నా తండా కథలు-2 – బంజారాస్ ప్రయిడ్ – డా.బోంద్యాలు బానోత్(భరత్)

ఫూలణ్ బాయి, భూలణ్ బాయి దోయి దమెతి సోప్తణె(ఫూలణ్ బాయి, భూలణ్ బాయి ఇద్దరు ప్రాణ ఫ్రెండ్స).

ఎంత ఫ్రెండ్సంటే, పొద్దున లేచిన మోదలుకొని రాత్రయ్యేంతవరకు, విన్న విషయాలు, చూసిన దృష్యాలు.. అన్ని ఒక్కరికొక్కరు చెప్పుకోనిదే ఆ రాత్రికి నిద్ర పట్టదనుకోండి. అంతే కాదు, ఆరోజు తిన్న తిండి కూడా అరగదనుకోండి. అంటే అంత మంచ్చి క్లోజ్ ఫ్రెండ్సు అన్నమాట.
‘తండా’ లో ఏ మగాడు ఏం చేస్తుండు, ఏ ఆడది ఏం చేస్తుంది, ఎవరితో ఎవరకి సంభంధం ఉంది!? ఎవరెవరికి తండా లోపటోల్లతో ఉంది, ఎవరెవరికి తండా బయటోల్లతో (అంటే ఊల్లోల్లతో) ఉంది, మోదలగు విషయాలు అన్ని పూసగుచ్చినట్టు చెప్పగల చాతుర్యం, తెలివితేటలు ఉన్నాయి ఫూలణ్ బాయికి.

ఐతే, వారం రోజులనుండి బురద దున్నుతున్నరు. దున్నింది దున్నినట్టే, వెంట వెంటనే, నాటేస్తున్నరు. ఐతే, వరినాటేసే సీజన్ కూ, పత్తి చేన్లల్లో కలుపు తీసే‌ సీజన్ కూ ఒకే అదును కావడంతో, ఇటు వరినాటేయించాల్న, అటు పత్తి చేన్లో కలుపు తియించాల్నో అర్థం కాక తికమకమయ్యే సమయమది.
ఐతే, పత్తి చేన్లో కలుపుకు అంత తొందర లేదు. ఎందుకంటే పత్తి చేన్లో కలుపుకూ నాల్గైదు రోజులు అటీటైన ఏమంత ఫరక్ బడదు. కాని వరినాటుకు లేటైతే అదును పోతది, వెనకబడి పోతది. అందుకే తండోల్లు, ఊల్లోల్లు అందరు నువ్వా నేనా అన్నట్టు పోటీపడి మరీ వరి నాట్లేపిస్తున్నరు. కూలోల్లను ఆకర్సించేందుకు, కూల్రేట్లు పెంచేస్తున్నరు…

ఆ రోజు ఫూలణ్ బాయి వాల్లది నాటేసుడు ఆకరైంది. రోజు బురదలో వంగోంగి నాటేసుట్లా బాగ అలసిపోయి, ఒల్లు గుల్లైనంత పనయింది. ఐనాసరే వరినాటు ఆకరైన సంధర్భంగా ఫూలణ్ బాయి ఫుల్లు కుశిగున్నది. ఈ కుశిలో కాస్తాంత మందెయ్యలనుకొంది ఫూలణ్ బాయి. కాని ఎట్లా అని ఆలోచిస్తుంది.. ఇంతలో ఇంట్లో తాగేందుకు పెట్టిన కుండసార గుర్తుకొచింది. చీకట్లో అటూ ఇటూ వెతికింది. వెతకబోయిన తీగ కాలుకు తట్టినట్టు. వెతకబోయిన సారా సీసా చేతికి దొరికింది. దబదబా క్యాన్లోనుంచి సీస నింపింది. ఇంట్లో ఎవరు లేన్దిచూసి, సార సీస కొంగు సాటున దాసుకొని, సప్పుడు గాకూండ మెల్లగా తన ఫ్రెడు భూలణ్ బాయి ఇంటికి చేరుకున్నది. ‘బాయి.. బాయి..’ అనీ తలుపు తట్టింది మెల్లగా.‌ విషయం గమనించిన భూలణ్ బాయి లేసి తలుపు తీసింది. ‘మంచమేపర బ్యాస్ బాయి'(మంచం మీద కూసో అక్కా.) అని అన్నది గౌరవంగా. భూలణ్ బాయి భర్తా ఇంట్లోనే ఉండడంతో ఆయన ముందు మంచంమీద కూర్చోవడానికి కొంచం మోహమాటం వ్యక్తం చేస్తూ కళ్ళతో సైగచేసింది. ‘అయిందానికి ఇగ సాప మీద కూసో అక్కా’ అన్నది భూలణ్ బాయి. ‘మనలో మనకు గీ మర్యాదలెందకమ్మా, నేనెక్కణైన కూసూంటా. ఈ జమ్మియాడితి మోటో కూణ్ ఆయో బాయి'( ఈ నేల తల్లికన్న పెద్ద ఎవర్లేరు తియ్యక్కా) అంటూ ఫూలణ్ బాయి సాప మీద కూసున్నది.

అప్పుడే భూలణ్ బాయి అన్నం తిందామని నాటుకోడి కూర గిన్నె, జొన్న రొట్టెలు, ప్లేట్లు రెడి పెట్టు కోంటుంది.

ఫూలణ్ బాయి రావడంతో ‘తూ సదా ఎక్ బాటి ఖో బాయి'(నువ్వు కూడా ఒక రొట్టె తినక్కా) అనీ అన్నది భూలణ్ బాయి. ‘తింటా కాని కొంచమంత తెచ్చిన, నాటేసుడు ఆకరయిందని..’ అని అంటూ, మళ్లి సైగచేసింద కళ్ళతో మోహమాటంగా, ఆమె భర్తవైపు. ‘నూవ్విక్కడ ఏ సంకోచం లేకూండ మాట్లాడవచ్చు. ఆయన ఏమనుకోడు. ఎవరితో చెప్పడు. కాకపోతే విషయాన్ని బట్టి తన అభిప్రాయాన్ని చెప్పుతడు. నువ్వేం టెన్షన్ బడకు.’ అనీ అన్నది భూలణ్ బాయి.

కొంగు సాటున ఉన్న సారాసీస బయటికి తీసింది. మూడు గ్లాసులు ఇయ్యమంది. మూడీటీల్లో బరాబర్ గా పోసిది. ముందుగా భూలణ్ బాయి భర్త విమల్ నాయక్ కూ తాగమని చేత్తో గ్లాసందీవ పోయింది మర్యాదగా. తను చదువుతున్న సైకాలోజి పుస్తకం మూస్తూ పేజి గుర్తుకోసం మద్యలో స్కేల్ పెట్టి పుస్తం మూసిండు. కుడిచేత్తో సారా గ్లాసు తీసుకున్నడు. మూడు చుక్కలు నేలమీద పోసిండు. మీరు కూడా తీసుకోండి అనీ సైగ చేసిండు విమల్ నాయక్. ముగ్గురు ఒకేసారి తాగీండ్రు. ‘కసెకొ ఛ బాపు’ (ఎట్లూన్నది)అనీ అడిగింది ఫూలణ్ బాయి. “బాగానె ఉంది, రోజు తాగే సారకంటే కొంచం భిన్నంగా వుంది. బాగుంది.’ అన్నడు సార గుటుక మింగుతూ. పుస్తం పేజి లో వున్న స్కేల్ తీసిండు, ఆపిన కానుండి చదవడం మోదలు పెటిండు విమల్ నాయక్.

ఇంతలో భూలణ్ బాయి ఒంటేలుకని బయటికి పోయింది. గోడసాటున ఒంటేలు పోసి లేసింది. అప్పుడే పక్కింట్లో నుండి ఆఫ్ బనీలు, లుంగీ పై బయటికి వస్తుండు ఒకాయన. అతన్ని గమనించిన భూలణ్ బాయి కొంచం భయపడింది. తుప్పురు తుప్పురు వర్షం పడుతోంది. కొంగు నెత్తినేసుకొని దబదబా ఇంట్లోకొచ్చిది భూలణ్ బాయి.’పాణిమార్రొ ఛ కూఁ ?’ (వర్షం పడుతోందా?) అని అడిగింది ఫూలణ్ బాయి. ‘హల్కి హల్కి ఛాంటే, పణన్ బాయి ఒవడితో దుమ్ముఝాల్డిదొ జూఁ ఛ కాయిఁ పాణి (తుప్పురు తుప్పురు చినుకులు కానీ అక్కా అటు పక్కింట్లో నైతే దుమ్ము దులిపినట్టుంది వాన) అనీ అన్యోక్తి గా అన్నది భూలణ్ బాయి. ‘నీకేదో కనబడినట్టుంది’ అని పక పకా నవ్వుతు అన్నది ఫూలణ్ బాయి. ‘కనబడుడేందమ్మా హాయిగా ఏమాత్రం ఫికర్లేకుంటా బయటికి పోతాండు, కానీ ఎవ్వడో నేను గుర్తు పట్టలేదు.’ అన్నది భూలణ్ బాయి. ‘ఏ.. అక్కా నువ్వు గుర్తు పట్టకుంటే ఎమైతది, నేను చూడకూండానే చెపేస్తా.

వాడు పట్నంలో నౌకరి చేస్తున్నడు. అప్పుడప్పుడు తండకొచ్చి వ్యవసాయం కూడ చేపిస్తుంటాడు. కొంచం పైసలున్నోడు కావడంతో కారు మేంటేన్ చేస్తుంటాడు. కారుకు దగ్గట్టుగా డ్రెస్సులు మేంటేన్ చేస్తుంటాడు. వయస్సు అరవై పైబడిన ఇరవై ఏండ్ల లేడీసులకు లైటింగ్ కొడుతుంటాడు. వ్యవసాయం పేరుతో తండకొచ్చి, రెండ్రెడు, మూడ్ముడు రోజులు తండలోనే మకామేస్తుంటాడు.‌ పిల్లి గనుక ఎలకల కోసం మకామేసినట్టు’ అని అన్నది ఫూలణ్ బాయి.

ఔనక్కా మా తాతా కూడ ‘పిల్లి-పాలు’ సామెత గురించి ఊకె చెప్పే వాడు.’ అన్నది భూలణ్ బాయి.
‘పిల్లంటే, ఈ పిల్లి, మాములు పిల్లి కాదు. ఈ పిల్లి పట్నంనుంచి వచ్చింది. ఇక్కడా తాత్కాలిక తోడుకోసం, ఆడపిల్లిని ఎతుకుతోంది. పిల్లి పాలు తాగుతూ నన్నేవరు చూస్తలేరు అనుకుంటదటా. కానీ పై నుండి ఎలకలు చూస్తోన్నాయి అన్న విషయాన్ని మరచి పోతదటా.’ అన్నది ఫూలణ్ బాయి, రొట్టెముక్కలో చికెన్ ముక్కను చుడ్తూ ‘ఇంట్టాయన ఇంట్లోలేడా! అక్కా’ అని అడిగింది భూలణ్ బాయి కూల్గ. ‘ఇంట్టాయన.. ఇంట్టాయన ఇంట్లో ఉంటేందీ వాడేక్కడైన పంటేంది. వాన్ని తిట్టీ తిట్టీ చెవ్వులినబడకుండా చేసింది.అత్త మామతో రోజు గొడవే. ఇంటిపక్కోల్లతో గొడవే. ఎవ్వల్తొ మాట్లాడదు, దాని గురించ్చి మాట్లాడినా, దాని మాట తీసిన, అది వాల్లను వారం రోజులు తనివి తీర తిడ్తది. అందుకనే దాన్ని ఎవరు పటించుకోరు, దాని జోలికి పోరు. ఇంటోడు కూడా చెప్పీ చెప్పీ, చూసి చూసి యాష్ఠకొచిండు. ఇగ వాడు కూడ పట్టించుకుంటలేడు. ఇగ దాని ఇష్ఠారాజ్యమయింది. కాని ఏం సంపాదించింది? దగ్గర దగ్గర రేండు సంవచ్చరాల పాటు తెలుపు నడిసింది. ఊ అంటే దవాఖానకు, ఆ అంటే దవాఖానకు… పాపం వాడు చాల మంచోడయేపటికే నడుస్తాంది. అదే నా మోగుడో నీ మోగుడో ఐతే, ఈ పాటికి విడాకులే గతౌ.. చిన్నా-పెద్దా, మంచ్చీ-చెడ్డా, మనోడు-పరాయోడు, ఇంట్లోడు-బయటోడు… చూడ కూడదా?

ఇంతగనమా!, నెరీ నెరీ మనుసుల కంటే కుక్కలు వందరేట్లు నయ్యం. ఎందుకంటే వాటికంటూ ఒక కార్తి ఉంది. ఒక పద్దతి వుంది. ఈ మనుసులకే ఓ పద్దతి-పాడు లేదు, ఓ టైమూ లేదు. నేను అందరు అట్లాంటోల్లని అనట్లేదు. ముఖ్యంగా తండాలో ఇద్దరున్నరు. దానికైతే ఊల్లోల్లే కావాలే. జాతి పరువు తీస్తాంది. దాన్ని చూసి ‘లంబాడోల్లు అందరు అలాంటోల్లే’ అని అనుకోరా! అక్కా’ అని అన్నది రెండోసారి తన గ్లాసులో ‘బంజారాస్ ప్రయిడ్’ (గుడంబ)పోసుకోంటు.

ఇదంతా ఒకవైపు వింటూనే ఇంకోవైపు సైకాలోజి పుస్తకం చదువుతున్నడు విమల్ నాయక్. ఇగ తను కూడ కౌంటర్ ఇవ్వాలనుకున్నడు. ‘ఓ.. యేదో కొంపలంటుకొపోయినట్టు.., ఆమె ఏదైన చేసుకొంటది, అది ఆమె పర్సనల్ విషయం. మీ కడుపులో ఏంటీ మంటా? మీక్కూడా అలాంటి స్వేచ్ఛ లేదనైతే బాద పడట్లేదు కదా!?’ అనీ అన్నడు విమల్ నాయక్ సూటిగ.

‘పర్సనలైతే ఆమెనుకూడ పర్సనల్గా ఉండమను. తండమద్యల ఇల్లేందుకు?’ అన్నది ఫూలణ్ బాయి తర్కంగా. ‘పర్సనల్గా, తండకు దూరంగా ఇల్లు పట్టుకొని ఉండాలని అనే హక్కు మనకెవ్వరికీ లేదు.’ అని అన్నడు విమల్ నాయక్ రెండోపెగ్గు బంజారాస్ ప్రయిడ్(గుడంబ) తాగిన గ్లాస్ కింద పెడుతు. ‘నువ్వు చెప్పేది చాల చక్కగుంది కాని అది చేసే పనెట్లూన్నది. నలుగురు మెచ్చేపనేనా అది? ఎక్కడికి పోయిన దానిగురించే మాట్లాడుకోంటున్నరు. అది వినలేకపోతున్నం.’ అన్నది ఫూలణ్ బాయి, అసహనం వ్యక్తం చేస్తూ.

‘ఐతే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేంటంటే ప్రతి జీవి, ప్రతి మనిసి (అది ఆడ కావచ్చు లేదా మగ కావచ్చు) జీవితాన్ని సైకాలోజి ప్రభావితం చేస్తోంది. సైకాలోజి లో ముఖ్యంగా మూడు విషయాలు ఉంటాయి.అవి ఒకటి ‘ఇడ్’, రెండోది ‘ఇగో’, మూడోది ‘సూపరిగో’. ఈమూడు మనిషి యెక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. పై మూడీటీల్లో దేని ప్రభావం ఎక్కువైతే దాని విదం గా ఆ వ్యక్తి యెక్క ప్రవర్తన ఉంటూంది. దీనికీ నీ వాళ్ళు, నా వాళ్ళు, నీ కులం, నా కులం అంటూ ఏమి ఉండదు.

అదేవిదంగా ఒక వ్యక్తి (ఆడైన మగైన) ఆర్దికంగా పేదరికంలో మగ్గుతుంటే కూడా సామాజికంగా దిగజారే అవకాశం ఉంది. కుటుంభ కలహాలు కూడా కారణమౌతాయి.కాబట్టి మనం ఎవ్వరిని ఊరకనే నిందించకూడదు, అని నా అభిప్రాయం.’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్ప్యాడు విమల్ నాయక్, చికెన్ బొక్క నములుతూ.

ఇంతలో వాన చినుకులు ఆగినయి. ఫూలణ్ బాయి ఒంటేలుకని బయటికి పోయింది. ఆ వ్యక్తి అక్కడే అటూ ఇటూ తిరుగుతూ కన్పించాడు. ఫూలణ్ బాయి తిరిగి ఇంట్లోకి వచ్చింది. ‘ఇప్పటిదాక ఏదేదో చెప్పినవు, నాకైతే సగం అర్థమైయింది, సగం అర్థంకాలేదు. కాని వాడు అక్కడక్కడే తిరుగుతుండు.’ అంటూ చివరి పెగ్గేసింది, ఫూలణ్ బాయి. ఇంతలో బయటినుంచి ఓ పిలుపు ఇన్పించింది, ఫూలణ్ బాయి ఆదర బాదర లేసి ఇంటికెల్లిపోయింది.

– డా.బోంద్యాలు బానోత్(భరత్)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments