అలుపెరగని విహంగం (సంపాదకీయం )- అరసి శ్రీ

ఒక ఆలోచనకి బీజం పడి ,ఆ ఆలోచన ఆచరణ రూపంలో సాగుతున్న పయనానికి పదేళ్ళు .

ముందుగా రచయిత్రులకి , రచయితలకి , చదువరులకి , అభిమానులకి, సాహితీ వేత్తలకి విహంగ వార్షికోత్సవ శుభాకాంక్షలు …………

మంచి సాహిత్యం జీవితాన్ని ప్రభావితం చేస్తుందనడంలో ఎంత నిజం ఉందొ అదే సాహిత్యం వాస్తవిక జీవితాన్ని ప్రతి బింబించాలీ అని నమ్మిన వారిలో డా .హేమలత పుట్ల ఒకరు . అక్షర రూపంలో అది అంతర్జాల వినీలాకాశంలో మహిళల పక్షాన తొలి విహంగమై ఎగిరింది విహంగ.

కాలం నిరంతర ప్రవాహం. ఆ ప్రవాహంలో అవసరాలతో పాటు ఆలోచనలు మార్పు చెందడం అత్యంత సహజం .

ఇప్పుడు నట్టింట్లో కన్నా నెట్టింట్లోనే ఎక్కువ సమయం గడుతున్న , గడపాల్సిన రోజులు …………..

కాని పదేళ్ల క్రితమే ఈ మార్పును గుర్తించిన వారు డా. హేమలత పుట్ల .

తెలుగు అంతర్జాలంలో తన ఉనికిని నిలబెట్టుకుంటున్న రోజుల్లోనే మహిళా సాహిత్య పత్రికను ప్రారంభించడం అనేది ఒక సాహసం . అప్పటికే ఒకటి అర తెలుగు పత్రికలు ఉన్న వాటి పంథా వేరు.

పత్రిక ప్రారంభించిన రోజు పత్రిక ఆశయాన్ని వ్యవస్థాపకులు డా.హేమలత పుట్ల మాటల్లో…
“అంతర్జాలం లో తెలుగులో మహిళల కోసం ఒక్క వెబ్ పత్రిక కూడా లేకపోవడమే ఈ ప్రయత్నానికి కారణం.అయినా స్త్రీల సాహిత్య పరిమాణం కొరతగానే ఉన్నందు వల్ల ఇంకా విరివిగా స్త్రీల సాహిత్యం, పత్రికలు అంతర్జాలంలో కాలు మోపాలని మా ప్రగాఢ వాంఛ. ‘విహంగ’ ని తొలి తెలుగు వెబ్ పత్రికగా 11-11- 11(2011) న అంతర్జాలపు వినువీధుల్లో సగర్వంగా ఎగరేస్తున్నాం.‘విహంగ’ వ్యక్తి స్వేచ్ఛను, అక్షర స్వేచ్ఛను గౌరవిస్తుంది” అన్నట్టుగానే విహంగ రచనలు అంతర్జాలం అయ్యాయి .

అప్పటి వరకు సాహిత్యం గురించి అవగాహన లేని ఎందరో చదువరులకు సాహిత్యం మరింత దగ్గర అయ్యింది . తొలి రోజుల్లో  సమకాలీనం , జ్ఞాపకాలు , మళ్ళీ మాట్లాడుకుందాం వంటి శీర్షికలు చదువరులను ఎంతగానో ఆకర్షించాయి. కొన్ని రోజులకే యాత్రా సాహిత్యం , ధారావాహికలు వంటిని ప్రారంభం కావడం , సాహిత్య సమావేశాలతో మరింత చేరువ అయ్యింది విహంగ .

ఆత్మ కథలు , పుస్తక సమీక్షలు , చారిత్రక వ్యాసాలు వంటి రచనలు ఆసక్తికరంగా సాగాయి . నాకు తెలిసి సినిమా పై సమీక్షలు ఒక వ్యాసంగా ముఖ్యంగా అంతర్జాతీయ బాలల చలనచిత్రాలపై సమీక్ష వ్యాసాలు ఒక కాలమ్ గా తెలుగులో రావడం అదే మొదటివి అనుకుంటాను .

ఆరోగ్యం పై అందరికి ముఖ్యంగా మహిళలకు  చిన్న చూపే . ఆ సున్నితమైన విషయాన్ని గ్రహించి ఆరోగ్య దీపిక , హలో డాక్టర్ వంటి  కాలమ్స్  ద్వారా ఆరోగ్య సలహాలు , ఎందరో చదువరులకు ఆరోగ్య సమస్యల పై ఒక అవగాహన కలిగించడం జరిగింది .ఇక కథలు , కవితలు , అనువాద సాహిత్యం కూడా ప్రచురితం అయ్యింది. బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర వంటి రచనల  పై చర్చలు కూడా జరిగాయి .

విహంగలో వచ్చిన ముఖాముఖీ ద్వారా ఎందరో మహిళా వేత్తలను, నాట్య గురువులను సాహితీ లోకానికి పరిచయం చేసాము .

విహంగ మహిళా పత్రిక అనగానే మహిళలకే  అని అవగాహనకు రావడం సహజం . కాని అది పొరపాటు మహిళా పత్రిక కాని విహంగ’ వ్యక్తి స్వేచ్ఛను, అక్షర స్వేచ్ఛను గౌరవిస్తుంది” అన్నట్టుగానే రచయితల రచనలకు పెద్ద పీట వేస్తూనే వస్తుంది విహంగ . ముఖ్యంగా విశ్వవిద్యాలయాల పరిశోధకుల రచనలకు , ప్రాముఖ్యం ఇస్తూ వచ్చింది .వారి వ్యాసాలు అర్హత పొందడానికి విహంగ ISSN గుర్తింపును కూడా పొందింది . అప్పటికి అంతర్జాలంలో ISSN గుర్తింపు పొందిన తొలి తెలుగు పత్రిక విహంగనే .

ఎప్పుడు కొత్త వారిని పోత్సహించే సహృదయం కలిగిన విహంగలో ఎందరో రచయిత్రులు , రచయితలు తమ తొలి రచనలు ముద్రితంలో చూసుకున్న జ్ఞాపకాలు ఎన్నో……

ఈ విధంగా విహంగ ఒక్కొక్క ఏడాది ఒక్కో మలుపులో ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు , ప్రారంభ రోజుల్లో పత్రిక తీరు కోసం గంటల గంటలు  , రోజులకి రోజులు సిస్టం ముందు ఏకధాటిగా ఉండిపోయిన రోజులున్నాయి. రోజు రోజుకి మారుతున్న టెక్నాలజీ వలన ఆ శ్రమ తగ్గింది అనే చెప్పాలి .

విహంగలో ప్రచురితం అయిన కథల పై విశ్వవిద్యాలయాలలో పరిశోధన జరగడం గమనార్హం.
విహంగ ఈ స్థాయికి చేరుకోవడానికి మేడం హేమలత పుట్ల అహర్నిశలు కష్టపడ్డారు. అందుకే విహంగ పయనం అలుపెరగకుండా ముందుకు సాగుతుంది . ఈ పయనంలో మాతో పాటు నడిచిన, నడుస్తున్న రచయిత్రులు , రచయితలకు, చదువరులకు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు.

ప్రతి నెల మీ ముందుకు వస్తున్న ఉర్దూ కవితల అనువాదం నజరానా, అరణ్యం, మహిళా మణులు, నా తండా కథలు , సమాంతరాలు , స్వప్న భాష్యాలు ఇంకా కథలు , కవితలు , ధారావాహికలు , ముఖాముఖీలతో …..ఎప్పటిలానే ఈ నెల  మీ విహంగ సంచిక నెట్టింటి ముంగిటలో ……

మరొకసారి

విహంగ వార్షికోత్సవ శుభాకాంక్షలు .

ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలు , ఆదరాభిమానాలు ఉంటాయని ఆశిస్తూ…

– అరసి శ్రీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Comments are closed.