రచయిత్రి బోయి విజయభారతితో సంభాషణ- కట్టూరి వెంకటేశ్వరరావు

తెలుగు సాహిత్యంలో ఉన్నత స్థాయిలో ఉన్నా. కులం వల్ల అనేక ఇబ్బందులకు గురై అనేక అవమానాలను ఎదుర్కొని. ప్రాచీన  సాహిత్యాన్ని ఆధునిక దృక్పధంలో విశ్లేషించి,విమర్శించడం , పదకోశం కాదు పదశోకం అని హేళన చేసిన వాళ్ళ నోళ్లు మూయించి తెలుగు సాహితీ లోకానికి సాహిత్య సంపదను అందించిన రచయిత్రి బోయి విజయభారతి గారితో విహంగ ముఖాముఖి…

* సాహితీవేత్తల కుటుంబం నుండి వచ్చిన మీరు. తెలుగు సాహిత్యంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
జ.సాహితీవేత్తల కుటుంబం నుంచి రావడం అనేది చాలా యాదృచ్చికంగా జరిగి ఉండొచ్చు. సాహితీవేత్తల కుటుంబాలలోని వాళ్ళకి రాయాలన్న తపన ఉండటం సాధారణం కాదు. మామూలుగా మనిషి లోపల కుతూహలం, సమాజం పట్ల,సాహిత్యం పట్ల తన వంతుగా తాను ఏదో చెయ్యాలి. తాను కూడా తన అభిప్రాయాలు వెల్లడించాలి అనే తపన ఉండటం ముఖ్యం.

*మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామి తారకం గారు వీరి నుండి మీరు స్ఫూర్తి పొందిన విధానం మా పాఠకులకు తెలియజేస్తారా?
మా నాన్నగారు (బోయి భీమన్న)గారి ప్రభావం నా మీద ఉందని నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. నాన్న గారి బాటలో వెళ్లాలని నేను పెద్దగా అనుకోలేదు. అందరిలాగానే మామూలుగా నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువు చెప్పించారు. నేను చదువుకుంటూ పోయాను అంతే. నాన్నగారు జర్నలిస్టు కావడం వల్ల మద్రాసులోనే ఉండేవారు. నేను మా తాతగారి ఊరైన రాజోలులో ఉంటూ ఎస్ ఎల్సీ వరకు అక్కడే చదువుకున్నాను. మా తాతగారు(అమ్మ తండ్రి) హరిజన హాస్టల్ నడిపేవారు. అమ్మ అప్పటికే చదువుకున్న మొదటి తరం మహిళ.

*మీకు సాహిత్యం పై అభిరుచి ఎలా ఏర్పడింది ?
అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడల్లా చందమామ,బాల వంటి పత్రికలు తెచ్చి ఇస్తూ ఉండేది. అలా పుస్తకాలు చదవడం వల్ల నాకు భాష మీద పట్టు వచ్చింది అని అనుకుంటాను. అలాగే చిన్నప్పుడు ఆ కథలు చూసి ఒక కథ రాయాలి అనుకోవడం. ఏదో ఒక కథ రాయడం అది అమ్మకు చూపించడం. ఇక నాన్నగారు జర్నలిస్ట్ కావడంవల్ల 1950- 60 మధ్య ప్రాంతాల్లో అచ్చయిన చాలా పుస్తకాలు మా ఇంటికి పంపించేవారు. ఆ సాహిత్యం నాకు అర్థమైనా, అర్థం కాకపోయినా చదువుతూ వచ్చేదాన్ని. అంటే నాకు నేను రాస్తానని,రాయాలని ఉండేది కాదు.

*మీ పై ఎవరి ప్రభావం ఉంది ?
సాహితీవేత్తల కుటుంబం నుంచి వచ్చిన నాపై వారి ప్రభావం నా మీద అంతగా లేదనే చెప్పాలి. ఎందుకంటే నేను ఎం. ఏ తెలుగు విద్యార్థిని కావడంవల్ల, సాహిత్య వ్యాసాలు రాయటం.లెక్చరర్ కావడం వల్ల విద్యార్థులకు బోధించే క్రమంలో కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం జరిగింది.అంబేద్కర్, పూలేల జీవిత చరిత్రలను నేను క్షుణ్ణంగా చదవడం. వారి ప్రభావం నామీద బాగా బలంగా ఉంది. మావారు తారకం గారు కూడా అంబేద్కరిస్టు.. అసలు దీని అంతరార్థం ఇలా అయ్యుండాలి కదా. అని రెండో కోణంలో ఆలోచించడం నాలోనే మొదలైంది.దాన్ని తారకం గారు ప్రోత్సహించారు. తర్వాత నాన్న గారి పాత రచనలన్నీ చదవడం మొదలు పెట్టాను. అప్పుడు నా దృష్టి కోణం నాన్నగారి దృష్టికోణం ఒకేలా ఉండేదని, అందువల్ల నాలో కాన్ఫిడెంట్ కూడా పెరిగింది. మా తల్లిదండ్రులు , నా భర్త బొజ్జా తారకం గార్ల ప్రభావం నా మీద ఉంది.

*మీరు బి. ఏ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం లో చేరాలి అనుకున్నారు కదా కారణం ?
నేను బి.ఎ అయిపోయిన వెంటనే ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే స్వశక్తి మీద నిలబడి ఉండటం మంచిది అనే ఆలోచన ఉండేది. దాంతో నాన్నగారు పని చేసే ట్రాన్స్లేషన్ ఆఫీసు ప్రక్కనే,ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉండేది. అందులో ఇంటర్వ్యూకి  వెళ్లి ఆ ఆఫీస్ లో జాయిన్ అయ్యాను. కానీ నాన్న గారు నువ్వు ఉద్యోగం చేయడం కాదు. నువ్వు తెలుగు బాగా చదువుతావు,బాగా రాస్తావు. అని నన్ను ఎం.ఏ తెలుగు లో చేర్పించారు. అంతకుముందు నాది సైన్స్ గ్రూపు. బి.ఏ లో తెలుగు చదివా.బి.ఏ లో నాయని కృష్ణకుమారి,యశోదరెడ్డి వంటివారు మాకు పాఠాలు చెప్పేవారు. అలా డిగ్రీ పూర్తయ్యాక ఎం.ఏ లో జాయిన్ అయ్యాను.ఇలా సాహితీరంగంలో నాకు ప్రవేశం జరిగింది.

*అప్పట్లో విశ్వవిద్యాలయాలలో ఎలాంటి వాతావరణం ఉండేది ?
యూనివర్సిటీలో ప్రొఫెసర్లందరూ మా నాన్నగారికి బాగా తెలిసినవాళ్ళే. అంచేత ఆ కుల వివక్ష అనేది నేను ఎదుర్కోలేదు. ఎటొచ్చి బాగా చదివే విద్యార్థినిగానే నాకు పేరు ఉండేది.అయితే అప్పట్లో తెలుగులో ఫస్ట్ క్లాస్ అనేది ఒకవర్గం వాళ్లకు మాత్రమే వచ్చేది. చాలామందికి ఫస్ట్ క్లాస్ ఇచ్చేవారు కాదు. అప్పట్లో ఏవో రాజకీయాలు నడిచేవని నాకు ఫస్ట్ క్లాస్ ఇస్తే ఇంకొకళ్ళు కూడా గొడవ పెడతారనేసి అందరికీ సెకండ్ క్లాస్ ఇచ్చారు మొత్తానికి.

*మీ ప్రొఫెసర్ ఖండవల్లి లక్ష్మీరంజనంగారు ఎలా ఉండేవారు ?
ఆయన చాలా మంచి వారు. చాలా విశాల భావాలు కలవారు. అసలు ఈ కులవివక్ష అనేది ఆయన గుర్తించేవారు కాదు.ఆయన పాఠాలు చెప్పడానికి వారి ఇంటికి రమ్మని పిలిచి భోజనాలు పెట్టి కాఫీ,టీలు ఇచ్చి సంతృప్తిగా పంపించేవారు.మళ్ళా ఎం.ఏ పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఈ క్రమంలో లక్ష్మీరంజనం గారు మా నాన్న గారికి ఉత్తరం రాశారట. ఇదేమిటి మీ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అని విన్నాను. ఉద్యోగం చేస్తేగానీ గడవని పరిస్థితి కాదు కదా మీది. ఇక్కడ యూనివర్సిటీ లో ఇంతవరకు ఆడవాళ్ళెవరూ ఎవరూ పి.హెచ్ డి చేయలేదు.మీ అమ్మాయి మరొక అమ్మాయి హేమలత చేత చేయిద్దామని అనుకుంటున్నానని ఉత్తరం రాశారట. అయితే ఆ ఉత్తరం నాకు మా నాన్న చూపించలా. ఆ ఉత్తరం చూపించకుండా…మా నాన్నగారు నువ్వు ఉద్యోగం మానేసి వెళ్లి ఉస్మానియాలో పి.హెచ్.డి జాయిన్ అవ్వమని చెప్పారు. అలా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి లో చేరాను. నేను ఇంకొక బ్రాహ్మణ అమ్మాయి హేమలత ఇద్దరం పిహెచ్.డి జాయిన్ అయ్యాము.

*మీరు పరిశోధన ఎవరి పర్యవేవేక్షణలో చేసారు ? ఏ అంశం మీద పూర్తి చేసారు ?
లక్ష్మీ రంజనం గారికి బాగా అనుకూలంగా వుండే ఆచార్య.పల్లా దుర్గయ్య గారిని నాకు గైడ్ గా ఇచ్చారు. హేమలతకేమో దివాకర్ల వెంకటావధాని గారు గైడ్ గా ఉండేవారు. హేమలతకి వ్యాకరణ భాషాపరంగా “దక్షిణాంధ్ర సాహిత్యం” అనే టాపిక్ ఇచ్చారు. నాకు దక్షిణాంధ్ర వాజ్మయంలోని సామాజిక పరిస్థితులు( సోషల్ లైఫ్)మీద పరిశోధన చేయమని చెప్పారు. అలా మా ఇద్దరిని తంజావూరు సదరన్ స్కూల్ ఆఫ్ తెలుగు లిటరేచర్ మీద ఇద్దరు కలిసి పని చేయండమ్మా అని పంపించారు.

*మీ పి హెచ్ డి పరిశోధన సమయంలో అనుభవాలు గురించి ?
తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలో మంచి మంచి అరుదైన పుస్తకాలు ఉండేవి.మ్యాన్ స్క్రిప్ట్ పుస్తకాలు కూడా ఉండేవి. అక్కడ ఇద్దరం పుస్తకాలు తీసుకొని ఎవరికి కావాల్సిన పాయింట్స్ రాసుకునేవాళ్ళం.అలా తంజావూరు, కాకినాడ, మద్రాసు వంటి ప్రదేశాలకు మ్యాన్ స్క్రిప్ట్ చూసి రాసుకోవడానికి ఇద్దరం కలిసి వెళ్ళడానికి మా ఇద్దరికీ అనుకూలంగా ఉంటుందని లక్ష్మీ రంజనం గారు ఆలోచించారు.అంతలా ఆలోచించే సంస్కారం ఉన్న ప్రొఫెసర్స్ ఉండేవారు మా రోజుల్లో.

*మీతో పాటు పరిశోధన చేసిన హేమలత కంటే మీరే ఉంది పి హెచ్.డి సబ్మిట్ చేసారు అంట కదా?
అవును , నేను హేమలత కంటే ముందే నా పరిశోధన గ్రంధాన్ని   సబ్మిట్ చేసాను. నా తర్వాతే హేమలత  సబ్మిట్ చేసింది. నా థీసీస్ ని అలా పక్కన పెట్టేసి ఉంచారు. అంటే అక్కడ వివక్ష చూపించారన్నమాట. నేను నిడదవోలు వెంకట్రావు గారి దగ్గర చాలావరకు సలహాలు తీసుకొనేదాన్ని. ఆయన దక్షిణాంధ్ర వాజ్మయంలో ఎక్స్పర్ట్ అన్నమాట. వాళ్ల అబ్బాయి సుందరేశ్వరరావు కూడా నాకు సలహాలు ఇచ్చేవారు. ఆయన్ని అడిగాను ఏమిటండీ…నా థీసీస్ అలా పెట్టేసి ఉంచారు. ఎందుకని అని అడిగితే ఆ థీసీస్ నెలటూరి వెంకట్రామయ్య గారి టేబుల్ మీద ఉన్నాయండి. అవి అలా ఉంటాయి అంతే అని అన్నాడు.
అప్పటికీ నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు నేను నిజాంబాద్ కాలేజీలో లెక్చరర్ గా పని చేయడానికి వెళ్లాను. తర్వాత హేమలత డిగ్రీ ప్రకటించిన తర్వాతనే నాకు వైవా ఏర్పాటు ఏర్పాటు చేశారు. అంటే అందులో నేను పెద్ద కుట్ర ఉందని కూడా అనుకోలేదు.

*తెలుగు సాహిత్యంలో పి.హెచ్.డి చేసిన తొలి మహిళ అనే గౌరవం దక్కలేదు ఎలా అనిపిస్తుంది మీకు గుర్తు చేసుకుంటే ?
కానీ తెలుగు సాహిత్యంలో పి.హెచ్.డి చేసిన తొలి మహిళగా ఆవిడ పేరు తీసుకురావడానికి కొద్దిగా నన్ను వెనక్కి నెట్టారని అన్నారు. కానీ నాకు తెలిసినంతవరకు పి.హెచ్.డి చేసిన తొలి దళిత మహిళగా నేను అంతగా ఫీల్ అవ్వలేదు. నా కొలీగ్స్ గాని, నాతోటి లెక్చరర్స్ అందరూ నన్ను బాగానే చూశారు.అయితే ఆ థీసెస్ మాత్రం నేను ప్రింట్ చేయలేకపోయాను. ఇప్పటికీ దాని గురించి విచారిస్తూనే ఉంటాను. అంటే అది వ్యవహారిక భాషలోకి మార్చి, తర్వాత ప్రింట్ వేద్దామనుకున్నా కానీ అది కుదరలేదు.

*తెలుగు అకాడెమీలో పనిచేస్తున్న రోజుల్లో సాహిత్య పదకోశం వ్యాల్యూమ్.l వ్యాల్యూమ్.ll తీసుకువచ్చి సాహితీ లోకానికి అందించిన ప్రయాణంలో మీకు ఎదురయిన సవాళ్ళు వివరిస్తారా?
జ.అది చాలా పెద్ద ప్రయాణమే,ఎందుకంటే 1978లో తెలుగు అకాడెమీకి వచ్చాను. తెలుగు అకాడెమీ అంటే అగ్రహారమనేవిధంగా ఉండేది. అకాడెమీలో అన్ని కులాల వారికి ప్రవేశం లేకుండా ఉండేది. ఒక వర్గం వారు మాత్రమే ఎక్కువగా ఉండేవారు. వెంకటస్వామి గారు డైరెక్టర్ గా వచ్చారు. అకాడమీ వాళ్ళు రీసెర్చ్ ఆఫీసర్ పోస్టు ఇచ్చారు. అందులో ఒకటి రిజర్వేషన్ పోస్ట్. అప్పటికి నేను నిజాంబాద్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. అందుకనే ఆ పోస్ట్ కి అప్లై చేయలేదు. మావారు తారకం గారు ఆ పోస్ట్ కి అప్లై చేయవచ్చు కదా. అది రిజర్వేషన్ పోస్ట్ కదా అన్నప్పుడు నేను ఆ పోస్ట్ కి అప్లై చేస్తే నేను ఎంపిక అయ్యాను.

*అకాడమీలో ప్రాజెక్టులు గురించి , పని ఎలా ఉండేది ?
అకాడెమీలో రకరకాల ప్రాజెక్టులు ఉండేవి. ఆ ప్రాజెక్టులో శబ్దసాగరం అని ఒక ప్రాజెక్ట్ ఉండేది. అది సూర్యరాయాంధ్ర నిఘంటువు కంటే పెద్ద స్థాయిలో నిఘంటువు తయారు చేయాలి తెలుగులో. ఆ ప్రాజెక్ట్ లో ఎం. ఏ తెలుగు పి హెచ్.డి చేసిన వారు చాలా మంది ఉన్నా వాళ్లచేత డిక్షనరీ లో ఉన్నపదాలు తీసుకొని వేరేచోట రాయించేవారు. అలా రెండు నెలలు గడిచిపోయాయి. వెంకటస్వామి గారు పి హెచ్ డి చేసిన నిన్ను ఇక్కడకు తీసుకువచ్చి ఇటువంటి పనులు చేయించడం కాదమ్మా నీకు ఏదైనా మంచి ప్రాజెక్టు ఇవ్వాలని చెప్పి. సాహిత్య పదకోశం అనే ప్రాజెక్టు ఉంది.అది నువ్వు చేయాలని అన్నారు.

*ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎదురయ్యిన సంఘటనలు  మాతో పంచుకుంటారా ?
నన్ను ఇన్చార్జిగా పెడితే మిగతావాళ్ళు ఏదైనా దబాయిస్తారేమో అని చెప్పి,శివ నారాయ్య ను ఇన్చార్జిగా పెట్టారన్నమాట. ఆ ప్రాజెక్టు మీద సర్వాధికారాలు ఇచ్చారు.నాకేమో అసిస్టెంట్ గా ఒక రోజు ఆర్డర్ వచ్చేసింది.ఆ ఆర్డర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సాహిత్య కోసం ప్రాజెక్టు మాల,మాదిగ చేతిలో పడిందిఅని. డైరెక్టర్ వెంకటస్వామి కూడా వాళ్ల వాడే కావడం వల్ల ఆ ప్రాజెక్ట్ వాళ్లకు ఇచ్చారని.వాళ్ళేం పూర్తి చేయగలుగుతారని మాల తెలుగు మాదిగ తెలుగు తెలుగు అని హేళనగా మాట్లాడుకునేవారట. ఈ ప్రాజెక్టు ఎలా పూర్తిచేస్తారో చూద్దాం .అని లైబ్రరీలో మాకు అవసరమైన పుస్తకాలు వేరేచోట పెట్టేసేవారు మాకు కనిపించకుండా. ఆఫీస్ లో ఎవరూ కూడా సహకారం అందించే వారు కాదు. మాకేమో ఎంట్రీ ఎలా రాయాలి?ఏ క్రమంలో రాయాలి ?అనేది తెలియదు.మాకు బ్లూప్రింట్ కూడా దొరక్కుండా చేశారు.మేము మా సొంత పరిజ్ఞానంతో ఒక ఫార్మేట్ పెట్టుకుని చాలా తక్కువ కాలంలో తయారుచేసాం.

*ఫార్మేట్ తయారు చేసుకోవడంలో ఎలాంటి పద్దతులు పరిగణనలోకి తీసుకున్నారు ?
నన్నయకు పూర్వం అంటే ప్రాచీనకాలం నుంచి1950 వరకు ఉన్న సాహిత్యం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న సాహిత్యాన్ని మేము పరిష్కరించాము. అప్పట్లో శాసనాలు మాత్రమే ఉండేవి. ఆ శాసనాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఫలానా దేశంలో తెలుగు అక్షరాలు కనపడ్డాయి. ఫలానా సంస్కృతంలో కూడా తెలుగు పదాలు ఉన్నాయి అని అవన్నీ సేకరించి చేసాము. ఇంత రీసెర్చ్ అవసరమా? అని డిస్క్రేజ్ చేసేవారు చాలామంది.అయితే మేము చాలా పటిష్టంగా ఆ పదకోశాన్ని తయారుచేసాం.

*అంత శ్రమ పడి తయారు చేస్తున్న పద కోశాన్ని పూర్తి కాకుండానే మధ్యలో ఆపి ముద్రణకు పంపవలసిన కారణం ఏమిటి ?
ఇంతలో వెంకటస్వామి గారు ట్రాన్స్ఫర్ అవుతున్నారు అని తెలిసింది మాకు. దాంతో శివనారయ్య వెంకటస్వామి గారు వెళ్ళిపోతే ఇంత కష్టపడి పూర్తిచేసిన ఈ ప్రాజెక్ట్ కి విలువ ఉండదని చెప్పి. వెంకటస్వామి గారు ఉండగానే ఈ పుస్తకం ఒక భాగమైనా అచ్చువేద్దాం.వేరేవాళ్ళు వస్తే దీన్ని మూలన పడేస్తారు. అని చెప్పి వెంకటస్వామి గారి దగ్గర ప్రింటింగ్ పర్మిషన్ తీసుకున్నాం. అప్పటి వరకు సేకరించిన పదకోశం రెండు భాగాలుగా విడగొట్టి నన్నయకు పూర్వమునుండి 1850 వరకు ప్రాచీన సాహిత్యం.1851 నుండి1950 వరకు ఆధునిక సాహిత్యంగా విడదీసి రెండు భాగలుగా చేసి పదిరోజుల్లోపల రాత్రింబవళ్ళు కష్టపడి చేసాం. శివ నారయ్య ఆ కాగితాలు ఆఫీస్ లో ఎక్కడా టేబుల్ మీద కూడా పెట్టేవాడు కాదు.ఒకవేళ అవి ఎవరి చేతిలోకైనా వెళితే మాకు దొరకవు. అంత వ్యతిరేకత ఉండేది మాపై అకాడెమీలో. అంత కష్టపడి రక్షించుకున్నాం ఆ ప్రాజెక్ట్ ని. వెంకటస్వామిగారు వెళ్లిపోయాక ఆ పుస్తకాలు ప్రింటింగ్ నుంచి బయటకు వచ్చాయి.

*మిమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన వెంకట స్వామిగారు ఆ పదవి నుంచి వెళ్ళిపోయాక ఎదుర్కొన్న సమస్యలు ?
వెంకటస్వామి స్థానంలో వచ్చిన వేరే అధికారికి మాపై వ్యతిరేకంగా చెప్పారు. ఇదంతా మాల,మాదిగ సాహిత్యం అని. అది సాహిత్య కోశం కాదు,సాహిత్య శోకము అని పండితలు రవీంద్రభారతి లోనో, సాహిత్య పరిషత్తులోనో కూర్చొని చెప్పుకునేవారట. ఆ సాహిత్య పదకోశం ప్రింటింగ్ అయి బయటకు రాగానే చాలా పత్రికల్లో చాలా విమర్శలు చేపించారు, రాయించారు. అంతే కాకుండా అసెంబ్లీలో తెలుగు అకాడెమీ ప్రచురించిన సాహిత్యకోశం అన్నీ తప్పులేనట కదా అని ప్రశ్నలు వేయించారు.

*మరి అంతగా మీ పై వ్యతిరేకతల మధ్య  రెండవ భాగం కూడా మీరే చేయాలి అని మిమ్మల్ని గుర్తించి, మీకు ఆ బాధ్యతలు ఇచ్చారు ఎలా ?
ఆ సాహిత్యకోశం పై ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో మేమే గెలిచాము. కొత్త డైరెక్టర్ మనోహర్ గారు శివనారయ్యను ,నన్ను పిలిచి వెంకట స్వామి మీవాడు కాబట్టి మీకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చాడు.అదంతా తప్పులతడక అని అందరూ అంటున్నారు అని చాలా డ్యామేజింగ్ గా మాట్లాడారు. మా భాష పరిజ్ఞానం చెక్ చేయడానికి ఒక టాపిక్ ఇచ్చి ఇన్ పొజిషన్ రాసే పిల్లల్లాగా ట్రీట్ చేసాడు. తర్వాత కొంతకాలానికి మనోహర్ గారు ఎలా తెలుసుకున్నారో ఏమో తెలియదు గానీ ఆయన నన్ను ఎంతగానో అభిమానించారు.అటుతర్వాతఅసెంబ్లీలో వేసిన కమిటీ రెండవభాగం కూడా మొదటిభాగం పూర్తి చేసినవాళ్ళే పూర్తి చేయాలని,మొదటిభాగం లో ఉన్నతప్పుల్ని సరిచేసి, రెండోభాగం కూడా పూర్తి చేయాలి అని ఆ కమిటీ సూచించింది .ఆ కమిటీ చెప్పాక అందరూ మా గురించి తెలుసుకుని చాలా గౌరవంగా చూడటం మొదలు పెట్టారు.ఆ తర్వాత వచ్చిన డైరెక్టర్ లు కూడా మమ్మల్ని చాలా గౌరవించారు. వీరు చాలా నిబద్ధతతో పని చేస్తారు, ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా చూస్తారు అని పేరు వచ్చింది మాకు.

*ఈ సాహిత్య పద కోశం విషయంలో మీరు ఆశించిన అంత సంతృప్తి చెందారా ?
సాహిత్య పదకోశం పుస్తకం తీసుకురావడంలో పడిన కష్టానికి మాకు తగినంత పేరు రాలేదు.ఇదే పని ఏ శాస్త్రో,శర్మో రాస్తే సభలు,సమావేశాలు పెట్టి ఘనంగా సన్మానించేవారు.కానీ ఇంతపెద్ద వ్యాల్యూమ్స్ రాసిన మాకు అంతలా పేరు రాలేదని చెప్పాలి.

(ఇంకా ఉంది )

– కట్టూరి వెంకటేశ్వరరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

ముఖాముఖిPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments