మహిళా కమిషన్ కొత్త కళ సంతరించుకుంటుందా …. -వి. శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

లేచింది …… పెను నిద్దుర లేచింది
ఎట్టకేలకు నిద్ర లేచింది తెలంగాణ ప్రభుత్వం .
ఆపదలో ఉన్న రాష్ట్ర మహిళలకు భరోసా ఇస్తూ, వారి హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర వహించాల్సిన మహిళా కమిషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచింది.

ఊహూ .. కాదు కాదు ,మొట్టికాయలేసి మొద్దు నిద్దుర లేపి, కళ్ళు తెరిపించింది రాష్ట్ర హైకోర్ట్.
రెండున్నరేళ్లుగా రాష్ట్ర మహిళలు తమ సమస్యల్ని ఏకరువు పెట్టుకునే వేదిక లేకపోయింది.

ఏదైతేనేం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా కమిషన్ ఏర్పాటయింది . సునీత లక్ష్మారెడ్డి అధ్యక్షురాలిగా మరో ఆరుగురు సభ్యులతో ఖాళీ భర్తీ అయింది .

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2013లో నియమితురాలైన మహిళాకమిషన్ చైర్ పర్సన్ పదవీకాలం 2018 జూలైలోనే ముగిసింది .

ఆ తర్వాతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది . కానీ , తెలంగాణా రాష్ట్రం ఆ దిశగా అడుగులే వేయలేదు.

రాష్ట్రంలో వివిధ శాఖల కమిషన్ లకు అధ్యక్షుల్ని , సభ్యుల్ని నియమించిన ప్రభుత్వం మహిళా కమిషన్ విషయంలో శీతకన్ను వేసింది . తొలి విడత ఒక్క మహిళా మంత్రినైనా ఏర్పాటు చేయని ప్రభుత్వం కదా .. మరి !

అదే విధంగా , దేశంలో మహిళా కమిషన్ లేని ఏకైక రాష్ట్రం గా కూడా ఘనత కెక్కింది.

మహిళా సంఘాల ఐక్యవేదిక, సామజికవేత్తలు, న్యాయవాదులు మహిళా కమిషన్ వేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం పరిపాటి అయిపొయింది . అయినా చెవికి ఎక్కించుకోని సర్కారాయె.
గత ఏడాది ఫిబ్రవరి 27 న జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖశర్మ తెలంగాణ ముఖ్య కార్యదర్శికి మహిళా కమిషన్ కి సంబంధించిన నియామకాలు చేపట్టాల్సిందిగా కోరుతూ లేఖరాశారు . అయినా చలనం లేదాయె.

మహిళపై నేరాల జాబితాలో భారత దేశంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది (NCW , 2017). తెలంగాణలో 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసున్న 45% మహిళలు శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొన్నారని NFHS (నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే ) సర్వేలో వెలువడింది.

‘తను కోరుకుంటున్న అమ్మాయి ‘ అన్న కారణం చేతే ఒక అమ్మాయి వేధింపులకు గురవుతున్నదని తెలంగాణలోని 44% బాలురు , తల్లిదండులు భావిస్తున్నారట.

ఈ నేపథ్యంలో , రాష్ట్రంలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలు , హింసకి స్పందించి మహిళా సామజిక కార్యకర్త రమ్యారావు తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు . ఆ లేఖను సుమోటోగా తీసుకుని స్పందించింది హైకోర్ట్ . డిసెంబరు 31లోగా మహిళా కమిషన్ నియమించాలని హైకోర్టు ఆదేశించింది.

ఫలితం, మహిళా కమిషన్ అధ్యక్షురాలు, సభ్యుల నియామకం. అంటే ఎవరైనా కొరడా పట్టుకునే వరకూ మనకు సోయి ఉండదన్నమాటేగా ..!

ఇంత అలసత్వానికి కారణం మహిళ హక్కుల్ని , మహిళల సమస్యల్ని, మహిళల భద్రతని ప్రభుత్వం సామజిక సమస్యలుగా భావించకపోవడమే ..

అధికారం , ధనం , కులం ఉన్నవాళ్లు న్యాయవాదులను పెట్టుకొని న్యాయం కొనుక్కోగలుగుతారేమో …, కానీ , అవి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ?

మహిళా సమానత్వం కోసం, మహిళా సాధికారత కోసం ఎన్నో మహిళా ఉద్యమాల కృషి ఫలితంగా ఏర్పడింది మహిళా కమిషన్ .
మహిళల ముందడుగు కోసం 1998 ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం. రాష్ట్ర మహిళా కమిషన్ ఒక స్టాట్యూటరీ బాడీ . ఇది ఒక పోలీస్ స్టేషన్ లాంటి వ్యవస్థ . ఒక కోర్టు లాంటి వ్యవస్థ . ఎన్నో అధికారులున్న వ్యవస్థ .

మహిళల స్థాయిని మెరుగుపరచడం, మహిళలను ప్రభావితం చేసే అధర్మమైన పద్దతులపై ఆరా తీయడం , పరిష్కారదిశగా శాసన పరమైన చర్యలకు సిఫారసు చేయడం , మహిళలకు సంబంధించిన అనేక అంశాలపై అధ్యయనాలు చేయడం , ప్రభుత్వానికి తగు సలహాలు, సిఫార్సులు చేయడం దీని ఏకైక ఉద్దేశం.

అయితే, అన్ని చట్టాల్లాగే మహిళా కమిషన్ కూడా . పేపర్ పులి మాత్రమే . వాస్తవంలో పిల్లి అనే అనుకోవచ్చు . ఈ మాట ఎందుకంటున్నానంటే , రాష్ట్రంలో మహిళా సంఘాలకున్న గుర్తింపు మహిళా కమిషన్ కి లేకపోవడమే .

ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగిన మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల ఐక్యవేదిక సభ్యులు, ఉద్యమకారులు అక్కడికి వెళ్లి సంఘటన పూర్వాపరాలు తెలుసుకుంటారు . బాధితుల పక్షాన మేమున్నాం అని భరోసాగా నిలబడతారు . అవి ప్రచార ప్రసార మాధ్యమాల్లో రావడంతో వాళ్ళకి ప్రజల్లో గుర్తింపు వస్తున్నది . అందుకే సమస్య వచ్చినప్పుడు బాధితులు వాళ్ళ కేసి చూస్తున్నారు , వారి దగ్గరకి వెళ్తున్నారు.

సామాన్య ప్రజలకి , మహిళలకి ఎవరిని ఎక్కడ కలవాలో తెలియదు . అందుకే ప్రజలు ఆ సంఘాల నాయకులను గుర్తించినట్లుగా మహిళా కమిషన్ ను గుర్తింరేమో ..

అదీ కాక రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉన్నప్పటికీ , అధ్యక్షులు , పూర్తిస్థాయి సభ్యులు ఉన్నప్పుడు కూడా కమిషన్ కి సంబంధించిన ప్రచారం లేకపోవడం వల్ల అది జనంలోకి వెళ్లలేక పోయింది . ప్రజలకి చైతన్యం కలిగించలేకపోయింది .

మెజారిటీ మహిళలు దిక్కు మొక్కు లేకుండా పోలీస్ స్టేషన్ , కోర్ట్ ఏదైనా కేస్ రిజిస్టర్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు . ముఖ్యంగా ఆదివాసీ , దళిత , మైనారిటీ మహిళలకు మరీ ఇబ్బంది అవుతున్నది.

పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడానికి ఎంతో డబ్బు , సమయం , ఖర్చు చేస్తూ ఎంతో శారీరక , మానసిక వ్యధ, వేదన అనుభవిస్తున్నారు. కొద్దీ మాత్రమే మహిళాకమిషన్ గడప తొక్కేది . తల లేని మొండెంగా కాలం వెల్లబుచ్చుతున్న మహిళా కమిషన్ సిబ్బంది వచ్చిన ఫిర్యాదులను పోలీసు శాఖకో, సఖి కేంద్రాలకో బదిలీ చేస్తున్నారు. కొన్ని పెండింగ్ లోనే ఉన్నాయి .

మహిళా సాధికారత కోసం , మహిళల భద్రత కోసం షి టీమ్స్ , ఫామిలీ కోర్టులు , భరోసా కేంద్రాలు, సఖి సెంటర్ లు , భూమిక హెల్ప్ లైన్ ఉన్నప్పటికీ వాటి పని తీరును అధ్యయనం చేసే వ్యవస్థ ఏదీ ..
ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే ఒక్కో గృహహింస కేసు నాలుగైదేళ్ళ సమయం పడుతున్నది . అసలు అవి ఆరు నెలల్లో ముగియాలి . సివిల్ కేసుల్లాగ ఏళ్లతరబడి నడుస్తున్నాయి . ఎందుకిలా జరుగుతున్నది ? అడిగేవాళ్ళు లేరనేగా .. ?

మహిళా కమిషన్ ఉంటే ఆ స్టడీస్ చేయొచ్చు . అవి ఎలా పనిచేస్తున్నాయో చూడొచ్చు . ఎందుకు ఆలస్యం అవుతున్నాయో తెలుసుకోవచ్చు . మరింత బాగా నడవడానికి ఇంకా ఏమి చేయొచ్చో చూడొచ్చు . చట్టాలలో ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవచ్చో చూడచ్చు . ప్రభుత్వ వ్యవస్థల్లో , ప్రభుత్వంలో మహిళల పట్ల ఉన్న వివక్షని ప్రశ్నించవచ్చు .

ఎన్ని కేసులు వస్తున్నాయి , ఎన్ని డిస్పోజ్ అవుతున్నాయి , ఎలాంటి కేసులు వస్తున్నాయి వంటి విషయాలు తెలుసుకోవడం , అవసరమైతే మరిన్ని ఫామిలీ కోర్టులు, మహిళల కోసం క్రిమినల్ కోర్స్ పెంచే విధంగా చూడడం , ప్రభుత్వానికి రికమెండ్ చేయడం చేయొచ్చు .
ప్రస్తుతం వాటి స్టేటస్ ఏమిటో తెలియదు .

జాతీయ స్థాయిలో కూడా మహిళా కమిషన్ చాలా చిన్న పరిధిలో పనిచేస్తున్నది. అలా ఎందుకు జరుగుతుందో తెలియదు .

సెక్షన్ 14 ప్రకారం ఒక కోర్టులాగా పనిచేయొచ్చు . ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తిని ఆఫీసుకు పిలిపించి విచారించవచ్చు . ఆ అధికారం మహిళా కమిషన్ కి ఉంది .

కానీ, ఎప్పుడూ సమర్ధవంతంగా , సంపూర్ణంగా పనిచేసింది లేదు . అసలే లేకపోవడంతో ఒక ప్రభుత్వం ఏమి చేస్తున్నా గానీ కమిషన్ నుండి ఒక రిపోర్ట్ గాని , విమర్శ గానీ ఉండదు . అది అసలు సమస్య .
సాధారణంగా మహిళా సంఘాలు మాత్రమే ఇటువంటి పనులు చేయడం మనం చూస్తుంటాం . సందర్భాన్ని బట్టి , విషయాన్ని బట్టి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయడం , నిలదీయడం వరకే వాళ్ళు చేయగలరు. వాళ్లకున్న పరిధి ,శక్తి చాలా తక్కువ .

మహిళా కమిషన్ అలా కాదు . అది చట్టబద్దమైన వ్యవస్థ. ఒక పోలీస్ గా పనిచేయొచ్చు . ఒక కోర్టుగా పనిచేయొచ్చు . ఇన్వెస్టిగేట్ చేయొచ్చు . ఫాక్ట్ ఫైండింగ్ కి వెళ్ళవచ్చు . అడుగే హక్కు, అధికారం మహిళా కమిషన్ కి ఉంది .

దిశ కేసులో నిందితులుగా చెప్తున్న నలుగురు యువకుల్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు మహిళా కమిషన్ ఉంటే సుమోటోగా స్వీకరించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉండేది . మహిళపై జరిగే వేధింపులు ,అఘాయిత్యాలు , దారుణాలు జరిగినప్పుడు ఆ హింసపై వెంటనే స్పందించడం , నిరంతరంగా ఆయా సమస్యలపై సమీక్షలు నిర్వహించడం , బాధితులకు న్యాయం చేసేందుకు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడడం మహిళాకమిషన్ కి సాధ్యమవుతుంది . చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది .

ఆంధ్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా వాసిరెడ్డి పద్మ నియమితురాలైనప్పటి నుండీ విస్తృతంగా పర్యటిస్తున్నారు . సంఘటనలపై వెంటనే స్పందిస్తున్నారు . బాధితులకు న్యాయం కోసం కృషి చేస్తున్నారు . అయితే బాధితులకు న్యాయం చేసే విషయంలో కుల , మత, వర్గ వివక్ష చూపుతున్నారని అందరినీ ఒకే విధంగా చూసి న్యాయం చేయడం లేదని ఆరోపణలున్నా అది వేరే విషయం .
మన పొరుగున ఉన్న రాష్ట్రాలు కర్ణాటక , కేరళ మొదలైనవి తమ కార్యకలాపాలు, స్వయంసేవక అవకాశాలు, వార్షిక నివేదికలు , చట్టపరమైన పత్రాలు , సంబంధిత డేటా సమగ్ర సమాచారంతో పూర్తి స్థాయిలో పనిచేసే ఆన్లైన్ పోర్టల్ కలిగి ఉన్నాయి

తెలంగాణ మహిళా కమిషన్ గురించి రాద్దామని వెబ్సైటు కోసం అంతర్జాలంలో వెతికాను . పేరుకు వెబ్సైట్ ఉంది . అది నెలక్రితమే ఏర్పాటైంది. వెల్కమ్ టు అవర్ వెబ్సైటు తప్ప మరో పేజీ లేదు . సమాచారం లేదు. అంతా డొల్లే .

ఏ వనరులూ లేని మహిళా సంఘాలు ఎన్నో విషయాల్లో సమర్ధవంతంగా పనిచేయగలిగినప్పుడు మహిళా కమిషన్ తన అధికారాలను వాడుకుంటూ పరిమిత వనరుల్లోనైనా పనిచేయగలదు.
రాజకీయ నిరుద్యోగం తగ్గించే పదవుల్లా కాకుండా బాధ్యతగా పనిచేసే సమర్థులైన మహిళలను మహిళా కమిషన్ చైర్ పెర్సన్ గా , సభ్యులుగా నియమిస్తే కమిషన్ పనితీరు మెరుగుపడుతుంది . మహిళల అభ్యున్నతి సాధ్యమవుతుంది . అది ఆశించడం అత్యాశేమో ..

చూద్దాం కొత్తగా నియమితులైన రాష్ట్ర మహిళా కమిషన్ ఎలా పనిచేస్తుందో .. కొత్త కళను సంతరించుకుని ఉన్న పరిమిత వనరులతో సమర్ధవంతంగా పనిచేస్తూ , తన వనరులను పెంచుకుంటూ , ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మహిళా కమిషన్ ప్రజలకు అందుబాటులోకి రావాలని, బాధితుల పక్షాన నిలబడి న్యాయం జరిపించాలని, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర చట్టాల్లోని లొసుగులను తొలగించి మహిళల భద్రతకు , సమానత్వానికి, సాధికారతకు దోహదం అవుతుందని ఆశిద్దాం .

వి . శాంతి ప్రబోధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో