లైఫ్ పార్ట్నర్ (కథ)-డాక్టర్. షహనాజ్ బతుల్

‘హలో కావ్యా ‘
శాంతి గొంతుక విని వెనక్కి తిరిగాను.
‘చాలా రోజులకు కనిపించావు. బాగున్నావా ? అడిగింది.’
‘బాగున్నాను.అస్సలు ఇంటికి, రావడమే మానేసావు. నీవు బాగున్నావా? మీ ఇంటిలో అందరూ కులాసానా?మా అమ్మగారు కూడా ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు.’
‘ఎప్పుడూ నేనే రావాలేంటి? ఈ సారి నువ్వు మా ఇంటికి వచ్చేవరకు, నేను మీ ఇంటికి రాకూడదనుకున్నాను

‘నేను ఉద్యోగిని. సమయము దొరికేది తక్కువ. నీవు ఖాళీగానే ఉన్నావు. నీవు మా ఇంటికి వచ్చినా, నేను మీ ఇంటికి వచ్చినా ఇద్దరమూ కలుస్తాముగా. అయినా నాతో పోటీ పెట్టుకుంటే, ఎలాగమ్మా? మా శాంతి చాలా

మంచిది కదూ. ఈ శనివారం రెండో శనివారం. మాకు శలవు. ఇంటిలోనే ఉంటాను. ఇంటికి రా’. అన్నాను తన ఛుబకాన్ని, పట్టుకొని.

‘ఎప్పుడూ అలాగే చెప్పి, మురిపించి, నన్నే మీ ఇంటికి పిలిపించు కుంటావు.’ అన్నది బుంగమూతి పెట్టి.
నాకు నవ్వు వచ్చింది. శాంతి అలా చిన్న పిల్లలా మాట్లాడ్తూ ఉంటె, ముద్దొస్తూ ఉంటుంది. చిన్నపిల్ల కాకపోయినా వయస్సులో నా కంటే చిన్నది.

శాంతి, నేను ఒకే కాలేజి లో చదివాము. మేము క్లాసుమేట్స్ కాదు. నేను బి.ఎన్.సి మొదటి సంవత్సరము లో చేరినప్పుడు శాంతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము లో చేరింది. మూడు సంవత్సరములు ఒకే కాలేజి లో ఉన్నాము. హాస్టల్లో ఒకే రూంలో ఉన్నాము.

నేను బి.ఎన్.సి చదివి హాస్టల్ వదిలి వెళ్ళేటప్పుడు, మేము మళ్ళి కలుస్తామో లేదో

అనుకున్నాము. నేను బి.ఎడ్ చదివాను. శాంతి బి.ఎస్.సి తో చదువు ఆపేసింది. ఆ తర్వాత వాళ్ళమ్మ గారు తనకు సంబంధాలు చూస్తున్నారు.

నిజమైన స్నేహము ఉంటె, ఏ కారణము చేతనైన విడిపోతే, తప్పక కలుస్తాము అన్నది నా నమ్మకం. అదే విషయం చెప్పాను. నాకు హైదరాబాద్లో టీచర్ ఉద్యోగము వచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత కలుసుకున్నాము.

వాళ్ళ నాన్న గారికి హైదరాబాదుకి ట్రాన్స్ఫర్ అయ్యింది.
‘ఏమిటి మాట్లాడవు. నీకు, మా ఇంటికి రావడం ఇష్టము లేదు కదూ.’ అన్నది.

‘ కాదు శాంతి. నిన్ను చూసినప్పుడల్లా హాస్టల్ రోజులు గుర్తుకు వస్తుంటాయి. అందుకే గతం లోకి వెళ్లి వచ్చాను. నువ్వీ శనివారం మా ఇంటికి వస్తే, వచ్చే ఆదివారము, నేను మీ ఇంటికి వస్తాను.’
‘నిజంగానా. అయితే ఈ శనివారం తప్పక వస్తాను. ఔను గతంలోకి వెళ్లి వస్తున్నానంటున్నావు. నీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉన్నాడు,’ అడిగింది.

‘బాగున్నాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ పాటలు పాడుతున్నడు. తెలుసా. నువ్వు చాలా కాలంగా మా ఇంటికి రావట్లేదని, బెంగ పెట్టేసుకున్నాడు. తన పాటలు నీకు కూడా వినిపించాలని, తహ తహ లాడ్తున్నాడు.’ అన్నాను నవ్వుతూ.

‘అయితే రావాల్సిందే. ఈ శనివారం సాయంత్రము వస్తాను. ఆంటీకి నా నస్కారము చెప్పు. నా బస్సు వచ్చింది. వెళ్తాను.’ అంటూ వెళ్లి పోయింది.

నా లైఫ్ పార్ట్నర్ ఎంత బాగా పాటలు పాడుతాడో తెలుసా? అతని పాటలు ఇష్ట పడని వాళ్ళు ఈ ప్రపంచములో ఉంటారా? అన్పిస్తుంది. అతని పాటలు వింటూ సర్వమూ మర్చి పోతాను. తన్మయత్వము చెందుతాను. పొయ్యి మీద అన్నము, కూర పెట్టి, అతని పాటలు వింటూ అన్నం కూర మాడ్చేస్తూ ఉంటాను. నాకు కోపం వస్తే పాటలు విన్పించడు.

అతని పాటలు ఒక్క రోజు వినక పోతే అస్సలు మనస్సు బాగుండదు.ఏ పని సరిగ్గా చెయ్యలేను. అతని ఆరోగ్యం పాడైతే, వెంఠనే డాక్టర్ దగ్గరకు, తీసుకు వెళ్తాను.

మరి అతని పాటలు వినక పోతే నేనుండలేను కదా.
ఒకసారి నా స్నేహితురాళ్ళు, శాంతి, కోమలి కలిసి మా ఇంటికి వచ్చారు. నా లైఫ్ పార్ట్నర్ కి ఆరోగ్యము పాడైంది. అందుకే డాక్టర్ దగ్గరకు , తీసుకెళ్ల బోతున్నాను. అతన్నినా హృదయానికి హత్తుకున్నాను, ఎదురుగా శాంతి, కోమలి ఉన్నారని ఆలోచించ కుండా

‘ చూడు కోమలి, కావ్య తన లైఫ్ పార్ట్నర్ ని ఎలా కౌగలించుకుందో. ఒక్క క్షణము విడిచి ఉండలేదు.’ అన్నది శాంతి.

సిగ్గేసింది. వెంఠనే వదిలేసి, ఎక్కడ క్రింద పడతాడోనని, నెమ్మదిగా కుర్చీ మీద కూర్చోబెట్టాను. అయినా వీళ్ళకేమి తెలుసు, నా లైఫ్ పార్ట్నర్ గురించి.

నేను స్కూల్లో టీచింగ్ చేసి, రాగానే అతని పాటలు వినాలి. అతని పాట వింటూ నేను పడిన అలసటను మర్చి పోతాను. నా లైఫ్ పార్ట్నర్ పాట వింటే ఎవరైనా మెచ్చుకుంటారు.

కానీ ఒక్కోసారి, బోర్ కొడుతోందనుకోండి, నేను సీరియసగా వర్క్ చేసుకునేటప్పుడు పాటలు పాడడు. నన్ను డిస్టర్బ్ చెయ్యడము ఇష్టం లేదు. నా మనస్సు, బాగోలేనప్పుడు పాటలు పాడి, కథలు, కబుర్లు, జోక్స్ చెప్పి, నన్ను ఉల్లాస పరుస్తాడు. ఇటువంటి లైఫ్ పార్ట్ నర్ ని ఎవరైనా ఇష్ట పడకుండా ఉంటారా? ఉంటె వాళ్లకు హృదయము లేదనుకుంటాను.

ఇంతకీ నా లైఫ్ పార్ట్నర్ ఎవరో తెలుసా? టు ఇన్ వన్ క్యాస్సెట్ రికార్డర్.
అదిగో నా బస్సు వస్తుంది. వస్తాను మరి. నా లైఫ్ పార్ట్నర్ పాట వినాలిగా. మీరు కూడా నా లైఫ్ పార్ట్నర్ పాట వినటానికి మా ఇంటికి రావాలి.

-డాక్టర్. షహనాజ్ బతుల్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments