ఆకలికే(ఆ)కలై )కవిత )- పెరుగుపల్లి బలరామ్

 

 

 

 

గులాబిరంగు నోర్లు
గొంతునుంచీ పొట్టంతా కనబడేలా
పొట్ట గొంతు ఏకంచేసి అరుపులు
బహుశా ఆఅరుపులకర్థం ఆకలేమో
ఒళ్ళంతా కంపలా మోడులు
ఇంకా ఈకలుగా మారని ఆమోడులతో
విప్పారని రెక్కలతో
రాటుదేలని ముక్కులతో
నిస్సహాయాన్ని వెలిబుచ్చే కళ్ళతో
ఒకదాన్ని మించిఒకటి దిక్కుల్ని
ఆకలి కేకలతో నింపుతున్నాయి

ఏ దిక్కునుందో తల్లి చెవినబడలేదు
వేటలో తదేక ధ్యానంలో ఉందో!
వేట ముగించి తిరుగు ప్రయాణంలో ఉందో!
వేట విఫలమై క్రుంగి రోదిస్తుందో!
కారణమేమో తెలియదు
గువ్వలు గూటిని చేరే సమయమైంది
దూరంగా నల్ల రబ్బరు వేలాడుతోంది
ఆ రబ్బరు చివర ఒక పంగల కర్ర, చేతికి వాటంగా
ఆ చేతులు మురికి పట్టినా పట్టు గట్టిగానే ఉంది
మోకాళ్ళ కిందికి జారిన లాగు
ధర్మ కాటాలో అధర్మం కిందికి దిగినట్లు ఒక వైపు కిందికి
మరోవైపు వాడి లాగుని అంతే బలంగా ఎగలాగాడు
కడుపులోపలికుంది పక్కటెముకలు బయటికున్నాయి
మరి పెగులెక్కడున్నాయోగానీ పిసరంత కండలేదు
రాముణ్ణి అనుసరించే లక్ష్మణుడిలా
ముందోడి అడుగులో అడుగై మరో బుడతడు
అరణ్యవాసంలా ఆ కంప చెట్లలోకి పోతున్నారు
అంతలో హటాత్తుగా అటు ఇటు ఆ కంపంతా గాలిస్తున్నారు
బకాసురుడికి చిక్కిన భోజనంలా
గూట్లోని గువ్వల గొంతుల్ని ఒక్క ఉదుటున దొరకబట్టారు
కంప నుంచీ తీగని చీల్చి ముక్కులోంచి దూర్చి
పిట్టల్ని కర్రకి కట్టారు

ఒకరి భుజం మీద మరొకరు చెతులేసుకుని
ఒకరి ముఖంలోకి మరొకరు చూసుకుంటూ
ఒకరి నవ్వు మరొకరు ఆస్వాదిస్తూ
ఇంటి దగ్గర దక్కే అభినందనల కోసం పరుగు లంఘించారు
ఆ గూడు ఒక్కసారిగా జారిపోయింది
వెలుగులోంచి సద్దులోంచి
పిట్టవచ్చింది ఆహారం తెలేదు
వేట విఫలమైందేమో ముఖం వేలాడదీసి గూటినవాలింది
అంతా సూన్యం గువ్వలు లేవు గూడూ శిధిలమైంది
ఆ కంపంతా ఏవో అడుగులు కొమ్మలు ఎడంచేసి దారి చేసి ఉంది
ఒక నిట్టూర్పు ఒక నిరర్వేదం ఒక జీవన సత్యం
ఆ చిన్న తల్లిపిట్ట బుర్రలో వెలిగింది
కన్నులు తెరిచె నిరీక్షణలో నిలిచిపోయింది
తిరిగి పిల్లలు వస్తాయని కాదు
ఇంత కాలం ఇదే బాధ ఎన్ని తల్లులు అనుభవించాయో అని
ఇదే సత్యం అనంత జీవుల బ్రతుకులలో నిత్యం
మనవంతు వస్తేనే మనకు కూడా ఆ శ్మశాన వైరాగ్యం

– పెరుగుపల్లి బలరామ్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments