రచయిత్రి మల్లీశ్వరితో సంభాషణ- కట్టూరి వెంకటేశ్వరరావు

‘రాయడం కోసం రాయడంగా కాక ప్రజల కోసం రాయడం, వారికి చేరే మార్గంలో రాయడం, ఒక సవాలు’ అంటూ రచన చేస్తున్న తెలుగు కథా రచయిత్రుల్లో ఒక విలక్షణమైన కలం కెఎన్ మల్లీశ్వరిది. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక(ప్రరవే)లో పదేళ్లగా క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ‘ప్రరవే’ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలిగా విధులు నిర్వహిస్తున్న రచయిత్రి మల్లీశ్వరితో విహంగ సంభాషణ….

1. మీ బాల్యం విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం వివరిస్తారా?

మాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. వ్యవసాయ కుటుంబం, మేం నలుగురు ఆడపిల్లలం. నేను ఆఖరి అమ్మాయిని. ఆడపిల్లలమైనా మా నాన్నగారికి మేమంటే చాలా ఇష్టం. నేనంటే కాస్త ఎక్కువ ప్రేమ. అందుకే చదివించే విషయంలో వెనకాడలేదు. నాన్న ప్రోత్సాహంతో తెలుగు సాహిత్యంలో ఎం.ఫిల్, పీహెచ్డీ ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేశాను.1996లో శ్రీనివాస్(చందూ)తో నాకు పెళ్లయింది. మాది కులాంతర వివాహం. చందు రైల్వే కాంట్రాక్టర్ గా చేస్తున్నారు. ఒక్కతే పాప స్నిగ్ధ. కెరీర్ విషయానికి వస్తే కొన్నాళ్లు ప్రిన్సిపాల్ గాను, కొన్నాళ్ళు పీజీ తెలుగు హెడ్ గాను పని చేశాను. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ పూర్తి చేశాను.అక్కడ పీజీ విద్యార్థులకి పాఠాలు చెపుతున్నాను. మేమంతా కలిసి ‘గోస్తనీ’ అనే వాల్ మాగజైన్ నడుపుతున్నాం. దాదాపు యాభైమంది వరకూ విద్యార్థులు గోస్తనీలో రచనలు చేస్తున్నారు. ఇపుడది ఔత్సాహికమే కావొచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ అందునుంచి ఒకరిద్దరికైనా సాహిత్యం గట్టిగా పట్టుకుంటుందని ఆశ.

2. తెలుగు సాహిత్యంలో మీకు బాగా ఇష్టమైన ప్రక్రియ?

నవల రాయడం బాగా ఇష్టం. నవల్లో బాగా స్పేస్ ఉంటుంది. కథ చాలా సవాళ్ళు విసురుతున్నట్టు అనిపిస్తుంది. అంటే కథ రాయడం చాలా నైపుణ్యంతో కూడిన పని. మనం ఎంత చెప్పాలని అనుకుంటామో అంతా పరిష్కరించి ఒకటి ఆరా వాక్యాలలో రాయగలగాలి. కానీ నవల అట్లా కాదు. మనం చాలా ఫ్రీగా రాయగలం. హ్యాండ్ చాలా ఫ్రీగా వెళుతుంది. నవలకి కూడా ఎడిటింగ్ ఉంటుంది, అయినా నవలా రచనలో స్వేచ్ఛ ఉంటుంది. కథ చాలా నియంత్రిస్తుంది. ఆ నియంత్రణలోనే అసలు కథా సౌందర్యం, ఒక పట్టు, ఒక బిగువ అనేది కథాప్రక్రియకు ఉండే సవాలు. నాకు నవల రాయటం బాగా ఇష్టం. అదే విధంగా కథ రాయడం కూడా నాకు ఇష్టం. కవిత్వంలో నాకు పట్టులేదు. చిన్నప్పుడు కొంత కవిత్వం రాశాను.

3. 2017లో తానా వారి ఉత్తమ నవలగా బహుమతి పొందిన మీ నీల నవల్లోని సదాశివ పాత్రను మీరు మలిచిన తీరు చాలా బావుంటుంది. అలాగే ఈ నవల చదివిన తర్వాత కూడా పాఠకుల మదిలో కదలాడే పాత్ర పైడమ్మ. ఆ పాత్రలపై మీ అభిప్రాయం, ఇవి మీ నిజజీవితంలో ఎంతవరకు ప్రభావం చూపించాయి?

నీల నవలలో ప్రతి పాత్ర దానిదైన ప్రభావం చూపిస్తాయన్నది చాలామంది పాఠకులు చెప్పిన అభిప్రాయం. సదాశివ పాత్ర కొంచెం ఆదర్శవంతమైన పాత్ర. అటువంటి వ్యక్తులు నేడు ఉంటారా అనేటువంటిది ప్రధానమైన విమర్శ. ‘స్త్రీ పాత్రలపైన అన్ని ప్రయోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు సదాశివ పాత్ర ఉంటుందా? ఉన్నా కూడా సమాజానికి, ఉద్యమాలకి అటువంటి స్వభావం ఉన్న పురుషులవల్ల మేలు జరగదు. వాళ్లు మరింత అన్ రెస్ట్ కి కారణమవుతారు’ అని కొంతమంది అన్నారు. పాత్ర స్వభావాన్ని ఆ పాత్రను చాలా మంది తిట్టుకుంటారు కానీ పైకి ఉండేటువంటి ఒక స్మూత్ నెస్ ని చూసిన వాళ్ళు చాలామంది సదాశివ పాత్రను ఇష్టపడ్డారు. కానీ అతను చెప్పే లాజిక్ గాని అతను మాట్లాడేటువంటి మాటలుగాని ఏదీ కూడా సమాజానికి మేలు చేయవు అని మరికొంతమంది విమర్శ చేశారు. రచయితగా నేనే మంటానంటే ఎవరు ఎటువంటి అభిప్రాయలు వ్యక్తం చేసినా అది పాత్ర మీదే తప్ప రచయిత మీదికి రాకూడదు. రచయిత ఆ పాత్రల్ని రక్తమాంసాలతో సృష్టిస్తారే తప్ప ప్రజల మెచ్చుకోలు కోసం సృష్టించడు. అటువంటి మనుషులు ఉంటారా ఉండరా అనేది ఎవరికి వాళ్ళు బేరీజు వేసుకోవాలి. వాళ్లకు అటువంటి జీవన విధానాలతో పరిచయం ఉంటే ఆ పాత్ర కొంతమందికి దగ్గరగా అనిపిస్తుంది. లేదంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది.

ఆ జీవన విధానాలతో ఉన్న స్వభావాల్ని రచయిత చూస్తేనే రాస్తాడు. అంతేకానీ ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా పాత్రల సృష్టి అయితే జరగదు. అలాంటి పాత్రలు నేను చూశాను కాబట్టి ఆ పాత్రలు నేను సృష్టించగలిగాను. అందులో కొంత శాతం ఒక చిన్న ఆదర్శం ఐతే ఉంటుంది అంటా. నవల్లో మొత్తం పాత్రల్లో వాస్తవికంగా ప్రవర్తిస్తున్న సందర్భంలో అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్ళినా అదే పెయిన్ కనిపిస్తూ ఉన్నప్పుడు రచయిత ఒక పాత్రలోనైనా ‘ఇట్లా ఉంటే బాగుంటుంది, మగవాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తే బాగుంటుంది’ అనే ఒక చిన్న ఆదర్శం ఉంటుంది కదా రచయితకి. అందులోనూ స్త్రీ రచయిత అయినప్పుడు ఇంకా ఉండొచ్చు. ఒకటి అరా సందర్భాల్లో ఒకటి అరా దశకాల్లో అటువంటి కల్పన అదికూడా వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి కల్పన చేసి ఉండొచ్చు. నిజజీవితాల్లో నేను గమనించినటువంటి స్వభావాలనుంచి అన్ని పాత్రలు వచ్చాయి. అలాగే సదాశివ పాత్ర కూడా వచ్చింది.

ఇక పైడమ్మ పాత్ర దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా అది నేను చూసిన జాలరి మహిళల జీవితాల్లోంచి, వాళ్ల గతాల్లోంచి వాళ్లతో మాట్లాడినప్పుడు తెలుసుకున్న అంశాలనుంచి వచ్చిన పాత్ర. ‘నీల’ పాత్ర ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు అక్కడ పరిచయమైన పాత్ర పైడమ్మ. జీవితంలో ప్రతి పాత్ర పోరాటం చేస్తుంది. కొన్ని పాత్రలు తాత్కాలికంగా విజయం పొందుతాయి, కొన్ని పాత్రలు విడిపోతాయి. కొన్ని పాత్రలు ఓడిగెలుస్తాయి గెలిచిఓడతాయి. ఇట్లా రకరకాల కాంబినేషన్స్ తో ఉంటాయి. జీవితంలో అన్నీ ఉంటాయి కాబట్టి పైడమ్మ పాత్ర కూడా అటువంటి పాత్రే. అయితే ఆ పాత్రకుండినటువంటి జీవన తాత్వికత, లేదా ఆ పాత్ర ఎదుగుతున్న పరిస్థితులు, ఆ పాత్రకు వాడిన భాష, ఆ పాత్ర నివసించినటువంటి మాండలికం లేదా ఒక సూక్ష్మ పరిశీలనతో చూసేటువంటి కొన్ని అంశాల వలన ఆ పాత్ర ఎంతోమందికి నచ్చింది. అందులోనూ శ్రామిక వర్గానికి చెందిన మహిళ అనే సరికి చాలామంది పాత్రను ఇష్టపడతారు.

4. ప్రగతిశీల భావజాలం, ఫెమినిస్ట్ రైటింగ్ వైపు మిమ్మల్ని నడిపించిన వ్యక్తులు లేదా సంఘటనలు ఉన్నాయా?

సాధారణంగా మేము నలుగురు ఆడపిల్లల్లో ఒకపిల్లగా పెరగడం అనేది కొంత నాకు స్వేచ్ఛనిచ్చిందేమో అనుకుంటా. అంటే ఇంట్లో మగ పిల్లలు లేరు, బంధువర్గంలో కూడా అన్నయ్యలు అనే వరసలోనో, లేక చిన్నాన్న పెదనాన్నలు ఉంటే ఎంతవరకు కంట్రోల్ చేసేవారో నాకు తెలియదు కానీ, మేము నలుగురం ఆడపిల్లలుగానే పెరగడం పై మా నాన్నగారు గాని మా అమ్మ గాని మేం పెరిగిన కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఏ ప్రాంతంలోనైనా ఆడపిల్లల చదువుల మీద ఎంతోకొంత నియంత్రణ ఉండేది. కొంత మా కుటుంబంలోనూ వాటిల్లోనూ మామూలు రైత్వారీ జీవితానికి సంబంధించిన వ్యక్తులే. కానీ ఆడపిల్లలను ఏదో మేరకు చదివించాలి అనుకోవడంతో మేం కొంచెం పట్టుబట్టి చదువుకోవడం, చిన్నప్పటి నుంచి సాహిత్యం చదువుతూ రావడంతో చదువుకున్నాం.

జీవితంలో ఎవరైనా బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ వల్ల నాకు చదువుపై ఆసక్తి బాగా ఉండేది. అయితే నేను చిన్నప్పుడు ఎక్కువగా డాక్టర్ చదువుతా అనేదాన్ని. కానీ నాకు లెక్కలు సైన్సు అస్సలు అబ్బలేదు. సోషల్, లాంగ్వేజెస్ ఇష్టంగా ఉండేవి. ఏలూరులో సెంట్ థెరిస్సా కాలేజీలో చదువుతున్నప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా మీ లక్ష్యాలు ఏమిటి అని అడిగారు హిస్టరీ మేడం. అప్పుడు నేను డాక్టర్ కావాలి అనుకున్నా గానీ, కాలేకపోయాను అని చెప్పాను. దానికి ఆ మేడం ఈరకంగా డాక్టర్ కాలేకపోయినా సమాజాన్ని బాగుచేసే డాక్టర్ కావచ్చునని చెప్పారు. అప్పటివరకు ఒక డాక్టరేట్ ఉంటుందని నాకు తెలీదు. అప్పుడే డాక్టరేట్ కావాలి అని ఒక ఎయిమ్ పెట్టుకున్నా. పల్లెటూరి నుంచి వచ్చిన నలుగురు ఆడపిల్లల్లో ఒక ఆడపిల్లగా, చితికిపోయిన రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక ఆడపిల్లగా నా జర్నీ నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అనేక రకాల ఒడిదుడుకుల మధ్యలో డాక్టరేట్ ఎట్లైనా సాధించాలని పట్టుదలతో చదివా. నాకు తెలుగులో కొంచెం ఎక్కువ మార్కులు వస్తూ ఉండేవి. తెలుగు టీచర్ భాగ్యలక్ష్మి మేడం బాగా ఎంకరేజ్ చేసేవారు.

ఆమె బాలవ్యాకరణం చెప్పేవారు. ఆ తర్వాత ఎమ్.ఫిల్ తెలుగు యూనివర్సిటీలో చేయడం డాక్టరేట్ చేయడం పై ఒక ఆసక్తిని ఆవిడ నాకు కలిగించింది. ఇక దాంతో పూర్తిగా స్త్రీవాదంలోకి వచ్చాను. తొలుత కుటుంబంలో ఉన్నటువంటి ఒక రకమైన స్వేచ్ఛ, సెంట్ థెరిస్సాలో ఎక్కువగా ఉండే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ వాతావరణం వలన భావవ్యక్తీకరణలో కొంత స్వేచ్ఛ పొందానని అనుకుంటాను. నేను ఎంచుకున్న PhD అంశం ఓల్గా నవలలు. అంతకుముందు ప్రొ.అత్తలూరి నరసింహారావుగారు కాళీపట్నం రామారావు గారి కథలు తీసుకోమన్నారు గాని నాకు అవి కొరుకుడుపడలేదు. ఆ వయసులో వోల్గా నవలలు తీసుకున్నప్పుడు ఫెమినిజం అనే ఒక థిరెటికల్ దృక్పధం వైపు నాకు పరిచయం చేసింది మాత్రం అత్తలూరి నరసింహారావుగారే. ఓల్గా నవలలు ప్రధానంగా నాకు లాజికల్ గా ఆలోచించవచ్చు అని తెలియజేశాయి. అంతకుముందు రంగనాయకమ్మ నవలలు, అలాగే యుద్దనపూడిసులోచన గారి నవలలు ‘ఆడపిల్లలు’ ‘అపర్ణ’ అని ఉండేవి. కానీ థీరిటైజ్ చేసింది మాత్రం ఓల్గా గారి రైటింగ్. ఆ రీసెర్చ్ టైంలో నేను చదివిన ఇతర పుస్తకాలు నన్ను ప్రభావితం చేశాయి. 1993 లో మొదలు పెట్టి1996 లో పరిశోధనని పూర్తి చేశాను.

అప్పటికే నీలిమేఘాలు రావడం, ఓల్గా రాసిన ఐదు నవలల మీద పరిశోధన చేశా. ఆవిడ ప్రయోగం నవల ఇండియాటుడేలో వచ్చినప్పుడు చాలా పెద్ద సంచలనం అప్పట్లో. ఓల్గా నవలల మీద మొట్టమొదటి రీసెర్చ్ నాదే. అప్పటికి ఇంకా ఎవరు ఆవిడ రచనల మీద చేయలేదు. చాలా తాజాగా వచ్చినప్పుడే ఐదు నవలలపై నేను వెంటనే రీసెర్చ్ చేశాను. పెళ్లి తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. మళ్లీ సంసార బాధ్యతలు, ప్రేమ వివాహం కావడం వల్ల లైఫ్ లో సెటిల్ అవడంలాంటి కొన్ని కారణాలవల్ల పూర్తిగా సాహిత్యం పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ 2005లో నేను కథలు రాయడం మొదలుపెట్టాను. ఇక ఆ తర్వాత ఎక్కడా ఆగలేదు. రాస్తూనే ఉన్నాను. అస్థిత్వ ఉద్యమాల్లో అప్పటికి స్త్రీవాదం వెనకబడి ఉందనే మాట వచ్చిన సందర్భంలోనే నేను తీసుకున్న నిర్ణయం ఇది.

5. తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యo కొంచెం లేటుగా దళిత స్త్రీవాద సాహిత్యం వచ్చాయి. స్త్రీవాద సాహిత్యo పురుషాధిక్యతను ప్రశ్నించింది. అదే దళిత స్త్రీవాద సాహిత్యం దగ్గరకు వచ్చేసరికి దళిత రచయిత్రులు చాలా నిస్సంకోచంగా ‘మమ్మల్ని అడ్డుకునేది మా గొంతు నొక్కేది దళిత పురుషులు, సవర్ణ స్త్రీలు’ అని చాలా కటువుగా రాశారు. ఈ సందర్భాన్ని రచయితగా, పాఠకురాలిగా మీరు ఎట్లా చూస్తారు?

దేన్నైనా థీరిటైజ్ చూసే మాట్లాడాలి. ‘నేను సవర్ణ స్త్రీని కాదు కాబట్టి నేను అన్నటికీ అతీతం’ అనే పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా అగ్రవర్ణ స్త్రీలు దళిత స్త్రీల మీద పీడితులుగానే ఉంటారు. ఏ రంగంలోనైనా ఎక్కడైనా తెలిసైనా తెలియకైనా, సూక్ష్మ స్థాయిలోనైనా నిరంతరం ఆ ఆధిపత్యం అనేటువంటిది ఏదో ఒక రూపంలో ఉంటుంది. మాట్లాడే విధానంలో గాని, ప్లే చేసే రోల్ లో గాని అన్నిటిలో కులం ఉంటుంది. అంటే చొరవగా దూసుకుపోవడంలో, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో, నాయకత్వ బాధ్యతలు తీసుకోవడంలో, పోటీపడటంలో వీటన్నింటిలోనూ కంపల్సరీ కులం ఉంటుంది. అయితే మనం చేయగలిగింది సాధ్యమైనంతవరకు పోటీపడటం మానేయమని, లేకపోతే పనిచేయొద్దని ఎవరు చెప్పరు. దళిత వర్గాల నుంచి వచ్చిన స్త్రీలు కూడా మీరు పని చేయొద్దు మేమే చేస్తామని ఎవరు అనరు. దళిత స్త్రీ పని చేయడానికి ఎవరూ అడ్డంకిగా మారకూడదు అని మాత్రం చెప్తారు. అడ్డుగా నిలబడ్డకూడదు.

అవకాశం వచ్చినప్పుడు అగ్రవర్ణం వెనక్కి తగ్గాలి. కచ్చితంగా అగ్రవర్ణ పురుషుడితో పాటు, అగ్రవర్ణ స్త్రీ కూడా దళిత స్త్రీ మీద పీడితురాలే. ఆచరణలో కూడా జరుగుతుంది. సాధ్యమైనంత వరకు నేను వ్యక్తిగతంగా అనుకునేది అటువంటివి నాలో ఐడెంటిఫై అవుతున్నాయా అని చెక్ చేసుకోడం. ప్రధానంగా ‘ప్రరవే'(ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక) లో గాని, బయటగాని నేను వ్యక్తిగతంగా విధించుకున్నటువంటివి పాటిస్తూ వచ్చిన వ్యాల్యూ ఇంతవరకు ఎవరూ నన్ను అడగలేదు. నేను వ్యక్తిగతంగా పాటిస్తూ వస్తున్నటువంటి వ్యాల్యూ ఏమిటంటే అగ్రవర్ణపు పురుషులు, అగ్రవర్ణపు స్త్రీల పైన నిష్కారణంగానో మరే కారణం చేతనో రకరకాల ఆరోపణలు ఉంటాయి సాహితీ ప్రపంచంలో కూడా నిందలు ఆరోపణలు ఉంటాయి. కొట్లాటలు ఉంటాయి దాడులు ఉంటాయి. అప్పుడు నా శక్తి మేరకు నేను వాటిని ఎదిరిస్తాను. నా తప్పులేనప్పుడు, నా మీద అటువంటి వివక్ష చూపినప్పుడు నేను కచ్చితంగా దాన్ని ఎదిరిస్తాను. నన్ను వ్యక్తిగతంగా, టార్గెట్ చేసినా నేను మౌనంగా చెక్ చేసుకున్నానే తప్ప నేనెప్పుడూ సంజాయిషీ చెప్పలేదు.

6. ‘విహంగ’ తో, డా. పుట్ల హేమలతతో మీ అనుబంధం గురించి చెప్పండి. ‘ప్రరవే’ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా అయిన తర్వాత ఇంకా ఎన్ని రాష్ట్రాల్లో తీసుకువెళ్లాలి అనేటువంటి ప్లాన్స్ వున్నాయి. మీ అభిప్రాయం తెలియజేయండి?

జ. నేను రాజమండ్రి పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎం.ఫిల్ చేస్తున్నప్పుడు ఎండ్లూరి సుధాకర్ గారు లెక్చరర్ గా వచ్చారు. అప్పట్లో ఓ కవితల పోటీ పెడితే నేను రాసిన బాల్యం అనే కవితకు జడ్జిగా ఉన్న ఆయన మొదటి బహుమతి ప్రకటించారు. అట్ల కవిత్వం రాయడంతో సుధాకర్ గారి దృష్టిలో పడ్డాను. ఆ సందర్భంలో నేను హేమలతగారిని ఇంటిదగ్గర కలవడం వల్ల పరిచయమయ్యారు. ఒక ఏడాది కాలం పాటు ఇంటికి రాకపోకలు ఉండేవి. ఆ తర్వాత నేను 2005లో కథల్లోకి అడుగుపెట్టడం వల్ల మెల్లగా మళ్ళీ హేమలతగారితో సాహితీ మిత్రులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ప్రరవే పెట్టిన తర్వాత మొట్టమొదటి సభకు హేమలత గారిని పిలవలేకపోయాం. అప్పటికే నీలిమేఘాలలో రాసినా ఆ తర్వాత ఎందుకో ఆమె రచనలకి కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత మరలా ప్రరవే మీటింగ్ పెట్టినప్పుడు హేమలత గారు గుర్తుకు రాలేదు. రెండవసారి మీటింగ్ పెట్టినప్పుడు రచయిత్రులు ఎవరున్నారని ఐడెంటిఫై చేసినప్పుడు,పుట్ల హేమలత గారు గుర్తుకువచ్చి పిలిస్తే వెంటనే గుంటూరు సభలో దళిత క్రైస్తవ సాహిత్యం మీద మాట్లాడారు. ఆ సందర్భం నుంచి హేమలత గారిని ఐడెంటిఫై చేసుకుంది ప్రరవే. ఆ తర్వాత నుంచి ఆమె ప్రరవేలో కంటిన్యూ అవుతూ వచ్చారు. తర్వాత కాలంలో ప్రరవే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పనిచేశారు. చాలా సందర్భాల్లో ప్రరవే చరిత్రను రాయాలనే అనుకుంటున్నాను. ఎందుకంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దాంట్లో అనేక మార్పులు జరిగాయి. అది చాలా పెయిన్, కొంతమంది వెళ్ళిపోయినప్పుడు వచ్చిన దుఃఖం, పడిన నిందలు, మాటలు, మనమేమన్నా చేసిన గొప్ప పనులు వీటన్నిటితో ప్రరవేకి చాలా పెద్ద చరిత్ర ఉంది. కొంతమంది వచ్చారు. కొంతమంది వెళ్లిపోయారు. కొంతమంది బాధపడ్డారు. ఎన్ని ఉన్నా హేమలత గారు ప్రరవేను ఓన్ చేసుకున్నారు. ఆవిడ మీద కూడా చాలా నిందలు వేశారు, అగ్రవర్ణాలకు తొత్తుగా మారారని చాలా మాటలకు గురయ్యారు. కానీ ఆవిడ వాటిని ఎంత మేరకు తీసుకోవాలో అంత మేరకు మాత్రమే తీసుకున్నారు. ఇంటర్నల్ గా మాత్రం హోరా హోరీగా విపరీతమైనటువంటి చర్చలు సాగించారు. చాలా తీవ్రమైన విమర్శలు చేసేవారు. సంస్థ మీద సమస్యలు ఇంటర్నల్గానే చర్చకు పెట్టేవారు. అట్లా అని ఏ ఒక్కరోజు కూడా సభకు రావడం మానేయడం వంటివి ఎప్పుడూ చేయలేదు. ప్రరవే సభ అంటే అందరికంటే ఎంతో ముందుగా బయలుదేరి వచ్చేవారు. ఎవరు ఏ బాధ్యత అప్పజెప్పినా చక్కగా నిర్వహించేవారు. కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో సీనియర్ సభ్యురాలిగా డా. పుట్ల హేమలత ప్రధాన పాత్రలోకి వచ్చి అన్ని రకాల విమర్శలకు నిలబడి ప్రరవేలో పనిచేశారు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం ప్రరవేకి ఎంతో లోటు. చాలా బాధపడ్డాము. ప్రరవే పరంగా వ్యక్తిగతంగా సబ్జెక్ట్ పరంగా మేమిద్దరం వాదనలు చేసుకునే వాళ్ళం. ఇద్దరిలో ఎవరం కూడా తగ్గే వాళ్ళం కాదు. ఆ చర్చ ముగిసిన వెంటనే మేము ఎప్పట్లాగానే కలిసి ఉండేవాళ్ళం. మా చర్చలు కేవలం ఆ సభల్లో చేపట్టిన చర్చల వరకే ఉండేవి. వ్యక్తిగతంగా చాలా క్లోజ్గా ఉండే వాళ్ళం. సంస్థను వృద్ధిలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఈ మానవసంబంధాలు వేరు, రాజకీయంగా మనం ఉండాల్సిన సంబంధం వేరు కాబట్టి దాంట్లో క్రిటికల్ గా ఉంటూ దీంట్లో తాను మానవీయంగా ఉండేవారు. సాహిత్యపరంగా ఆవిడ గొప్పస్థానాన్ని అలంకరించారు. వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి స్థానంలో మానస, రెహాన వంటి వాళ్లు రావడం సంస్థకు నాయకత్వ లోటు లేకుండా ఉంది. నాయకత్వాన్ని ఎట్లా విభాగించుకోవాలి అనే విషయాలపై మా మీద వచ్చే విమర్శలు వేరు. దళిత స్త్రీల మీద వచ్చే విమర్శలు వేరు. అగ్రవర్ణ స్త్రీలపై వచ్చిన విమర్శలు వేరేగా ఉంటాయి. కానీ అగ్రవర్ణ సంస్థ అనే పేరు పడినటువంటి సంస్థలో దళితులు పనిచేయవలసి వచ్చినప్పుడు, వాళ్ళ పెయిన్ ఒక రకంగా ఉంటుంది. దాని నియమాలకు ఉన్న శక్తి డా.పుట్ల హేమలత గారు. తను చేసే పనిలో నిజాయితీ, తాను నమ్మిన సంస్థ పట్ల నిబద్ధతతో ఉన్నారు కాబట్టి ఆవిడ స్వయంగా నిలబడ్డారు. ఆవిడ జీవితం సంస్థలోకి వచ్చేవారు ఆదర్శంగా తీసుకుంటారు.

7. ఇటీవల మీరు అనువాదంపై దృష్టిసారించడానికి కారణమేంటి? రాబోయే రోజుల్లో మీ కలం నుండి జాలువారే రచనల గురించి తెలియజేయండి?

నేను ఈ కరోనా టైంలో క్రియేటివ్ రచన వైపు కొంచెం క్రియేటివ్ గా ఆలోచించి రాయడానికి సమయం దొరికింది. ఒకసారి నాలుగు ఐదు వాక్యాలు దేని కోసమో అనువాదం చేయవలసివచ్చినప్పుడు ఏదో ప్లెజర్ కనిపించింది. అట్లా చేతికి నాకు దొరికిన మిత్రుల కథలు ఒక ఐదారు అనువాదం చేశాను. ఏదైనా ఒక పని మొదలు పెడితే దాని మీద నాకు ఒక పిచ్చిలాంటిది ఉంటది. నిజానికి నేను అనువాదం మొదలు పెట్టడం అంటే మొదట్నుంచీ రచనలు చేయడం మొదలుపెట్టడం అన్నమాట. చాలామంది బాగున్నాయి అనువాదాలు బాగా చేశారు అని చెప్పడం వల్ల, అది చేస్తున్నప్పుడు నాకేదో ప్లెజర్. ఇతరుల రచనలను ఊరికే చదవడం వేరు. కానీ అనువాదం చేసినప్పుడు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం. ఇతర రచయితల టెక్నిక్స్ ని దగ్గరగా చదవడం అనేటువంటిది కూడా నాకు బాగా నచ్చింది. బహుశా దాని వల్లే చేసానేమో కానీ, అనువాదం నేను చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. కొన్ని రచనలు నేను ఎంచుకొని అనువాదం చేయడం మొదలుపెట్టాను. నేను చూసిన అమెరికన్ లైఫ్ కానీ, నేను చూసిన హ్యూమన్ రిలేషన్స్ గానీ వాటిల్లో ఉండే గాఢత, నేను గ్రహించిన విషయాలు అమెరికాలో నాకు ఎదురైన సంఘటనల నుంచి నేను అర్థం చేసుకున్న అమెరికాని స్త్రీ కోణంలోంచి, యాత్రా రచన చేద్దామనుకుంటున్నా. అట్లాగే ఇంకొక నవల ఒకటి ప్లాన్ చేసుకున్నాను. నీల తర్వాత నేను పెద్దగా కథలు కూడా ఏమి రాయలేదు. నవలలు కూడా ఏమి రాయలేదు. అంత ఫాస్ట్ గా రాయడం అనేది కొంచెం తగ్గిపోయింది. ఆర్టికల్స్ బాధ్యత రీత్యా తప్పవు. వాటికి సృజనతో సంబంధం లేదు గదా. వ్యాసాలు రాయడం వ్యాసరచన మాత్రం కొనసాగుతోంది.

8. ఈతరం రచయితలకు మీరిచ్చే సూచనలు ఏమిటి? నేటితరం రచయితలలో మీకు నచ్చిన శైలి, రచనా విశేషాలు గాని వాళ్ళ రచనా వస్తుపరంగా మీకు నచ్చిన అంశాలు ఏమిటి?

నేటి రచయితలలో నాకు చాలా రచనలు ఇష్టం. ప్రధానంగా నాకు నచ్చే అంశాలు ఏమిటంటే ప్రజలు సాహిత్యం చదువుకోవడం లేదా అంటే విపరీతంగా ఉన్నారు. అంటే నేటికాలంలో రచనలు చేస్తున్న వాళ్ళలో ఎంతో చదువుకొని గాఢతతో రచనలు చేస్తున్నారు. విషయాన్ని గాఢంగా రాయడం అనే కాన్సెప్ట్ తో చాలామందిని చూస్తున్నాము. అది కవిత్వం కావచ్చు కథలు కావచ్చు. వివిధ ప్రక్రియలు రాసేవారు ఎంతమంది ఉన్నా, ఇంత అద్భుతంగా వాక్యనిర్మాణం చేయగలిగేవారు ఉన్నారా అని అనిపిస్తుంది. ఇప్పుడిదివరకట్లా కాకుండా కొత్తకొత్త ప్రయోగాలు చేయడం, వాళ్లను వాళ్ళు కొత్తగా ఆవిష్కరించుకోవడం నాకు నచ్చుతాయి. అలాగే సాహిత్యం అనేది కూడా ఒక వ్యాపారమే అనే దాని మీద నాకు సరైన అభిప్రాయం లేదు. అంటే సాహిత్యం ప్రధానంగా వ్యక్తిగతమైనటువంటి భావ వ్యక్తీకరణ. మానసికమైనటువంటి సంచలనాలకి వ్యక్తిగతంగానే సాహితాన్ని చూస్తున్నాం. దాన్ని ఒక పనిముట్టుగా సామాజిక ప్రయోజనాలకు వాడుకోవచ్చు. సామాజిక ప్రయోజనాలకి సాహిత్యాన్ని వాడుకుంటామా లేక అది రాసిన తర్వాత సృజనాత్మక సాహిత్యంగా వాడుకోపడుతుందా లేదంటే ఒక టూల్ గా మారుతుందా అనేది గమనించాలి. నేనేమంటానంటే రాసినప్పుడు అది హృదయగతమైన సంచలనాల వ్యక్తీకరణగానే, తను అన్వేషించిన తన భావాలు వ్యక్తీకరణగానే ఉంటుంది. ఆ తర్వాత సాహిత్యం అవసరమైతే సామాజికమైన మార్పుకి, వ్యక్తుల్లో మార్పుకి దేనికైనా ఒక పనిముట్టుగా మారుతుంది. మారాలి అని అనుకుంటాను. అలా కాకుండా సమాజాన్ని మార్చడం కోసమే రచనలు చేస్తున్నాం. అనేటువంటి దాని మీద నాకు నమ్మకం లేదు. సమాజాన్ని మార్చడం కోసం రచనలు చేయడమనేది సమాజంలో మార్పు కోసం అంటే కొన్ని విషయాలు ప్రజలకి అర్థం కాక, అవగాహన కల్పించాల్సిన సమాచారం కోసం వ్యాసాలు వంటివి రాస్తామోమో కానీ ఈ సమాజాన్ని మార్చడానికి కథ రాస్తాను కవిత రాస్తాను అని కూర్చొని రాసేదాని మీద నాకు విశ్వాసం లేదు. మన వ్యక్తిగతమైనటువంటి భావోద్వేగాలు, వ్యక్తిగతమైనటువంటి అవగాహన నుంచి వ్యక్తిగతమైనటువంటి సంచలనాల నుండి వచ్చే వ్యక్తీకరణ రూపాలు సృజన సాహిత్యం. అయితే ఈ సమాజంలో మార్పుకి కారణం అయితే అవ్వచ్చు అని అనుకుంటాను నేను. అటువంటి అన్వేషణ, అలాంటి వ్యక్తిగతమైనటువంటి అనుభూతుల్ని,భావాల్ని వ్యక్తీకరించే రచయితలు ఈ ఆధునిక కాలంలో చాలామంది నాకు కనపడుతున్నారు. కాబట్టి వాళ్ళని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది.

మీ అనుభవాలను మా విహంగ చదువరులతో పంచుకునందుకు ధన్యవాదాలు .

-కట్టూరి వెంకటేశ్వర్రావు 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖిPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments