తెలుగు గజల్ ప్రేమికులకు నమస్సులు……………….
ప్రేయసి సౌందర్యాన్నివర్ణించేందుకు ఎప్పుడూ పదాలు తక్కువైపొతూ ఉంటాయి.
ఆ సౌందర్యాన్ని కోరికల రూపంలోకి మార్చి ప్రేమికుడు పాడుకొనే గజల్ ఇలానే
ఉంటుందేమో కదా. కనురెప్పలపై సుతిమెత్తని కలలు ఒక్కొక్కటీ పడుతుంటే
ఆ హాయిని వర్ణించగలమా… కన్నులలో చెలిరూపం కొలువైతే అంతకంటే కావాల్సినది
ఇంకోటుంటుందా… వయ్యారి నడక చూసి బాట తూలిపోవడం అది చూసి ఇలాంటి నడక
తమకు లేదని హంసలు సిగ్గుపడడం , ప్రతీరాత్రీ పున్నమిగా మారిపోవాలంటే జాబిలికంటే
ఎక్కువగా వెలిగిపోయే ప్రేయసిలోని ఒక్క కళను జాబిల్లికి పూయమని అడగడం ఇవన్నీ
అతిశయోక్తులతో కూడిన ప్రేయసి సౌందర్య స్తుతి. గజల్ చదివేందుకు ఆలస్యమెందుకూ
మీకోసం ఈ గజల్ :
గజల్ :
రెప్పలపై కలలపూలు జల్లవేమిమనోహరీ
కన్నులపై నీ రూపుని కప్పవేమి మనోహరీ
వయ్యారపు నడకచూసి బాటతూలిపోతున్నది
హంసలకే బిడియాలను నేర్పవేమి మనోహరీ
మెరిసిపోతు ఉండాలనిఅప్సరసలు తపిస్తారు
నీ చూపులలో వారిని ముంచవేమి మనోహరీ
ప్రతిరేయీ పున్నమిలావెలగాలనుకుంటున్నది
ఒక్క కళను జాబిల్లికి పూయవేమి మనోహరీ
వియోగమే నదిగ మారి మనమధ్యనపారుతోంది
ప్రేమనావ నడుపుకుంటు దాటవేమి మనోహరీ
నీవులేని వేళలోన కయ్యానికిపిలుస్తోంది
విరహంపై నీ నవ్వులు నాటవేమి మనోహరీ
మదిగూటిని అమావాస్యవదలకుంది “నెలరాజా”
వెలుగుపిట్టలాగ వచ్చి వాలవేమి మనోహరీ .
-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~