అరణ్యం 15 -” సరిహద్దు రేఖ “- దేవనపల్లి వీణావాణి

తెల తెలవారుతుంది.. డిసెంబెర్ నెలలో కదిలే బరువైన ఉదయపు గాలి కుదురుకుని మంచు ముత్యమై గడ్డిపరకను అలంకరించే వేళ మా బృందం అంతా కళ్ళమీద కమ్ముకొస్తున్న నిద్రని అంతే బరువుగా ఆపుకుంటూ తగులుతున్న చలిగాలికి చేతులు ముడుచుకుంటూ కూర్చున్నాం. గడ్డిపరక ఒక నీటి బిందువును తప్ప మరి ఇంకా దీన్ని మోసిన దాఖలాలు నేను చూడలేదు. చిన్న గాలి తరగకే ఒరిగిపోయే గడ్డిపరక బుద్దిమంతుడైన విద్యార్థి కుదురుగా కూర్చున్నట్టు ఉన్న చోటనే ఉంది. గడ్డిపరక దేన్నీ మోయలేదు కానీ సాంద్రమవుతున్న శీతలవాయు వీచికకు తాను ఒక ఆధారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కనుక నీటి బిందువును తన వయనం మీద ఆపుకోవటానికి ఒదుపుగా వంగుతుంది. అలాగే నీటి బిందువులు కూడా ఏమాత్రం ఆధారం లేనటువంటి నిట్టనిలువుగా ఉండే గడ్డి పరక కింద భాగాన వరుస కట్టిన గాజుముత్యాలై శోభిస్తుంటాయి. తనకు తానుగా యే రూపమంటూలేని నీరు ఒద్దికగా ఎవరో అద్ది పోయినట్టు లేలేత గడ్డి పరకల మీద అలంకరించబడుతుంది. మీరు గమనించారా గడ్డి పరక వయనం అడ్డంగా ఉండదు ఆకు లాంటిది కాదు, ఆకు మీద నీటి బిందువును వేసినప్పుడు అరచేతి లాగా ఉన్నటువంటి ఆకు మీద నీటి బిందువు ఉండడం గొప్ప కాదు కానీ నిట్టనిలువుగా ఉండేటువంటి గడ్డ మీద ఒక నీటి బిందువు నిలబడడం ఉదయ కిరణాల తాకిడికి నేల మీది నక్షత్రాల వలె మెరుస్తుండడం గొప్ప.

అక్కడ ఉన్న నేలమీద గడ్డి పరకలు అత్తిపత్తి మొక్కలూ కలగలసి ఉన్నాయి. అత్తిపత్తి చెట్టు పొదలాగా వచ్చిన చోట కొంచం చిక్కగా అల్లుకుపోయిన కొమ్మలు వాటి మధ్య చిన్న చిన్నని గులాబీ బంతులవంటి వాటి పువ్వులు ..చుట్టుపక్కల మరికొన్ని గడ్డి పువ్వులు వాటి మీదకు వచ్చిపోతున్న సీతాకోకలు.అత్తిపత్తి పెద్దగా సీతాకోకలను ఆకర్షించదు..కానీ అన్నీ కలిసిన ఆ చిన్న చిన్న పొదల మీదుగా ఎగురుతూ కూర్చుంటూ లేస్తూ తీరిక లేకుండా ఉన్నాయి.సీతాకోకల ప్రయాణం లే ఎండలో శోభాయమానమైన దృశ్యం. సీతాకోకలు ఒక పూవు మీద నుంచి మరో పూవుకి ఎగిరి తన పొడవైన మడతకాళ్ళను విచ్చుకుంటున్న పూరేకుల మీద ఆన్చి ప్రత్యుత్పత్తికి సహాయపడతాయి. మీరు గమనించినట్లయితే తెల్లని పుష్పాలు దాదాపుగా సువాసన కలిగినవై ఉంటాయి ఇంకా వాటి సువాసన ద్వారా ఇతర కీటకాలను పరాగ సంపర్కం కొరకు ఆకర్షిస్తుంటాయి.

సాధారణంగా ఇవి రాత్రి పూట వికసించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే రాత్రి కీటకాలు చూడలేవు అని చెట్లకు తెలుసు కనుక అవి తమ శక్తిని రంగురంగుల ఆకర్షణ పత్రాలు కాకుండా ఆ శక్తిని సువాసన భరితమైన సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేయడం కోసం ఉపయోగించుకుంటాయి. రంగురంగుల పుష్పాలు కలిగినటువంటి మొక్కలు వాటి ఆకర్షనీయమైన రంగుల ద్వారా పక్షులను కీటకాలను ఆకర్షిస్తాయి. రంగురంగుల పుష్పాలకు సువాసనలు తక్కువ లేక వాటికి వాసన అవసరం లేదు. అవి సూర్యుని యొక్క శక్తి వికరణాలని ఉపయోగించుకొని రంగురంగులుగా ఆకర్షక పత్రాలను రూపొందించుకుంటాయి. ఏది ఏమైనా అవి మధురమైన రూపంలో వాటి దగ్గర ఒక బహుమతిని సిద్దం చేస్తాయి..పక్షులు , కీటకాలు , సీతాకోకలు చేసే మేలుకి బదులుగా మొక్కలు వాటికోసం తీయటి స్రవిస్తున్న మకరందాన్ని దాచి పెడతాయి. మొక్క ఇచ్చే మకరందపు బహుమతి పొందడం కోసం సీతాకోకలు అటూ ఇటూ తిరుగుతూ తమ ఇంద్రధనువు చాపాలను విస్తరిస్తూ , ముకులిస్తూ ఆకుపచ్చ పొదలను అందంగా అలంకరిస్తున్నాయి.

ఈ రోజు కూడా యథావిధి పనులలో భాగంగా బయట ఉన్నాం. నిన్న రాత్రి బయలుదేరాం కనుక ఈ ఉదయం ఆదివారపు ఉదయం. సమీపంలో పెద్ద పెద్ద చెట్లేమీ లేవు. ఉన్న చెట్లు నీడ వచ్చేంత పెద్దవికాదు, వాటికి నీడ నిచ్చే పెద్ద శాఖలు రావు. ఈ రోజు కూడా మాకు ఎప్పటిమాదిరే, కాకపోతే ఈ శీతల వీచికల మధ్య వర్ణ శోభితమైన ఉదయపు ఆకర్షణల మధ్య ప్రాపంచిక దుఃఖం తేలికైపోతున్న భావన మాత్రం కొత్తది. ఈ రోజు డిసెంబర్ 8, మానవ జీవితంలో ఎదురుపడే దుఃఖానికి మూలాలను అన్వేషించి జ్ఞాన బోధ చేసిన బుద్దుని “బోధి దినోత్సవం”. అంటే సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్దుడుగా మారిన బోధి సత్వుడి దినోత్సవం. ప్రపంచ బౌద్దులంతా బోధి దినోత్సవంగా జరుపుకునే రోజు. తన జ్ఞానోదయానికి సాక్ష్యం అడిగిన అసుర మారునికి భూమి ముద్ర తో సాక్ష్యాత్తూ భూమి చేతనే సాక్ష్యం ఇప్పించిన రోజు. తన జీవితాన్ని ప్రపంచ దుఃఖాద్యాన్ని కనుగొనడం కోసం ధారపోసిన బుద్ధుడు తన లక్ష్యాన్ని చేరుకున్న మహోన్నతమైన రోజు . అది ఎంత గొప్ప క్షణం అయ్యి ఉండవచ్చునొకదా! శతాబ్దాల అనంతరం నేనీ క్షణం ఆనాటి బుద్ధుడి అంతరంగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.

ఇంత విశాల జగత్తు నిండా ప్రతీ జీవీ ప్రతీ నిర్జీవీ తనకు తానుగా వ్యక్తపరుచుకున్న సౌందర్యాన్ని బుద్దుడు ఎందుకు చూడలేకపోయాడు… మానవ జన్మ దుఖ పూరితం అని నిరాశలో ఎందుకు కూరుకుపోయాడు… తన ఉద్యానవనంలో తిరిగినప్పుడు ఒక పత్రమే మొగ్గగా మారి పూవై , కాయయై , పండై రాలి పోవడంలో జీవం యొక్క పరిపూర్ణతను ఎందుకు చూడలేకపోయాడు… రాజ్య సంచారవేళ ఎదురైన వృద్దుడి వార్ధక్యాన్ని, శవాన్ని చూసి ఎందుకు ప్రకృతితో అన్వయించు కోలేకపోయాడు.. ఆయన అంతరంగాన్ని యే ప్రకృతి కదిలించలేక పోయిందా..అనేకానేక భౌతిక విస్తృతుల మధ్య సాగదీసుకున్న దినానికి వేలాడబడ్డ నాలాంటి సామాన్య వ్యక్తికి బుద్దుడు ప్రవచించిన జ్ఞానబోధ ఒంటబట్టడం అంత సులభం కాదు కాకపోతే నా ముందు ఎదురుపడే చిన్న చిన్న ప్రాకృతిక విన్యాసాలలోనే నేను దుఃఖాతీత క్షణాలను కనుగొంటాను, అది బహు సులభమైనదిగా నాకు తోస్తుంది. సాటి జీవం పట్ల కరుణ ,ప్రేమ , సహృదయాన్ని నిరపేక్షంగా ప్రకటించుకోలేని సంకుచిత సంక్షుభితఃమైన జనారణ్యంలో బతికే మనకు ఎదురుపడే ప్రకృతికాక దుఖానికి విరుగుడు ఏమున్నది!

కొందరు పునర్జన్మ ఉందంటారు ..కొందరు లేదంటారు. బుద్దుడు జన్మల పరంపర ఉంటుదని ప్రతీ జన్మలోనూ తత్వం ఎరిగిన ఆత్మ చివరికి నిర్యాణం చెందుతుంది అంటాడు..అన్నీ సార్లు మానవ జన్మే ఎందుకు వస్తుందో చెప్పలేదు..మరోవైపు కర్మసిద్దాంతం దేనిని చేసావో దానిని అనుభవిస్తావు అంటుంది, అందుకు మళ్ళీ మళ్ళీ జన్మించావాల్సి వస్తుంది అంటుంది. వేటూరి గారైతే ఒకేఒక వాక్యంలో కర్మ బంధపు పర్యవసానాన్ని ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు అని రాసి తేలికగా అర్థం చేయించారు. కాకపోతే యుగములు దాటిన నా ప్రయాణం ఎటువంటిదో నాకు తెలియదు. నేనిప్పుడు నా ముందు ఎగురుతున్న సీతాకోకను చూస్తున్నాను.ఎంత సౌందర్యం అది , ఎంతటి సౌకుమార్యం! మరి ఎంత అల్పమైన జీవితమైతే అంత సులభంగా జన్మల పరంపర దాటావచ్చునా ,అంతటి అల్పమైన జీవితంతో ఎంతటి ప్రాకృతిక పరోపకారం! అలా నేనెప్పటికీ జన్మనెత్తలేనా లేక ఇదివరకే ఎత్తి ఉన్నానా ..!? ప్రతీ జన్మ వారి కర్మలతో లభిస్తుంది అనుకున్నట్లయితే యే కర్మ చేస్తే నేనీ జన్మ నెత్తగలను ? నాకు ఈ క్షణం నీడ నిస్తున్న చెట్టు ఒక్కప్పుడు ..అంటే ఒకానొక జన్మలో నా తల్లే అయిఉంటుందా . లేదా ఒక వేళ నాకు తన దీర్ఘ శాఖలను చామరం చేసిన చెట్టుది కర్మేనా .. నేను పొందుతున్న హాయికి తగిన కర్మను నేను ఇదివరకే చేసి ఉన్ననా , లేదా కొత్త కర్మకు ఇది ప్రారంభమా.. నాకు చెప్పండి యే కర్మ చేయడం వళ్ళ నేను మళ్ళీ చెట్టునవుతాను, నా ముందు ఎగురుతున్న సీతాకోక చిలుకనవుతాను..? బాల క్రిష్ణుడు రోలుతో పడగొట్టిన రెండు మద్ది చెట్లు ఇద్దరు యక్షులుగా బయటపడ్డట్టూ నా పక్కనే ఉన్న ఈ మద్ది చెట్టూ ఎవరో ఒకరా.. ?! ప్రేమగా సాకుకుంటున్న నా కుండీలోని మొక్కలన్నీ నా పిల్లలేనా ,, అవి నాకు మళ్ళీ జన్మలో తల్లి అవుతాయా …అలా అయితే నేనెప్పటికీ ఈ జన్మల పరివృతావలయం నుంచి విడిపోలేనా..నేను మనిషిగానే ఎందుకు పుట్టాలి ..ఇది చెట్టుగానే ఎందుకు పుట్టాలి..

ఓహ్.. ఎక్కడ మొదలయింది నాలో ఆలోచన ఎక్కడ నేను ఉన్నాను..!

గడియారం తన పని తాను చేసుకుపోతుంది. రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. చరిత్ర కుప్పలాగా పేరుకుంటుంటే ప్రకృతివనరులు తగ్గుతూ వస్తున్నాయి. మారుతున్న జీవన విధానానికి, నవీన అవసరాలకు వేగంగా కుంచిన్చుకుపోతూనే ఉన్నయి.మానవునికి ప్రకృతికి మధ్య ఒక సరిహద్దు రేఖను నిర్మించుకున్న సాంస్కృతిక సరళి పెను మార్పులకు లోనయి ఉత్త వ్యవహారంగా మిగిలిపోతున్నది. అవసరానికి మించి దుర్వినియోగం చేయడంకూడదని చెప్పే ప్రయత్నంలో కర్మ సిద్ధాంతం పనికి వస్తుందని అనుకుంటాను. నవీన సమస్యలు సృష్టించిన దుఖ భారాలు తొలగించాలని అనుకుంటే బుద్ధుడి వంటి గురువుల బోధనలు ఒక్కటే సరిపోవేమో. నాలుగు గోడల మధ్య బంధించుకున్న మనల్ని దాటి మనం విశాలప్రకృతిలోకి తొంగిచూడడం ఒక తప్పని అవసరం అని గుర్తించడమే సరియైందేమో.

కానీ అప్పటికే నష్టపోతే , అదీ ఎప్పటికీ తిరిగిరానిదైతే .. ఇదే అనుమానం శాస్త్రవేత్తలకు కలిగింది. మానవుడు కలిగిస్తున్న ప్రాకృతిక విఘాతాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ఒక మధ్యే మార్గాన్ని సూచించారు.అదే సుస్థిర అభివృద్ధి అని. అంతే మన అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్తు కొరకు వనరులను సంరక్షిన్చుకోవడం అన్నమాట.మనం ఇప్పుడు ఎంతగా పొదుపుగా వనరుల్ని వినియోగిస్తే అంతగా భవిష్యత్తు తరాలు అంత భద్రంగా ఉంటాయన్నమాట.

అభివృద్దికి , సంరక్షణకు మధ్య సమన్వయాన్ని సాధించడం సులభమైన పనేమీ కాదు.తరచుగా ఇది ప్రభుత్వ నిర్ణయాలకు , ప్రజలకూ మధ్య పెద్ద అగాదంగా మారుతుంటుంది. మనం మన దేశంలో జరిగిన,జరుగుతున్న పర్యావరణ ఉద్యమాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. మరొకవైపు అటవీ శాఖ అనేక అభివుద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతుందన్న అపవాదు ఎలాగూ ఉండనే ఉన్నది. భారతదేశంలో అడవులు రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి అమాశం కనుక కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను సమగ్రంగా అమలు చేసే సందర్బంలో అనేక సార్లు ఈ మాట ప్రజలనుంచి వినపడుతుంది. కాకపోతే మనవ జాతి మనుగడను ప్రబావితం చేయగలిగే విశేషమైన సంధి సమయంలో ఉన్న మనకు ఒక శాఖనో కొద్ది వ్యక్తుల సమూహమో కాకుండా విశాల దృక్పథంతో ప్రజలంతా అవగాహనతో ఉంటె తప్ప ఇంత గొప్ప లక్ష్యాన్ని సాధించలేము.

ఎప్పుడో అధర్వణ వేదంలోనే భూసూక్తాన్ని ప్రవచించి భూమి యొక్క గొప్పదనాన్ని సూచించారు మన పూర్వులు. మరొక్క సారి అటువంటి దైవీ భావనను నిత్య జీవితంలో ప్రతిక్షేపించగలిగితే , సామాన్య మానవుని జీవనానికి అనుసంధానం చేయగలిగితే తప్ప అది సాధ్యం కాదు. ఇటువంటి ఆలోచనే 1986 లో ఇటలీలో జరిగిన The Assisi Declarations కు మూలం. హిందువులు, బౌద్ధులు , ముస్లింలు, క్రిస్తియన్లు, జుడాయిస్టులకు చెందిన ప్రభోధకులు పర్యావరణం పట్ల తమ తమ భావాలను(Faith Declarations on Nature ) ప్రకటించారు. శాస్త్రీయంగానూ , ఆధ్యాత్మికంగానూ జీవన విధానాన్ని తీర్చి దిద్దుకున్నపుడే భూ మండలాన్ని కాపాడుకోగలమని గుర్తించడం ఈ విషయాన్నీ చెప్పడంలో నా ఉద్దేశ్యం. అలా ఒక నిశ్చితమైన సరిహద్దును నిర్మించుకోవడంలోనే మన భవిష్యత్తు.

పొద్దెక్కడం , రోజు మేల్కొవటమూ రోజువారీ పరుగులు పెడుతున్న జనమూ మెల్లిమెల్లిగా కనబడుతున్నారు. మాకు ఏమీ పనిపడలేదు. యథావిధిగా వచ్చాము, ఇక ఈనాటికి పని ముగించుకొని తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. అందరం ఒక మాట అనుకొని వెళ్ళాలి. వెళ్లి లోకంతో కలిసిపోవాలి. అందుకొరకే నావైపుగా చూస్తున్న మా బృంద సభ్యులతో మాట్లాడాను. అందరం మేము ఉన్న చోటు నుంచి కదిలి వెళ్ళాము.మా వాహనం సిద్దంగానే ఉంది. బయలు దేరాం కూడా. రేపటికార్యక్రమం గురించి కాసేపు జీపులోనే కూర్చొని మాట్లాడుకుంటున్నాం. చల్లని గాలికి చీల్చుకుంటూ వెళ్తున్నాం. జీపు వేగానికి మరింత చల్లి గాలి మా ముఖాలను తాకుతున్నది. దారెమ్మట వానాకాలమ్ పూచినచెట్లకు గింజ పడుతున్నది. శీతాకాలం అడవి చెట్ల కన్నా ఉద్యానవనాల మొక్కలు ఎక్కువ పుష్పిస్తుంటాయి.అవీ ఇవీ మాట్లాడుకుంటూ ఇంటి దారిపట్టాము.

– దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments