ఈ తీర్ధం ఆ శంఖంలో నుండి …(కథ )- కాదంబరి కుసుమాంబ

అన్నయ్య విజయ మోహన్ పెరట్లో సన్నజాజిపందిరి దగ్గర కూర్చున్నాడు.

“లక్ష్మణ్, వచ్చే నెలలో రిటైర్ ఔతున్నాను. ఇన్నాళ్ళూ లక్షణంగా కులాసాగా గడిచాయి రోజులు, ఇకముందు ఇంట్లో కూర్చుని ఒంటరిగా ఎట్లాగ, హూ.” అన్నగారి నిట్టూర్పులో
లక్ష్మణ్ కి స్పష్టంగా కనిపించింది, భావి దృశ్యం.

‘నిన్నటిదాకా – ఆఫీసులో స్టాఫు, పని మీద వచ్చే కస్టమర్లు, మేనేజర్ హోదాలో పై వాళ్ళ ధాష్టీకం –
అనుభవించినన్నాళ్ళూ ఆ చిర్రు బుర్రులు బాధగానే భరించాడు. కానీ- ఇక మీదట, అది లేని రోజులను వింత చేదుతో గడపాల్సివస్తుంది. – తను కూడా పదవీవిరమణ చేయాలి.

అప్పుడు తను కూడా అన్నయ్యలాగా ఇంత మనో వేదనను ఫీల్ అవుతాడా?’

                                                           @@@@@

లక్ష్మణ్ తలపులలో చోటు చేసుకుంటూన్న ఆ రోజు రానే వచ్చింది. ఆఫీసులో అందరితోటి పార్టీ చేసుకుని, పదవీ విరమణ శుభాకాంక్షలు   పుచ్చుకుని, ఫొటోలు, చిన్ని చిన్ని గిఫ్ట్సుతో ఇంటికి వస్తూ, అన్న మాటలను నెమరు వేసుకున్నాడు. భార్య ప్రభావతి పిల్లలకు ఫోన్ చేసింది.

“ఇవాళ ఆఫీసులో వీడ్కోలు సభ  చాలా బాగా జరిగింది. …” అని చెప్పింది.

“రేపు పక్క ఫ్లాటు గౌరికి, తతిమ్మా వాళ్ళకు చెప్పాలి” అనుకుంటూ బడలికతో పడుకుంది. పరుపుపై ఒత్తిగిలి పడుకుంటూ అన్నది,

“ఏమండీ! రేపు ఆరింటికి లేద్దాం. వంటావార్పులకు తొడతొక్కిడిగా పరుగులెత్తే పని నాకు తప్పింది కదా.

” చీకటితో నాలుగింటికే నిద్ర లేచి, స్నానం చేసి, మడి చీరతో వంట మొదలెట్టేది ఆమె. ఇప్పుడు అంత పరుగులు అవసరం లేదు కదా, అనుకున్నది.

అన్నది గాని, ఆ పలుకులు చిన్న రాయి వేస్తే కొలను నీళ్ళన్నీ కదలినట్లు, అతని మనసును ఎంతో కెలుకుతున్నయ్.

                                                       @@@@@

లక్ష్మణరావు, ప్రభావతిల పెళ్ళి నిన్న మొన్న ఐనట్లున్నది. అప్పుడే ఇన్నేళ్ళు గడిచాయి,
పిల్లల బాధ్యతలు తీరి, సంతృప్తిగా గడిపే కాలం ఇది.

ఊహు, గడియారంలో ముల్లు మరీ ఇంత నెమ్మదిగా తిరుగుతున్నదేమిటి!? రానురానూ టైమ్ పాస్ అవకపోతే ఎంత దుర్భరంగా ఉంటుందో అనుభవంలోనికి వస్తున్నది. తెనాలిలో అన్న దగ్గరకు వెళ్ళాడు. ఉద్యోగం, ఎక్స్పీరియన్సు, అవీ ఇవీ, కబుర్లు కాకరకాయలు – కాలక్షేపం బఠాణీలు అన్నీ నాలుగు రోజులలో పూర్తి ఐనాయి. వదిన విజయలక్ష్మి, ప్రభావతి అచ్చట్లు ముచ్చట్లు బాగానే కొనసాగుతున్నాయి.
కానీ తనకే బోరు కొట్టింది, ఏదో చెప్పలేని, ఇతమిత్ధమని చెప్పలేని తెలీని వెలితి …, “పద, తాళాలేసి వచ్చాం. ఇల్లు బూజులు పట్టి ఉంటుంది” అంటూ బయల్దేరదీసాడు. “కాఫీ తీసుకోండి.” కిచెన్ లో నుండి ప్రభావతి గట్టిగా పిలిచింది. ఇంతకు మునుపు డ్రాయింగ్ రూములోకి వచ్చి, ఇచ్చేది, ఇప్పుడో …. “
మదిలో బేరీజు వేసుకుంటూ అనుకున్నాడు చిర్రుబుర్రుగా.

కొన్నాళ్ళ తర్వాత, పైకే ఈ అక్కసు భావాన్ని వెలిగక్కుతున్నాడు. ఉస్సురస్సురంటూ ఆమె భర్త రుసరుసలని వినీ విననట్టుగా ఉండటం అలవాటు చేసుకున్నది. మోకాళ్ళ నొప్పులు, ఆయాసం – హోమియోపతి మాత్రలు వేసుకుంటుంది.

“ఎంతసేపూ నీ హెల్త్ జాగ్రత్తలు బాగానే చూసుకుంటున్నావు, నా విషయం మాత్రం పక్కన పెట్టేసావు.”
క్రమంగా కీచులాటల స్థాయి పెరిగిపోయింది. భార్య ఫోన్ పట్టుకుంటే “చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఈ ముజ్జగాలు మరిచిపోతారు, మీ ఆడవాళ్ళు.” అనేస్తాడు.

“సందె పొద్దు, గుడికి వెళ్ళి కాస్సేపు తిరిగిరండి.” “ఏం, నేను నీకు అడ్డంగా ఉన్నానా?”
గృహజీవనం స్త్రీలకు స్వాభావికం,

కనుక ఆమెకు విసుగు అనిపించదు. ఇంటి పనులన్నీ చేసుకుంటూ, మధ్యే మధ్యే ఆషామాషీ కబుర్లు, మిత్ర,బాంధవులతో …., , మొబైల్ ఆవిర్భావం – వారి మనసులకు తేటబరిచే కొండగాలి అయ్యింది. ఉద్యోగ సంబంధ విషయాలను ముక్తసరిగా మాట్లాడే అలవాటు ఈ భర్తది. బాల్యం నుండీ తాత తండ్రి బంధు పురుషుల ప్రవర్తనా ధోరణి – వాక్కుతో బోధించకుండానే వంటబట్టించిన పాఠం ఇది.

“మగవాళ్ళు మితభాషులుగా ఉంటారు, అటులనే ఉండవలెను …. ” అనే విచిత్ర సంఘ సూత్రాన్ని ఆమె మనఃపూర్వకంగానే స్వీకరించింది. మానసికంగా కాస్తో కూస్తో ప్రశాంతంగానే ఉన్న ఒక మహిళ అతనికి ఆట్టే నచ్చడం లేదు. కీచురాళ్ళు కూడా మౌనం దాల్చి, ఆ ఇంట్లో కీచులాటలను పరికిస్తూ, వినోదాన్ని పొందుతున్నాయి.

                                        @@@@@

కొలీగ్ సౌజన్యా రావు కూతురి పెళ్ళి, తెనాలిలో. భార్యాసమేతంగా వెళ్ళాడు లక్ష్మణ రావు.
అక్కడ మరికొందరు మిత్రులు కలిసారు.

అక్షింతలువేసి, వివాహ భోజనంబును – మిత్ర వర్గంతో కులాసా కబుర్లు మనసును తేలికపరిచాయి.
అన్న ఫోన్, “ఫ్రెండ్సుతో బాతాఖానీ చేస్తూ, మమ్మల్ని మరిచినట్లున్నావు,
మీ వదిన నన్ను నిష్ఠూరాలాడుతున్నది.”

“చిటికెలో అక్కడ ఉంటాను, సరేనా అన్నయ్యా!?” ప్రభావతి “ఇదిగో అక్కయ్యా, ఈ వారమే చేసాను, రుచి చూసి చెప్పండి.” అంటూ మూడు ఊరగాయలను తోడి కోడలికి ఇచ్చింది. నాలుగు రోజులు … అనుకున్నాడు కానీ నెల రోజులు దాకా సాగింది లక్ష్మణ్ దంపతుల బస,

“మనిషి పొలుపు – అని వరూధినీ ప్రవరాఖ్యం ఇచ్చిన కొటేషన్ అక్షరలక్షలు విలువైనది కదూ.”
అనుకున్నది కులాసాగా నవ్వుతున్న భర్తను గమనిస్తూ, ప్రభ.

                                      @@@@@@

అన్నయ్య కూరలు తరుగుతున్నాడు, వంటలో సాయం చేస్తూ, పెళ్ళానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు,

“ఇదేంటి అన్నయ్యా! ఆడ పనులన్నీ చేస్తున్నావు.” “చేస్తే తప్పేముంది!? అదీగాక, ఇప్పుడు వేరే పనేముంది!!?  పదవీ విరమణ మూలాన్న ఇంత వెసులుబాటు దొరికింది. నాకే కాదు, నాతోబాటు మీ వదినకు కూడా, వయసు పెరిగింది కదా! తనకు పాపం, రిటైర్ మెంట్ ఎట్లాగూ ఉండదు కదా.
ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే, పూర్తిగా మూలన బడితే, పరిస్థితి అధ్వాన్నం చతుర్ముఖం ఔతుంది …..
సరే గానీ, కార్డ్స్ కొన్నాను, కాఫీలు గట్రా సాయంత్రం తాగాక, చతుర్ముఖ పారాయణానికి కూర్చుందాం.”

“అట్లాగైతే, మమ్మల్ని కూడా మీ బాచ్ లో కలుపుకోండి విజయ్ మోహన్ గారూ!” అప్పుడప్పుడూ వచ్చే డప్పు దామోదరం, ఆ ఫ్లాట్సు కమిటీ మెంబరు అతను, “వచ్చే బుధవారం, సీనియర్ సిటిజన్సుకి స్పోర్ట్స్. ఆటపాటలు, హంగు పార్టీ పెడ్తున్నాం.. విజయ్ మోహన్ గారూ, మీరు తప్పక రండి.” అంటూండగా,
“మా తమ్ముడు వాళ్ళతో కూడా వస్తాం.” “దానిదేం భాగ్యం, అందరూ అటెండ్ ఐతే మరీ బాగుంటుంది,
మన హంగామా పార్టీ. తతిమ్మా వాళ్ళను ఫోన్ చేసి పిలుస్తాను, లెండి.” అంటూ, దామోదరం ఇవాళ్టి ఈవినింగ్ కి ఇక్కడ పేకాట పాపారావు అవడానికి తన ప్రోగ్రామ్ ఖాయపర్చుకున్నాడు.

                                                                          @@@@@

ఇద్దరూ గృహోన్ముఖులయ్యారు. విజయవాడ చేరాక, లక్ష్మణరావు, రెగ్యులర్ టైమ్ టేబుల్ ని మార్చుకున్నాడు.

“ఇప్పటిదాకా తను గమనించలేదు. ఏవో పొరలు తన మనసును క్రమ్మేసినాయి. ప్రభ ఇంటి పని అంతా పూర్తిగా చేస్తున్నది,

కానీ గొప్ప ఓపిక ఉండి మాత్రం కాదు. సంప్రదాయాలూ ఆచారాలూ అనుసరించడం జీర్ణించుకున్న స్త్రీ.
కనుకనే భర్తగా తనకు ఉన్నతస్థానం ఇచ్చి, చిన్నమెత్తు పనిని కూడా చెప్పదు.

ప్రభ అస్సురుస్సురంటూ మసలుతున్నా, తన మనసుది మాత్రం ఏమీ పట్టని నిర్లిప్త ధోరణి, … ” అనుకుంటూ గృహ కృత్యాలను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ, సూర్యోదయానికి సుస్వాగతం పలుకుతున్నాడు.

                                                           @@@@@
 

ఈ మార్పు సహజంగానే ప్రభావతికి ఆనందదాయిని కదా. పతిదేవునిలోని నవ చైతన్యానికి మంత్రముగ్ధ ఔతూ – విజయలక్ష్మి దంపతులకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ అనుకున్నది, “తన అన్నగారు చెప్పారు, కాబట్టి, మనిషిలో ఇంత మార్పు, ఒకవేళ అదే నేనో, నా కూతురో, కోడళ్ళో చెప్పి ఉంటే – ఆడపుటక పుట్టి, మీరు చెబ్తున్నారా?, అంటూ తాడెత్తున ఎగిరేవారు. ఈ నీళ్ళు – సోదరులు అనే – ఆ శంఖంలో తీర్ధంగా మారాయి. హమ్మయ్య.”

– కాదంబరి కుసుమాంబ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments