2011చివర్లోకాని 2012 మొదట్లోకాని విజయవాడలో దివ్యాంగ రచయిత డా, అలేసేటి నాగరాజు, శ్రీ గంథం వే౦కాస్వామిశర్మ గారి ‘’అమృత హస్తాలు ‘’కథా సంపుటిపై చేసిన రిసెర్చ్ పుస్తకం ఆవిష్కరణ హోటల్ ఐలాపురం లో జరిగితే శర్మగారు ఆహ్వానిస్తే వెళ్లాను . అక్కడ ‘’దుర్గా ప్రసాద్ గారూ కులాసానా ?’’అన్న స్త్రీ గొంతు వినిపించి ఆశ్చర్య పోయాను .ఆమె నా దగ్గరకు రాగా ‘’నేనెలా తెలుసు ‘’అని అడిగితె ,తాను సరసభారతి బ్లాగు ను క్రమం తప్పక చదువుతానని అందులో ఫోటోను బట్టి గుర్తి౦చాననీ , తనపేరు పుట్ల హేమలత అనీ భర్త ,డా ఎండ్లూరి సుధాకర్ అనీ చెప్పి ఆశ్చర్యపరచారు .
నేను ఎండ్లూరి కవితాభిమానని అని చెప్పగా ఆయనా వచ్చి పలకరించారు .ఇదే మాతొలిపరిచయం .హేమలతగారు తాను ‘’విహంగ ‘’మహిళా వెబ్ మాసపత్రిక నడుపుతున్నాననీ ,పంపిస్తాననీ ,నన్ను అందులో రెగ్యులర్ గా ఆర్టికల్స్ రాయమని కోరారు .అలాగే అన్నాను .2012మే లో అమెరికా వెళ్లాం .అక్కడి నుంచే ‘’ఆడదై పుట్టటం ఆమె నేరమా ?’’అనే వ్యాసం గ్రీకుమహిళా గణిత శాస్త్ర వేత్త గురించి రాసి అంతర్జాలం లో విహంగ కు పంపాను .అప్పటినుంచి ప్రతినెలా 15తేదీ లోపు నాకు ఆర్టికల్ రాసిపంపమని అడగటం ,వివిధరంగాలలో ప్రపంచ ప్రసిద్ధులైన మహిళల గురించి రాసి పంపటం అవిచ్చిన్నంగా జరుగుతోంది .విహంగలో వచ్చిన వ్యాసాలూ, అంతకు ముందు నేనురాసినవీ కలిపి ‘’మహిళా మాణిక్యాలు ‘’పేరిట సరసభారతి తరఫున పుస్తకం ప్రచురించాం .
సరసభారతి పుస్తకాలన్నీమూడునాలుగుకాపీలు ఎప్పటికప్పుడు హేమలత గారికి పంపటం, ఆమె యూని వర్సిటీకి అందజేయటం జరుగుతూనే ఉంది .నారచనలపై సమీక్షలు కూడా చేయించిన పెద్దమనసు ఆమెది ..సుమారు నాలుగేళ్ళక్రితం జనవరి 11 న రాజమండ్రి నన్నయ యూనివర్సిటీలో వార్షికోత్సవం జరుపుతున్నామనీ ,నాకు విహంగ సాహితీ పురస్కారం అంద జేస్తున్నామని ,తప్పక రమ్మని హేమలతగారు ఫోన్ చేస్తే వెళ్లాం .వైస్ చాన్సలర్ గారి చేతులమీదుగా ఘన సత్కారం చేసి ,జ్ఞాపిక బహూకరించారు .ఇదే నేను అంతర్జాలం లో చేసిన రచనకు పొందిన మొదటి పురస్కారం .దీనికి హేమలతగారికి ధన్యవాదాలు .హేమలత గారు సుమారు రెండేళ్ళక్రితం అకస్మాత్తుగా మరణించటం మహిళా హక్కులకు ,విహంగకు తీవ్ర నష్టం . అయినా మొక్కపోని ధైర్యం తో ఎండ్లూరి మానస , అరసి విహంగను క్రమం తప్పక నడపటం అభినందనీయం .విహంగకు నేను రాసిన ‘’సెంచరి ఆర్టికల్ ‘’అంటే నూరవ వ్యాసం ఈ అక్టోబర్ లో ప్రచురితం .మూడురోజులక్రితం శ్రీ అరసి ఫోన్ చేసి ‘’విహ౦గ తో మీ అనుబంధం గురించి ,కూడా రాస్తూ 101 వ ఆర్టికల్ పంప౦డి’’అని కోరిన దానికే ఈ ప్రతిస్పందన . విహంగ సాహితీ కుటుంబ సభ్యుడ నైనందుకు నాకు ఆనందంగా, గర్వ౦గా ఉంది .
-గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~