గాయాలు నోరుమూసుకోనుండవు(కవిత )-పల్లిపట్టు.

దేవుళ్ళ కుమ్ములాటలో
దగా పడుతున్న నామూలాల నేలా!
ఇంకా
దుఃఖిస్తూ వుండటమంటే క్షమించని నేరమే
ఇకపై
సానుభూతి పొడిదగ్గులుంటే మనచేవలేనితనమే

పదవీముక్కులతో పొడుస్తున్న గద్దలొకవైపు
అధికారపుగోళ్ళతో రక్కుతున్న డేగలొకవైపు

అవమానవుముండ్లు గుచ్చుకుని
పుండ్లుదేలినసలపరింపులు కండ్లుమూసుకోనుండవు
పరాజితుని చూరుకిందా
గాయలెప్పుడూ నోరుమూసుకోనుండవు

రాతిబొమ్మల రంకులో చితికిపోతున్న కలమా!
ఏ మాయమాటల నూతిలో పడి ఈదులాడుతున్నావు?

దినానికొకతూరి
బతుకుల్ని పీనుగెత్తే పన్నాగం నడుస్తుంటే
లక్ష గాయాల దేశమా
నువు ఎవరిపక్షమో చెప్పూ.!
సవాలక్ష ద్రోహాల నడుమ రగులుతున్న ప్రజా
నీ లక్ష్యమెటువైపో
ఇప్పుడైనా గొంతువిప్పూ!

-పల్లిపట్టు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments