చెలమ (కథ )-డా.కె.మీరాబాయి

అభయ కాంప్లెక్ష్ లోని సి బ్లాక్ లో మూడువందల ఇరవై ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. నలభై ఏళ్ళ రవీంద్ర ముక్కు, నోరు కప్పుతున్న మాస్క్,,చేతులకు తొడుగులు వేసుకుని బయటకు అడుగు పెట్టాడు.
అతనికి నాలుగు అడుగుల వెనకాల రవీంద్ర నాన్న పాండురంగ,ఒంటినిండా శాలువా కప్పుకుని,జ్వరంతో వణుకుతూ బయటకు వచ్చాడు.

ఆయన వయసు అరవై అయిదు పైనే. ఆయన కూడా మాస్క్ వేసుకునే వున్నాడు. ఆయన ఆదోనిలో ఒక ప్రైవేట్ కాలేజిలో కెమిస్త్రీ లెక్చరర్ గా పని చేసి పదవీ విరమణ చేసాడు.

ఎమ్మిగనూరులో ఆయన తండ్రి కాలం నాటి చిన్న ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. వయసు మీద పడిందని, తమ దగ్గరికి వచ్చి వుండాల్సిందే అని ఒక్కగానొక్క కొడుకు పట్టుబట్టి ఆరు నెలల క్రితం కర్నూలుకు తీసుకు వచ్చాడు.

అదేమి దురదృష్టమో, వచ్చిన కొన్నాళ్ళకే కరోనా విజృంభించడం , ఎక్కడి వాళ్ళు అక్కడ భయంగా రోజులు గడపడం మొదలయింది.

“నువ్వు అటు వెళ్ళి లిఫ్ట్ లో కిందికిరా నాన్నా. నేను మెట్లు దిగి వస్తా” అంటు మరోవైపుకు నడిచాడు రవీంద్ర.

పాండురంగ చేతి కర్ర సాయంతో ఆ పది అడుగులు వేసి లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నాడు. లిఫ్ట్ బటన్ నొక్కితే దీపం వెలగలేదు. తలుపు తెరుచుకోలేదు.

కరెంట్ గానీ పోయిందా అని ఆయన అటు ఇటు చూసాడు. అంత వరకు ఓరగా తెరిచి వున్న చివరి అపార్ట్ మెంట్ తలుపు గట్టిగా మూసుకుంది.

అభయ కాంప్లెక్ష్ లో ఎ, బి, సి మూడు బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కో బ్లాక్ లో అంతస్థుకు నాలుగు చొప్పున అయిదు అంతస్థులలో ఇరవై అపార్ట్ మెంట్స్ ఉన్నాయి. అంటే అభయ లో మొత్తం అరవై కుటుంబాల వాళ్ళు నివసిస్తున్నారు.

చేసేదిలేక అడుగులో అడుగు వేస్తూ మెట్ల వైపు నడిచాడు పాండురంగ.

నాలుగు మెట్ల కొకసారి ఆగుతూ మూడు అంతస్థులు దిగేసరికి ఆయనకు వూపిరి ఆగిపోతుందేమో అన్నంత ఆయాసం ముంచుకొచ్చింది.

“ఏమిటి నాన్నా ఇంత ఆలస్యం? ” విసుక్కున్నాడు కొడుకు.
“ కరెంట్ లేదురా లిఫ్ట్ పనిచేయలేదు.” ఆయాస పడుతూ చెప్పాడు.
ఇంతలో కింద స్కూటర్ పెట్టి లిఫ్ట్ దగ్గరకు వచ్చిన మరొక గృహస్థు బటన్ నొక్కగానే లిఫ్ట్ తలుపు తెరుచుకుంది. ఆయన రెండో అంతస్థుకి వెళ్ళిపోయాడు.
రవింద్రకు అర్థం అయ్యింది ‘ దగ్గు, జ్వరం వున్న ముసలాయన లిఫ్ట్ వాడడం ఇష్టం లేక ఎవరో స్విచ్ ఆఫ్ చేసారు.
‘ఎవరిని ఏమనగలడు? ఎవరి భయం వారిది.’
ఇంతలో ముసలాయన దిగి వచ్చిన మెట్లమీద నుండి దూకుతూ కిందకి వచ్చాయి మందు వాసన కొడుతున్న నీళ్ళు. అంతలో శానిటైజర్ వేసిన బట్టతో రెయిలింగ్ తుడుస్తూ కనబడ్డాడు వాచ్ మాన్.

‘ ముందు జాగ్రత్తగా ఆయన వాడిన మెట్లు, రెయిలింగ్ మీద నీళ్ళు పోసారన్నమాట ‘ అనుకున్న రవీంద్ర రోడ్డుమీదకి వచ్చి అటు పోతున్న ఆటో ఆపాడు.

పక్క వీధి లో వున్న ఆసుపత్రి దగ్గర ముసలాయనను దింపమని అడిగాడు.

ఆటో అతను రవీంద్ర వైపు, అతనికి దూరంగా నిలబడిన పాండురంగ వైపు చూసి “రెండువందలు అవుతుంది అన్నాడు.”

” మైలు దూరానికి రెండువందలా? “
రవీంద్ర బేరం చేయబోయాడు.

“ఎక్కువ అనుకుంటే మీరే స్కూటర్ మీద తీసుకు వెళ్ళండి” అంటూ ఆటో స్టార్ట్ చేసాడు.

” సరే పద. నాన్నా జాగ్రత్తగా ఎక్కు. అక్కడ దిగేటప్పుడు నిదానంగా దిగు. నేను వెనకాల వస్తాను.” అన్నాడు రవీంద్ర.

ముసలాయన ఎక్కేదాకా దూరంగా నిలబడిన ఆటో అతను, వేసుకున్న మాస్క్ సరిచేసుకుంటూ వచ్చి బండి తీసాడు.

ఆటో అరమైలు దూరం కూడా పోకుండానే ముసలాయన వూపిరి అందక మాస్క్ తీసేయడం చూసి బండి ఆపేసాడు

” దిగండి సార్ పెట్రోల్ అయిపోయింది ” అని పాండురంగను దింపేసి అక్కడ వుంటే తనమీదకి వస్తుందని ముందుకు దూసుకు పోయాడు పోయాడు.

ఏం చేయాలో తోచక అటూ ఇటు చూస్తున్న పాండురంగకు, దూరంగా కొడుకు రావడం కనబడింది.

అమ్మయ్య అనుకునేంతలో దగ్గుతెర ముంచుకొచ్చి వూపిరి ఆడక వుక్కిరిబిక్కిరి అయిపోయి నిలబడలేక క్రింద పడిపోయాడు.

అది చూసిన ఒకతను ఆంబులెన్స్ కి ఫోన్ చేసాడు. ఇంకో నలుగురు దూరంగా నిలబడి చూస్తున్నారే గానీ ఎవరూ సాయానికి రాలేదు.

దూరంగా అనుసరిస్తున్న రవీంద్ర సెల్ మోగడంతో కొంతదూరంలో ఆగిపోయాడు. ఫోన్లో మెసేజ్ చూసుకున్నాడు.

అతనికి ముచ్చెమటలు పట్టాయి. భయపడినట్టే జరిగింది.

ముసలాయనకు దగ్గు, జ్వరం వుంది అంటే కరోనా పరీక్ష చేయించాడు. ఇప్పుడు దానిగురించే కబురు ‘ మీ నాన్నగారికి కొవిడ్ పాసిటివ్ గా తేలింది. ఆంబులెన్స్ లో మనిషి వచ్చి ఆయనను తీసుకు వెడతాడనీ ,ఇంట్లోని మిగతా వాళ్ళు ఇల్లు దాటి రాకూడదనీ, స్వీయ గృహ నిర్బంధంలో వుండాలనీ’ సారాంశం.
తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయనను లేవదీయడానికి రవీంద్రకు ధైర్యం చాలలేదు.. ఇంట్లో ఉన్న పదేళ్ళ లోపువాళ్ళు తన కన్న పిల్లలు, ఇల్లు తప్ప బయటి ప్రపంచం తెలియని భార్య ముఖాలు అతనికంటిముందు మెదిలాయి. తనకి ఏమైనా అయితే వాళ్ళు వీధిన పడతారు.

క్రిందపడి వూపిరి అందక కొట్టుకుంటున్న తండ్రిని చూస్తుంటే అతని గుండె పట్టేస్తోంది.
స్కూలు ఉండి వచ్చేటప్పుడు తను కాళ్ళు నొప్పి అని ఆగిపోతే భుజాల మీద కూర్చో బెట్టుకుని ఇంటిదాకా మోసిన నాన్న, తనకి పన్నెండు ఏళ్ళప్పుడే తల్లి చనిపోతే తల్లి, తండ్రి తానే అయి పెంచిన నాన్న, తనకు అన్యాయం జరుగు తుందేమో అని రెండో పెళ్ళి మాట తలపెట్టని నాన్న, ఆయన వుద్యోగం ప్రైవేట్ కాలేజి లో గనుక ఒక్కోసారి రెండు నెలలు జీతం రాక, ఇంట్లో బియ్యం నిండుకుంటే వున్న కాస్త అన్నం తనకు పెట్టి ‘నాకు కడుపులో బాగా లెదురా ఈ పూట లంఖణం చేస్తే సరిపోతుంది ‘ అని అబద్ధం చెప్పిన నాన్న-

మనసాగక రవీంద్ర అడుగు ముందుకు వేసాడు.

అంతలో ఆంబులెన్స్ మోత చేసుకుంటు వచ్చి ఆగింది.

గబ గబ కిందకి దిగిన ఒక డాక్టర్ ముసలాయన దగ్గరగా వచ్చి చూసి కంగారుగా “మాస్టారూ, మాస్టారూ !” అంటూ గుండెమీద చేతులు వేసి నొక్కడం మొదలు పెట్టాడు . డాక్టరు తలనుండి కాలిదాకా రక్షణ కవచం వంటి కోటులో వున్నాడు.

వెనుకనే చిన్న ఆక్సిజన్ సిలిండరు తో దిగిన నర్స్ పాండురంగ ముక్కుకు గొట్టం తగిలించి వూపిరి ఆడేట్టు చూసింది.

“ ఈయన మాకు చదువు చెప్పిన టీచర్. వారిదగ్గర చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారు. ” అని,చుట్టూ చూసి “ఈయన తరపు వాళ్ళు ఎవరైనా వున్నారా ఇక్కడ?” అనడిగాడు.

కాళ్ళు, శరీరము బండరాతిగా మారినట్టు బరువెక్కగా కదలకుండా నిలబడి పోయాడు రవీంద్ర.

చేస్తున్న వుద్యోగం పోయి నాలుగు నెలలు అయ్యింది. బాంక్ అప్పుకు కట్టవలసిన నెలవారీ మొత్తం, అపార్ట్ మెంట్ కోసం కడుతున్న కంతులు ఆపేసాడు. ఇంట్లో ఒక పూట తింటే, మరొక పూట పస్తులుండే పరిస్థితి.

ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చితే ఎంతమాత్రం వైద్యం అందుతుందో తెలియదు. కార్పొరేట్ వైద్యశాల అంటే ముందు మూడు లక్షలు కట్టమంటారుట. పూట గడవడం ఎలా అని వెదుక్కునే తను అంత డబ్బు ఎక్కడినుండి తేగలడు? ఏంపెట్టి ఆయనకు వైద్యం చేయించగలడు?

ఆయన్ని అలా వదిలేసి ఏమీ కాని వాడిలా దూరంగా నిలబడి చూడవలసి రావడం అతని గుండెని పిండేస్తూంది.

అంబులెన్స్ నుండి దిగిన మరో ఇద్దరితో ” ఆయనను బండి ఎక్కించండి” అని చెప్పాడు డాక్టర్.
ఫోన్ లో ఇంకో డాక్టర్ తో మాట్లాడి ప్లాస్మా వైద్యంకి సిద్ధం చేయమని, తాను తీసుకు వస్తున్న రోగి తనకు చాలా కావలసిన టీచర్ అని కొన్ని నంబర్లు ఇచ్చి వాళ్ళంతా ఆ టీచర్ శిష్యులనీ ఎక్కడినుండి అయినా ఎంత ఖరీదు అయిన మందులైనా తెప్పించగలరనీ, ఖర్చులు కూడా పెట్టుకుంటారనీ, చెప్పి తను ఆంబులెన్స్ ఎక్కాడు.

” నాన్నా! నీ రక్తం పంచుకుని పుట్టిన నేను నీ కొడుకుగా నేను చేయవలసిన బాధ్యత నెరవేర్చ లేక పోయినా నీ దగ్గర చదువుకుని పైకి వచ్చిన నీ శిష్యులు నిన్ను బ్రతికిస్తున్నారు.” రవీంద్ర మనసు మౌనంగా రోదిస్తోంది.

మళ్ళీ సెల్ ఫోన్ మోగింది.

ఈసారి భార్యనుండి మెసేజ్.
అంబులెన్స్ వాళ్ళు వచ్చారనీ, ‘కొడుకు ఆయనను ఆసుపత్రికి తీసుకు వెళ్ళారనీ చెప్పడానికి తను తలుపు తెరిచి బాల్కనీ లోకి రాగానే ఆ అంతస్థులో మిగిలిన ఇళ్ళవాళ్ళు తనను బయటకు రావొద్దంటూ గద్దించి లోపలికి పంపి తలుపులు వేసారని, ముసలాయనను ఆసుపత్రికి తీసుకు వెళ్ళినట్టు వాళ్ళే అంబులెన్స్ వాళ్ళకి చెప్పారనీ .

రవీంద్రకు నీరసంగా అనిపించింది. అంతలో తేరుకుని, తండ్రిని తీసుకు వెడుతున్న ఆంబులెన్స్
ఏ ఆసుపత్రికి వెడుతుందో తెలుసుకోవడానికి దాన్ని అనుసరించాడు.

మాస్టారిదగ్గర చదువుకున్నానని చెప్పిన ఆ డాక్టర్ సూచన మేరకో ఏమో ఆంబులెన్స్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆగింది. అక్కడి డాక్టర్లు తండ్రి దగ్గర చదువుకున్న విద్యార్థులని ఆంబులెన్స్ లో వచ్చిన డాక్టరు అనగా విన్నాడు గనుక ఆయనను జాగ్రత్తగా చూస్తారని వూరట కలిగింది రవీంద్రకి.

తనను లోపలికి రానివ్వరని తెలుసు గనుక బరువైన గుండెతో వెనక్కి తిరిగాడు.
తండ్రిని అక్కడి వాళ్ళు జాగ్రత్తగా దింపి లోపలికి తీసుకు వెళ్ళడం చూసాక ఇంటిదారి పట్టాడు రవీంద్ర.
అతను స్కూటర్ ఆపి లిఫ్ట్ దగ్గరకు రావడం చూసిన కాపలాదారు మిగిలిన ఇళ్ళ వారి సూచన మేరకు కాబోలు స్విచ్ ఆఫ్ చేసాడు.

మాట్లాడే ఓపిక లేనట్టు మెట్లు ఎక్కాడు రవీంద్ర.
అప్పటికే అతని ఇంటి ముందు నిలబడి వున్న ఇంటి యజమాని గట్టిగా అరుస్తున్నాడు : ” ఈ నెలాఖరు లోపు ఇల్లుకాళీ చేసి వెళ్ళక పోతే సామాను బయట పడేస్తాను అని మీ ఆయనకు చెప్పమ్మా. మర్యాదస్థులని మంచిగా చెబుతున్నా.” అంటూ.

“అలా అంటే ఎక్కడకు పోతామండీ? ” దూరంగా నిలబడి వినయంగా అన్నాడు రవీంద్ర.

“ఏట్లోకి పోండయ్యా. అవన్నీ నాకు అనవసరం. ఆసుపత్రిలో చేర్చిన మీ నాన్నను ఇక్కడికి తీసుకురావడానికి కుదరదు. ముందే చెబుతున్నా. “.. నీ పక్కన ఇల్లు కూడా నాదే. అందరూ వణికి పోతున్నారు. కాళి చేసి పోతామంటున్నారు. రెండు ఇళ్ళు పాడుపెట్టమంటావా?” గయ్యిమన్నాడు ఆయన. ఖండితంగా చెప్పి వెళ్ళిపోయాడు .

రవీంద్ర ఆయనకు దండం పెట్టి లోపలికి వచ్చాడు.

“ ఎక్కడికి వెళ్ళగలడు? మా ఇంటికి మీరు రాకండి. మీ ఇంటికి మేము రాము అనే పరిస్థితిలో వున్నారు అందరూ. అందులో నాన్నకు కరోనా వచ్చి, తాము స్వీయ నిర్బంధం లో ఇంటికే పరిమితం అయ్యామని తెలిస్తే దగ్గరి వాళ్ళు అయినా ముఖం చాటు చేస్తారు.పరిస్థితులు అలా వున్నాయి. నాన్న దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. ఎందుకన్నా మంచిది అని కొంత డబ్బు ఆయన జేబులో పెట్టాడు తను. దిగులుగా కూర్చుండి పోయాడు రవీంద్ర.

ఆసుపత్రికి వెళ్ళి తండ్రి విషయం తెలుసుకోవాలని మనసు పీకుతున్నా కదలడానికి లేదు. ఆసుపత్రికి వెళ్ళినా లోపలికి పోనివ్వరు మనిషిని చూడనివ్వరని విన్నాడు. గుండె రాయి చేసుకుని వుండి పోయాడు.
మరునాడు పొద్దున్నే తలుపు తెరవగానే గుమ్మం ముందు పాల పొట్లం, కారీ బాగ్ లో కొన్ని కూరగాయలు కనబడ్డాయి.

ఎవరు పెట్టారా అని ఆశ్చర్య పోయారు దంపతులు.
రెండువారాలపాటు ప్రతీ రోజు పాలు, అప్పుడప్పుడు కూర గాయలు, రెండు ఆదివారాలు భోజనం కేరియర్ ఇంటి ముందు ప్రత్యక్షమవుతూనే వున్నాయి.

మళ్ళీ ఇంటిల్లి పాదికీ కోవిడ్ పరీక్ష చేసాక, నెగెటివ్ రావడంతో బయటకు వచ్చిన రవీంద్రకు ఆ కాంప్లెక్ష్ కార్యదర్శి విషయం చెప్పాడు.

రవీంద్ర సహ వుద్యోగులు మొదలు పెట్టిన సహాయం చూసి ఇరుగు పొరుగు వారే వాచ్ మాన్ కు డబ్బులు ఇచ్చి ఆ ఏర్పాటు చేసారట. రవీంద్ర ఇంటి ఓనరు కూడా ధన సహాయం చేసాడుట.
తమను వెలివేసి నట్టు చూసిన వారే ఇంత సహాయం చేసారని తెలిసి రవీంద్రకు నోట మాట రాలేదు.
‘వాళ్ళంతా దయలేని స్వార్థపరులు అనుకున్నాడు ఇన్నాళ్ళు. మనుషుల్లో మంచితనం , సాటి మనిషికి సహాయ పడాలనే కరుణ ఇంకా సజీవంగా వున్నాయి. . రవీంద్ర కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ముందు నాన్న సంగతి చూడాలి అనుకుంటూ బయటకు వచ్చి స్కూటర్ మీద బయలుదేరాడు.
అంతలో సెల్ ఫోన్ మోగింది. నాన్న దగ్గర సెల్ లేదు. ఎవరైవుంటారు అనుకుంటూ తీసాడు.

                                            *****.                                                          ****

అక్కడ పేరు పొందిన డాక్టర్లు శ్రద్ధ తీసుకోవడంతో , ఆయనకు హై బి.పి,చక్కెర వ్యాధి వంటివి లేకపోవడం వలన ఆసుపత్రిలో వున్న పాండురంగ పదిరోజులకు కాస్త కోలుకున్నాడు.
“మీ అడ్రెస్ చెప్పండి మీ వాళ్ళను పిలిపిస్తాము” అన్న సిబ్బంది ప్రశ్నకు ఎవరూ లేరు అన్నట్టు సైగ చేసాడు.

మరో నాలుగు రోజులకు అతని ఆరోగ్యం మరింత మెరుగు పడింది.
పరీక్ష చేస్తే నెగెటివ్ వచ్చింది.

ఆయనకు వైద్య సహాయం అందించిన డాక్టరు ” మాస్టారూ మీరు ఇక్కడ అయిన ఖర్చు గురించి ఆలోచించకండి. అది మీ శిష్యులు చూసుకున్నారు. మీ అబ్బాయి వాళ్ళు ఎక్కడ వున్నారు చెబితే అక్కడికి మిమ్మల్ని పంపిస్తాము.” అని అడిగాడు.

” మా వాడు చెన్నైలో వున్నాడు. అందుకే రాలేకపోయాడు. నేను ఇక్కడ దగ్గరే ఎమ్మిగనూరులో వున్న మా ఇంట్లో వుంటాను. మా ఇంటికి వెడతాను. మీ అందరికీ రుణపడ్డాను. మీకు ఆ భగవంతుడి ఆశీర్వాదం వుంటుంది.” గద్గద కంఠంతో అన్నాడు ఆయన.

“జాగ్రత్తగా ఉండండి” అని చెప్పి ఆయనను డిస్చార్జ్ చేసారు.
నేరుగా బస్ స్టేషన్ కు వచ్చి జేబులో వున్న డబ్బుతో తన ఊరికి టికెట్ కొనుక్కున్నాడు పాండురంగ.
ఫోన్ బూత్ నుండి కొడుకుకు ఫోన్ చేసాడు.

                              ******.                                                    ******

తండ్రి గొంతు వినగానే రవీంద్రకు దుఖం వచ్చింది. ఆయన బ్రతికి బయట పడినందుకు పట్టలేని ఆనందం కలిగింది . ఆయన ఇంటికి వస్తానంటే ఏం చేయాలి అని మరు నిముషం భయం వేసింది. ఏమి మాట్లాడాలో తెలియ లేదు.

” రవీంద్రా! నా గురించి భయపడకు నాన్నా. నేను బాగున్నాను. డిస్చార్జ్ చేసారు. అయితే ఇంటికి రావడం లేదు. పిల్లల గురించి, , మీ ఇద్దరి ఆరోగ్యం గురించి ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. మన ఊరికి వెడుతున్నా. నా గురించి దిగులు పడకండి . పిల్లలు మీరు భద్రం” . అని ఫోను పెట్టేసాడు పాండురంగ .

తాను ఆరు దశాబ్ధాల పైన జీవితం చూసాడు. కొడుకు, కోడలు చిన్నవాళ్ళు. పిల్లలు పసివాళ్ళు. వాళ్ళు క్షేమంగా వుంటే చాలు. రిటైర్ అయ్యాక కొన్నేళ్ళు విద్యార్థులకు ట్యూషన్ చెప్పాడు గనుక ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే తన బ్రతుకు గడిచి పోతుంది. కొడుకు వుద్యోగం పోయినది గనుక వాడికి భారం తగ్గించడమే గాక కాస్త సహాయ పడవచ్చు”. అనుకుంటూ అప్పుడే వచ్చి ఆగిన బస్ ఎక్కి కూర్చున్నాడు పాండురంగ..

పరిస్థితుల ప్రభావంతో మానవత్వం అడుగంటి పోయినట్టు కనబడినా మనిషి హృదయంలో తనవారి మీద మమకారం, తోటి మనిషి పట్ల సానుభూతి ,దయ అనే నీటి చెలమ పూర్తిగా ఎండిపోదు. హృదయాంతరాళాల నుండి వూరుతూనే వుంటుంది.

-డా.కె.మీరాబాయి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

Comments are closed.