అదొక మధురానుభూతి. కొన్ని పరిచయాలు వరం ఉంటేనే లభిస్తాయి అంటారు. విహంగ మహిళా వెబ్ మ్యాగజైన్ తో నాకు పరిచయం నిజంగానే ఒక వరం. నా ‘ఎనిమిదో అడుగు’ నవల మొట్ట మొదట విహంగ వెబ్ పత్రికలో లో సీరియల్ గా వచ్చింది. దానికి కారణం డా. పుట్ల హేమలత గారు. ఆమెతో పరిచయం కానీ, ఫోన్లో మాటలు కానీ చాలా హాయిగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా అనిపించేవి.
‘అంజనీగారు’ అంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. నేను నా ‘ఎనిమిదో అడుగు’ నవల పంపగానే యాక్సెప్ట్ చేసారు. 25-4-2013 సంచికలో ఆ నవలను ధారావాహిక గా ప్రారంభించారు. ‘ఒక రచయిత్రిగా మీకు పబ్లిక్ తో చాలా అవసరం’ అంటూ నా చేత ఫేస్బుక్ ఓపెన్ చేయించారు. ఆ తరువాత అరసి గారితో ఇంటర్వ్యూ చేయించారు. నా ‘ఎనిమిదో అడుగు’ నవలతోపాటు నావి కొన్ని కధలు కూడా అందులో వచ్చాయి. ప్రస్తుతం నా ‘జ్ఞాపకం’ నవల సీరియల్ గా వస్తోంది.
డా. హేమలత గారి తరువాత ఆ పత్రిక ఎలా వుంటుందో అనుకున్నాను. కానీ ఆ పత్రిక పట్ల ఆమెకు వున్న లక్ష్యాన్ని, మమకారాన్ని ఎండ్లూరి మానస , అరసి లు బాగా అర్ధం చేసుకుని ముందుకు నడిపిస్తున్నారు. అందుకే విహంగ ను అభిమానించే వాళ్ళలో నేను ముందుంటాను.
అభిమానులందరికీ విహంగ వార్షికోత్సవ శుభాకాంక్షలు
-శ్రీమతి అంగులూరి అంజనీదేవి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`