నా తండా కథలు-4 -సీత్లా కర్రెే చఁ – డా.బోంద్యాలు బానోత్(భరత్)

మండువేసవి ముగిసింది.
సంతోషాల వసంతకాలం పచ్చదనంతో వానాకాలమై వాలింది. అందాకా ఎండకెండిన ముఖాల్లో ఒక్కసారిగా తేనే తొణికిసలాడింది. ఆకసంలో కారుమబ్బులు కమ్ముకున్నయి. తండావాసుల ఆశలు చిగురించినయి. మూడురోజుల జడివానతో అంతకుమునుపు, ఎండకెండిన బీడుభూములు,మడికట్లు ఈపాలి పచ్చహారాలు తొడుక్కున్నయి.

పశువుల కాసేపోరగాండ్లు ఆనందపడుతుండ్రు. విశాలమైన పచ్చికబీళ్ళు. వాటిలో రకరకాల చెట్లు, తంగేడుపొదలు, రేలపూల చెట్లు, మోదుగుపూల చెట్లు, జిన్నపళ్ళ చెట్లు, మామిడి చెట్లు ఉన్నయి…
తండా నుంచి గొడ్లను మందలు మందలుగా తోల్కొస్తున్నరు. గొర్ల మంద, మేకల మంద… తోల్కొస్తున్నరు. వర్షానికి పచ్చగడ్డి పిక్కలదాక పెరిగింది. గాలి వీచినప్పుడు గడ్డి అటు-ఇటు ఊగుతుంది. వంగివంగి లెేసినట్లుగా ఉంది. సూటిగా చెప్పాలంటే, ‘లంబాడి యువతులు సీత్లాపండుగ రోజున నృత్యం చేస్తున్నట్టు ఉంది.’

పశువులు మెసలకుండా మేస్తున్నయి. పశువుల కాపర్లు మర్రి చెట్టుమీద కోతి కొమ్మాట ఆడుతున్నరు. కొంతమంది జిల్లగోనె ఆడుతున్నరు. మర్రి చెట్టుకు కొద్దిదూరంలో మోదుగు చెట్టున్నది. ఆ మోదుగుచెట్టు మొదట్లో సీత్లాభవాని కొలువై ఉన్నది.

ఎదురుజిల్ల కొడితే బుయ్యీమనుకుంట పోయి సీత్లాగుడిని ఆనుకొని పడ్డది. ఎదురుజిల్ల అందకొనేవాడు ఉరికిండు. జిల్ల తీసుకొని సీత్లాను మొక్కిండు. ‘సీత్లాపాఁడ్గ దగ్గరికొచ్చిందని అనుకున్నడు’.
కొంచంసేపు సీత్లాగుడిని చూసిండు. మామూలు మోదుగుచెట్టు మొదట్లో పలచటి, మొఖంకొచ్చటి ఏడురాళ్ళు వరసగా నిలబెట్టి ఉన్నయి. మధ్యల నిలుచున్న రాయి మిగత ఆరురాళ్ళ కంటే పొడుగున్నది. దానికి ఎడమ పక్కన ఉన్న మూడురాళ్ళు క్రమంగా ఎత్తు తగ్గుతూ వచ్చినయి. అదే మాదిరిగా కుడిపక్క కూడా ఉన్నయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అరచెయ్యి సక్కగా చాపితే కనిపించెే వేళ్ళ ఆకారంలా ఉన్నది. మధ్యన ఉన్న పొడగాటి రాయికి సక్కగా, ఎదురుగా, ముప్పై అడుగుల దూరంలో ఒక కొచ్చటిరాయి నాటి ఉన్నది. దాని ముందు గుండ్రటి చిన్నగుండం తవ్వి ఉన్నది.
ఇవన్నీ చూసాకా ‘శేవ్య నాయక్’

మనసులో సందేహాలు మొదలైనయి. అతని మనసులో మెదిలే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డాడు శేవ్య నాయక్. జిల్ల గోనె ఆటను మధ్యలోనే వదిలేసి, అక్కణ్నుంచి కొంచెందూరంలో పశువులకాసే పెద్దమనిసి సేట్రాం నాయక్ దగ్గరికి పోయిండు.’ఆపణ్ సీత్లాపాఁడ్గ కన్న కర్రెే దాదా!?'(మనం సీత్లాపండుగ ఎప్పుడు చెేస్తున్నం తాతా!?) అని ఆసక్తిగా అడిగిండు శేవ్య నాయక్.

“కో బేటా లారేర్ వారం, నతో ఓర్ లారేర్ మంగళ్వారేర్ కరజూఁ చఁ. టాఁడేర్ నాయెకేన్ మాలం.” (ఏమో బిడ్డా!, వచ్చేవారం లేదా దాని తర్వాత వచ్చే మంగళవారం చెేస్తరు కావచ్చు. తండానాయకునికి తెలుసు.) అన్నడు సేట్రాం నాయక్.

“నాకు ఈ సీత్లాపండుగ గురించి చెప్పవా? ఈ ‘సీత్లా’
అంటే ఏంటి? ఈ ఏడు రాళ్ళేంటివి? వీటిని గొడ్లు మేసే బీడులోనెే ఎందుకు పెట్టిండ్రు? వీటిగురించి క్షుణ్ణంగా నాకు చెప్పవా?” అని ఆసక్తిగా అడిగిండు శేవ్య నాయక్. అందుకు సమాధానం చెప్తూ “దీని గురించి ‘కేశ్యా భాట్’ ను అడిగితే చాలా బాగా చెప్పేవాడు. కాని ఆయన చనిపోయిండు. ఆయన కొడుకు ‘భీక్యా భాట్’ ఉన్నడు కాని ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడతన్ని అడిగినా ఏమి చెప్పలేడు. కానీ నాకు తెలిసిన కాడికి చెప్తా.

“విను, ‘సీత్లా’ అంటే దేవత. ఈ పండుగ మన పూర్వీకుల నుండి వస్తున్నది. ఆమెను సీత్లాభవాని అని అంటారు. వీరు ఏడుగురు అక్కాచెల్లెళ్ళు. సీత్లా, హింగ్లా, తుల్జా, మేరామ(దండి), కంకాళి,మత్రాల్, ధ్వాళాంగర్.

ఈ ఏడుభవానీలకు ప్రతిరూపంగా ఏడురాళ్ళను నిలబెడతరు. వీటికి ఎదురుగా రక్షణగా ‘లూంకడియా’ను నిలబెడతరు. ఈ ‘లూంకడియా’ ఆ భవానీలకు సోదరుడు.

దాని ముందు చిన్న గుండ్రటి గుండంలాంటి గుంత ఉంటుంది. ఇదీ దేవుని గుడిముందు ఉండే నీటి కొలనుకు ప్రతీక. ఇగ ఈ ఏడుగురు దేవతలు మన చేను-చెల్కల్లో తిరుగుతూ ఉంటారని, మన పూర్వీకుల నుండి నమ్ముతున్నరు. ఆ దేవతల వల్లనే పంటలు మంచిగా పండుతాయని, పశువులకు గాలి-ధూళి, రోగాలు..రావని, పిల్లలకు అమ్మతల్లి రాకుండ కాపాడుతుందని, ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే రోగాల బారినుండి కాపాడుతుందని మనవాళ్ళు, మన పూర్వీకుల నుండి నమ్ముతూ వస్తున్నరు. కాబట్టీ ప్రతి సంవత్సరం జూన్ నెలలో, ఏదో ఒక్క వారంలో మంగళవారం రోజున సీత్లా పాఁడ్గ(పండుగ) చేసుకోవటం మన ఆనవాయితీగా వస్తున్నది.” అని సవివరంగా వివరించిండు సేట్రాం నాయక్
                                       

                                                                     1

చూస్తుండగానే రోజులు గడిసిపోతున్నయి. చుట్టుపక్కల తండాల వారందరు సీత్లాపండుగ చేసుకుంటున్నరు. శేవ్య నాయక్ తండావాళ్ళు సీత్లా పండుగకు చుట్టాలింటికి పోయి వస్తున్నరు. వాళ్ళు వచ్చేదారిలో శేవ్య నాయక్ పశువులను మేపుతున్నడు. ‘ఏ కాకా కత్త జాన్ ఆరే చోఁ?’ (‘ఓ చిన్నాయిన యాడికి పోయి వస్తున్నరు?’)అని అడిగిండు శేవ్య. ” సీత్లా పాఁడ్గార్ మార్ సస్రేర్ ఘర్ జాన్ ఆరే చాఁ.”( సీత్లా పండుగకు మా అత్తగారింటికి పోయి వస్తున్నం.) అని సమాధానం చెప్పిండు ‘సీత్యా నాయక్’. ‘ ధేరాచోపణన్ ఆపణ్ సీత్లా కన్నా కర్రే చాఁ?'( సరేగాని మన సీత్లాపండుగ ఎప్పుడు చేస్తున్నం?)అని ఆసక్తిగా అడిగిండు శేవ్య నాయక్.

“ఆజ్ సాఁజెేర్ టాఁడేర్ నాయెకేతి వాతేకరన్ మాలం కరాఁ చఁ”(ఈ రోజు సాయంత్రం తండా నాయకునితో మాట్లాడి చెప్తాం.) అని ఇంటికిపోతు, సమాధానం చెప్పిండు సీత్యా నాయక్.

తండాచుట్టు తాటివనం ఉంది. ఆ తాటివనం ఆకాశాన్ని తాకినట్టుగా ఉంటుంది. ఆ తాటిచెట్లల్లో ‘పండుతాడు’ విశేషమయినది. పండుతాటి కల్లు మస్తుగైతుంది. సమయం 2:30 గ.నిలు అవుతుంది. గౌండ్లోల్లు తాళ్ళకు వచ్చే యాలైంది. కొందరు నడిసి వస్తున్నరు. ఎక్కువ మంది సైకిళ్ళ మీద వస్తున్నరు. ఒక్కలిద్దరు సైకిల్ మోటర్ల మీద వస్తున్నరు.

కల్లు వాడికదార్లు, కల్లు తాగేవాళ్ళు, చేతుల్లో సీసాలతో ఒక్కోక్కరుగా మర్రిచెట్టు కింది మండువ కాడికి చేరుకుంటున్నరు. మర్రిచెట్టు విశాలంగా ఉంది. దాని ఊడలు కిందిదాక వేలాడుతున్నయి. కల్లువాడికదార్లు అందరు ఒక పక్కకు అర్దచంద్రాకారంలో కూసున్నరు. ఇంకో పక్కకు ఊరోళ్ళు కూసున్నరు.

తండానాయకుడు కాస్తంత ఆలస్యంగా వస్తున్నడు. దగ్గరికి రాగానే ‘రాంరాం నాయక్.’ అని పలకరించిండు ఖీమ్యా నాయక్. అందుకు తండానాయకుడు కూడా ‘రాం రాం’ అన్నడు. ఆయన మధ్యల కూర్చునేందుకు వీలుగా కూసున్నోళ్ళంతా సర్దుకున్నరు.

చింతనిప్పు అనే పేరుపొందిన తాడును అప్పుడే దిగి, ఒక చేత్తో కల్లుకుండ ఉగ్గం, మరో చేత్తో భుజానున్న మోకును కదలకుండా పట్టుకోని కల్లుమండువ కాడికి చకచక నడిసి వస్తున్నడు ఎల్లగౌడు. వస్తూవస్తూ కొన్ని మోదుగాకులు తెంపుకోని బొడ్లో పెట్టుకున్నడు. కల్లు కూడ నిప్పు మంటలాగనే బుసబుస పొంగుతుంది. ఎట్టకేలకు మండువ కాడికి వచ్చిండు ఎల్లగౌడు.

“రాతేన పాణివారూజ్ పడోతో వో పాణితి ఈ సీంధి కూఁ ఛకో కాఁయిఁ కో!?”
(రాత్రి వాన గట్టిగానే కొట్టింది. ఆ వానకి ఈ కల్లు ఎట్లున్నదో ఏమో!?) అని తండా వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుకుంటున్నరు.

‘పట్టు-పట్టూ ఆకు పట్టూ’ అని అటుచివర కూసున్న ఖీమ్యా నాయక్ తో అన్నడు ఎల్లగౌడు. “కాదు కాదు ముందుగా మా తండానాయకునికి వంచు.” అని తండానాయకుని వైపు చూపిస్తూ అన్నడు ఖీమ్యా నాయక్. “అరే నాయకుడు వచ్చిండా సరే సరే” అనుకుంటూ, తండా నాయకుని దగ్గరికి వచ్చి, కల్లు వంపిండు ఎల్లగౌడు. ఆ తర్వాత ఖీమ్యా నాయకునికి వంపిండు. ఖీమ్యా నాయక్ దమ్ము పడితే బుడ్లోకల్లు వడిసేదాక ఊఁ అనడు-ఆఁ అనడు. ‘తనెప్పుడు ఊఁ అంటడా అని గౌడు ఎదురు చూస్తున్నడు. ఆఁ.. ఎట్టకేలకు తల ఊపిండు ఖీమ్యా నాయక్. వంగి కల్లువంచుతున్న ఎల్లగౌడు, పైకి లేసి ఊపిరి పీల్చుకున్నడు. మర్రి ఆకుతో మూతి తూడ్చుకుంటూ “ఎట్లుంటదో అనుకున్న కానీ చెవులకెల్లి పొగలెల్లుతున్నయి. కల్లు మస్తుగున్నది .” అని అన్నడు ఖీమ్యా నాయక్.

“యేహే! గా వాన చినుకులకు ఏమైతది. అదీ ఏం తాటి చెట్టు అనుకుంటున్నవు!? నిప్పూ! చింతనిప్పూ!! ఆ చెట్టుకల్లు తాగితే కిందా చింతపండు కావల్సిందే.” అన్నడు ఎల్లగౌడు అదేఊపులో.

“కాఁయిఁ నాయక్? జన్ జగత్ సే సీత్లా కర్లిదే, పణీన్ ఆపణ్ అజి కన్నా కరియాఁ?’ ( ఏం నాయకుడా, మరీ అందరు సీత్లా పండుగ చేసుకున్నరు మరి మనమెప్పుడు చేసుకుందాం?)అని ప్రస్తావించిండు సీత్యా నాయక్. “హఁ మనంకూడా చేసుకుందాం.” అన్నడు తండానాయకుడు. ఈ మంగళవారం తప్పితే, తర్వాత పని తీరదు. కాబట్టీ ఇపుడొచ్చెే మంగళవారం నాడు సీత్లపండుగ చేసుకుందాం, అని నిర్ణయించుకున్నరు. మండువ కాడున్న డప్డియాను పిలిచిండు తండానాయకుడు. “రేపు పొద్దుగాల డప్పు సాటింపుగా, వచ్చే మంగళవారం సీత్లాపండుగ చేసుకోబోతున్నం కాబట్టి అందరు సిద్ధంగుండాలని చెప్పు.” అని డప్డియాను ఆదేశించిండు.

తెల్లారి పొద్దుగాలే ఆ విధంగానే డప్పు సాటింపు చేసిండు డప్డియా. తండా అంతా పండుగ వాతావరణం అయింది. తండానాయకునితో ఐదుగురు కలిసి యాటపోతులను కొనెేందుకు, గొల్ల మల్లయ్య ఇంటికి పోయిండ్రు.15వేలకు జత యాటపోతులను బేరం చేసిండ్రు.

“మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మా మావాళ్ళు వచ్చి పోతులను తీసుకెళుతరు. అప్పటి వరకు వీటిని నీ గొర్లమందలోనే ఉండని.” అని గొల్ల మల్లయ్యతో అన్నడు, తండానాయకుడు.
తండావాళ్లంతా తమతమ ఆదాయాల్నీ బట్టి, అవసరమున్నంత పండుగ సామాన్లు కొంటున్నరు. అందరు మూడురోజుల ముందే చుట్టాలకు కబురు పంపిండ్రు.

                                                                                 2

ముఖ్యంగా ఆడవాళ్ళు తమతమ ఇండ్లను సర్దుకుంటున్నరు.
‘సీత్కీ’ సీత్లాభవాని వరాన పుట్టింది. అందుకే ఆమె పేరు ‘సీత్కీ’ అని పెట్టిండ్రు. అందుకే ‘సీత్కీ’ కీ సీత్లాపండుగ అంటే ఎక్కడలేని సంతోషం. అందరికంటే అందంగా తయరైతది.

‘సీత్కీ’ పండుగకు వేసుకునే బట్టలు సందూకు(పెట్టె) నుండి బయటికి తీసింది. ‘ఫూల్యా గాల(బోనపుకుదురు, సుట్ట బట్టా), గొణ్ణొ(బోనం మీద కప్పే వస్త్రం), ఖాఁసెర్ థాళి(కంచుపళ్ళెం)..’ కూడా బయటికి తీసింది. వాటిని వెేరు వెేరుగా సర్ఫులో నానబెట్టింది. అవి నానేంతసేపు ఇల్లు దులిపింది. తర్వాత వాటిని ఉతికి ఆరేసింది.

తెల్లారి మంగళవారం సీత్లాపండుగ సందర్భంగా, ‘సీత్కీ’ సీత్లాబోనం వండింది. బోనంలో బెల్లంతో చేసిన పాయసం, ఏడురకాల దినుసులు కలిపి ఉడికించిన గుడాలు(గగ్గీలు). కొద్దిగా పలావ్ అన్నం.ఇవన్నీ కొద్దికొద్దిగా వెడల్పాటి కంచుపళ్ళెంలో వేసుకుంది. దాని మీద గొణ్ణొ కప్పింది. ఈ విధంగానే తండాలోని ఆడవాళ్ళు అందరు తమతమ బోనాలను కూడా సిద్ధం చేసుకున్నరు.

                                                                          3

‌‌‌
సమయం 12 గంటలయ్యింది. తండానాయకుడు ఓ ఇద్దరు కుర్రోళ్ళని గొల్ల మల్లయ్య గొర్లమంద కాడికి పంపిండు. రెండు గొర్రెపోతుల్ని తోలుకొని రమ్మన్నడు.

పూజసామాన్లు తెమ్మని ఒకడిని పిలిచి వందరూయలు చేతిలో పెట్టీ ‘పదిరూపాయల ఆముదం నూనె, పదిరూపాయల ప్రమిదలు, ఐదు రూపాయల వత్తులు, ఒక అగ్గిపెట్టె, పదిరూపాయల గెరు(జాజు,సిందూరం)..’ తెమ్మని ఊర్లోకి పంపిండు.

తండానాయకుడు తన అనుచరులను వెంటబెట్టుకొని సీత్లా కాడికి పోయిండు. సీత్లా చుట్టుప్రక్కల శుభ్రం చేసి, సీత్లా ముందు చాపంత వెడల్పు గడ్డి చెక్కించిండు. దాని మీద నీళ్ళు చల్లించిండు. సీత్లాభవానికి ప్రతిరూపంగా నిలబెట్టిన రాళ్ళను భక్తి శ్రద్దలతో కడిగించిండు. ఎదురుగా ఉన్న లూంకడియాను కడిగించిండు. లూంకడియా ముందు చిన్న గుండ్రటి గుంత తవ్విం‌చిండు. ఆ గుంతలో నీళ్ళు పోయించిండు.

నీళ్ళు చల్లిన చాపంత ప్రదేశం కొద్దిగ ఆరినంక పేడతో అలికించిండు. ఇంతలో పూజా సామాగ్రికి పోయినతను సామాగ్రితో వచ్చిండు. చిన్న బక్కెట్లో తగినన్నీ నీళ్ళు పోసి. ఆ నీటిలో గెరు(జాజు)ముక్కలు
వేసిండు. కాసేపటి తర్వాత దాన్ని కలిపిండు. దాన్ని తండానాయకుడు తన చేతుల్లో పట్టుకొని భక్తి శ్రద్దలతో సీత్లాభవానికి ప్రతిరూపమైన రాళ్ళమీద పూసిండు. మిగిలినది బక్కిట్లోనే ఉంచిండు. అలికిన చోట జొన్న పిండితో స్వస్తిక్ ముగ్గేసిండు. దాని మధ్యలో మట్టి దీపం పెట్టి, దాంట్లో ఆముదపు నూనె పోసి, ఆతర్వాత నూనెల వత్తి పెట్టిండు. వత్తి ఒకకొస ఇంచుమందం బయటికి ఉంచిండు.

4 ‌

సమయం 2:30 గం.నిలు అయ్యింది. తొందరగా బోనాలెత్తుకోని రావాలని తండావాసులకు కబురు పంపిండు నాయకుడు.

‘సీత్కీ’ సీత్లాపండుగకై సంప్రదాయ బట్టల్ని కట్టుకున్నది. బోనం పైన గొణ్ణొ(బోనం పైన కప్పే ప్రత్యేక వస్త్రం) కప్పింది. ఫూల్యా గాల( బోనానికి కుదురైన చుట్టబట్ట) నెత్తిన పెట్టుకుంది. దాని మీద బోనం ఎత్తుకుంది. తనతో నలుగురిని కలుపుకుంది. ఇంటి నుండి గానం చేసుకుంటూ సీత్లాకి పోయే బాటమీదికి వచ్చింది. ఆమెను చూసి తండా మహిళలు ఒక్కొక్కరుగా బోనాలతో సీత్లావైపుకు బయలుదేరేరు. అందరు వచ్చి ఒక చోట గుమ్మిగూడిండ్రు. అక్కడి నుండి అందరు భక్తీ శ్రద్దలతో సీత్లాభవానికి గానంచేస్తూ, పద్దతిగా పయనమైండ్రు.

తండా కు అరకిలో మీటర్ దూరంలో పశువులు మేసే బీడుభూమిలో మోదుగుచెట్టు మొదట్లో సీత్లా కొలువై ఉన్నది. అక్కడికీ తండాలోని లంబాడీ యువతులంతా బోనాలెత్తుకోని, ఒక క్రమంలో లయబద్దంగా సీత్లా పాటలు పాడుతూ నడిచొస్తున్నరు. వాళ్ళు అలా నడిచి వస్తూంటే, నేల మీద సింగిడి పొడిసినట్లు ఉన్నది.
అందరు సీత్లాకాడికి చేరుకున్నరు. తమతమ బోనాలు దించి సీత్లాపక్కన పెట్టిండ్రు. ఆడవాళ్ళందరు ఆట-పాటల్లోమునిగిపోయారు. చిన్నా- పెద్దా, ఆడా-మగా అందరూ సీత్లాకాడికి చేరుకున్నరు. పట్నాల్లో చదువుతున్న స్కూలు పిల్లలు మరియు కాలేజి యువతీ-యువకులు కూడా వచ్చిండ్రు.

5 ‌

తర్వాత తండానాయకుడు నాలుగు ఇస్తరాకులు పరిసిండు. దాని మీద బోనాల నుండి కొన్ని గుడాలు (గుగ్గిల్లు), కొంత పాయసం, కొద్దిగా పలావ్.. పెట్ఠిండు. అగ్గిపుల్ల గీసి దీపం ముట్టించిండు. గొర్రెపోతుల జతను సీత్లాముందుకు తెమ్మన్నడు. సీత్లాముందు పెట్టిన నీళ్ళచెంబు తీసుకున్నడు. గొర్రెపోతుల తలపై కొద్దిగ నీళ్ళ చల్లిండు. కొంత నోట్లో పోసిండు. ఆపై ముందటి కాల్లమీద పోసిండు. తర్వాత గొర్రెపోతులకు పసుపుకుంకుమ బొట్లు పెట్టిండు. తండానాయకుడు ఒక పోతును పట్టుకున్నడు. ఇంకో దాన్ని పక్కన నిలబడిన వ్యక్తి పట్టుకున్నడు. సీత్లాముందు వరసగా చాలా మంది భక్తి శ్రద్దలతో నిలబడ్డరు. గొర్రెపోతులు ధడ్ధడీ(జల్తా) చేసుకోవాలని, సీత్లాభవానిని వినయంగా మొక్కుతున్నరు. ఎంతకు గొర్రెపోతులు ధడ్ధడీ చేస్కోవటంలేదు.

తండానాయకుడు తన చేతికున్నా వెండికడెం తీసి సీత్లాభవాని ముందు పెట్టి, ధడ్ధడి చేసుకోవాలని మొక్కిండు. గొర్రెపోతులు వెంటనే ధడ్ధడి చేసుకున్నయి. ఆ వెంటనే గొర్రెపోతులను కోసిండ్రు. తలకాయలు సీత్లా ముందు పెట్టిండ్రు. తర్వాత గొర్రెపోతుల మోకాళ్ళ కాడికి వేరుచేసి ఒక కాలును కోసిన పోతు తల నోట్లో అడ్డంగా పెట్టిండ్రు. కోసిన పోతులను తలకిందులుగా వేలాడదీసీ ఇద్దరు వ్యక్తులు, వాటి తోలు తీయ్యడం మొదలు పెట్టిండ్రు. వాళ్ళు తోలుతీయ్యడంలో నైపుణ్యం గలవారు. ఆ తోళ్ళను పక్కకు తీసుకపోయి ఉప్పురాసిండు ఊమ్ల నాయక్. తోలు తీసి పోగులు పెట్టి, పొట్ట-పేగులు సీత్లాభవాని ముందు తాటి కమ్మలమీద ఉంచిండ్రు. పేగులను సీత్లాభవానికి ఎదురుగా ఉన్న లూంకడియా నుండి భవాని ముందువరకు రెండు వరసల్లో చుట్టిండ్రు.

భవాని ముందున్న నైవేద్యంతోపాటు కొద్దిగా గొర్రెపోతుల రక్తాన్ని, ఒక గిన్నెలో సగానికి
కలుపుకొని సిద్ధంగా పెట్టుకున్నడు తండానాయకుడు.ఇప్పుడు గొడ్ల, గొర్ల మరియు మేకల మందలను తోల్కోని రమ్మన్నడు. ముందుగా గొడ్ల కాపర్లు తమతమ పశువులను వరసక్రమంలో సీత్లాభవాని ముందునుండి, లూంకడియాకు చుట్టిన గొర్రెపోతుల పేగుల పైనుండి దాటిస్తున్నరు. తండానాయకుడు సీత్లాభవాని ముందు నిలబడి, ఆ కలిపిన మిశ్రమాన్ని పశువులమీద వెదజల్లిండు.

తండావాసులందరు తమతమ మొక్కులు చెల్లించుకుంటున్నరు. వారు తెచ్చిన కోళ్ళను కోసి వాళ్ళ పశుసంపద మీదికి విసురుతున్నరు. ముందుగా పశువుల మంద దాటింది. తర్వాత గొర్ల మంద, దాని తర్వాత మేకల మంద.. అన్ని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి దాటించిండ్రు.

గత సంవత్సరపు మొక్కులు చెల్లించిండ్రు. వచ్చే సంవత్సరానికి కావలసిన కోరికలు తీర్చమని, తల్లీ సీత్లాభవానికి వేడుకుంటున్నరు. యువతీ- యువకులు తమ పెళ్ళిళ్ళు కోరుకున్న వారితో జరగాలని కోరుకున్నరు. వ్యవసాయం చేసేవాళ్ళు తమ పంట-పైరులో బరకత్ ఇయ్యమని కోరుకున్నరు. జబ్బులు రాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నరు. విద్యార్థులు చదువులో రాణించాలని కోరుకున్నరు. మొక్కులైనంక ఒక్కొక్కరుగా ఇంటిదారి పడుతుండ్రు.కాని ఇంటికోమనిషి మాత్రం అక్కడ మిగిలారు.
గొర్రెపోతుల మాంసం పోగులు పెడుతున్నరు. ఇంతలోనే, తండా మంగలాయన వచ్చిండు. కొద్దిసేపటికే కమ్మరాయన. ఆవెనకాల్నే, కుమ్మరాయన. తర్వాత కాసేపటికి వడ్లాయన. ఆ దారెంటనే వెళ్ళుతున్న పెద్దగౌడు కూడా వచ్చిండు. కుండనిండా కల్లు తెచ్చిండు. కొద్దిసేపటి తర్వాత మాదిగాయన వచ్చిండు.
వచ్చిన ఊరి వృత్తిదారులందరికి కొంత మాంసం పంచి పెట్టిండు తండానాయకుడు.

వాళ్ళు సంతోషంగా తీసుకొని ఇంటికి బయలెల్లిండ్రు. కాని మంగలాయన మాత్రం మొరాయించిండు. “నాయకుడా, గింతంతా కూర పెడితే! ఏంజెస్కోవాలె దీన్ని!” అన్నడు మంగలాయన. ” అందరేంజేస్కుంటరో, అదే జేస్కో. కూరొండుకో.”అన్నడు తండానాయకుడు. “దీన్ని కూరొండుతే ఎవ్వరి ముక్కులో పెట్టాలె నాయకుడా?” అని పరాష్కమాడిండు మంగలాయన. “ఔను మరి సరిపడేంత గావాలంటే యాడదేవాలే? తండా మంగలాయనవని అందరితో పాటుగా నీకు కూడ కొంత మాంసం ఇచ్చినం. దానికి సంతోషపడాలే గాని,ఈ గునుగుడేంది యాకయ్య? కావాలంటే నువ్వు ఈరోజు ఇక్కణ్ణేవుండూ, అన్నం తిను, సారా తాగు, మా తండాలోనే పడుకో, వద్దంటామా?” అన్నడు తండానాయకుడు.

“నేనీడ పడకుంటే ఈ కూర మా ఇంటికి ఎవరు తీసుకొపోతరు? ఇంకేమడగనులే గాని ఓ రొండుతున్కలు ఎయ్” అని అడిగిండు మంగలాయన. “రొండుగాదు, ఇగొ నాల్గుతున్కలు ఏస్తున్న ఇగ సంతోషంగా బో!” అన్నడు తండానాయకుడు. మంగలాయన సంతోషంగా పోయిండు.

చివరికి తండావాసులు ఎవరి పోగులు వాళ్ళు ఎత్తుకున్నరు. తమ వంతుగా వచ్చిన సళోయిని(బంజారాల విశేష వంటకం)చిన్నగిన్నేలో పెట్టుకున్నరు. సీత్లాభవాని ముందు ఉడికించి పెట్టిన ఏడు నల్లిబొక్కలు, కొంత సళోయి ఉన్నది. ఇప్పుడు సీత్లాభవానికి విన్తి(వినతి) చేసిండ్రు. తర్వాత మిగిలిన సళోయిని తలారెండు ముక్కలు తండానాయకుడు పంచిండు. నల్లిబొక్కలను తండాపెద్దమనుషులు తలా ఒక్కటి పంచుకొని తిన్నరు. ఆ తర్వాత అన్ని సర్దుకొని ఇంటిబాట పట్టిండ్రు. ఆ విధంగా సీత్లాపండుగ బంజారాలదే కాకుండా, తండామీద ఆధారపడే వారందరి పండుగయ్యింది. ఈ విధంగా సీత్లా ప్రకృతి పుత్రులకు వరమైంది. బహుజనులకు కూడా పండుగ అయ్యింది.

— డా.బోంద్యాలు బానోత్(భరత్)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments