జనపదం జానపదం- 10 – జానపదుల వివాహం నాడు, నేడు – భోజన్న


మానవ జీవితంలో మూడు పండగలుంటాయని జానపదులు చెబుతుంటారు. అందులో మొదటిది పుట్టుకలో పురుడు చేయడం. రెండవది వివాహం ఇది జీవితాంతం మరచిపోలేనిది. మూడవది మరణం ఈ మూడింటిని ఆనందంతో చేసుకోవాలని జానపదులు నేటికి నమ్ముతారు.

ప్రాచీన కాలంలో ఈ మూడు తంతులు ఎంతో ఆనందంగా చేసుకున్న జానపదులు నేడు పాత ఆచారాలను సాంప్రదాయాలను మరచిపోతూ బాధ్యతగా చేయాల్సిన కార్యక్రమాలని బాధతో చేయడం కనిపిస్తుంది.

పుట్టుక సమయంలోనూ అనేక నిబంధనలు, గీతలు గీసుకొని బాధపడుతూ పెండ్లి సమయంలోనూ ఆడంబరాల విషయంలో అధిక ధన వ్యయం చేస్తూ ఆనందాలకు దూరం అవుతున్నారు. ఆప్తులను చూడాల్సిన వధూవరుల కండ్లు ఆస్తులను పరిశీలించడం, పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టే నేటి వధువరుల జీవితాలు మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతున్నాయి.

ఒకప్పుడు కష్టాలలోను , కన్నీళ్ళలోను ఒకరికొకరు కలిసున్న జంటలు తమ జీవితంలో మంటలు పోసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల్లో కానీ, బంధువులలో కాని ఒకప్పటి ప్రేమలు, ఆప్యాయతలు ఏ మాత్రం కనిపించడం లేదనే చెప్పాలి.

ప్రాచీన కాలంలో వివాహం ఆదారభిమానాలతో విలసిల్లిన మండపాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. వివాహానికి సమయం కేటాయించని వారుకొందరైతే ఆదరాబాదరాగా పెండ్లికి వచ్చి వెళ్ళేవారు కొందరు. ప్రస్తుతం వివాహానికి హాజరు కోసం మాత్రమే వచ్చేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కాబట్టే సిరియోల్స్ లో, సినిమాలలో ప్రాచీన కాలంలోని వివాహాలను ప్రదర్శిస్తూ మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తారు. జీవితంలో ఒకేసారి చేసుకునే వివాహంలో కుడా అనేక లోటు పాట్లు కనిపిస్తాయి. కారణం మనం ఆధ్యాధునిక జీవనం గడుపుతూ వేగాన్ని అందిపుచ్చుకుని అందరికి దూరంగా జరిగిపోయారు.
ఐరేండ్ల పూజా : పెండ్లిలో అత్యంత ముఖ్యమైన తంతు ఐరెండ్ల పూజ. కుమ్మరి ఇంటినుండి కొత్త కుండలను తీసుకొచ్చి పూజించే విధానాన్ని ఐరెండ్ల పూజ అంటారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత నిష్టగా, శ్రద్ధతో చేస్తారు. ప్రాచీన వివాహ వ్యవస్థను గమనిస్తే అన్ని కులాల కలుపుగోలుగా తోస్తుంది. గ్రామంలోని అనేక కులాలు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తారు. అందుకు ప్రతిఫలంగా వీరికి అనేక కట్న కానుకలు సమర్పించుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.

పోలు పీట : పచ్చని పందిరి అయిపోయిన తరువాత వడ్లుపోసి దానిపైన ఎత్తైన పీటను వేసి పెండ్లి కుమారుడిని దానిపై కూర్చోబెట్టి మంగళి మైలపోలు తీస్తాడు. అనగా పెండ్లి కుమారుని కాలి గోర్లు మొదలైనవి శుభ్రం చేస్తాడు.

గంటె పుస్తెలు : పెళ్ళిలో ప్రధానమైనవి గంటేపుస్తేలు. స్త్రీ కి వివాహం ఐంది అనడానికి ప్రధాన సాక్ష్యం. పెళ్ళిలో ఈ గట్టాన్ని మాంగల్యధారణ అంటారు. దీనిని చాలా పవిత్రంగా బావిస్తారు. దీనికి పవిత్రంగా పూజ చేసి ముత్తైదువులతో నమస్కరించి వరుడి చేత వడువు మెడ లో కట్టిస్తారు. పెళ్లి అయిన తరువాత వీటిని ఎత్తి పరిస్థితుల్లోను మెడనుండి తీసివేయరు.

అందుగ గుంజ : అందుగ చెట్టు కాండాన్ని తెచ్చి పచ్చని పోరుక రోజున ఇంటి ముందు నాటుతారు. ఇది కళ్యాణ అభివృద్ధి మరియు క్షేమాన్ని సూచిస్తుంది. ఈ చెట్టు అంత పెద్దగా పెరిగితే కాపురం అంత చక్కగా ఉంటుందని గ్రామీణులు నమ్ముతారు. ( తాటికాయల పుష్ప, 52 దొంకేశ్వర్, భీర్పూర్, జగీత్యాల)

పోచమ్మ పూజ : పెళ్ళికి కొన్ని రోజుల ముందు ఈ పోచమ్మ పూజను నిర్వహిస్తారు. దీనిని ఆదివారం రోజున యాటలతో చేస్తారు. పేదవారు కోడితో చేసుకుంటారు. ఈ పూజకు గ్రామంలో అత్యంత ప్రాముఖ్యం ఇస్తారు. దప్పులు, బ్యాండ్, పరివారం, బంధువులు కలిసి ఈ మొక్కు చెల్లిస్తారు.

పచ్చ పొరుక : పెళ్లి ముందు రోజును పచ్చని పోరుక అంటారు. పచ్చని పొరుక అనగా ఇంటిముందు పందిరిపై పచ్చని చెట్టు కొమ్మలని వేసి నీడ చేయడం. కాపురం కలకాలం పచ్చగా ఉండాలని దీనిని చేస్తారు. పూర్వం ఎద్దుల బండిలో అడవి నుండి ఈ పచ్చని పొరుకని తెచ్చేవారు. ప్రస్తుతం టెంట్ వేస్తూ సరిపెట్టేవారు లేకపోలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి భోజనం పెట్టి వారి ఇంటికి పంపిస్తారు.

పసుపు ఇసురుడు : ముతైదువులు కొందరు కలిసి పసుపు కొమ్ములను ఇసురురాయిలో వేసి ఇసురుతారు.
సరసాలు, సరదాలు : పెండ్లి సమయాలలో బంధువులందరూ ఒకచోట కలిసి సరసాలు, సరదాగా గడుపుతారు. ఈ సందర్భంలో బావ మరదళ్ళ, తాత మనుమల సరసాలు ఎక్కువగా ఒకప్పుడు కనిపించేవి. నేడు ఇవన్నీ క్రమక్రమంగా అంతరించిపోతున్నాయని చెప్పవచ్చు.

– భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కాలమ్స్Permalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments