పసితనం ఛాయలు వీడి
నాలో వచ్చిన హెచ్చుతగ్గులు
నన్ను నాకు కొత్తగా ..
పరిచయం చేస్తున్నాయి…
రోజు లాగే స్నానం కి
వెళ్లిన నాకు రక్తపుమరక
ఒకింత కలవర పరిచింది
నిజాన్ని నీళ్ళతో కడిగేసా…
ఏమైందో అర్థంకాని
పసిహృదయపు అమాయకత్వం
ఎదో తెలియని బిడియం
చెప్పొద్దని దాచుకున్న నిజం..
దాచుకుంటే దాగదని
తెలియని మనసుకు
ఎప్పటిలాగే వేసుకున్న దుస్తువులు
నిజాన్ని దాచలేక పోయాయి…
ఆ నిజం తడిచి నడుస్తున్నప్పుడు
గాయాలను వెలికితీసి
నడవలేని స్థితికి దిగజార్చి
కొత్త వాసనలు పరిచయం చేసాయి..
రక్తపు మరక ప్రతి ఆడపిల్లను
పలకరిస్తుందని అవగాహన
కల్పించలేని పెద్దవాళ్ళ పట్టింపులకు
రెండు నెలలలో తనని
పలకరించి వెళ్తున్న రక్తపుమరకలగురించి
కనీస అవగాహన లేని పసిమనసు
దాచాలనుకున్న దాయలేని నిజం..
ప్రతిఆడపిల్ల రక్తపుమరక
అమ్మతత్వానికి నాంది
రక్తపుమరక అవగాహన
ఆడపిల్ల ఆరోగ్య పునాది..
ఎదో తప్పుగా భావించి
పిల్లలకు చెప్పలేక వాళ్లే
తెలుసుకుంటారనే వదిలేసిన
వారి అమాయకత్వానికి
పలకరించి వెళ్తున్న రక్తపుమరకలు
నడవలేనిస్థితికి తెచ్చిన నరకం
గాలి తాకి వెళ్లిన ప్రతిసారి
ముక్కు మూసుకున్న వైనం
ఎవరికి చెప్పొద్దేమో అని
దాచాలనుకున్న ప్రయత్నం
దాయలేము అని తెలుసుకున్న నిజం..
జ్యోతి రాణి జో
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~