మనుస్మృతా? స్త్రీల పాలిట శిక్షాస్మృతా ? (వ్యాసం )– అరుణ గోగులమండ

“యత్ర నార్యస్తు పూజ్యంతే నుండి న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి” దాకా..!!

“Caste feudal however sweetened, is Slavery” బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 డిసెంబర్ ఇరవై ఐదు మహద్ సత్యాగ్రహ ముగింపు సభలో. దేశమంతా దళిత స్త్రీలపై, హత్యాచారాలతో అట్టుడుకుతున్న వేళ, యూపీ లాంటి కొన్ని రాష్ట్రాల్లో యధేచ్చగా రాజ్యాంగ విస్మరణ జరుగుతూ, ప్రభుత్వ కనుసన్నలలోనే పేద దళితులపై దళితస్త్రీలపై దారుణమైన రీతుల్లో కులహంకార దాడులు జరగడం బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుండీ అతిమామూలైపోవడం కళ్ళారా అందరూ చూస్తున్న వేళ కులం యొక్క విష సంస్కృతిని ఎప్పటికైనా వదిలించుకోవాల్సిందే అంటూ కుల నిర్మూలనను ఘోషించి, స్త్రీల విద్యనూ, అభివృద్ధినీ నిరంతరం కలలుకన్న బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రి బాయ్ ఫూలే లాంటి చారిత్రక వ్యక్తుల ఆలోచనలు మననం చేసుకోవడం అనుసరించడం ఇప్పుడొక చారిత్రక అవసరమే కదా?

స్త్రీని దేవతగా కొలిచే దేశంలో నిరంతరం స్త్రీలపై ఈ అత్యాచారాలేమిటి? ఆమెను దేశంలో దేవతగా కొలిచారా నిజానికి దేవతను చేసి, నోరులేనిదాన్ని చేసి, చైతన్యాన్ని హరించి రాయిగా మార్చి బంధించారా? మరోసారి తెలుసుకుందాం. అత్యంత హేయమైన రీతిలో భారతీయ సమాజం స్త్రీలచుట్టూ అల్లిపెట్టిన పవిత్రత అనే అంశంలో, కులందాటి చేసుకునే పెళ్ళిళ్ళలో ప్యూరిటీ కోల్పోయి పొల్యూట్ అయిపోవడం ద్వారా కులసంకరణం జరుగుతుంది కనుక, కులం యొక్క పవిత్రతను, ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికే స్త్రీల శీలంచుట్టూ అనేక ఆంక్షల గోడలు కట్టి, వాటికి సాంప్రదాయాలు అనే అందమైన పేరు తగిలించి, తద్వారా స్త్రీలు తమంతట తాముగా వాటికి కస్టోడియన్స్ గా ఉండేలా తయారుచేయబడ్డ కుట్రపూరిత వ్యవస్థ పై మన సమాజం కట్టబడి ఉన్నది అనే విషయం బాబా సాహెబ్ తన అసాధారణ ప్రసంగం ‘ కుల నిర్మూలన ‘ లో స్పష్టంగా నొక్కివక్కాణిస్తారు.

బాబాసాహెబ్ ఇంత తీవ్రస్థాయిలో భారతీయ పురాణాల నిగ్గుతేల్చి, వాటికి మూలమైన మనుస్మృతిని ఔపోసన బట్టి, దాన్నొక దుష్ట గ్రంధంగా, స్త్రీని దుర్మార్గంగా చిత్రీకరించిన, బానిసను చేసిన సాంఘిక దురాచారంగా అర్ధం చేసుకొని తగలబెట్టి కులనిర్మూలనను ప్రతిపాదించడానికి కారణం ఏంటి? చూద్దాం.

“పితా రక్షతి కౌమారే.
పతి రక్షతి యౌవనే
పుత్రో రక్షతి వార్ధక్యే
న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి”
మానవాళికే జన్మనిచ్చే స్త్రీ మూర్తిని, ఒక్కో వయసునందు ఒక్కొక్క మగవాడికి అప్పజెప్తూ, తండ్రికీ భర్తకూ, కుమారునికీ ఆమెను ఆస్తిగా అప్పగిస్తూ, స్త్రీ ఎప్పుడూ ఎవరో ఒకరి ఆధీనంలో ఉండాలని నిర్దేశిస్తూ, స్త్రీ తనంతట తానుగా, స్వతంత్రురాలిగా బ్రతకడానికి అర్హత లేదని చెప్పాడు మనువు. స్త్రీ లేనిదే ఊపిరే లేని పురుషజాతికి స్త్రీని జీవితాంతం బానిసను చేసే కుట్రను రచించిన మనువును మించిన స్త్రీద్వేషి ప్రపంచంలో ఇంకెక్కడినా ఉన్నాడంటారా?

తన పరిశోధనాత్మక గ్రంధం “భారతీయ సంస్కృతిలో స్త్రీ”లో దళిత తత్వవేత్త డా.కత్తిపద్మారావు ఇలా అంటారు. “పురాణాల్లో స్త్రీని నీచాతి నీచంగా వర్ణించడం జరిగింది. ఆమె మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఎంతగా కించపరచడానికి వీలౌతుందో అంతగా కించపరిచారు. అసభ్యంగా, బీభత్సంగా, జుగుప్సగా చిత్రీకరించారు. ఆమెను పతివ్రతగా పొగుడుతూనే, వ్యభిచారిణిగా మనసు నిలకడ లేనిదానిగా అభివర్ణించారు. స్త్రీలు చిరునవ్వుల చేతనూ, హావ భావాల చేతనూ పురుషుడ్ని కట్టివేస్తుందనీ అందుకే స్త్రీ విషయంలో అప్రమత్తంగా ఉండాలనీ తన సుభాషితాల్లో భర్తృహరి హెచ్చరిస్తున్నాడు”

కాబట్టే నిచ్చెన మెట్ల భారతీయ కుల వ్యవస్థను అర్ధం చేసుకోవడం అంత సులభం కాదని చెప్పాలి. మనదేశాన్ని కుల వివక్ష ఒక మాయని రోగంగా పట్టిపీడిస్తుంటే, దానికి మూలకారణమైన లింగ వివక్షను గుర్తించడం, దాని గురించి మాట్లాడడం చాల కష్టమైన వ్యవహారాలే. ఎందుకంటే, ఒకపక్క భారతదేశం స్త్రీలను దేవతలుగా పూజించే దేశమని, ఇక్కడి పురాణాలు ఘోషిస్తాయి. ఇంకోపక్క స్త్రీలను రెండో స్థాయి పౌరులుగా, పీడగా, పాప భూయిష్టురాలిగా, తెలివిలేనిదిగా, చెడ్డబుద్ధుల సముదాయంగా, కుట్రదారుగా కూడా మళ్ళీ అవే పురాణాలు నిర్వచిస్తాయి. మనుస్మృతి అనే అలనాటి సాoఘిక ధర్మశాస్త్రంలో మనువు అనే వ్యక్తి స్త్రీలనూ, దళితులనూ దుర్మార్గులనుగా, నీచమైన మనస్తత్వం కల వారుగా, ప్రళయాంతకమైన బుద్ధికలవారుగా, సమాజాన్ని నాశనం చేసేవారుగా నిర్వచించి, వారిని అనేక కట్టుబాట్లలో ఉంచాల్సిన ఆవశ్యకతను నిర్దేశించి, అందుకు తగ్గట్టుగా వర్ణ వ్యవస్తను రూపొందించాడు. అందుకే భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పౌరులందరూ సమానంకాని హెచ్చుతగ్గుల వ్యవస్తను చూస్తాం. ఈ హెచ్చుతగ్గుల వ్యవస్తలో స్త్రీ ఎన్నటికీ ఒక బానిసగా, సర్వకాల సర్వావస్థలలోనూ పురుషునికి విధేయురాలిగా ఉండాల్సిన బానిసగా మనువు తీర్పుచెప్తాడు.

ఐతే, రాజ్యాంగశిల్పి, ఆధునిక భారతదేశ రూపకర్త డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇన్ని సాంఘిక వైషమ్యాలకు నిలయమైన మనుస్మృతిని దహనం చేసి, భారతదేశంలో పుట్టిన అందరికీ సమాన హక్కులు దక్కేలా సర్వశ్రేష్ట రాజ్యాంగాన్ని రూపొందించి, దళితులనూ స్త్రీలనూ విముక్తి చేసాడు. ఎన్నో విధాలా వారికి సమాజంలో హక్కులు కల్పించి వారి జీవన ప్రామాణాలు మెరుగుపడే విధంగా చట్టాలు చేసాడు.

అందుకనే ఈదేశంలో ఈరోజు చంద్రమండలానికి వెళ్ళే స్త్రీలనూ, స్పేస్ సెంటర్లలో పనిచేసే సైంటిష్టుస్త్రీలనూ, మల్టీ నేషనల్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న ధీరొధాత్త మహిళలనూ, కంపెనీ సియ్యీవోలనూ అతిమామూలుగా చూడగలుగుతున్నాం. మనుషులను కులాలుగా విభజించి, అంతటితో ఆగకుండా మళ్ళీ స్త్రీలను జాతులుగా కూడా విభజించాడు మనువు. దానిప్రకారం, కొన్ని జాతుల స్త్రీలే మంచి స్వభావం కలిగి ఉంటారనీ, వారికి కొన్ని ప్రత్యేకమైన శారీరిక లక్షణాలుంటాయనీ, అలాంటి వారినే వెతికి, భార్యలుగా, కోడళ్ళుగా చేసుకోవాలనీ, సూచించాడు. ఆ విధంగా మనుషులుగా పుట్టిన వారిని జాతులుగా వర్ణాలుగా కుట్రపూరితంగా విభజించి, కొందర్ని పాలకులుగా కొందర్ని పాలితులుగా, కొందర్ని యజమానులుగా మరికొందర్ని బానిసలుగా విభజన చేసి, భారతదేశం ఇన్ని రకాల హెచ్చుతగ్గులకు కారణం కావడానికి పునాదులు వేసాడు స్వారోచిష మనువు. కనుకే ఈరోజు ఇంతటి ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ మనం గమనిస్తే, మనువు పాలకులుగా నిర్దేశించిన కులాలే/ మతాలే ఇప్పటికీ పాలిస్తున్నాయ్. అంబేడ్కర్ శ్రమ వల్ల షెడ్యూల్డ్ కులాలు లేదా అణచివేతకు గురైన కులాలు ఎంతో కొంత అభివృద్ధి సాధించినా, మారువేషంలో సంచరిస్తున్న అంటరానితనానికే ఇప్పటికీ గురౌతూ ఇప్పటికీ ఇంకా ఊరికి దూరంగా, ప్రత్యేకింపబడ్డ ప్రదేశాల్లోనే నివశిస్తుంది తప్ప, ఇతర ధనిక కులాల్తో సమానంగా, సావాసంలో జీవించే హక్కుకు దూరంగానే ఉంది.

కాబట్టే ,పైన నేను ప్రస్తావించిన అచీవర్స్ స్త్రీల జాబితాలో మనం ఎంత వెతికినా , షెడ్యూల్డ్ కులాల స్త్రీలు కనిపించరు. స్త్రీలందరికీ, ఒకటే రీతిన ఈ దేశపు ప్రభుత్వాలు అవకాశాలు కల్పించి ఉండి ఉంటే, దేశంలోని బాలికలందరికీ ఒకటే రీతిన విద్యావకాశాలు కల్పించి ఉండుంటే, ఈరోజు అంతరిక్షంలో అడుగుపెట్టిన స్త్రీల జాబితాలో, కంపెనీ సియ్యీవోల, సైంటిష్టు స్త్రీల జాబితాలో కులాలు అంతరాలు లేకుండా అట్టడుగు కులాల స్త్రీలు కూడా స్థానం సంపాదించుకుని ఉండేవారు. కానీ వాస్తవాలు చేదుగా ఉన్నాయి. ఇంకా ఎందరో దళిత బాలలు సరైన చదువుకి నోచుకోలేని స్తితిలో చదువుకి దూరంగా ఉంటున్నారు. దళిత ఆడపిల్లలైతే కూలికి వెళ్ళడం, తల్లులు కూలికెళ్తే, ఇంట్లోని పసిపిల్లలను సాకడం, ఇంటి పనులు చూసుకోవడం లాంటి పనులు చూసుకోవాల్సి వస్తూ, చదువుకీ ఆర్ధిక స్వాలంబనకూ దూరంగా ఉంటూ, తమ భవిష్యత్తును కోల్పోతున్నారు. అలాంటి స్తితి వల్ల, నిరంతరం ఇంట బయటా అవమానాలకూ, త్వరగా పెళ్ళి పిల్లలూ పుట్టేయడం లాంటి ఇబ్బందుల వల్ల, ఉత్పత్తి కులపు స్త్రీ యొక్క ప్రగతిలో ఆరోగ్యంలో, సమాజం ప్రగతి మొత్తం ఆధారపడి ఉందన్న నిజం తెలిసీ, ఆ కులాలను అట్టడుగునే ఉంచేసే కుట్రను జాగ్రత్తగా అమలు చేస్తున్న ఆధిపత్య శక్తుల వల్లా, దళిత స్త్రీ మిగతా కులపు స్త్రీలలా అభివృద్ధి సూచికలో వెనకబడే ఉండిపోతుంది. శారీరక శ్రమ చేస్తూ కూడా, గనుల్లొ పనుల్లొ కార్ఖానాల్లో మగాళ్ళకు దీటుగా ఇంకా చెప్పాలంటే పురుషుల కంటే ఎక్కువ పని చేస్తూ కూడా ఇంకా ఇంకా అట్టడుగునే ఉండిపోవడం వల్లనే, ఆమె అత్యధికంగా అత్యాచారాలకు, భౌతిక దాడులకు, ఆధిపత్య పారిశ్రామిక ,వ్యాపార సమాజం చేస్తున్న అవమానాలకు బలౌతూ బాధాకరమైన స్థితిలో ఉంది, ఉండిపోతుంది.

రాజ్యాంగ రూపశిల్పి, “స్త్రీ విముక్తిలోనే స్త్రీల యొక్క ఆభివృద్ధిలోనే భారత సమాజం యొక్క మొత్తం అభివృద్ధి ఉందని ఒక్క మాటలో ఆధునిక సమాజాన్ని ప్రవచించిన డా. బాబసాహెబ్ అంబేడ్కర్, ఆ మాటలతో ఆగకుండా భారతీయ స్త్రీని అన్ని విధాలా విమొచించే హిందూకోడ్ బిల్లును రూపకల్పన చేసారు. భారతీయ మనువాద మేధావులుస్త్రీని దేవతవూ అంటూనే కట్టుబాట్లకు, పరాయీకరణకూ, బానిసత్వానికీ గురిచేసిన ఆచారాలూ, చట్టాలూ తొలగించి ఆమెకు ఆర్ధిక స్వావలంబన కల్పించే ఆర్ధిక, సాంఘిక, లైంగిక హక్కులను కల్పిస్తూ నాలుగేళ్ళకు పైగా కృఅషిచేసి ముసాయిదాను తయారుచేస్తే, ఆనాటి పార్లమెంటులో అప్పటి సోకాల్డ్ అభ్యుదయవాదుల్లో ఎందరో ఆ బిల్లును తిరస్కరిస్తూ గగ్గోలు పెట్టారు. పితృస్వామ్య సంకెళ్ళనుండి భారతీయ స్త్రీని తప్పిస్తేనే సర్వస్వతంతృరాలై పురుషాధిక్యతను లెక్కచేయదనీ, తద్వారా భారత సమాజం నాశనం ఔతుందనీ బెంబేలెత్తి, నాలుగేళ్ళ సుదీర్ఘ చర్చల అనంతరం కూడా ఆ బిల్లును చట్టం కానివ్వకుండా అడ్డుకున్నారు.

సమకాలీన భారతీయ తత్వవేత్త, దళిత బహుజన సామాజిక రాజకీయ విశేషకుడు, తత్వవేత్త ,మేధావి కత్తిపద్మారావు తన భారతీయ సంస్కృతిలో స్త్రీ అనే గ్రంధంలో ఇలా అంటారు.

సమకాలీన సమాజంలో భూస్వామ్య సంస్కృతిలో మాతృస్వామ్యానికి ఉన్న ప్రాధాన్యాన్నివివరిస్తూ ఇంకా లోతైన అధ్యయనంతో చారిత్రక రచన సాగవలిసి ఉంది. సమకాలీన సమాజంలో భూస్వామ్య సంస్కృతిలో, అస్పృశ్యతకు వెట్టిచాకిరీకి గురౌతున్న దళిత స్త్రీ,తరతరాల గణ వ్యవస్థల,మాతృస్వామిక వ్యవస్థల సంస్కృతుల్లోనే జీవిస్తున్న గిరిజన స్త్రీ, పెట్టుబడిదారీ సంస్కృతీ బంధనాల్లో చిక్కుకున్న మధ్య తరగతి స్త్రీ అనేక వృత్తుల్లో వ్యయప్రయాసలతో కూడిన శారీరిక శ్రమలో సరైన వేతనం పొందలేని బడుగు వర్గాల స్త్రీ, మొత్తంగా పీడిత వర్గ స్త్రీల యొక్క ఆర్ధిక, సాంఘిక సాంస్కృతిక మానసిక స్వరూప స్వభావాలను నిరూపించే ఆధునిక చారిత్రక పరిశొధనా రంగం ఇంకా సుసంపన్నం కావలసి ఉంది”

పురుషాధిక్యాన్ని సాంప్రదాయంగా, గొప్ప భారతీయ ఆచారంగా గప్పాలు కొట్టుకునే భారతీయ సమాజంలో, స్త్రీలందరూ నిజానికి రెండోజాతి పౌరులే. ఐతే కులాల వల్ల తమకు ఒనగూడే ఆధిపత్యాలను అనుభవించడం, ఆనందించడం, రాజకీయ సాంఘిక, ఆర్ధిక అధికారాలను ఆయా కులాల స్త్రీలు కూడా తమ భర్తలతోపాటే అలవాటు చేసుకొని, నిచ్చెన మెట్ల వ్యవస్తలో అట్టడుగున ఉన్న కులాల స్త్రీలపై తమ ఆధిక్యతను ప్రదర్శిస్తూ అజ్ఞానంతో ప్రవర్తిస్తూ, స్త్రీలపై ఈ దేశం నడిపిస్తున్న దమన కాండను ప్రశ్నించకుండా వీరంతా మరొక ఆధిపత్య కేంద్రంగా తయారయ్యారు. పురుషుల ఆలోచనల్లో స్త్రీలందరూ బానిసలూ, సేవకులే ఐనా, దళిత, సంచార జాతుల స్త్రీల మాదిరి ఈ స్త్రీలు పొలాల్లో, పరిశ్రమల్లో, ఇబ్బందికర పరిస్తితుల్లో పనులు చేసే పరిస్తితులు తక్కువ కనుక, వీరికి ఆర్ధిక స్వావలంబనతో పాటూ ఆధిపత్య కులం ఇచ్చే ఆధిక్యత కూడా ఉండడం వల్ల వీరిపై అత్యాచారాలు జతిగే అవకాశాలు తక్కువా కాబట్టి వీరు కూడ దళిత కులాల స్త్రీలపట్ల వివక్ష చూపించడం అలవాటుగా చేసుకున్నారు. ఈ పరిస్తితులు మారాలి అంటే, స్త్రీలంతా మనుస్మృతిని తెలుసుకోవాలి. స్త్రీలపై జరిగే ప్రతీ అత్యాచారాన్నీ, ధనిక కులాల స్త్రీలు కూడా ఏక కంథతో ఖండించాలి. అలాగే దళిత కులాల స్త్రీలు విద్యావంతులూ ఆర్ధిక స్వావలంబనను కాంక్షించే వారుగా తయారవ్వాలి. శ్రామికురాలిగా పీడనలోనే బ్రతికి ముగుసిపొకుండా, జ్ఞానవంతురాళ్ళై ఈ దేశాన్ని శాసించే స్తితికి ఎదగాలి. ఆ దిశగా దళిత మేధావి వర్గం కృషి చేయాలి.

– అరుణ గోగులమండ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments