జనపదం జానపదం- 11 – జానపద మానసిక సంబంధాలు నాడు – నేడు – భోజన్న


ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవికి మానసిక (అంతర), మరియు బాహ్య సంబంధాలు తప్పక ఉంటాయి. ఈ రెండు లేని జీవులు మనకు ఎక్కడ కనిపించవు. ప్రతి రెండు జీవుల మధ్యన మానసిక సంబంధమో, లేక బాహ్య సంబంధమో తప్పక ఉంటుంది. బాహ్య సంబంధాలకంటే మానసిన సంబంధాలే చాలా ఉత్తమమైనదని గ్రామీణులు అంటుంటారు.

నేటి సమాజంలో మానసిక సంబంధాలకంటే బాహ్య సంబంధాలే ఎక్కువగా కానిపిస్తున్నాయి. అవసర నిమిత్త స్నేహాలు, ప్రేమలు, కలుపుకోవడాలు, కలిసి జీవించడం మొదలైన అంశాలు జానపదుల్లోనూ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమాజంలో వస్తున్నా మార్పులను అతిత్వరగా జానపడులుసైతం జీర్ణ్హించుకుంటున్నారు.

మానవ విలువలకి, మానవ సంబంధాలకి, నైతిక విలువకి, సభ్యతకి, సంస్కారాలకి నిలయంగా వెలసిల్లిన గ్రామాలు నేడు పాత శోభని రోజు రోజుకి కోల్పోతున్నాయి. స్నేహం, ప్రేమే పరమావధిగా బ్రతికిన పల్లెలు నేడు అవినీతికి, అన్యాయాలకి, పగలు, ప్రతికారాలకి నిలయంగా మారిపోతున్నాయి. పట్టణాలలో అలసి,సొలసిన జీవితాలకి పల్లే ప్రాణంగా ఉండేది. కాని నేడు ఆ పల్లే ప్రాణాన్ని నిలుపుకోవడానికి నానా కష్టాలు పడుతుంది. కొత్తరకం రాజకీయాలు, కొత్తరకం యువతరం పోకడలు, పట్టణ నాగరికత అతిత్వరగా గ్రామాన్ని చేరడం వంటి అనేక అంశాలు గ్రామాల రూపు రేఖలనే మార్చివేస్తున్నాయి. వీటన్నింటి ప్రభావం గ్రామీణ ప్రజానీకంపై పడుతుంది. ఫలితంగా విచిత్ర మనస్తత్వం వారికి తెలియకుండానే రూపుదిద్దుకుంటుంది.

పూర్వకాలంలో జానపదుల మనస్తత్వం:

పూర్వం గ్రామాలలో ప్రజల దగ్గర ఆస్తి పాస్తులు తక్కువగా ఉన్న మనుష్యుల మధ్య ప్రేమానురాగాలుండేవి. పక్కవారితో కలిసిమెలసి జీవించే మనస్తత్వం వారిలో చివరివరకు ఉండేది. పూర్వకాలంలో చాయిపత్తి, నూనే బియ్యం మొదలైన అనేక వస్తువులను మరియు డబ్బులను చేబదులు / చేపాయిగా తీసుకొని తిరిగి ఇచ్చేవారు. ఇలా చేయడం వలన కూడా ఒకరిపై ఒకరికి గౌరవ మర్యాదలు ప్రేమలు ఏర్పడేవి. అంతేకాకుండా గ్రామంలో ఎవరి ఇంట్లో పండగలు చేసుకున్న, శుభకార్యాలు జరిగిన గ్రామంలోని వారందరు తమ ఇండ్లలోనే ఆ పండగలు జరిగినట్లు తమతమ శక్తిని అనుసరించి ధన సహాయం మరియు తమవంతు శ్రమను వారికందించి శుభకార్యాలను సఫలం చేసేవారు. ఆపద సమయంలో గ్రామాల్లో అందరు సహాయం అందించి ఆపదనుండి వారిని గట్టెక్కించేవారు. ఇలా ఒకటేమిటి గ్రామాల్లోని అనేక కార్యాల్లో ఒకరికొకరు తోడుంటూ జీవితాంతం ఆనందంగా జీవించేవారు.

నేటికాలం జానపదుల మనస్తత్వం:

ప్రస్తుతం సమాజంలో మానవ మనుగడ అత్యంత భయంకరంగా మారిపోయింది. ఈ రోజు గడిస్తే చాలు రేపటికి ఏది అవసరం లేదు అనే విధంగా మానవుల మనస్తత్వం మారిపోయింది. వస్తువులని, పర్యావరణాన్ని, మనుష్యలను తమ స్వార్థంకై వాడుకుంటున్నారు. మంచి చెడుల తారతమ్యం తెలియక రోజురోజుకి విలువలను పాతరవేస్తున్నారు. పాతకాలంలో లాగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే అలవాట్లను దూరం చేసుకున్నారు. అసూయా, కోపం, ద్వేషాలను నరనరాన జీర్ణించుకున్నారు. స్వంతవారితోనూ, పక్కవారితోనూ, గ్రామంలోని ప్రజలతోనూ అంటిముట్టకుండా జీవితాన్ని గడపడం నేడు సర్వసాధారణమై పోయింది.

గతం తాలుకు గుర్తులను కూడా మిగిల్చకుండా కొత్త ఆలోచనలని స్వాగతిస్తూ చెత్త జీవితాన్ని గడుపడం పరిపాటి అయిపొయింది. ఆస్థుల సంపాదనే లక్ష్యంగా సాగే ఆటలో తోటివారిని క్రీడా వస్తువులుగానే చూస్తూ ఆట అనంతరం విసిరివేసే సంస్కృతి నేడు ఎక్కువగా కనపడుతుంది. ఈ తంతులో ఎక్కడ మానసిక అంశాలే కనిపించవు. ప్రతీది ఆర్ధిక, రాజకీయాలతో ముడిపడి బాహ్య సంబంధాలనే గుర్తుకు తెస్తాయి. గతం తాలుకు ఆనవాళ్ళను ఏ మాత్రం గుర్తుపట్టకుండా నేటి మానవులు మార్చివేసారు. ఫలితంగా నేటితరం అస్థవ్యస్థంగా తయారై తల్లిదండ్రులకు అనేక మానసిక, శారీరక ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఇప్పటికైనా మానవుడు మేల్కొని ప్రాచీన ఆచారాలను, సంప్రదాయాలను, మానవ విలువలను, అనుబంధాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుతరాలకు ఆస్తులను ఇవ్వాల్సిన పనిలేదు ఆప్తులను ఇస్తే తల్లిదండ్రులు పిల్లలపట్ల ప్రేమానురాగాలను ప్రదర్శించిన వారుగా మిగిలిపోతారు. లేదంటే అతిపెద్ద మానవ తప్పిదంగా మారిపోయి రానురాను మానవుడంటేనే లోకమంతా భయపడే స్థితిలోకి సమాజం వెళ్ళిపోతుంది.

మానసిక మానవ సంబంధాలకంటే ఆర్థిక సంబంధాలు ముఖ్యం కాదనే భావన ఏరోజైతే మానవుడు తెలుసుకుంటాడో ఆరోజే పరిపూర్ణ జ్ఞానవంతుడిగా మారినట్లు లెక్క. పిల్లలకి ఆర్థిక పాటాలు చెప్పే కంటే ముందుగా మానసిక సంబంధాల పాట్యంశాలను వల్లె వేయించాలి. తోటి మనిషికంటే మరేది ముఖ్యం కాదనే సత్యాన్ని వారికి తెలియజేయాలి. పైవన్ని తల్లిదండ్రులు ముందుగా పాటించి తదనంతరం పిల్లలకి చెప్పడం మంచిది. నేటితరం పిల్లలు అతిత్వరగా నేర్చుకునే స్వభావాన్ని తమలో నింపుకొని ఉండటం మనం గమనించవచ్చు. కాబట్టి మంచికంటే చెడునే త్వరగా తమలో కలుపుకొంటున్నారు. మంచివారికి రుచించడం లేదు. పాతతరం కంటే నేటితరం తల్లిదండ్రులు అత్యంత ప్రమాదపు అంచుల్లో ఉన్నారనడం అతిశయోక్తి కాదు. కానీ నేటి తల్లి దండ్రులకి బ్యాంక్ బ్యాలన్స్, ఆస్తి పాస్తులపై ఉన్న శ్రద్ధ పిల్లలపై చూపించారు. చాలా తక్కువ శాతం మాత్రమె తమ పిల్లలపై ఒకింత శ్రద్ధను కనిపించడం చూస్తుంటాము. లోకంలోని మానసిక సంబంధాలను పక్కన పెడితే ముందుగా కుటుంబంలోని మనుష్యుల మధ్యనే అనేక సమస్యలు జీవితాంతం ఆ సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి. ఈ సమస్యలన్నీ ముందు తరాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి.

– భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments