అందరి ఆశ ఒక్కటే (సంపాదకీయం) – అరసిశ్రీ

విహంగ చదువరులకి , సాహిత్యాభిమానులకి , రచయిత్రులకి , రచయితలకి నూతన  సంవత్సర శుభాకాంక్షలు ……….

కొత్త సంవత్సరం వస్తూ వస్తూ ఎన్నో ఆశలన్నీ , అంతకు మించి మరెన్నో బాధ్యతలను తీసుకు రావడం ఎప్పుడూ జరిగే వ్యవహారమే . కాని ఈ సంవత్సరం మాత్రం మానవాళి అందరికి ఒకే ఒక్క ఆశ వ్యాక్సిన్ . యిప్పటి వరకు తన ప్రతాపాన్ని చూపించిన కరోనా తగ్గుముఖం పట్టిన మరొక రూపంలో ఎక్కడో ఒకచోట కొత్త వైరస్ కలకలం ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నాయి . దానికి కారణం వైరస్ ని ఎదుర్కునే సమర్ధవంతమైన  వ్యాక్సిన్  రాకపోవడమే .

గత ఏడాది ఎన్నో పాఠాలను నేర్పింది . ఏ సంబంధాలు దృఢమైనవి , మానవత్వం ఎంత వరకు నిలిచి ఉంది అనే ఎన్నో కోణాల్లోనుంచి సగటు మనిషి తనని తాను చూసుకున్నాడు . ఒక ఏడాదికి కాదు ప్రతి ఒక్కరికి ఒక జీవిత పాఠమే నేర్పింది 2020.కరోనా కాలంలో ఎందరో మహిళా మూర్తులు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా   ప్రత్యక్షంగా , పరోక్షంగా తమ  విధులు నిర్వహించారు . వారందరికీ జోహార్లు .

మరొక వైపు మహిళల మీద జరిగిన , జరుగుతున్న అత్యాచారాలు , హింసలు మరింత ఎక్కువై పోయాయనే చెప్పాలి . సగటు మహిళల మానసికంగా మరింత ఆందోళనకు గురి అయ్యింది కూడా. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా మహిళల పై జరుగుతున్న అత్యాచారాలు కనీసం తగ్గు ముఖం పట్టడం లేదు . దానికి కారణం వాటి మీద కనీస అవగాహన లేకపోవడం ప్రధాన  కారణం.

కనీసం ఈ కొత్త ఏడాదిలో ప్రపంచానికి కరోనా నేర్పిన గుణపాఠంని గుర్తు పెట్టుకుని ముందుకు సాగిపోవాలి . దానికి తగినట్టు మన జీవిన విధానాన్ని మార్చుకోవాలి . ఆధునిక పోకడలతో  వదిలి పెట్టిన మన భారతీయ సంప్రదాయాలను గుర్తు చేసుకుని , ఆచరించవలసిన సమయం ఇది.

ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు తగ్గాలి అంటే మన ఇంటి నుంచే ఆడ , మగ అంటూ జెండర్ వ్యత్యాసం ఉండకూడదు . ఈ ఏడాది లోనైనా  ఆ దిశ గా  ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని ఆశిస్తూ ..

మరొకసారి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు .

                               -అరసి శ్రీ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Comments are closed.