రచయిత్రి బోయి విజయభారతితో సంభాషణ-2- కట్టూరి వెంకటేశ్వరరావు

*తెలుగు సాహిత్యంలో గొప్ప పేరు కలిగిన వ్యక్తి మిమ్మల్ని సాహిత్యంలో ఎదగనీయకుండా సభలు,సమావేశాల్లో వేదికమీద కనిపించనీయకుండా మిమ్మల్ని అణగద్రొక్కే ప్రయత్నం చేశారని విన్నాం.ఆ వార్తలపై మీ అభిప్రాయం చెబుతారా?

జ.సాహిత్య పదకోశం రెండవ వాల్యూమ్ మమ్మల్నే పూర్తి చేయమని అసెంబ్లీ వేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.అ క్రమంలో 1851నుండి1950 వరకు ముద్రించాలి.మాకు ఇచ్చిన బ్లూ ప్రింట్ ఆధారంగా పూర్తి చేయాలి.ఆ వ్యాల్యూమ్ లో ఒక ప్రముఖకవి పేరు చేర్చలేదు.ఆయనే సి.నారాయణ రెడ్డి వారికి చాలా కోపమొచ్చింది.మా ఆఫీస్ లో ప్రమీలని పిలిచి నాపేరు ఎందుకు చేర్చలేదు అని అడిగారట. దానికి ప్రమీల బ్లూప్రింట్ ప్రకారమే అలా చేశారు అని బదులిచ్చిందట ప్రమీల.ఆ తర్వాత ఆయన ఎంతలా కక్ష పెట్టుకున్నారంటే.నాకు సాహిత్యంలో డయాస్ లేకుండా చేశారు.ఎవరైనా వచ్చి ఫలానా పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకుంటున్నాం.మీరు తప్పకుండా రావాలి.ఆ కార్యక్రమంలో మాట్లాడాలి అని ఆహ్వానించి వెళ్లేవారు.అలా ఆలపాటి నరసింహం అని ఒక మంచి రైటర్ ఉండేవారు.వారు వచ్చి ఒక సభకు పిలిచారు. ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర రాసినప్పుడు పరిచయం.మీరు విమర్శ కూడా చేస్తారు.మీరు వచ్చి మా సభలో మాట్లాడాలి అని పిలిచి వెళ్ళారు. కానీ ఆ మీటింగ్ నాకు తెలియకుండానే జరిపించేశారు.అంటే సి.నారాయణ రెడ్డి అంతలా కంట్రోల్ చేసేవారన్నమాట.అలా సాహిత్యవేదికలపై నాకు చోటులేకుండా చేసేవారన్నమాట.

*సాహిత్య పదకోశం రెండవ వ్యాల్యుమ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ?
సాహిత్య పదకోశం రెండవ వ్యాల్యూమ్ అందుబాటులోకి తీసుకురావడానికి చాలామంది అడ్డుతగిలారు.బూదరాజు రాధాకృష్ణ అంటుండేవాడు. ప్రాచీన సాహిత్యపదకోశం ఎలాగో పూర్తి చేశారు.రెండోది చేయడం మీ తరం కాదు. ఎందుకంటే రెండో వ్యాల్యూమ్ పూర్తి చేయడానికి కావలసిన కురుగంటి సీతారామయ్య రాసిన’నవ్యాంధ్ర సాహిత్య వేదిక’అనే పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి.అవి ఎక్కడా దొరకవు అవి నీకు చస్తే ఇవ్వను అని అన్నారు.అయితే చిత్రంగా కురుగంటి సీతారామయ్య గారు ఆయన రాసిన ఆ పుస్తకాలు రెండు వ్యాల్యూమ్స్ స్వయంగా మానాన్న గారికి పంపించారు.అవి నాదగ్గర ఉన్నాయనే సంగతి బూదరాజు రాధాకృష్ణ కి తెలియదు.అంచేత నేను చాలా ధీమాగా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగా.సాహిత్యం లో చాలా ఇబ్బందులుకు గురిచేశారు. కానీ మేము విజయవంతంగా పూర్తి చేశాం.

* అంబేద్కర్ జీవిత చరిత్రలు రెండు మూడు రచనలు అప్పటికే వచ్చాయి కదా.మళ్లీ మీరు ప్రత్యేకంగా అంబేద్కర్ జీవిత చరిత్రను తీసుకురావడం వెనుక ఉన్న కారణాలు తెలియజేస్తారా?
జ.నిజానికి అంబేద్కర్ జీవిత చరిత్రలు అప్పటికే రెండు మూడు వచ్చాయి.ఎండ్లూరి చిన్నయ్య గారు రాసిన అంబేద్కర్ చరిత్ర చాలా పెద్దగా ఉండటం వల్ల,సామాన్య ప్రజలకు చదవడానికి ఇబ్బందిగా ఉందని చిన్నయ్య గారి అభిమానులే మా దగ్గరకు వచ్చి.అంబేద్కర్ జీవిత చరిత్ర వంద పేజీల లోపల రాయమని మావారిని వారు అడిగారు. తారకం గారు అంబేద్కర్ చరిత్ర ఆయన ఐడియాలజీ అంతా క్షణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి. హైదరాబాద్ లో అంబేద్కర్ మిషన్ అనే సంస్థ ఉండేది. భూపతి రాజు అనే ఆయన దానికి మూలస్తంభంగా ఉండేవారు.భూపతి రాజు మిగతా వారి కోరిక మేరకు ఆ పుస్తకం రాయవలసి వచ్చింది. తారకం గారు ఉద్యమాల్లో బిజీగా ఉండటంవల్ల, భూపతి రాజు గారికి నన్ను చూపిస్తూ మా విజయ చాలా బాగా రాస్తుంది అంటూ… నువ్వు రాయకూడదా అని అన్నారు. అలా అనుకోకుండా వచ్చింది నా చేతికి.

* అంబేద్కర్ జీవిత చరిత్రరాయడానికి మీరు చేసిన కృషి ?
నేను ఇంగ్లీష్ పుస్తకాలు తెప్పించి అవి చదవడం మొదలు పెట్టాను.ఎండ్లూరి చిన్నయ్య గారి పుస్తకం కూడా నాకు ఎవరో తెచ్చి ఇచ్చారు. కానీ నేను చదవలేదు. ఎందుకంటే చదివితే ఒరిజినాలిటీ ఎక్కడ పోతుందో అని చదవలేదన్నమాట. ఇంగ్లీష్ పుస్తకాలు కొన్ని స్టాండర్డ్ బుక్స్ చదివాను. ఇంచుమించుగా చరిత్ర అంటే అన్ని యదార్థ సంఘటనలు ఉంటాయి కదా. అదే ఒక రకంగా రాసుకుంటూ వెళ్లాను. అలా రాసుకుంటూ వెళ్ళాక స్క్రిప్ట్ చాలా పెద్దదైపోయింది. భూపతి గారు అడిగిన వంద పేజీల కంటే చాలా ఎక్కువ అయిపోయింది. దాంతో అచ్చు వేయించడానికి వాళ్ళు ఆలోచించారు.అప్పుడు ఇంతదాకా వచ్చాక దాన్ని ఆపడం ఎందుకని, తారకంగారు మేము కలిసి దాన్ని మా సొంత డబ్బులతో అచ్చు వేశాం.

*కాని తర్వాత చాలా విమర్శలే ఎదుర్కున్నారు కదా ?
అవునండీ , ఎండ్లూరి చిన్నయ్య గారి పుస్తకం ఉండగా ఇప్పుడు ఈవిడ ఎందుకు రాసింది అని. నిజానికి చిన్నయ్య గారి అభిమానులే వచ్చి అంబేద్కర్ పై చిన్న పుస్తకం రాయమని నన్నడిగారు. కానీ నేను రాసిన పుస్తకం చిన్నయ్య గారి పుస్తకం కంటే పెద్దగా వచ్చింది. ఆ తర్వాత రీప్రింట్లో చిన్న చిన్న మార్పులు చేస్తూ వచ్చాను. అలా అంబేద్కర్ జీవిత చరిత్ర నేను రాయవలసి వచ్చింది.

*స్త్రీల హక్కుల కోసం మంత్రి పదవిని వదులుకున్న అంబేద్కర్ని మీరు ఏ కోణంలో ఆవిష్కరిస్తారు?
జ. అంబేద్కర్ గురించి ఏం చెప్పినా సమగ్రం కాదండీ. ఆయన గురించి ఎన్ని సంవత్సరాలు,ఎన్ని తరాలు ఆలోచించినప్పటికీ కొత్తకోణాలు బయటపడుతూనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఆయన ఎంత ఆలోచనాపరుడో,స్త్రీల హక్కుల గురించి ఎలా ఆలోచించేవారో అది నిజంగా నాకైతే అంతుబట్టదు. మామూలుగా హిందూ సమాజం కుటుంబ వ్యవస్థలో స్త్రీలు సేవా ధర్మానికి నియోగించబడుతూ ఉంటారు. వాళ్ళకి ఒకమాట కూడా ఎవరూచెప్పరు. ఇంట్లో పెద్దవాళ్లు మాట్లాడుతున్నప్పుడు కూడా తండ్రితో తాత, తండ్రితో కొడుకు ఆలోచిస్తాడే తప్ప అది భార్యకు చెప్పి, కూతుళ్ళకి చెప్పి చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇంట్లో స్త్రీలతో మాట్లాడి ఆలోచించాలి అనే ఆలోచన అసలే ఉండదు. బహుశా అంబేద్కర్ తన చిన్నప్పుడు తన మేనత్తల పరిస్థితిని,తన కుటుంబంలో ఉన్న వాళ్ల మేనత్తల పరిస్థితిని ఆలోచించుకొని ఉంటారు. ఆ స్థితిని చూసి స్త్రీలకు కూడా కొన్ని హక్కులు ఉండాలి.ఆ హక్కులు చట్టపరంగా స్త్రీలకు ఉండాలని ఆయన చేసిఉంటారు.

*హరిశ్చంద్రుడు కష్టాలు పడింది అబద్ధాలను చెప్పలేకకాదు.కులం పోగొట్టుకోలేక అంటూ ‘సత్య హరిశ్చంద్రుడు’ అనే విమర్శనాత్మక పుస్తకం రాసారు. దీనిపై మరోసారి విహంగ పాఠకుల కోసం మీ వివరణ?
జ. అవునండి మామూలుగా తెలుగు సిలబస్ లో స్కూల్ నుండి కాలేజీ వరకు హరిశ్చంద్రుడు అంటే సత్యవాది, అబద్ధం ఆడడు అనేది మనం చెప్పుకుంటూనే ఉంటాం. పురాణ కథలన్నీ కూడా మనకు నెగిటివ్ పాయింట్ లో ప్రెజెంట్ చేశారు వాళ్ళు. అలాగే సత్య హరిశ్చంద్రుడు ఎక్కడో వేదకాలంలో ఒక రాజు. విశ్వామిత్రుడు ఒక ఋషి.వాళ్ళ మధ్య ఏవో గొడవలు జరిగాయి. ఈ కథ వేదాలనుంచి తీసుకున్నారు అంటారు. కానీ అక్కడ ఈ సత్యం మాట్లాడడం ఉండదు. ఏదో యజ్ఞం చేయడం,ఆ యజ్ఞంలో వాళ్ళ కొడుకుని బలివ్వడం అలాంటి గొడవలేవో ఉంటాయి అక్కడ. కానీ మేం పాఠాలు చెప్పేటప్పుడు ఎంతసేపు ప్రాతివ్రత్యం గురించి,సత్యాన్ని గురించి గొప్పగా చెప్పేవాళ్ళం.హరిశ్చంద్రోపఖ్యానం కావ్యంలో ప్రాతివ్రత్యం గురించి ఒకసారి,సత్యమంటే ఎంతగొప్పదో,కులమంటే ఎంతగొప్పదో అని చెప్పడానికి ఆ పాఠాన్నే భోధిస్తాము. అలా చెప్తున్నప్పుడు నాకు అనుమానం వచ్చింది.ఎంత సేపు కులం చెడగొట్టుకోలేను,కులం చెడగొట్టుకోలేను అని అంటాడు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడు ఏమో నా పెంపుడు కూతుళ్ళు మాతంగ కన్యలు అంటాడు. ఇదేమిటి దీన్ని ఎంత వక్రీకరించి రాశారు వాళ్ళు.అలా వక్రీకరించి ఈ కావ్యాన్ని ప్రజల్లోకి ప్రచారం చేశారని నాకు అనిపించింది. అప్పుడే దాని గురించి రాయాలని అనుకున్నాను.అంటే అతనేమంటాడు వీళ్ళు మాతంగ కన్యలు. సంగీత సాహిత్యాలలో ఆరితేరిన వాళ్ళు. అంటే వాళ్ళు అందరితో పాటు సమానంగా ఉండేవాళ్ళన్నమాట. అయితే ఈ మనుధర్మశాస్త్రం వచ్చాక ఈ మాతంగ కులాన్ని కొంచెం తక్కువ చేయడం కోసం.అంటరానివాళ్ళ కింద ముద్ర వేయడం కోసం వాళ్లు అది ఉపయోగించుకున్నారు. హరిశ్చంద్రుడంటాడు వీళ్ళు అంటరాని వాళ్ళు. పాలవంటి కులం నేను చెడగొట్టుకుంటానా అని అంటాడు. అంటరాని కులంలో మాతంగ కన్యలను చేసుకోనని అంటాడు.అంటే రాజు ఏ కులం వారినైనా చేసుకోవచ్చు. కానీ ఈ మాతంగ కులం వాళ్లను చేసుకుంటే ఎలా?అని అంటాడు. ఇలా విశ్వామిత్రుడు పరీక్షలుపెట్టినా మధ్య మధ్యలో అడుగుతోనే ఉంటాడు. నువ్వు నా కుతుళ్ళను చేసుకుంటే నీకు ఈ కష్టాలేవి లేకుండా చేస్తానని. దానికి హరిశ్చంద్రుడు నేను కులం పోగొట్టుకోలేను అని అంటాడు. అది చాలా చిత్రంగా దీన్ని ప్రజల్లో ప్రచారం చేశారు. ఇంకొకటి ఏమిటంటే మరోకాలం వచ్చేసరికి అదే మాతంగుడి దగ్గర హరిశ్చంద్రుడు ఉద్యోగం చేయవలసి వస్తుంది. అంటే కులాన్ని పట్టించుకునే వాళ్ళకి గుణపాఠం చెప్పడంకోసం,ఆ కాలంలో ఆ ముగింపు ఇచ్చారేమో అని నాకు అనిపిస్తుంది.

*నేటి రచయిత్రులకు ముఖ్యంగా అణగారిన వర్గాల నుంచి సాహిత్యంలో ముందుకు వచ్చి రచనలు చేస్తున్న రచయిత్రులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు?
జ. అంటే ప్రాచీన సాహిత్యాన్ని బాగా చదవాలండీ.ప్రాచీన సాహిత్యంలోనే మన భారతీయ సంస్కృతి అంతాఉంది. ఆ సంస్కృతిని వీళ్ళు వక్రీకరించి చెప్పారు. తమ తమ అవసరాలకు అనుగుణంగా అంటే ఈ కులాలు,వంశాలు,కుటుంబాలు ఏర్పాటు చేయడం కోసం కొన్ని సంఘటనలు కల్పించి వీరు రాశారు. ఆ రకంగా ఆలోచించినప్పుడు మామూలుగా హిందూసంస్కృతి చాలా చెడ్డది అని అనుకోవడం కాకుండా.దీన్ని చెడ్డగా చిత్రీకరించడానికి కొన్ని వర్గాలని ఆకట్టుకోవడానికి, కొన్ని వర్గాలను తమకు బానిసలుగాను,సేవకులుగాను చేసుకోవడానికి.అంటే తమ క్రిందివాళ్ళగా ముద్ర వేయడానికి ఆ కథలు వాళ్ళు ఉపయోగించుకున్నారు. అందులో ఉన్న మూలాలకి వెళ్ళండి అని నేను అంటాను.

*దళిత స్త్రీవాదిగా నేటి సమాజానికి మీరిచ్చే సందేశం?
జ. దళిత స్త్రీలు అనడం కంటే దళితవాదం అంటే బాగుంటుందేమో.మామూలుగా కూడా జాషువా దళిత కవి.భీమన్న దళితకవి అంటే మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు.దళితకవి ఏమిటి?దళితవాదం అని అనేవారు. అంటే దళితులు కూడా అందరితో సమానమే అనే వాదం కదా మనది. అలాగే దళిత స్త్రీవాదం అని నా అభిప్రాయం.దళితవాదులుగా ముద్ర వేయడం కూడా తగనిపని అని నేను అనుకుంటాను. వాళ్ళు దళితులు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారులే. వాళ్ళు అలాగే రాస్తారులే అనే అవకాశం రాకుండా ఉండాలి.అంటే దానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండాలి. అలాంటి ఆదర్శాలతో ఉన్న ఆ దళిత సమాజాన్ని మనం తప్పుబట్టడం ఎంతవరకు సమంజసమనే మన వాదం సాగాలి.దళితవాదం అనేదాన్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిందే.

– కట్టూరి వెంకటేశ్వరరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖిPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments