జ్ఞాపకం- 55 – అంగులూరి అంజనీదేవి

అసలు తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండడానికి ఇల్లు, పీల్చటానికి గాలి, తాగటానికి నీళ్లు ఎంత అవసరమో మనిషి ఎదుగుదలకి విజ్ఞానం అనేది అంత అవసరం. విద్యాలయాలు, దేవాలయాలు, గ్రంథాలయాలు వెరీవెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అన్నదానం, నేత్రదానం, విద్యాదానం చాలా పవిత్రాతిపవిత్రమైనవి. అందుకే మీ ఇంట్లో మీరు చదివాక మళ్ళీ మీకు ఉపయోగపడని ఎలాంటి పుస్తకాన్ని అయినా గ్రంథాలయానికి అందజేస్తే అక్కడ మండల, మండల పరిధిలోని గ్రామాలేకాక శివారు తండావాసులు ఇలా ఎంతో మంది పాఠకులు వాటిని చదువుతారు.

ఒక నిరుద్యోగికి ఉద్యోగం రావాలన్నా, ఒకరు డాక్టరు కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఎయస్ ఆఫీసర్ కావాలన్నా పుస్తకాలే ఆధారం అంటుంటారు. అవన్నీ సంలేఖ వింటుంది. అంతేకాదు, ఆ వాతావరణంలో ఆమె చాలా తెలుసుకుంది. పుస్తకాలు జ్ఞాన ధనాగారాలని, విశేష జ్ఞానసంపదకు మూలాధారాలని. అవి మనలో తప్పిపోతున్న ఆలోచనలను అదుపులో వుంచి మనశ్శాంతిని ఇస్తాయని. మూసివున్న తలుపుల వైపే చూస్తూ కాలాన్ని వృధా చేసుకోకుండా మనకోసం తెరుచుకున్న తలుపులు వైపు ఎలా నడవాలో నేర్పిస్తాయని. నడిచేలా చేస్తాయని ఆమె తెలుసుకుంది.

ఆమె రోజూ లైబ్రరీకి వెళ్తుంటే “ఇంట్లో వుండి ఏం చేస్తుంది? వెళ్లి చదువుకోనియ్!” అనుకునేవాళ్ళు రాఘవనాయుడు, సులోచనమ్మ.

తిలక్ ముఖం అదోలా పెట్టి ఎగతాళిగా నవ్వి “థీసెస్ రాయాలన్నా నీ క్వాలిఫికేషన్ సరిపోదు. ఎందుకే పిచ్చిదానా రోజూ వెళ్తావ్ లైబ్రరీకి?” అని నెత్తిమీద మొట్టేవాడు.

అదిచూసి రాజారాం వారిస్తూ “పుస్తకాలు చదివితే తెలియని విషయాలు చాలా తెలుస్తాయి తిలక్ వెళ్లనీ! అదేమైనా సినిమాలకీ, బ్యూటీపార్లర్లకి వెళ్తుందా? లైబ్రరీకేగా!” అనేవాడు.

రాజారాం సపోర్టుతో సంలేఖకి ధైర్యం వచ్చేది. తేలిగ్గా వూపిరి పీల్చుకునేది.
నెమ్మదిగా రాజారాం దగ్గరకి వెళ్ళి “థ్యాంక్స్ అన్నయ్యా! నువ్వలా అనకుంటే తిలక్ అన్నయ్య దీన్ని పెద్ద

ఇష్యూ చేసి నాన్న మనసు మార్చేవాడు. అప్పుడు నాన్న నన్ను సిటీకి వెళ్లి బుక్స్ తెచ్చుకోనిచ్చేవాడు కాదు” అనేది కృతజ్ఞతగా.

సంలేఖ లైబ్రరీ నుండి తెచ్చుకున్న పుస్తకాలు రాత్రివేళల్లో చదువు కోటానికి వీలుగా ఆమె పడుకునే మంచానికి పక్కనే బెడ్ ల్యాంప్ పెట్టించింది కూడా రాజారామే.

రాజారాంకి టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆదిపురికి 30 కిలోమీటర్ల దూరంలో వుండే తండాలో ఓ స్కూల్లో వచ్చింది. ఇప్పుడుండే కాంపిటీషన్లో రాజారాం ఉద్యోగం సంపాయించటం నిజంగానే గొప్ప విషయం. రోజూ ఆ ఊరికి వెళ్లాలంటే కొంతదూరం బస్ లో , కొంతదూరం ఆటో, కొంతదూరం కాలినడక తప్పనిసరి. తండాల్లో టీచర్లుగా పనిచేసే వాళ్లంతా రోజూ అలాగే వెళ్తుంటారు.

ఎండి పోతున్న పంటపొలంలో వర్షం పడ్డట్లు పెద్దకొడుకు ప్రయోజకుడయ్యాడని మురిసిపోయారు రాఘవరాయుడు, సులోచనమ్మ. ఆర్దికపరమైన కష్టాలు తొలిగిపోతాయనుకున్నారు.

అప్పుడే డిగ్రీ ఎగ్జామ్స్ రాసి ఇంట్లోవున్న వినీలతో రాజారాం పెళ్ళి చేశారు. చాలా సంతోషంగా, వీలైనంత ఘనంగా చేశారు.

వినీల చదువుకునే రోజుల్లో ‘పెళ్లయ్యాక జీవితం ఎలా వుంటుందో? ఇలా వుంటేనే బావుంటుంది. ఇలాగే వుంటుంది. ఇలాగే వుండాలి’ అని తనకి నచ్చిన రీతిలో కలలు కంటూ వుండటం వల్లనో ఏమో ఇప్పుడు కూడా ఆమె మనసు ఆమె అనుకున్న రీతిలోనే స్పందిస్తోంది అనుకున్నది జరగనప్పుడు యుద్ధం చేస్తోంది.

సంలేఖ, తిలక్ ఇంటర్ పాసయి డిగ్రీలో చేరారు.
                                           

                                                  ******

మరో మూడు సంవత్సరాలు గడచిపోయాయి.
ఇప్పుడు సంలేఖ, తిలక్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో వున్నారు.

డిగ్రీలో ఎప్పుడైనా ఒకే క్లాసులో గ్రూపులుగా వుంటారు. ఒక గ్రూపు మరో గ్రూపుతో దేనిలోనైనా పోటీ పడుతుంటారు. డిగ్రీలో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదివేవాళ్ళు ఎక్కువగా వుంటారు. కొందరు ఇంట్లో పరిస్థితుల వల్ల జాబ్ చేస్తే, మరికొందరు పాకెట్ మనీ కోసం జాబ్ చేస్తుంటారు. డిగ్రీ పూర్తయ్యేలోపు బయటకెళ్లాక ఎలా బ్రతకాలో నేర్చుకుంటుంటారు. ఇంటర్లో పేరెంట్స్ కి ఫోన్
చేయడం కోసం కాయిన్ బాక్స్ దగ్గర క్యూలో నిల్చుంటే డిగ్రీలో మొబైల్ మెయిన్ టెయిన్ చేస్తారు. ముఖ్యంగా డిగ్రీలో లెక్చరర్స్ కి భయపడే విద్యార్థులు చాలా తక్కువగా వుంటారు. క్లాసులు కూడా హాఫ్ డే నే నడుస్తాయి. మిగిలిన హాఫ్ డే ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్లు వుంటారు.

తిలక్ తన స్వభావానికి తగినట్లుగానే వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం తనతో చదువుతున్న విద్యార్థులతో ఫ్రీగా కలిసిపోగలుగుతున్నాడు. సంలేఖ అలా కలవలేకపోతోంది. ఆమె ఆలోచనలు కాని, ప్రవర్తన కాని వాళ్లకన్నా మెచ్యూర్డ్ గా అన్పిస్తున్నాయి.

కాలేజి అయ్యాక అప్పుడప్పుడు జిల్లా గ్రంథాలయానికో, లేక అదే సిటీలో వున్న తన స్నేహితురాలు హస్విత ఇంటికో వెళ్తుంటుంది.

                                                                          *******

హస్వితకి డిగ్రీ పూర్తయ్యాక దిలీప్ తో పెళ్లయింది. అతనికి మొదటి నుండి జర్నలిజం అంటే ఇష్టం కాబట్టి ప్రస్తుతం జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు. దిలీప్ తన వృత్తిరీత్యా ఇంట్లో వుండేది తక్కువ. అందుకే సంలేఖ ఎక్కువగా హస్విత దగ్గరకి వెళుతుంది. అంతేకాదు వాళ్లిద్దరు వాళ్లకి నచ్చిన ఐటమ్స్ చేసుకుని తింటారు. హ్యాపీగా వుంటారు.

సంలేఖ హస్విత వాళ్ల ఇంటికి వెళ్లినా, గ్రంథాలయానికి వెళ్లినా, తను రాసిన కధలను పత్రికలకు పంపించాలని పోస్టాఫీస్ కి వెళ్లినా ‘నేను ఫలానా చోటుకి వెళ్తున్నా అన్నయ్యా! అమ్మతో చెప్పు. ఇంటికి సాయంత్రం వరకు వచ్చేస్తాను’ అని తిలక్ తోచెప్పే వెళ్తుంది.

తిలక్ తో చెప్పకుండా ఎక్కడికీ వెళ్లదు.
కానీ వినీల రాజారాంతో “మీ చెల్లెకి కాలేజీ వదలగానే ఇంటికి రావాలని తెలియదా? ఇవాళ రేపు బయట పరిస్థితులు ఎలా వున్నాయో తెలుసుకదా! తెలిసికూడా భయం చెప్పరెందుకు? ఏదైనా సమస్య వస్తే పనులు పోగొట్టుకొని తిరగాల్సింది మీరే! మామయ్యగారికి ఇలాంటివి ఎలా తెలుస్తాయి. పొలం పనులు తప్ప” అంది ఇంట్లో అందరూ వినేలా.

అంతా అవాక్కయ్యారు. అలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు వాళ్లకి. సంలేఖ కూడా చదువుతున్న పుస్తకాల్ని పక్కన పెట్టి బిత్తరపోయి చూసింది.

“అది వింటే బాధపడుతుంది. ప్లీజ్! ఇంకెప్పుడూ అలా మాట్లాడకు. పోరానిచోట్లకు అది పోదు. మా నాన్న మమ్మల్ని అలా పెంచలేదు” అన్నాడు రాజారాం.

కన్పిస్తూనే వుంది వాళ్ల పెంపకం అన్నట్లు తిలక్ వైపు ఒక రకంగా చూసింది వినీల. ఆ చూపుకి తిలక్ ఉలిక్కిపడి ‘ఈవిడేంటి ఇలా చూస్తుంది? ఇప్పుడు నేను బాగానే వున్నానుగా. అప్పుడెప్పుడో ఇంటర్ తప్పితే ఇప్పుడు కూడా ఇలాగే చూడాలా? అదేంటో తన చిన్నప్పటి నుండి తనేం చేసినా తన తల్లిదండ్రులనే అంటుంటారు. చేసేది తను మాట పడేది తన తల్లిదండ్రులు’ అని మనసులో అనుకుంటూ ఉక్రోషాన్ని అణచుకుంటున్నాడు.

వినీల అదేం గమనించటం లేదు. నిన్న సంలేఖను ఒక నవల అడిగితే “అది లైబ్రరీలో ఇవ్వాలి వదినా! ఇది తీసుకో” అంటూ వేరే నవల ఇచ్చింది. పోన్లే అని రాజీపడి ఆ నవలను చదువుకుంటూ ఊయలబల్లపై కూర్చుని వుంటే “ఇవి వెనకటి యద్దనపూడి రోజులు కావుతల్లీ! వచ్చి పనిచూడు” అంది అత్తగారు.

అదే తన కూతురు ఇదే ఊయల బల్లపై కూర్చుని ఎంత చదివినా, ఎంత రాసినా, ఎంత నిద్రపోయినా ఏమీ అనదు. ఏ విషయంలో కూడా కూతుర్ని పట్టించుకోదు. అదే మా అమ్మ అయితే కాలేజీనుండి ఓ పది నిముషాలు రావడం ఆలస్యమైనా ఎదురుచూస్తుంది. వచ్చాక లక్ష ప్రశ్నలు వేస్తుంది. విసుగొచ్చి ఎదురు మాట్లాడితే “కాళ్లు విరగొడతా! నోర్ముయ్!” అంటుంది.

(ఇంకా ఉంది )

— అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో