ళాలనే సాకుతో అతన్ని తప్పించుకొని వచ్చేసింది.

జాబ్ లో జాయిన్ అయ్యాక అమ్మానాన్నల్ని తనతోపాటే తెచ్చేసుకుంది. లోన్ పెట్టుకుని చెల్లికి పెళ్ళి చేసి, తమ్ముడ్ని కెనడా పంపింది. అమ్మ పెళ్ళి మాట తీసుకొస్తే మాత్రం మౌనంగా ఉండిపోయేది.
తనతోపాటే వర్క్ చేసే ఆనంద్ ఎన్నిసార్లు మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చినా రిజెక్ట్ చేస్తూనే ఉంది.
అడిగి అడిగి అమ్మ కూడా విసిగిపోయింది.

ఎందుకో ప్రేమ, పెళ్ళి అనే పదాలు వింటే అసహ్యకరమైన మాటల్లా అనిపింవేవి దీవెనకి.
ఒక ఐదేళ్ళు ఉద్యోగం చేసాక సర్వీస్ కమిషన్ రాయాలనే ఆలోచన వచ్చింది. ఉన్నట్టుండి
జాబ్ రిజైన్ చేస్తుంటే అందరూ పిచ్చి పట్టిందా అని తిట్టారు, కానీ ఎవరిమాట వినకుండా కోచింగ్ కి వెళ్ళింది.

సంవత్సరం పాటు ప్రిపేర్ అయ్యాక ‌తన కష్టం వృధా పోలేదు, గ్రూప్1 లో RDOగా సెలెక్ట్ అయింది.
ట్రైనింగ్ అయ్యాక మొదటి పోస్టింగ్ కర్నూలులో వేసారు‌‌. అన్నీ అమర్చుకొని అమ్మానాన్నని తెచ్చుకుంది. అమ్మకి ఈ ఉద్యోగం, ఈ హోదా అన్నీ చాలా అబ్బురంగా అనిపిస్తున్నాయి. ఆఫీసుకి వెళ్ళొస్తుంటే అద్భుతాన్ని చూసినట్లు చూస్తుంది.

ఆరోజు సోమవారం. గ్రీవెన్స్ డే జరుగుతుంది. అర్జీ ఇవ్వడానికి వచ్చిన మనిషిని ఎక్కడో చూసినట్టుగా అనిపించి పరిశీలనగా చూసింది‌. మొహమంతా పీక్కుపోయి, అక్కడక్కడా తెల్లబడిన వెంట్రుకలతో, ముడతలు పడిన షర్ట్ తో ఏదో కోల్పోయిన వాడిలా ఉన్న అతన్ని పరీక్షగా చూస్తుంటే అతను కూడా తనని పట్టిపట్టి చూడడం మొదలుపెట్టి కాసేపటికి చిన్నగా నవ్వాడు, అప్పుడు గుర్తొచ్చింది ఆ నవ్వు ప్రవీణ్ దే.

అతన్నలా చూసి షాక్ తినింది, అతని పరిస్థితి ఇంచుమించుగా అదే, తననలా ఆ ప్లేస్ లో చూసి మాటలు రానట్టుంది.

“మీరు.. నువ్వు.. దీవెన కదా?” అంటూ తడబడుతుంటే తనే అర్జీ చొరవగా తీసుకొని చూసింది.
సరిహద్దు తాలూకూ దాయాదుల గొడవలు. త్వరగా పరిష్కరించమని mro కి ఫోన్ చేసి మాట్లాడతానంది.

మధ్యాహ్నం లంచ్ టైంలో అటెండర్ వచ్చి “అతను మీతో మాట్లాడలటమ్మా” అని చెప్పడంతో లోపలికి పిలిపించింది.బెరుకుగా వచ్చి నిలబడిన ప్రవీణ్ ని చూసి కూర్చోమని కుర్చీ చూపించింది.

కాలేజ్ లో బిందాస్ గా ఏ బాధలు లేనట్టు లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు చేస్తూ చిన్న సైజు జమీందారులా తిరిగే ప్రవీణేనా ఇతను అని ఆశ్చర్యపోయి “అసలేం జరిగింది ప్రవీణ్ ఎందుకిలా అయిపోయావు?” అని అడిగింది.

నిమిషాల‌ నిశ్శబ్దం తర్వాత “నన్ను క్షమించు దీవెనా నిన్ను చాలా బాధపెట్టాను, నీకు చేసిన అన్యాయం నాకు నా కుటుంబం మొత్తానికి తగిలింది” అంటూ కళ్ళవెంట నీళ్ళు పెట్టుకుని జరిగింది చెప్పుకొచ్చాడు.
“బంధువులంటూ నాన్న కౌలుకిచ్చిన పొలాన్ని ఆ కౌలుదారులు తమదేనంటూ తప్పుడు సాక్ష్యాలు పుట్టించారు, పోనీ వాళ్ళ మీద కేస్ వేద్దామనుకుంటే వాళ్ళందరినీ మానేజ్ చేసేసి దొంగ సాక్ష్యాలు చెప్పించి అందరికీ లంచాలిచ్చి దాన్ని స్వాధీనం చేసేసుకున్నారు.

ఆ పొలం మీద ఆశలు వదిలేసుకున్నాం. ఒక చిన్న పొలం అమ్మ పేరు మీద నాన్నెప్పుడో కొన్నది ఉంటే దాన్ని నేనే సాగు చేసుకుంటున్నాను. ఇప్పుడు మా బాబాయిలు సరిహద్దు విషయంలో గొడవలు చేస్తున్నారు. అందుకే అర్జీ‌ ఇవ్వడానికి వచ్చా. కొంచెం మా ‌mroతో మాట్లాడి ఈ‌సమస్య త్వరగా పరిష్కరించమను” అని‌ చేతులు జోడించి అడుగుతుంటే దీవెనకి చెప్పలేని తృప్తి‌గా అనిపించింది.

తానిన్ని రోజులు కొరతగా ఫీల్ అయిందేదో సంపూర్ణమైనట్టుగా ఏదో సాధించినట్డుగా హాయిగా ఉంది.
ప్రవీణ్ నాశనాన్ని దీవెన కోరుకోలేదు కానీ చేసిన తప్పులకి దేవుడు శిక్ష భూమి మీదే విధిస్తాడని అందరూ అన్న దాన్నిప్పుడు కళ్ళారా చూస్తోంది.

ఇన్ని సంవత్సరాలుగా తన కోసమే ఎదురుచూస్తూ ఉండిపోయిన ఆనంద్ కి ఫోన్ కలిపి తాను పెళ్ళికి ఓకే చేసినట్టుగా చెప్పింది. అవతలి వ్యక్తి ఎగిరి గంతేయకపోయినా ఇంచుమించుగా అదే విధంగా రియాక్ట్ అయిన విషయాన్ని‌ఫోన్ లో విని చిన్నగా నవ్వుకుంది.

తనకి తెలుసు, తన జీవితంలో తాను ఇప్పటి వరకూ కోల్పోయిన ప్రేమ, నమ్మకం పదిరెట్లు ఎక్కువగా తనకి దొరకబోతుందని.

ఈ విషయం చెప్తే అమ్మ ఇంకెంత సంతోషపడుతుందోనని అమ్మ నంబర్ కి డయల్ చేసింది.

-షఫేలా ఫ్రాంకిన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments