బిడ్డా రామీ!
జర సోచాయించు
మన అమ్మల కడుపు గాలితే
పట్టుచీరల తో సింగారించుకోలేదు
పట్టుపంచెలు ఎగదోపి కాష్ఠాల్లో కట్టె పెట్టలే
శవాలముందు మొసలికన్నీరు కార్చలే
వున్నది గుడిసె
ఓ పక్క వంట మరోపక్క పక్క
రెండు గదులిండ్ల జాడ లేదు
హోమ్ క్వారంటైన్ గెట్లా
మన అసుంటోళ్ల దవాఖానలోనేమో నీళ్ళు జొర్రే
మన బువ్వ మనం తింటుంటే
మన గింజ మనం నాటుతుంటే
మన నేల సత్తా మనకు తెల్వనట్లు
కొత్తగింజేయమని హుకుం
గిదేమీ వాడయ్య జాగీరు గాదుగా
ఇచ్చే నాలుగు రూకలూ మనయే బిడ్డా
గాడింట్లనుండియ్యట్లే బిడ్డా పైలం
భూసారం జూసుకో
రాజప్రాసాదాలు
కోటలు గుళ్ళూ గోపురాలు మనకెందుకు బిడ్డా
మనకి గింత బువ్వుంటే చాలు
రోగమొత్తే గోలిచ్చే దవాఖాన చాలు
పోరగాళ్ళకింత అచ్చరం జెప్పే బడి చాలు
గది కూడా అడగనీకి నోరు పెగలట్లే
ఊళ్ళ గడీలు మళ్ళీ లేస్తున్నాయి బిడ్డా
మన బిడ్డలు సచ్చి
మన తల్లుల ఆక్రందనలు
వినబడలేదా బిడ్డా
ఎంగిలిమెతుకుల కెగబడి
మన బతుకులనే పణం పెట్టొద్దు బిడ్డా
మన చరిత్ర మనం మరువొద్దు
మన పోరగాళ్ళ కొలువుల జాతరేది
ఉరితాళ్ళు పేనిస్తది
మందుడబ్బాలు అందిస్తది
పోకడే అది
అర్థంకాక వెనకటి గొయ్యిల పడ్తనం
రక్తం మనదే
రక్తపుమరకలు మనయే
రక్తాన్ని రుచిమరిగిన జాతి
మనల్నే మనపైకి ఎగదోస్తది
ఎవ్వడు సచ్చినా మనమేగా
అది తమాషాగా జుర్రుకుంటది రక్తం
– గిరిప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`