ఏ రాత్రి భోజనాలు అయ్యాకో
మేడ మీదికి చేరి
చిరిగిన ఆకాశాన్ని చూస్తూ
నా గడచిన దినాన్ని నెమరేసుకోవాలనుకుంటాను…
ఒక్కో చుక్కా ఒక్కో చుక్కై కంట్లోంచి జారుతుంది
వెన్నెలా చీకటీ కలిసిన చోటు కదా అది
నా మనసల్లే ఎప్పుడూ చిక్కు చిక్కుగా ఉంటుంది
మల్లెల పరిమళాలు
చల్లగాలి కబుర్లు
చందమామ చుట్టపు చూపులు
నిశి దాచిపెట్టే నీడలు
ఇవేవీ నాలోకి దూరలేవు
అంతంలేని ఆలోచనల్ని ఆపలేవు
నిజం కాని కలలు
మూతలు పడే కనులు
కన్నీటిని తాగే తలగడలు
దేహాన్ని మాత్రం కప్పగలిగే దుప్పట్లు
ఇవేవీ నాలోని చలిని తగ్గించలేవు
నా ఆత్మ రాయని కథను ప్రదర్శించలేవు
నేనో మనిషిననే నిజాన్ని
కొన్ని గంటలన్నా మరచిపోవాలనుకుంటాను
చిదిమి దీపం పెట్టే చీకటిలో
నేను తప్పిపోవాలనుకుంటాను
దూరంగా వెలిగే మిణుగురు పురుగునై
అనంత యానాన నాలా
నేను బతకాలనుకుంటాను
చేయి పట్టుకున్న బాధలేవో
నన్ను విడిస్తేనే కదా ఇది సాధ్యం…
తీగలై అల్లుకున్న దినచర్యలేవో మోడువారితేనే కదా
నాకా అదృష్టం….
నన్ను నిలేసే నిత్యకృత్యాలేవో
సెలవంటూ వీడ్కోలు పలికితేనే కదా
నే చేరేది ఆ గమ్యం…..
-సుధామురళి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~