ఆత్మాభిమానం-(కవిత )-సాగర్ రెడ్డి

ఆకలి తీరని ఆత్మారాముడు
ఆవురావురుమని
అరచిగీపెట్టినా,
చేలములు పీలికలై
రూపము అసహ్యమైనా,
చేయిచాచి
దేబిరించక-
ఆత్మాభిమానమే
ఎనలేని ఆస్ధిగా
మురిసిపోయిన
రోజులు ఏవి??

దుస్తులు విదేశీ అయినా
తన మూలాలు స్వదేశీ
అని మరచే మనిషికి,
ధర్పం అవసరమా?
గుప్పెడు మెతుకులు
తినే జానెడు పొట్టకు,
బఫే అనే సంస్కృతితో
నేలపాలు చేస్తున్న-
వేల రూపాయల తిండి
ఎన్ని అభాగ్య కడుపులు
నింపుతుందో తెలియని
అఙ్ఞానికి డాంబికమా??

ఎన్ని వేదాలు ఘోషించినా-
ఎన్ని శాస్త్రాలు,
చెంప చెళ్ళుమనేలా
నీతి బోధించినా,
కుక్కతోక వంకరలా-
మారని మనిషి బుద్దిలో
మార్పు ఆశించడం
మరీచికమేనా??

కర్మసిధ్ధాంతం,
పురాణ సంఘటనలు,
మనిషి మార్పుకా?
కాలక్షేపానికా?
చేసేది తప్పు అని-
అరచిగీపెట్టే
అంతరాత్మ పీకనొక్కినా,
ఆ పైవాడి కంటిచూపునుంచి
తప్పించుకోలేని
మనిషి నైజం-
స్వల్పకాలికమే తప్ప
దీర్ఝకాలికం-
ఎన్నటికీ కాజాలదు!!

-సాగర్ రెడ్డి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments