విన్యాసాలు పురి విప్పిన సమయం..!'(కవిత )—సుజాత.పి.వి.ఎల్.

sujatha

వీలు కుదరక రిపేరు చేయించకుండా మూలపడేసిన మిక్సీ,
తిరగనని మొరాయిస్తున్న టేబుల్ ఫ్యాన్..
సంగతేంటో చూడమని
మా ఇంటాయనకి అప్చజెప్పాను..
ఏమీ తోచని ఆయన
ఎంతో ఇంట్రెస్టు గా ..
రిపేరు చేసి పక్కన బెట్టడం చూసి..
ఎంతో ఆనందం కలిగింది..
పనికిరావనుకున్న వస్తువులు
నా పనిలో పాలు పంచుకుంటుంటే..!
టి.వి సీరియల్స్ లేక
పిచ్చెక్కి పోతున్న అత్త మామలకి
పిచ్చిపిచ్చిగా పెరిగిన పెరట్లోని
మొక్కలకు అంటకత్తిరేసి,
అందంగా తాళ్ళతో కట్టి,
నీళ్ళతో తలంటి పోసే పని
పురమాయించాను..
ఖాళీ గా కూర్చుని విసిగెత్తి..
నే చెప్పిందే తడవుగా
తోటమాలి అవతారమెత్తి..
చకచకా చేసి చూపించే సరికి..
పరిశుభ్రమైన పత్రాలు..గాలికి ఊగుతూ..
నాకు ధన్యవాదాలు

చెప్పినంత ఆనందం కలిగింది…!
ఇంట్లోని మూలమూలల్ని దులిపి,

తుడిచి.. పనికిరానివి ఏరి పారేసే పనిని
పాపకి అంటకట్టాను..
ఫస్ట్ టైం తను ఇంటి పని చేస్తున్నా..
బెస్ట్ అనిపించుకోవాలనే తాపత్రయంతో
ఎంతో శ్రద్ధగా..అద్దంలా చేసి.
ఇంటికి కొత్తకళను తెచ్చింది..
తనలోని హౌస్ కీపర్ ను

చూసి ఇల్లే మురిసిపోయేంతలా..!!
వర్క్ ఫ్రం హోమ్ తో తలమునకలవుతున్న
మా అబ్బాయికి
కొంత సాయం చేసినట్టవుతుందని..
తన పనిలో.నేనూ తలదూర్చాను.
రొటీన్ కి భిన్నంగా సిస్టమ్ పై వర్క్ చేస్తుంటే..
నేను నూతన సామ్రాజ్యంలోకి

ప్రవేశించిన అనుభూతి కలిగింది .
ఈ పనులన్నీ
ఓ పద్దతిలో చేయించిన
నాలోని ట్యూటర్ కి నేనే అభినందనలు

తెలుపుకోవడం నావంతైయ్యింది..!
ఇన్నాళ్ళూ ..
గిరిగీసిన యాంత్రికతలో
బిర్ర బిగుసుకుపోయిన వారందరిచే
పని చేయించాను..
ఇన్ని విన్యాసాలు పురి విప్పింది..
ఎప్పుడో తెలుసా!..
లాక్ డౌన్ సమయంలో..!!

–సుజాత.పి.వి.ఎల్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.