జనపదం జానపదం- 9 – రోజు రోజుకి మారుతున్న జానపదుల మనస్తత్వం- భోజన్న తాటికాయల

జీవితంలో ప్రతి మనిషి ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. కాని దానికి సరిపోయే పనులు మాత్రం చేయడానికి బద్దకిస్తుంటాడు. ఇష్టంతో కష్టపడి జీవితాన్ని సుఖమయం చేసుకున్న వారిపై ఈర్షపడతారు, ద్వేషాన్ని పెంచుకుంటారు. వారిని క్రిందికి లాగడానికి సర్వవిధాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ పని వారి జీవితంకోసం చేసుకుంటే వారు ఎంతో అభివృద్ధిని సాధిస్తారని తెలుసుకోలేరు. మానవ సమాజాలు రోజు రోజుకి విచ్చిన్నమౌతున్నాయి. విలువలు వలువలుగా తీసి విసిరిపారేస్తున్నారు. ఈ రోజుల్లో పక్క వ్యక్తిని నమ్మడమే గగనమైపోయింది. అందులోను స్వంత కుటుంబం చేరడం బాధాకరం. బాధ్యతతో మెలగాల్సిన మనుష్యులు బాధలను మిగుల్చుతున్నారు. తన, మన భేదం లేకుండా దొరికిన వారిని దొరికినట్లు దోచుకుతింటున్నారు. మానసిక సంబంధాలు వదిలి ప్రతిదానిని ఆర్థికాంశంగా చూస్తున్నారు. ఆ దృష్టితోనే పనులు చేస్తున్నారు. ప్రాచీన కాలంలో కుటుంబ సభ్యుల మధ్యన కానీ, స్నేహితుల మధ్యకానీ, బంధువుల మధ్య గానీ, హాస్యపూరిత సన్నివేశాలు కనిపించేవి. ప్రస్తుతం ఎవరి గుమ్మందాటి వారు అడుగు బయట పెట్టడం లేదనేది అందరికి తెలిసిన విషయమే.

నలుగురికి మంచి చేసే రోజుల నుండి ఎంతమందినైన దోచుకునే హక్కును పొందినట్లు మనిషి ప్రవర్తిస్తున్నాడు. కష్టపడి పనులు చేసే స్థాయి నుండి మాటలతో మాయలు చేస్తూ అనేక గారడీలు ప్రదర్శిస్తూ అనేక కుటుంబాలను రోడ్డున పడేసి ఏ మాత్రం సిగ్గులేకుండా హాయిగా విలాసాలలో మునిగి తేలుతున్నాడు. ఈ కోవలో జానపదులు కూడా మెల్లగా చేరుతున్నారు. నేటి గ్రామాలు చిన్న స్థాయి పట్టణాలను తలపిస్తున్నాయి. వేషం, భాషా, వస్త్రాధరణ మారిపోయింది. బాహ్యంగా మారిందనుకుంటే పొరపాటే మానసికంగా కూడా గ్రామీణులు పూర్తిగా మారిపోతున్నారు. ఒకప్పటి పలకరింపులు లేవు. ఇచ్చి పుచ్చుకోడాలు లేవు. ఆదరణ లేదు అలకలు లేవు అంతా తమ ఇల్లే సర్వం అయిపోయింది. అందరికి ఒక్క క్షణం అడుగు బయటపెట్టే తీరిక లేకుండా పోయింది. బంధువులు, మిత్రులు, సన్నిహితులు వీరందరి పాత్రలని కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ మొదలైనవి ఆక్రమించాయి. గ్రామాల్లోసైతం మనుష్యుల మధ్య దూరం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎవరిదారి వారు చూసుకుంటూ స్వంతవారికి సైతం దూరం అవుతున్నారు.

గ్రామాల్లో ధారావాహికలు , సినిమాలను తలపించే నిజమైన సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ప్రజలు తమ ఇంటిలోని వారిని మోసంచేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. గ్రామాల్లో విలువలు దారితప్పి ప్రాచీనులు చూపిన మార్గాలను వదిలిపెట్టి సరికొత్త దారులను వెతుకుతున్నారు. భారతదేశం మహిళలపై చూపుతున్నా పూజ్య భావాన్ని వదిలి గ్రమాలుసైతం అబలల మాన, ప్రాణాలను హరిస్తున్నాయి. డిల్లి నుండి గ్రామాల్లోని గల్లి వరకు ఇలాంటి సంఘటనలు రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాము.

గ్రామాల్లో ప్రజలు పట్టణ నాగరికతను అతి త్వరగా జీర్ణంచుకొని మంచి చెడుల విచక్షణ మరిచిపోయి చెడు దారుల్లో ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లోనూ మార్గదర్శకత్వం చూపే వారు రోజు రోజుకి కరువౌతున్నారు. టి.వి, కంపూటర్, సెల్ ఫోన్స్ మొదలైన ఉపకరణాల ఫలితంగా శైశవ దశను దాటని బాలబాలికలుసైతం వికృత పోకడలను అందిపుచ్చుకుంటున్నారు.

పూర్వం అద్బుతాలను ఆవిష్కరించిన గ్రామాలు నేడు అధ పాతాళానికి పడిపోతున్నాయి. మనిషి నిరంతరం మార్పులను స్వాగతించాలి కాని ప్రతి మార్పును అంగికరించి ఆహ్వానిచాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలి. ఈ పరిస్థిస్తులు ఇలానే కొనసాగితే భావితరాల భాఫిష్యత్తు అంధకారం అవుతుంది. ప్రస్తుత మానవుడే ఎవరిని నమ్మలేని స్థితిలో ఉంటే ముందు తరాల జీవనం అగమ్యఘోచరమేనని చెప్పక తప్పదు. ముందు తరాలకు కొటానుకోట్ల ఆస్తిని ఇచ్చేకంటే ప్రశాంతంగా జీవించే సమాజాన్ని వారికిద్దాం !

– భోజన్న తాటికాయల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments