సమాంతరాలు – లేత మనసు – యం .యస్ .హనుమంతరాయుడు

hanumantharao

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
బియిడి క్లాస్ రూమ్
ప్రిన్సిపాల్ సార్ ఆ రోజు క్లాస్ కు వచ్చాడు .

డియర్ స్టూడెంట్స్ రేపటి నుండి మీరందరూ మీకు అలాట్ చేసిన స్కూలుకు బ్లాక్ టీచింగ్ కు వెళ్ళాలి.
ప్రతి ఒక్కరూ తప్పకుండా వెళ్లాలి అని చెప్పారు.

నాకు యూనివర్సిటీ పక్కన ఉండే పల్లెలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ను అలాట్ చేశారు.

మొట్టమొదటి సారి బ్యాగ్ తీసుకుని బ్లాక్ టీచింగ్ కు బయలుదేరాను.చిన్నప్పటి నుండి పుస్తకాల బ్యాగ్ తీసుకుపోయే అవసరం రాలేదు. అవకాశం లేదు అంటే ఇంకా బాగుంటుంది.

ఎందుకంటే 1 నుండి10 వరకు శెట్టూరు లో చదువుకోవడం, స్కూల్ ఇంటికి దగ్గరే ఉండటం వల్ల రైటింగ్ ప్యాడ్ మీద ఏ పూటకు అవసరమైన పుస్తకాలు మాత్రమే ఆ పూటకు తీసుకుపోయేవాళ్ళం.

ఇంటర్ కనేకల్ రెసిడెన్షియల్ కాలేజ్. క్లాస్ రూమ్స్ హాస్టల్ పక్కపక్కనే కాబట్టి అక్కడ కూడా బ్యాగ్ అవసరం రాలేదు.ఇక డిగ్రీలో చెప్పాల్సిన అవసరం లేదు ఊపుకుంటూ ఒక నోట్ బుక్ తీసుకుని పోయేవాళ్ళం

కొద్ది రోజుల కోసం కొత్త బ్యాగ్ ఎందుకులే అని తమ్ముడు మారుతి దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకుని క్యారియర్ బుక్స్ TLM అన్నీ అన్నీ సర్దుకుని స్కూల్ కు పోయాను.

కొత్త స్కూల్ కొత్త పిల్లలు అయినా కూడా తొందరగానే వాళ్లలో కలసిపోయాను. మనకెలాగో పాటలు పాడటం కథలు చెప్పడం వచ్చు. దాని వల్ల పిల్లలు తొందరగా నాకు అలవాటు పడ్డారు.

నాకు 7వ తరగతి ఇంగ్లీష్ తొమ్మిదవ తరగతి మ్యాథ్స్ సబ్జెక్టు ఇచ్చారు.

7వ తరగతిలో రవి అని ఒక పిల్లగాడు అందరికన్నా భలే యాక్టివ్ గా ఉండేవాడు. ఏదన్నా పని చెబితే మాట పూర్తి అయ్యేలోపు వెళ్ళేవాడు.బాగా చదువుకునేవాడు.ప్రతి రోజు మిస్ కాకుండా స్కూల్ కు వచ్చేవాడు.

ఒకరోజు పొద్దున్న పూట మార్నింగ్ అసెంబ్లీ జరుగుతూ ఉంది.మద్య వయసున్న వ్యక్తి ఒకాయన స్కూల్ దగ్గరకు వచ్చాడు.తెల్ల పంచె తెల్ల షర్ట్ వేసుకుని చాలా సాదాసీదాగా ఉన్నాడు.వచ్చి పిల్లల వెనక నిలబడిన మా పక్కన వచ్చి తను కూడా నిలబడ్డాడు

ఎవరబ్బా ఈయన అని నేను అనుకున్నాను.
అంతలోనే హెడ్ మాస్టర్ గారు రండి నరసింహులు అన్న అని సాధరంగా పిలిచాడు
అతను మాత్రం మొహమాట పడుతూ పర్వాలేదు సార్ మీరు ప్రార్థన కానివ్వండి తరువాత మాట్లాడుదాం నేను ఇక్కడే ఉంటాను సార్ అని చెప్పాడు.

మార్నింగ్ అసెంబ్లీ అయిపోయిన తరువాత అతను హెడ్ మాస్టర్ సార్ దగ్గరకు వచ్చాడు
ఏం లేదు సార్ జనవరి 26 జెండా పండగ దగ్గరకు వచ్చింది కదా సార్ ఏమేమీ కావాలో చెబితే ఆ రోజుకు అన్నీ తెచ్చిస్తాను సార్ మీరు పేపర్ లో నాకొక లిస్ట్ రాసివ్వండి సార్ మరచిపోకుండా అన్నీ తీసుకురావచ్చు అని అడిగాడు.

సరే అన్న ఏమేం కావాలో అన్నీ లిస్ట్ రాసి రవి తో ఇచ్చి పంపుతాను అని హెడ్ మాస్టర్ సార్ అన్నారు.

సరే సార్ నాకు కొంచెం పని ఉంది నేను పోయెస్తాను అని అతను అన్నాడు.

లోపలికి రండి అన్న టీ తెప్పిస్తాము తాగి పోదురు అన్నారు
వద్దులెండి సార్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తాగుతాను అని చెప్పి వెళ్లిపోయారు.

అతను వెళ్లిపోయిన తరువాత
ఎవరు సార్ ఆ అన్న అని నేను హెడ్ మాస్టర్ సార్ ను అడిగాను.

నరసింహులు అన్న గ్రామ సర్పంచ్ చాలా మంచివాడు నెమ్మదస్తుడు అణుకువగా ఉంటాడు.
స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం కు పిల్లలకు బహుమతులు స్వీట్లు తెచ్చి ఇస్తుంటారు.
ప్రతిసారి మాదిరిగానే ఈ సారి కూడా ఏమేం తేవాలో అడగడానికి వచ్చారు అని అన్నారు.

ఇంత బాధ్యతగా స్కూల్ దగ్గరకు వచ్చి అడిగి మరీ కావాల్సినవి తెచ్చిస్తున్న సర్పంచ్ నరసింహులు అన్నను మనసులోనే మెచ్చుకున్నాను.

ఒక రోజు మధ్యాహ్నం పూట ఏడవ తరగతి వారికి అటెండెన్స్ వేస్తున్నాను.
రవి అని పిలిస్తే వాడు పలకలేదు.
పిల్లలంతా రాలేదు సార్ అని గట్టిగా అరచి చెప్పారు.
పొద్దున్న వచ్చాడు కదరా ప్రెజెంట్ వేశారు, ఇప్పుడెందుకు రాలేదు
టెస్ట్ పెడతాను అందరూ తప్పకుండా రావాలి అని చెప్పాను కదరా అయినా వాడు ఎందుకు తప్పించుకున్నాడు అని అడిగాను.
తెలీదు సార్ అన్నారు

సరే రేపు పొద్దున్నే నాకు వాడి గురించి గుర్తు చేయండి వాని కథ రేపు చూద్దాం అని చెప్పి వచ్చిన వాళ్లందరికీ టెస్ట్ పెట్టాను.

మరుసటి రోజు పొద్దున్నే స్కూలుకు వెళ్ళగానే పిల్లలంతా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు
సార్ రవి వచ్చాడు సార్ మీరు పొద్దున్నే గుర్తు చేయండి అని చెప్పారు కదా సార్ అందుకే మీరు వస్తూనే చెబుదామని ఎదురుచూస్తూ ఉన్నాం సార్ అన్నారు.
వాణ్ణి ఇక్కడికి పట్టుకుని రా పోండిరా అని చెప్పాను.

అందరూ పరిగెత్తుకుంటూ పోయి పరమానందయ్య శిష్యులు కథలో సూది గుచ్చిన మొద్దును మోసుకొచ్చినట్టు రవిని కాళ్ళు చేతులు పట్టుకుని మోసుకొని వచ్చారు
పిలుచుకుని రమ్మంటే మోసుకొని వచ్చారు కదరా అన్నాను.
సార్ కొడతాడు నేను రాను అన్నాడు సార్ అందుకే మోసుకొని వచ్చాము అన్నారు.
రే రవి దగ్గరకు రారా అని పిలిచాను

నేను రాకముందే వాని క్లాస్మేట్స్ అంతా సార్ నిన్ను వాంచి పారేస్తాడు లేప్పా అని వాణ్ణి బాగా భయపెట్టినట్టు ఉన్నారు.అందుకే వాడు భయం భయంగా నా దగ్గరకి వచ్చాడు.

రే నిన్న నేను టెస్ట్ పెడతాను అని చెప్పాను కదరా
చెప్పినా కూడా స్కూలుకు ఎందుకు తప్పించుకున్నావురా అని అడిగాను

వాడు మౌనంగా తల ఒంచుకుని నిలబడ్డాడు సమాధానం చెప్పలేదు
మళ్ళీ రెట్టించి అడిగాను ఏరా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఉన్నావు ఎందుకు రాలేదో చెప్పు అని గట్టిగా అడిగాను.

కటింగ్ చేపించుకోవడానికి పోయాను సార్ అని నిదానంగా చెప్పాడు.
కటింగ్ చేయించుకోవడానికి స్కూలుకు తప్పించుకుంటావా?
స్కూల్ వదిలిన తరువాత చేయించుకోవచ్చు కదరా అన్నాను

మా నాయన నేను సార్ కు చెబుతాను అని చెప్పి నన్ను అనంతపురం కు పిలుచుకుని పోయినాడు సార్ అక్కడే కటింగ్ చేయించుకుని వచ్చాము సార్ అని చెప్పాడు.

ఏం పేరు రా మీ నాయనది ఏం పని చేస్తాడు మీ నాయన అని అడిగాను.

సార్ మా నాయన పేరు సర్పంచ్ నరసింహులు సార్ అని చెప్పాడు.

అది సరే గానీ కటింగ్ షాప్ ఇక్కడే మీ ఊర్లో పెట్టుకుని అనంతపురం కు ఎందుకు పోయారప్పా అని అడిగాను.

రవి మళ్ళీ ముఖం నేలకు వాలించాడు.
నువ్వెందిరా ఏది అడిగినా తలకాయ వంచుకుంటావు అడిగిన దానికి సమాధానం చెప్పు అని గద్దించి అడిగాను
వాడు సమాధానం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ చిన్నగా ఒక్కొక్క మాట వినీ వినబడనట్టుగా బయటకు అన్నాడు

“ఈ ఊర్లో మాకు కటింగ్ చేయరు సార్ ” అంటూ మళ్ళీ తల దించుకున్నాడు.

నాకు విషయం అర్థమయ్యింది. మళ్ళీ వాణ్ణి ఇంకో ప్రశ్న అడగలేదు.

అంతవరకూ మా సంభాషణ వింటున్న పిల్లల్లో కొన్ని గొంతులు మాత్రమే గట్టిగా వినిపించాయి.

“సార్ వాళ్ళు మాదిగోళ్లు సార్ దానికే వాళ్ళకి మా ఊర్లో కటింగ్ చేయరు సార్”

ఆ మాట వినగానే అంతవరకూ గట్టిగా మాట్లాడిన నా గొంతు కూడా ముగబోయింది.
రేయ్ అందరూ క్లాస్ రూమ్ లోకి పోండి
రే రవి నువ్వు కూడా పోరా అని చెప్పాను.

ఏంది ఈ సార్ రవిని కొడతాను అని చెప్పి ఏం చేయకుండా పంపిస్తున్నాడు అని ఆశ్చర్యంగా నా మెహమే చూసుకుంటూ తరగతి గదిలోకి వెళ్లిపోయారు.

-యం.యస్.హనుమంత రాయుడు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments